పత్తి సాగులో సమస్యలను అధిగమించడానికి బెడ్స్ (ఎత్తు మడులు) పద్ధతిని అనుసరించడం మేలని నిపుణులు చెబుతున్నారు. ట్రాక్టర్‌తో బెడ్స్ ఏర్పాటు చేసుకొని ఒక సాలు పత్తి, పక్కనే మరో సాలు కందిని మనుషులతో విత్తుకోవటం మేలని సూచిస్తున్నారు. వర్షం ఎక్కువైనా, తక్కువైనా.. కండగల నల్లరేగడి నేలలైనా, తేలికపాటి ఎర్రనేలలైనా.. బెడ్స్‌పై పత్తిలో కందిని అంతర పంటగా విత్తుకోవటం రైతులకు ఎన్నో విధాలుగా ఉపయోగకరమని చెబుతున్నారు.
పత్తి పంటను ఎత్తుమడుల (బెడ్స్)పై విత్తుకోవటమే మేలని, అందులో కందిని అంతర పంటగా 1:1 నిష్పత్తిలో వేకోవటం వల్ల రైతులకు అనేక ప్రయోజనాలున్నాయని ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డా. ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ప్రయోగాత్మక సాగులో తొలి అనుభవాలు తెలియజేస్తున్నాయి. బెడ్స్‌పై పత్తి, కంది మిశ్రమ సాగుపై రెండేళ్లుగా అనేక విధాలుగా ప్రయోగాలు చేస్తున్న డా. ప్రవీణ్ మూడేళ్ల తర్వాత పూర్తి ఫలితాలు వెల్లడవుతాయని అన్నారు.
అయితే, ఇప్పటికి గ్రహించిన దాన్ని బట్టి పత్తిలో కంది పంటను బెడ్స్‌పై 1:1 నిష్పత్తిలో విత్తుకోవటం మేలని భావిస్తున్నారు. కందిని 1:1 నిష్పత్తిలోనే విత్తుకోవాలనేం లేదని, 4:1 నిష్పత్తిలో (4 సాళ్లు పత్తి, 1 సాలు కంది) కూడా విత్తుకోవచ్చని ఆయన సూచిస్తున్నారు. కండగల నల్లరేగడి నేలల్లో అయినా, తేలికపాటి ఎర్ర నేలల్లో అయినా బెడ్స్ పద్ధతిలో పత్తిలో కందిని అంతరపంటగా విత్తుకుంటే వర్షం ఎక్కువైనా, తక్కువైనా ఇబ్బంది ఉండదని ఆయన తెలిపారు.
గత ఏడాది నల్ల రేగడి నేలలో బెడ్స్‌పై పత్తిలో కంది పంటను 1:1 నిష్పత్తిలో విత్తి మంచి ఫలితాలు సాధించారు. బెడ్ వెడల్పు అడుగు. రెండు బెడ్స్ మధ్య దూరం 5 అడుగులు. ట్రాక్టర్ సహాయంతో బెడ్స్ ఏర్పాటు చేయించారు. మొక్కల మధ్య అడుగు దూరం పాటించారు. మనుషులతో బెడ్స్‌పై విత్తనం నాటించారు. గత ఏడాది సాధారణం కన్నా అధిక వర్షాలు కురిసినప్పటికీ.. బెడ్స్ పద్ధతి వల్ల పొలంలో నీరు నిలబడలేదు. దీని వల్ల పంట పెరుగుదలకు ఎటువంటి ఆటంకం కలగలేదు.
బెడ్స్‌పై సాగు వల్ల ఉపయోగాలేమిటి?
బెడ్స్ మీద విత్తిన విత్తనం సాధారణ పొలంలో కన్నా ఒకటి, రెండు రోజులు ముందే మొలిచింది. అంతేకాదు, 90% వరకు మొలక వచ్చింది. వర్షపు నీరు ఒక్క రోజు కూడా పొలంలో నిలవకుండా కాలువల ద్వారా బయటకు వెళ్లిపోయింది. దీని వల్ల తొలి దశలో మొక్క పెరుగుదల ఒక్క రోజు కూడా కుంటుపడలేదు. బెడ్స్ లేకపోతే ఎక్కువ వర్షం పడినప్పుడు ఉరకెత్తే సమస్య ముఖ్యంగా నల్లరేగడి పొలాల్లో సాధారణం. బెడ్స్ వల్ల ఈ సమస్య లేకుండా పోయింది.
అంతేకాదు, కాయకుళ్లు సమస్య కూడా తీరిపోయిందని డా. ప్రవీణ్‌కుమార్ తెలిపారు. బెడ్స్ లేకుండా సాగు చేసే పొలాల్లో పత్తి మొక్కలకు కింది కొమ్మలకు మొదట్లో వచ్చే 5–10 కాయలు కుళ్లిపోతూ ఉంటాయి. బెడ్స్ మీద వేయటం వల్ల గాలి, వెలుతురు బాగా తగిలి, తేమ తగుమాత్రంగా ఉండటం వల్ల కాయ కుళ్లు లేదన్నారు.
పత్తి, కంది.. 11 క్వింటాళ్ల దిగుబడి
బెడ్స్ పద్ధతిలో విత్తిన పొలాల్లో కూడా గులాబీ రంగు పురుగు ఉధృతి మామూలుగానే ఉంది. గులాబీ పురుగు ఉధృతి ఎక్కువయ్యే కాలానికి, అంటే నవంబర్ ఆఖరు నాటికే పత్తి మొక్కలను తీసేశాం. అయినా ఎకరానికి 5.5 క్వింటాళ్ల మేరకు పత్తి దిగుబడి వచ్చిందని డా. ప్రవీణ్‌కుమార్ అన్నారు. గులాబీ పురుగును సమర్థవంతంగా అదుపు చేయగలిగితే మరో 3–4 క్వింటాళ్ల దిగుబడి వచ్చేదన్నారు. నవంబర్ ఆఖరులో పత్తి తీసేసినా.. కంది పంట జనవరి వరకు ఉంచారు. ఎకరానికి 5.5 క్వింటాళ్ల కందుల దిగుబడి కూడా వచ్చింది.
అంటే, ఒక ఎకరంలో రెండు పంటలూ కలిపి 11 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఒకవేళ పత్తి పంట ఏ కారణంగానైనా దెబ్బతింటే.. కంది పంటయినా రైతును ఆదుకుంటుందని.. అందుకని పత్తితో పాటు కందిని కూడా వేసుకోవటం మేలని డా. ప్రవీణ్ కుమార్ రైతులకు సూచిస్తున్నారు.
బెడ్స్‌పై కాకుండా మామూలుగా నల్లరేడగడి పొలంలో పత్తి మాత్రమే విత్తుకున్న రైతులు కూడా చాలా మంది ఐదారు క్వింటాళ్లు మాత్రమే దిగుబడి తీయగలిగారన్నారు. అధిక వర్షాల వల్ల పంట పెరుగుదల లోపించటం, గులాబీ పురుగు ఉధృతిని అదుపు చేయలేకపోవటం వల్ల దిగుబడి తగ్గిందన్నారు.
తేలికపాటి ఎర్ర నేలల్లో అయినా పత్తితోపాటు కందిని బెడ్స్‌పై విత్తుకుంటే వర్షం ఎక్కువైనా, తక్కువైనా ఇబ్బంది ఉండదన్నారు. తేమ త్వరగా ఆరిపోకుండా ఉండటానికి బెడ్స్ ఉపయోగపడతాయన్నారు. ఈ ఏడాది కూడా సాధారణం కన్నా అధికంగానే వర్షాలు పడతాయని భావిస్తున్న నేపథ్యంలో బెడ్స్ పద్ధతిని రైతులు అనుసరించడం మేలు.
బెడ్స్ పద్ధతిలో సాగుపై ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం యూట్యూబ్ చానల్ ఓఠిజు అఛీజీ ్చb్చఛీ లో వీడియోలు ఉన్నాయి. ఆసక్తి గల రైతులు చూడవచ్చు. ఆ తర్వాత కూడా సందేహాలుంటే డా. ప్రవీణ్ కుమార్ (99896 23829)ను సంప్రదించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment