పత్తి.. సూటి రకాలే మేటి! | Organic farming benefit with sooty cotton forming | Sakshi
Sakshi News home page

పత్తి.. సూటి రకాలే మేటి!

Published Tue, Nov 6 2018 4:54 AM | Last Updated on Tue, Nov 6 2018 4:54 AM

Organic farming benefit with sooty cotton forming - Sakshi

మానుకొండవారిపాలెంలో సూటి రకం పత్తి పంటను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు, రైతులు

ఖరీఫ్‌లో వర్షాధారంగా సాగయ్యే ప్రధాన వాణిజ్య పంట పత్తి. గత ఐదారేళ్లుగా పత్తి పంటలో దిగుబడి  తగ్గిపోతున్నది. తెగుళ్లు, గులాబీ రంగు పురుగు దాడి కారణంగా ఏటికేడు దిగుబడి పడిపోతోంది. బీటీ రకాలు తెల్లబోతున్నాయి. ఇక బీటీ మాయలో పడిన రైతులు పాత రకాలను సాగు చేయడమే మరచిపోయారు. సరైన విత్తనం ఎంపిక చేసుకొని మెలకువలు పాటిస్తే నాన్‌ బీటీ హైబ్రిడ్‌ రకాలు తీసిపోవని చాటుతోంది ‘రైతు రక్షణ వేదిక’. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ వేణుగోపాల్, రైతు శాస్త్రవేత్త జొన్నలగడ్డ రామారావు, రైతు నేత డాక్టర్‌ కొల్లా రాజమోహనరావు, రైతు సంఘాల నేతలు, కొందరు అభ్యుదయ రైతులు కలిసి గుంటూరు కేంద్రంగా రైతు రక్షణ వేదికను ఏర్పాటు చేశారు.

కొన్నేళ్లుగా సూటి రకాల ప్రదర్శనా క్షేత్రాలను నిర్వహిస్తూ పాత రకాల ఆవశ్యకతను తెలియ జేస్తున్నారు. బిటీ పత్తికి ప్రత్యామ్నాయంగా సూటి రకాలను ప్రోత్సహిస్తున్నారు. ‘రైతు రక్షణ వేదిక నిర్వహిస్తున్న ప్రదర్శన క్షేత్రాలను ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎన్‌. దామోదర నాయుడు ఇటీవల సందర్శించి సంతృప్తిని వ్యక్తం చేశారు. సూటి రకం విత్తనాలతో ఖర్చు తగ్గుతోందని, ఇతర పంటల రైతులతో పాటు పత్తి రైతులు కూడా తమ విత్తనాలను తామే తయారు చేసుకొనే విధంగా ప్రోత్సహిస్తామని ఆయన పేర్కొనడం ఆహ్వానించదగిన పరిణామం.

పత్తిలో సమగ్ర సస్య పోషణ, రక్షణల ద్వారా కాయతొలిచే పురుగులతో పాటు అత్యంత బెడదగా మారిన పచ్చదోమ, తెల్లదోమల బెడద కూడా లేకుండా పోయింది. రైతులు పండించిన పత్తిలో నుంచే సేకరించిన విత్తనాలతోనే ప్రధాన వాణిజ్య పంట అయిన పత్తిని కూడా ఇతర పంటల మాదిరిగానే సాగు చేయటంలో గుంటూరుకు చెందిన రైతు రక్షణ వేదిక విజయం సాధించింది. అనేక ఏళ్ల నుంచి ఈ దిశగా కృషి చేస్తున్న వేదిక సభ్యులైన రైతులు, విశ్రాంత శాస్త్రవేత్తలు, రైతు సంఘాల కార్యకర్తలు ఈ ఖరీఫ్‌లో మరింత విస్తృతంగా నాన్‌ బీటీ సూటి రకం పత్తి సాగును చేపట్టడం విశేషం. సూటి రకం పత్తి విత్తనాలతో రైతుకు ఖర్చు తక్కువ, నాణ్యమైన దిగుబడి, వివిధ పురుగులను నిరోధించే అవకాశం ఉంది.

15 చోట్ల రైతుల ప్రదర్శనా క్షేత్రాలు
2018–19 సంవత్సరంలో గుంటూరు జిల్లాలో 15 ప్రదేశాల్లో సూటి రకం నాన్‌ బీటీ పత్తి పంటను సాగు చేస్తూ నమూనా (ప్రదర్శనా) క్షేత్రాలను ఏర్పాటు చేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం నంద్యాల ప్రాంతం నుంచి వచ్చిన విత్తనాలనే వినియోగించి సఫలీకృతులయ్యారు. రైతులు ప్రయోగాత్మకంగా చేపట్టిన కార్యక్రమం పూర్తిస్థాయిలో విజయవంతమైంది. దీంతో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డా. దామోదర నాయుడు, లాం ఫాం డైరెక్టర్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ డా. ఎన్‌వీ నాయుడు, లాంఫాం శాస్త్రవేత్త డా. దుర్గాప్రసాద్‌ చిలకలూరిపేట మండలం మానుకొండవారిపాలెంలోని తియ్యగూర శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరరెడ్డిల ప్రదర్శనా క్షేత్రాలను స్వయంగా పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. రైతులను అభినందించారు.

సూటి రకం పత్తితో 30% తగ్గిన ఖర్చు
రైతులు బీటీ విత్తనాలకు బదులుగా సూటి విత్తనాలు (నాన్‌ బీటీ) సాగు చేస్తే 30 శాతం ఖర్చు తగ్గుతుంది. ఆశించిన దిగుబడి లభిస్తుంది.  రైతులు సూటీ పత్తిని సాగు చేయటంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని రైతు రక్షణ వేదిక నేతలు తెలిపారు. గుంటూరు జిల్లాలోని గుంటూరు రూరల్, వట్టిచెరుకూరు, కొర్నెపాడు, ప్రత్తిపాడు, పెదనందిపాడు, చిలకలూరిపేట, ఫిరంగిపురం, మంగళగిరి తదితర ప్రాంతాల్లోని 650 ఎకరాల్లో ఈ ఖరీఫ్‌లో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. రైతులు నంద్యాల నుంచి ఎన్‌డీఎల్‌హెచ్‌–1938, రైతు రక్షణ–02 నాన్‌బీటీ సూటి రకాల పత్తిని సాగు చేస్తున్నారు.  లాంఫాం, కృషి విజ్ఞాన కేంద్రం, డాట్‌ సెంటర్‌లకు చెందిన శాస్త్రవేత్తలు అందుబాటులో ఉండి సూచనలు సలహాలు అందిస్తారన్నారు.

సూటి రకాల సేంద్రియ సాగు ఇలా..
దుక్కిలో పశువుల ఎరువుతో కలిపిన వామ్‌(జీవన ఎరువు) ఎకరానికి ఐదు కేజీలు వేయాలి. చివరి దుక్కిలో ఎకరానికి వేప పిండి రెండు క్వింటాళ్ళు వేయాలి. నాన్‌ బీటీ సూటి రకం పత్తి విత్తనాలు విత్తుకోవాలి. నాన్‌బీటీ విత్తనాలు సాగులో ఉన్న పొలం చుట్టూ జొన్న, కొర్ర, ఆముదం మొక్కలు రెండు – మూడు సాళ్ళు(వరుసలు) రక్షక పంటగా వేయాలి. పత్తి మొక్క దశలో రెండు విడతలు వేపనూనె, మోనోక్రోటోఫాస్, మిథైల్‌ ఆల్కాహాల్‌ కలిపిన ద్రావణాన్ని కాండానికి కుంచెతో పూయాలి. వేప కషాయాన్ని మరగబెట్టగా వచ్చిన ద్రావణాన్ని పిచికారీ చేస్తే జల్లెడ పురుగు, తెల్లదోమ గూడ పురుగులను అదుపులోకి తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. గులాబీ రంగు పురుగు నివారణకు ఒక ఎకరానికి 10 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేయాలి.

సూటి పత్తిలో కొర్ర, అలసంద, మినుము తదితర అంతర పంటలను సాగు చేసుకునే వెసులుబాటు ఉంది. నీటి వసతి అందుబాటులో ఉన్న రైతులు నెలకు ఒక విడత చొప్పున ఆరుతడులు అందిస్తే మరింత ప్రయోజనం ఉంటుంది. ఈ విధంగా చేస్తే పత్తి దిగుబడులు హైబ్రిడ్‌ పత్తికి దీటుగానే వస్తాయని రైతు రక్షణ వేదిక రైతులు అనుభవపూర్వకంగా చెబుతున్నారు. ఈ సూటి రకాల పత్తి పింజ పొడవు, నాణ్యత బాగానే ఉంటుంది. అధిక శాతం రైతులు ఈ పత్తిని సాగు చేస్తే మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయని వారు అంటున్నారు. దిగుబడుల్లో రాజీ పడకుండానే కంపెనీల విత్తనాలను పక్కన పెట్టి సొంత సూటి రకం పత్తి విత్తనం వాడుకునే సత్సాంప్రదాయానికి బాటలు వేస్తున్న రైతు రక్షణ వేదిక సభ్యులైన రైతులు అభినందనీయులు.

వర్షం తక్కువైనా ఏపుగా పెరిగింది!
నంద్యాల నుంచి తీసుకు వచ్చిన సాధారణ విత్తనాలతో 2.50 ఎకరాల్లో పత్తిని సాగు చేశాం. పత్తి పొలం చుట్టూ ఇతర పురుగులు రాకుండా జొన్న విత్తనాలు నాటాం. గులాబీ రంగు పురుగు, పచ్చదోమ, తెల్లదోమ తదితర క్రిమి కీటకాలు రాలేదు. వర్షం తక్కువగా పడినా పంట ఏపుగా పెరిగింది. ఆశించిన స్థాయిలో పూత ఉంది. బీటీ తరహాలోనే దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాం. శాస్త్రవేత్తలు పరిశీలించి పలు సూచనలు, సలహాలు అందించారు.

--తియ్యగూర వెంకటేశ్వరరెడ్డి (97044 97442), రైతు, మానుకొండవారిపాలెం,  చిలకలూరిపేట రూరల్‌

రసాయనాల్లేని సాగులో బీటీకి మించిన దిగుబడి
రైతులు పండించిన పత్తి పంట ద్వారా వచ్చిన విత్తనాలనే వినియోగించి ప్రయోగాత్మకంగా పరిశీలించాం. పంట ఆశాజనకంగా ఉంది. రసాయనిక ఎరువులు, పురుగు మందులను వినియోగించలేదు. అయినా, పంట ఎదుగుదల ఆశాజనకంగానే ఉంది. బీటీకి మించిన దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా క్షేత్రోత్సవాలను నిర్వహించి ప్రచారం కల్పిస్తాం. ఈ పద్ధతిలో సాగు చేసే రైతులకు చేయూతనందిస్తాం.


– డాక్టర్‌ కొల్లా రాజమోహనరావు (90006 57799), సమన్వయకర్త, రైతు రక్షణ వేదిక, గుంటూరు

సూటి రకాలు గులాబీ పురుగునూ తట్టుకున్నాయి!
పక్కపక్కన పొలాల్లో సాగు చేసిన సూటి రకం, బీటీ రకం పత్తి పంటల్లో స్పష్టమైన తేడాను గమనించవచ్చు. రైతు రక్షణ వేదిక ఆధ్వర్యంలో కంపెనీ బీటీ హైబ్రిడ్‌ పత్తి విత్తనాలకు ప్రత్యామ్నాయంగా సూటి రకం నాన్‌ బీటీ విత్తనాలను రైతులకు అందించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. నంద్యాల–1938 రకం, రైతు రక్షణ–02 అనే నాన్‌ బీటీ సూటి రకాల విత్తనాలు రసం పీల్చే పురుగులతో పాటు గులాబీ రంగు పురుగుల బెడదను తట్టుకున్నాయి. దీంతో పాటు రైతు రక్షణ వేదిక ద్వారా తయారైన హైబ్రిడ్‌ను కూడా సరఫరా చేస్తున్నాం. రైతు రక్షణ వేదిక ద్వారా తయారుచేసే హైబ్రిడ్‌ ప్రత్యామ్నాయ రకం వెరైటీని  ప్రోత్సహిస్తే రైతుకు స్వావలంబన కలుగుతుంది. రసాయనిక వ్యవసాయం వల్ల వ్యవసాయ ఖర్చులు ఎక్కువై నష్టం జరుగతోంది. జీవన ఎరువులు, పశువుల ఎరువును వాడుకుంటే రసాయన ఎరువులను ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు.

– ప్రొఫెసర్‌ వేణుగోపాల రావు (94900 98905), విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త, రైతు రక్షణ వేదిక


మానుకొండవారిపాలెంలో పూత దశకు చేరుకున్న సూటిరకం పత్తి పొలం

– ఓ.వెంకట్రామిరెడ్డి, అమరావతి బ్యూరో, గుంటూరు
ఫొటోలు : లీలానంద్, చిలకలూరిపేట రూరల్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement