వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి
-
బహుళ పంటల సాగుతో ఆదాయాన్ని పెంచాలి
-
కలెక్టర్ ముత్యాలరాజు
నెల్లూరు రూరల్ : వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ముత్యాల రాజు వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులకు సూచించారు. నెల్లూరు రైల్వేఫీడర్స్ రోడ్డులోని పశుసంవర్థక శాఖ సమావేశ మందిరంలో ఫార్మర్ ప్రొడ్యూషర్స్ ఆర్గనైజేషన్(ఎఫ్‌పీఓ)ల ఏర్పాటు, వ్యవసాయంలో ఉపాధి హామీ పథకం అమలుపై వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో బుధవారం ఆయన ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 10లక్షలు ఎకరాలుగా ఉన్న సాగు విస్తీర్ణంను 11 లక్షలకు పెంచాలన్నారు. రైతులు బహుళ పంటల సాగు చేపట్టేలా ప్రోత్సహించాలన్నారు. జిల్లాలో ఎక్కువ మంది రైతులు వరి సాగు చేస్తున్నారని తెలిపారు. పెట్టుబడులు పెరగడం, మద్దతు ధర లభించక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. పెరుగుతున్న జనాభాకు అవసరమైన కూరగాయలను బయట నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలోనే కూరగాయలను సాగు చేస్తే రైతులకు ఎక్కువ ఆదాయం చేకూరుతుందన్నారు. ఉద్యానపంటలు, పాడి పరిశ్రమ, ఆక్వాసాగు చేపట్టేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు రైతులకు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. జాయింట్ కలెక్టర్–2 రాజ్‌కుమార్ మాట్లాడుతూ రైతులు పండించిన పంటలను స్వయంగా అమ్ముకుని లాభపడేలా ఫార్మర్ ప్రొడ్యూషర్స్ ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే నిమ్మ రైతుల సంఘాలను ఏర్పాటు చేసి వారికి పూర్తి స్థాయి అవగాహన కల్పించామన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కే హేమమహేశ్వరరావు, షిషరీస్ జేడీ సీతారామరాజు, పశుసంవర్థక శాఖ జేడీ శ్రీధర్‌కుమార్, నాబార్డు ఏజీఎం రమేష్‌బాబు, ఎల్‌డీఎం వెంకట్రావ్, ఆత్మ, మైక్రో ఇరిగేషన్, ఉద్యాన, శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.