పత్తి/కంది.. మధ్యలో పచ్చిరొట్ట | natural cotton farming process in sagubadi | Sakshi
Sakshi News home page

పత్తి/కంది.. మధ్యలో పచ్చిరొట్ట

Published Tue, Dec 18 2018 5:33 AM | Last Updated on Tue, Dec 18 2018 5:33 AM

natural cotton farming process in sagubadi - Sakshi

పచ్చిరొట్ట పంటలతో పాటు సాగు చేస్తున్న కంది, పత్తి పంటలను చూపిస్తున్న రైతు శాస్త్రవేత్త సుభాష్‌ శర్మ

మహారాష్ట్ర.. విదర్భ.. యవత్‌మాల్‌.. ఈ పేర్లు వినగానే అప్పుల్లో కూరుకుపోయి బలవన్మరణాల పాలైన వేలాది మంది పత్తి రైతుల విషాద గాథలు మదిని బరువెక్కిస్తాయి. అయితే, ఈ కథ అంతటితో ముగిసిపోలేదు. ఎడారిలో ఒయాసిస్సు మాదిరిగా సేద్యాన్ని ఆనందమయంగా మార్చుకున్న అతి కొద్ది మంది ప్రకృతి వ్యవసాయదారులు కూడా అదృష్టవశాత్తూ అక్కడ ఉన్నారు. రసాయనాలను త్యజించి, నేలతల్లికి ప్రణమిల్లుతూ భూసారాన్ని పరిరక్షించుకుంటూనే అధిక దిగుబడులు సాధిస్తున్న అద్భుత ప్రకృతి వ్యవసాయదారుల్లో సుభాష్‌ శర్మ ఒకరు.

ప్రకృతి వ్యవసాయంలో ఆచ్ఛాదన అతి ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయితే, ఆచ్ఛాదనగా వేయడానికి గడ్డీ గాదం ఎక్కడ దొరుకుతుంది అని రైతులు ప్రశ్నిస్తుంటారు. ఈ సమస్యకు సుభాష్‌ శర్మ అద్భుతమైన పరిష్కారాన్ని కనుగొన్నారు. రెండు సాళ్లు పత్తి వేస్తారు (కందిని కూడా ఇలాగే సాగు చేయవచ్చు). ఆ పక్కనే 3 సాళ్లలో పచ్చిరొట్ట మొక్కలు పెంచి, వాటినే కత్తిరించి ఆచ్ఛాదనగా వేస్తారు. పొలం అంతా ఇలాగే వేయడం ద్వారా అధిక దిగుబడిని సాధించే వినూత్న పద్ధతిని ఆయన గత కొన్నేళ్లుగా అనుసరిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయదారుడిగా, పరిశోధకుడిగా ప్రయోగాలు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్న సుభాష్‌ శర్మతో ‘సాక్షి సాగుబడి’ ఇటీవల ముచ్చటించింది.

ముఖ్యాంశాలు..
సుభాష్‌ శర్మకు 60 ఏళ్లు. వ్యవసాయంలో 40 ఏళ్ల అనుభవం ఉన్న రైతు. అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకుని, గడ్డు సమస్యలకు అద్భుతమైన పరిష్కారాలను వెదకి తలపండిన ప్రకృతి వ్యవసాయదారుడు, రైతుశాస్త్రవేత్త. క్షేత్రస్థాయిలో వ్యవసాయ సమస్యలను లోతుగా పరిశీలిస్తూ.. తన అనుభవం, ప్రజ్ఞలతో ప్రకృతికి అనుగుణమైన సాగు పద్ధతులను రూపొందించుకున్నారు. కరువుకు, పత్తి రైతుల ఆత్మహత్యలకు నిలయమైన మహారాష్ట్ర విదర్భలోని యవత్‌మాల్‌ జిల్లా (చోటి గుజారి) వితస గ్రామ వాస్తవ్యుడైన ఆయనకు 19 ఎకరాల నల్లరేగడి భూమి ఉంది. 1975 నుంచి వ్యవసాయం చేస్తున్న సుభాష్‌ శర్మ 20 ఏళ్ల పాటు రసాయనిక ఎరువులు, పురుగుమందులతోనే వ్యవసాయం చేశారు.

ఫలితంగా ఆర్థికంగా నష్టాలపాలవటమే కాకుండా భూసారం సర్వనాశనమైపోయింది. 1986 తర్వాత ఖర్చులు పెరుగుతున్నా దిగుబడులు తగ్గిపోతూ వచ్చాయి. ఆ దశలో రసాయనిక వ్యవసాయ పద్ధతే నష్టదాయకమైనదన్న సత్యాన్ని గ్రహించారు. 1994 నుంచి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల వైపు మళ్లారు. నిశిత పరిశీలనతో ప్రకృతికి అనుగుణమైన ఆచరణాత్మక సుస్థిర వ్యవసాయ పద్ధతులను రూపొందించుకుని అనుసరిస్తూ మంచి నికరాదాయాన్ని పొందుతున్నారు. ఆయనకున్న 13 ఎకరాల నల్లరేగడి భూమిలో 3 ఎకరాలను ఆవులు, ఎద్దులు మేయడానికి కేటాయించి మిగతా పది ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ముఖ్యంగా కంది, పత్తి, కూరగాయలు, ఆకుకూరలను ఏడాది పొడవునా సాగు చేస్తుంటారు.

పత్తి/కంది సాళ్ల మధ్యలో పచ్చి రొట్ట సాగు
పత్తి లేదా కంది సాగులో సుభాష్‌ శర్మ అధిక దిగుబడులు పొందుతున్న పద్ధతి ఆసక్తికరంగానే కాదు.. రైతులెవరైనా సులభంగా అనుసరించడానికి వీలుగానూ ఉంది. రెండు సాళ్లలో పత్తి లేదా కంది పంట, వాటి పక్కనే మూడు సాళ్లలో పచ్చిరొట్ట మొక్కలను సాగు చేస్తారు. ప్రతి సాలుకు మధ్య 2 అడుగుల దూరం ఉంటుంది. ఈ ఐదు సాళ్లు 10 అడుగుల స్థలంలో ఉంటాయి. అంటే.. 4 అడుగుల్లో పంట, 6 అడుగుల్లో పచ్చిరొట్ట పెరుగుతాయి. పత్తి లేదా కంది సాళ్ల మధ్య 2 అడుగులు, మొక్కల మధ్య అడుగున్నర దూరం ఉంటుంది. సాధారణంగా పత్తి సాగు చేసేరైతులు 4“2 అడుగుల దూరం పాటిస్తారు. 2“1.5 అడుగుల దూరాన వేస్తున్నందున ఎకరానికి వేసే మొక్కల సంఖ్య గానీ దిగుబడి గానీ తగ్గబోదని, ఎకరానికి కిలో పత్తి విత్తనాలు అవసరమవుతాయని సుభాష్‌ శర్మ అన్నారు.


పచ్చిరొట్ట పంటలుగా ఎకరానికి 4 కిలోల సజ్జ, 6 కిలోల అలసంద, 15 కిలోల జనుము విత్తనాలను కలిపి వరుసలుగా బోదెలపై విత్తుతారు. పత్తి లేదా కంది సాళ్లలో కలుపును అతి చిన్నగా ఉన్నప్పుడే మనుషులు పీకేస్తారు లేదా కుర్ఫీతో తీసేస్తారు. నెలకోసారి కలుపు తీసి అక్కడే ఆచ్ఛాదనగా వేస్తారు. మరీ అవసరమైతే పంట తొలిదశలో గుంటక తోలుతారు. కలుపు మొక్కలు చిన్నగా ఉన్నప్పుడే తీసేస్తే కలుపు తీత ఖర్చు 80% తగ్గుతుందని సుభాష్‌ శర్మ తెలిపారు. పచ్చిరొట్ట పంటలున్న సాళ్లలో కలుపు తియ్యరు. 45–50 రోజులు పెరిగిన తర్వాత పచ్చిరొట్ట పంట మొక్కలను, కలుపును కోసి అక్కడే ఆచ్ఛాదనగా వేస్తారు. ఆ తర్వాత 30–35 రోజులు గడచిన తర్వాత మరోసారి కోసి అక్కడే ఆచ్ఛాదనగా వేస్తారు. ఈ రెండు సార్లూ ఆచ్ఛాదనగా వేసే పచ్చిరొట్ట మూరెడు ఎత్తున వస్తుంది. కాబట్టి, ఆచ్ఛాదనతో సత్ఫలితాలు వస్తున్నాయి.

పంటలో పచ్చిరొట్ట సాగుతో అనేక ప్రయోజనాలు
పంటల సాళ్ల పక్కనే పచ్చిరొట్టను పెంచి ఆచ్ఛాదన చేయటం వల్ల చాలా స్థలం వృథా అయినట్లు పైకి కనిపిస్తుంది. కానీ, నిజానికి బహుళప్రయోజనాలు నెరవేరతాయి. దీని వెనుక ఉన్న శాస్త్రీయతను రైతులు సరిగ్గా అర్థం చేసుకోవాలని సుభాష్‌ శర్మ అంటారు. పొలం బెట్టకు రాకుండా భూమిలో తేమను పచ్చిరొట్ట పంటలు కాపాడతాయి. కోసి వేసిన ఆచ్ఛాదన వల్ల నేలలోని తేమ ఆరిపోకుండా ఉండటమే కాకుండా, వాతావరణంలో నుంచి నీటి తేమను ఆచ్ఛాదనగా వేసిన గడ్డీ గాదం గ్రహించి భూమికి అందిస్తుంది. ఫలితంగా వానపాములు, సూక్ష్మజీవులు తమ కార్యకలాపాలను సజావుగా నిర్వర్తిస్తూ నేలను సారవంతం చేస్తూ ఉంటాయి. పత్తి లేదా కంది మొక్కల వేర్లు పక్కన ఉన్న పచ్చిరొట్ట ఆచ్ఛాదన కిందికే చొచ్చుకు వచ్చి దాహాన్ని తీర్చుకోవడంతోపాటు పోషకాలను గ్రహిస్తాయి. ఈ విధంగా పచ్చిరొట్ట సాగు వల్ల పత్తి లేదా కంది పంట దిగుబడి పెరుగుతుంది.

పచ్చిరొట్ట ఆచ్ఛాదనతో ప్రయోజనాలు..
1. పంట పక్కనే పచ్చిరొట్టను కూడా పెంచడం వల్ల సూర్యరశ్మి పూర్తిగా వినియోగమవుతుంది. ఆచ్ఛాదన వల్ల నేలలో సేంద్రియ కర్బనం పెరిగి భూసారం ఇనుమడిస్తుంది.

2. పొలం అంతటా వత్తుగా పంటలు ఆవరించి ఉండటం వల్ల, ఆచ్ఛాదన వల్ల వర్షాలకు భూమి పైపొర మట్టి కొట్టుకుపోకుండా రక్షింపబడుతుందని తెలిపారు.

3. పచ్చిరొట్ట పంటలు ఎర పంటగా పనిచేస్తాయి. జీవ నియంత్రణ వల్ల చీడపీడలు కూడా అదుపులో ఉంటాయి. ప్రతి 75 మిత్రపురుగులకు 25 శత్రుపురుగుల చొప్పున పెరుగుతుంటాయని.. మిత్రపురుగులు శత్రుపురుగులను తింటూ వాటి సంతతిని అదుపు చేస్తూ ఉంటాయి. పురుగుల మందులు, కషాయాలు కూడా చల్లాల్సిన అవసరం లేదని, ఆ ఖర్చంతా రైతుకు మిగిలిపోతుందని సుభాష్‌ శర్మ తెలిపారు. సూరజ్‌ సూటి రకం పత్తి గులాబీ పురుగును సైతం తట్టుకుంటుందన్నారు.

4. భూమిలో తేమ ఆరిపోకుండా ఎక్కువ కాలం నీటి ఎద్దడి రాకుండా చూస్తుంది. పత్తి వేర్లకు బోజనంతోపాటు తేమ కూడా దొరుకుతుంది. వర్షాలు మొహం చాటేసి మరీ ఇబ్బంది అయినప్పుడు ఒకటి, రెండు తడులు ఇస్తున్నామని సుభాష్‌ శర్మ తెలిపారు. పత్తి లేదా కంది సాళ్లు వేసిన చోట వచ్చే పంటకాలంలో పచ్చిరొట్ట పంటలు వేస్తామని, ఇప్పుడు పచ్చిరొట్ట విత్తనాలు చల్లిన చోట పత్తి లేదా కంది పంటలు వేస్తూ పంటమార్పిడి చేస్తుంటామన్నారు.


పత్తి 12, కంది 15 క్వింటాళ్ల దిగుబడి
పత్తిని పచ్చిరొట్టతో కలిపి సాగు చేసే ప్రయోగంలో.. సూరజ్‌(సూటి రకం) పత్తి తొలి ఏడాది ఎకరానికి 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మూడో ఏడాదికి 12 క్వింటాళ్లకు పెరిగింది. మరో రెండు, మూడేళ్లలో 20 క్వింటాళ్లకు పెరుగుతుందని సుభాష్‌ శర్మ ధీమా వ్యక్తం చేశారు. నల్లరేగడి నేలలో ఇది ఒకటి, రెండు తడులు ఇచ్చే పద్ధతిలో దిగుబడి వివరాలు. పూర్తిగా వర్షాధారంగా ప్రయోగాత్మక సాగు వచ్చే ఏడాది ప్రారంభిస్తామన్నారు. అదేవిధంగా, కంది స్థానిక సూటి రకాలను విత్తి 15–20 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నామని తెలిపారు. రైతులు ఈ పద్ధతి వెనుక దాగి ఉన్న శాస్త్రీయతను అర్థం చేసుకొని సాగు చేస్తే చక్కటి ఫలితాలు వస్తాయని, తక్కువ ఖర్చుతోనే అధిక దిగుబడి, అధిక నికరాదాయం పొందవచ్చని తెలిపారు.
(సుభాష్‌ శర్మ–హిందీ– 94228 69620,డా. రాజశేఖర్‌(సి.ఎస్‌.ఎ.)–తెలుగు– 83329 45368)

ప్రకృతి సేద్యంలో శాస్త్రీయతను రైతులు అర్థం చేసుకోవాలి
పత్తి 2 సాళ్లు వేసి.. ఆ పక్కనే 3 సాళ్లలో అనేక రకాల పచ్చిరొట్టను సాగు చేస్తే దిగుబడి పెరగడంతోపాటు భూసారం పెరగడం, బెట్టను తట్టుకోవడం వంటి ఎన్నో ప్రయోజనాలు నెరవేరతాయి. చీడపీడల బెడద కూడా తీరిపోతుంది. పత్తి మాదిరిగానే కందిని కూడా ఇలాగే సాగు చేయవచ్చు. ప్రకృతి వ్యవసాయంలో ఈ విషయాలు చాలా కీలకం. రైతులు మనసుపెట్టి ప్రకృతి సేద్యంలో దాగి ఉన్న శాస్త్రీయతను అర్థం చేసుకోవాలి. పచ్చిరొట్ట సాగుకు స్థలం వృథా అవుతున్నదని పొరబడకూడదు. రసాయనిక వ్యవసాయంలో కన్నా ప్రకృతి వ్యవసాయంలో అధిక దిగుబడి, అధికాదాయం పొందటం ముమ్మాటికీ సాధ్యమే.

సుభాష్‌ శర్మ, ప్రసిద్ధ ప్రకృతి వ్యవసాయదారుడు, రైతు శాస్త్రవేత్త, వితస, యవత్‌మాల్, మహారాష్ట్ర

ఎక్కడ కురిసిన వాన అక్కడే ఇంకాలి
నల్లరేగడి భూమి అయినప్పటికీ ఏ గజం స్థలంలో పడిన వర్షాన్ని ఆ గజంలోనే ఇంకింపజేయడం సుభాష్‌ శర్మ ప్రత్యేకత. ఏ పంటనైనా బోదెలపైనే సాగు చేస్తారు. బోదెల మధ్యలో ప్రతి మీటరుకూ అడ్డుకట్ట వేసి జల స్తంభన చేస్తారు వేసవికి ముందు నుంచే ఇలా వాన నీటి సంరక్షణ ఏర్పాటు చేస్తారు. మరీ కుండపోత వర్షం కురిస్తే పంట ఉరకెత్తకుండా అడ్డుకట్టలను తాత్కాలికంగా తొలగించి, వరద నీరు పోయిన తర్వాత మళ్లీ కట్టలు వేస్తారు. ఏడాదిలో ఏ సీజన్‌లోనైనా అకాల / సకాల వర్షాలన్నిటినీ ఒడిసిపడతారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి నీటి బొట్టునూ పొలంలో ఎక్కడికక్కడే ఇంకింపజేస్తారు. దీంతో భూగర్భ జలాలకు లోటుండదు. అయినా చాలా పొదుపుగా మరీ అవసరమైతేనే ఒకటి, రెండు తడులు ఇస్తూ పత్తి, కంది, కూరగాయలను సాగు చేస్తారు. భూమిలో ఎకరానికి 4 టన్నుల చొప్పున దిబ్బ ఎరువు వేసి కలియదున్నుతారు. ఆ తర్వాత పంట ఏదైనా సరే బోదెలు తోలి, బోదెలపైన విత్తనాలు వేసి సాగు చేస్తారు. విత్తనాలతో పాటే ప్రతి పాదులో దోసెడు తాను స్వయంగా తయారు చేసుకున్న ‘అలౌకిక్‌ ఖాద్‌’ను ఎకరానికి టన్ను చొప్పున వేస్తారు.


బోదెలపై 2 సాళ్లలో పత్తి మొక్కల మధ్యలోని 3 సాళ్లలో ఏపుగా పెరుగుతున్న పచ్చిరొట్ట. వర్షపు నీరు పొలంలోనే ఎక్కడికక్కడే ఇంకింపజేసేందుకు బోదెల మధ్య వేసిన అడ్డుకట్టలు  


కంది మధ్య పచ్చిరొట్టను 2 సార్లు కోసేసిన తర్వాత ఆకుకూరలు కూడా పండించుకోవచ్చు

– పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement