ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేసిన మిరప పంటలో రైతు వెలుగుల బాబ్జి
మిరప పంటపై నల్ల తామరకు ప్రకృతి వ్యవసాయమే దీటుగా సమాధానం చెబుతోంది. రెండేళ్లుగా నల్ల తామర, మిరప తదితర ఉద్యాన పంటలను నాశనం చేస్తుండడంతో దీన్ని పెను విపత్తుగా ప్రభుత్వం గుర్తించింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో కాకినాడ జిల్లాలోని మిరప రైతులు నల్ల తామర తదితర చీడపీడలను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పంటను నిలబెట్టుకుంటున్నారు.
గొల్లప్రోలు మండలం దుర్గాడకు చెందిన పలువురు రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సస్యరక్షణ మందులను వినియోగించి నల్ల తామర ఉధృతిని కట్టడి చేస్తూ పంటలను కాపాడుకుంటున్నారు. దుర్గాడ గ్రామంలో 650 ఎకరాల్లో గుండ్రటి రకం మిరప సాగవుతుంటే, ఇందులో 180 ఎకరాలలో రైతులు ప్రకృతి సేద్య పద్ధతులు పాటిస్తున్నారు. ఈ మిరప పంట నల్ల తామర పురుగును తట్టుకుని నిలబడటం విశేషంగా చెబుతున్నారు. దుర్గాడ రకం మిర్చి విరగ పండటంతో రైతులు సంతోషంగా ఉన్నారు. అయితే, అదే గ్రామంలో ఈ పొలాలకు పక్కనే ఉన్న, రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడుతున్న రైతుల పొలాల్లో మిరప తోటలు నల్లతామర తదితర చీడపీడలతో దెబ్బతి న్నాయి. భారీ పెట్టుబడులు పెట్టి రైతులు తీవ్రంగా నష్టపోయారు.
– లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి ప్రతినిధి, కాకినాడ
ఫొటోలు: వివివి వరప్రసాద్, పిఠాపురం
కొత్త పురుగు నల్ల తామరను నియంత్రించడంలో రసాయనక ఎరువులు, పురుగుమందుల కంటే కషాయాలే బాగా పనిచేస్తున్నాయి. ఉల్లి కషాయం, జీవామృతం, మీనామృతం వంటివి వినియోగించిన పొలాల్లో మిరప పంట తామర పురుగును తట్టుకుని నిలబడింది. రసాయనిక సేద్యంలో దెబ్బతిన్న మిరప పొలాల్లో కషాయాలు, ద్రావణాలు ఉపయోగించిన చోట్ల పంట తిరిగి పుంజుకుంటుండటం విశేషం. సేంద్రియ ఎరువులు వాడిన పంట మంచి ఆదాయాన్నిస్తుండగా రసాయనిక ఎరువులు, పురుగుమందులు వినియోగించిన పంటలు దెబ్బతిన్నాయి. ఈ రైతులకు అవగాహన కల్పించి వచ్చే సీజన్లో ప్రకృతి వ్యవసాయం చేసేలా అవగాహన కల్పిస్తున్నాం. నల్ల తామర ఉధృతిని ఎప్పటికప్పుడు పరిశీలించి రైతులకు సూచనలు ఇస్తున్నాం. సేంద్రీయ మందులతో కొత్త పురుగు ఉధృతి తగ్గింది.
– ఇలియాజర్ (94416 56083), డీపీఎం, పకృతి వ్యవసాయ శాఖ, కాకినాడ
కుళ్లిన ఉల్లితో కషాయం, ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, చేప వ్యర్థాలతో మీనామృతం, అల్లం–వెల్లుల్లితో అగ్ని అస్త్రం వంటివి తయారు చేసుకొని మిరప పంటకు వాడుతూ ప్రకృతి సేద్యంలో మంచి ఫలితాలు సాధిస్తున్నాం. కుళ్లిన ఉల్లిపాయలు, వేపాకులతో తయారు చేసే ఉల్లి కషాయం మిరప తోటల్లో నల్ల తామరను కట్టడి చేయటంలో కీలక స్థానం పోషిస్తోంది. ఎకరా మిర్చి తోట నుంచి ఇప్పటి వరకు రూ.3 లక్షల వరకు ఆదాయం వచ్చింది. ఇంకా కొన్ని కాయలు కోయాల్సి ఉంది.
– వెలుగుల బాబ్జి (97014 41771), ప్రకృతి సేద్య పద్ధతుల్లో మిర్చి సాగు చేస్తున్న రైతు, దుర్గాడ
ఎకరానికి రూ. 65 వేల పెట్టుబడి.. రూపాయి కూడా తిరిగి రాలేదు..
నేను గత కొన్నేళ్లుగా రసాయనిక ఎరువులు, పురుగుమందులతో మిరప సాగు చేస్తున్నా. ఐతే గత రెండేళ్ళుగా నల్ల తామర పురుగు సోకడంతో మిర్చి పంట పూర్తిగా దెబ్బతిన్నది. ఎకరానికి రూ 65 వేల వరకు పెట్టుబడి పెట్టాను. ఒక్క రూపాయి కూడా తిరిగి రాలేదు. పంట పూర్తిగా తీసేయాల్సి వచ్చింది. రసాయనిక పురుగుమందులు పంటకు రక్షణ కల్పించ లేకపోయాయి.
– ఇంటి ప్రసాద్, మిర్చి రైతు, దుర్గాడ, గొల్లప్రోలు మండలం, కాకినాడ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment