high yields
-
ఖరీఫ్‌కు కొత్త వరి వంగడాలు సిద్ధం
సాక్షి, భీమవరం: ఖరీఫ్ సాగుకు రైతులు సన్నద్ధమవుతున్న తరుణంలో పంట తెగుళ్లు, వైపరీత్యాలను ఎదురొడ్డి నిలిచే ఆధునిక వంగడాల సాగు ద్వారా నాణ్యమైన అధిక దిగుబడులు సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 300 వరి రకాలు సాగుచేస్తున్నప్పటికీ బీపీటీ 5204, ఎన్‌డీఎల్‌ఆర్ 7, స్వర్ణ, పీఏపీఎల్ 1100, ఆర్జీఎల్ 2537 వంటి కొన్ని రకాలు మాత్రమే తినడానికి అనువుగా ఉంటున్నాయి.ఈ సమస్యను అధిగమించేందుకు మరిన్ని రకాలను, అధిక పోషక విలువలు కలిగిన వాటిని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గత ఏడాది జూలై 19న విడుదల చేసింది. అందులో బీపీటీ 5204, ఎంటీయూ 1271, బీపీటీ 2846, బీపీటీ 2841, ఎన్‌ఎల్‌ఆర్ 3238 రకాలు ఉన్నాయి. వాటి వివరాలను మార్టేరు రీజినల్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ (వరి) డాక్టర్ టి.శ్రీనివాస్ తెలిపారు. ఆయా రకాల వరి వంగడాలు, వాటి ప్రత్యేకతలు ఆయన తెలిపారు. ఎంటీయూ 1271 అధిక గింజలతో ఎక్కువ దిగుబడి ఇచ్చే సన్న రకం. పంట కాలం 140 రోజులు. రెండు వారాల నిద్రావస్థ కలిగి ఉండి గింజ మొలకెత్తదు. కాండం దృఢంగా ఉండి చేను పడిపోదు. పచ్చి బియ్యానికి అనుకూలం. బియ్యం పారదర్శకంగా ఉండి 69.7 శాతం నిండు గింజలు కలిగి అధిక దిగుబడి ఇస్తుంది. రైతు, మిల్లర్, సన్నగింజ ధాన్యం మార్కెట్‌కి అనుకూలమైన వెరైటీ. కడప, కర్నూలు, చిత్తూరు, తిరుపతి, నంద్యాల, ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో సార్వాకు అనువైన రకం. దోమ, ఎండాకు తెగుళ్లను కొంతవరకు తట్టుకుంటుంది. సగటున ఎకరాకు 2.8 టన్నుల నుంచి మూడు టన్నుల వరకు దిగుబడి వస్తుంది. బీపీటీ 2846 కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ప్రాంతాల్లో బీపీటీ 5204కు దీటైన ప్రత్యామ్నాయంగా, భోజనానికి అనువుగా ఉంటూ అధిక దిగుబడినిచ్చే మధ్యస్థ సన్న గింజ రకం. మార్కెట్‌కు, వినియోగదారులకు అనువుగా ఉంటుంది. పంట కాలం 145 నుంచి 150 రోజులు. రెండు వారాల నిద్రావస్థ కలిగి ఉండి గింజ మొలకెత్తదు. సన్నగింజ రకం. కాండం దృఢంగా ఉండి చేను పడిపోదు. గింజ మధ్యస్థ సన్నంగా ఉంటుంది. భోజనానికి అనుకూలమైన రకం. 65.2 శాతం నిండు గింజలు కలిగి మిల్లర్, మార్కెట్‌కు అనుకూలమైన వెరైటీ. అగ్గి తెగులు, మెడ విరుపు, పొట్ట కుళ్లు తెగుళ్లను తట్టుకుంటుంది. సగటున ఎకరాకు మూడు టన్నుల దిగుబడి సామర్థ్యం కలిగి, రైతుకు మంచి ఆదాయం ఇస్తుంది. నేరుగా విత్తే విధానం, సేంద్రియ వ్యవసాయ విధానానికి అనువైన రకం. బీపీటీ 2841 అధిక ప్రొటీన్, జింక్, ఇతర పోషక విలువలు కలిగి, మధుమేహ రోగులకు భోజనానికి అనువైన నల్ల బియ్యపు రకం. బీపీటీ 5204 ప్రత్యామ్నాయంగా, భోజనానికి అనువుగా ఉంటూ అధిక దిగుబడినిచ్చే మధ్యస్థ సన్న గింజ రకం. పంట కాలం 130 నుంచి 135 రోజులు. రెండు వారాల నిద్రావస్థ కలిగి ఉండి గింజ మొలకెత్తదు. కాండం దృఢంగా ఉండి చేనుపై పడిపోదు. 65.2 శాతం నిండు గింజలు కలిగి పచ్చి బియ్యానికి అనువుగా ఉంటుంది. బియ్యం పారదర్శకంగా ఉండి భోజనానికి బాగుంటుంది. అగ్గి తెగులు, మెడవిరుపు, దోమ పోటును తట్టుకుంటుంది. సగటున ఎకరాకు 2.4 టన్నుల దిగుబడి సామర్థ్యం కలిగి, రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయం చేసే అన్ని ప్రాంతాలకూ అనువుగా ఉంటూ, డిజిటల్ మార్కెటింగ్‌లో కిలో సింగిల్ పాలిష్ బియ్యానికి రూ. 200 పైచిలుకు ధర పలికే అవకాశం ఉన్న రకం. ఎన్‌ఎల్‌ఆర్ 3238 అధిక జింక్ కలిగి ఉంటుంది. మధ్యస్థ సన్న గింజ రకం. 120 – 125 రోజుల కాల పరిమితి కలిగిన స్వల్పకాలిక వెరైటీ. రెండు వారాల నిద్రావస్థ కలిగి ఉండి గింజ చేనుపై మొలకెత్తదు. కాండం దృఢంగా ఉండి చేనుపై పడిపోదు. 62% నిండు గింజలు కలిగి, బియ్యం పారదర్శకంగా ఉండి భోజనానికి అనువుగా ఉంటుంది. అగ్గి తెగులు, మెడ విరుపు తెగుళ్లను తట్టుకుంటుంది. తక్కువ నత్రజనితో (సిఫారసు చేసిన నత్రజనిలో 75%) సగటున ఎకరాకు 2.6 టన్నుల దిగుబడి ఇస్తుంది. రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయం చేసే అన్ని ప్రాంతాలకు అనువుగా ఉంటూ, డిజిటల్ మార్కెటింగ్‌కి అనువైన రకం.విత్తనాల కోసం వీరిని సంప్రదించవచ్చు అధిక శాతం విస్తీర్ణంలో కొత్త వెరైటీల సాగుకు కసరత్తు చేస్తున్నట్లు డా. టి.శ్రీనివాస్ తెలిపారు. ఎంటీయూ వరి రకాల విత్తనాల కోసం మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీడ్ ఆఫీసర్ డాక్టర్ పీవీ రమణారావు (ఫోన్ 94404 41922), బీపీటీ రకాల కోసం డాక్టర్ కృష్ణవేణి (ఫోన్ 94417 21120), ఎన్‌ఎల్‌ఆర్ రకాలకు డాక్టర్ శ్రీలక్ష్మి (ఫోన్ 98855 27227), వరి రకాల వివరాలు, సాగులో సందేహాల నివృత్తి కోసం డాక్టర్ టి.శ్రీనివాస్ (ఫోన్ 93968 48380) సంప్రదించాలని డా. టి.శ్రీనివాస్ వివరించారు.2023లో అఖిల భారత స్థాయిలో విడుదలైన వరి వంగడాలుఎంటీయూ 1275 పంట కాలం 135 నుంచి 140 రోజులు. రెండు వారాల నిద్రావస్థ కలిగి ఉండి గింజ మొలకెత్తదు. కాండం దృఢంగా ఉండి చేనుపై పడిపోదు. గింజ మధ్యస్థ సన్నంగా ఉండి పచ్చి బియ్యానికి అనుకూలం. బియ్యం పారదర్శకంగా ఉండి భోజనానికి అనువుగా ఉంటుంది. అగ్గి తెగులు, మెడ విరుపు, బ్యాక్టీరియా ఆకు ఎండు, గోధుమ రంగు మచ్చ తెగుళ్లను తట్టుకుంటుంది. సగటున ఎకరాకు మూడు టన్నుల దిగుబడి ఇస్తుంది.బీపీటీ 3050 కేంద్ర రకాల విడుదల కమిటీ ద్వారా గుజరాత్, మహారాష్ట్రలలో సాగు కోసం విడుదల చేసిన రకం. పంట కాలం 130 నుంచి 135 రోజులు. రెండు వారాల నిద్రావస్థ కలిగి గింజ మొలకెత్తదు. కాండం ధృఢంగా ఉండి చేనుపై పడిపోదు. గింజ పొడవుగా లావుగా ఉండి అధిక బియ్యం రికవరీ కలిగిన రకం. అగ్గి తెగులు, మెడ విరుపు, గోధుమ రంగు మచ్చ తెగుళ్లను తట్టుకుంటుంది. సగటున ఎకరాకు 2.4 నుంచి 2.6 టన్నుల దిగుబడి వస్తుంది. -
సాగుబడి: ఈ సరికొత్త ప్రయోగంతో.. కరువును తట్టుకున్న పంటలు!
ఏపీ రైతు సాధికార సంస్థ (ఆర్‌వైఎస్‌ఎస్) మద్దతుతో ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయంలో ఒక సరికొత్త ప్రయోగం ప్రారంభమైంది. కరువును తట్టుకునే ప్రత్యేక పద్ధతి (డ్రాట్ ప్రూఫింగ్ మోడల్)లో పంటలు సాగు జరుగుతోంది. వర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ, బీడు భూముల్లో కూడా ప్రత్యేక పద్ధతులను అనుసరిస్తూ ప్రకృతి వ్యవసాయం చేయవచ్చని పలువురు చిన్న, సన్నకారు రైతులు నిరూపిస్తున్నారు. పొలం మొత్తాన్నీ దుక్కి చేయకుండా.. ప్రతి 3 అడుగుల దూరంలో ఒక అడుగు భూమిని తవ్వి 5 రకాల పంట విత్తనాలను విత్తుతున్నారు. 2023 ఆగస్టులోప్రారంభమైన ఈ సరికొత్త పద్ధతిలో అనేక జిల్లాలకు చెందిన 56 మంది రైతులు 20 సెంట్ల నుంచి ఎకరా విస్తీర్ణంలో డ్రాట్ ప్రూఫ్ సాగు చేస్తున్నారు. ఇద్దరు రైతుల అనుభవాలతో కూడిన కథనం.. కాలువ రాకపోయినా పంట వచ్చింది.. రైతు ఆదిలక్ష్మి ఇలా చెప్పారు.. ‘‘మాకు అరెకరం పొలం ఉంది. ఇక్కడ అందరూ మిరపే వేస్తారు. మేమూ మిరపే వేసేవాళ్లం. రెండేళ్ల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. మిరపలో అంతరపంటలు కూడా సాగు చేశాం. సాగర్ కాలువ నుంచి ఇంజన్‌తో తోడుకొని తడి పెట్టేవాళ్లం. గత ఏడాది 7 క్వింటాళ్లు ఎండు మిరప పండింది. రూ. 50 వేల నికారాదాయం వచ్చింది. వర్షాలు లేక ఈ సంవత్సరం కాలువ ఒక్కసారే వచ్చింది. అందుకని మిరప వేయలేదు. ప్రకృతి వ్యవసాయ శాఖ అధికారుల సూచన మేరకు.. కరువును తట్టుకొని పండే డ్రాట్ ప్రూఫ్ మోడల్లో పంటలు పెట్టాం. ఈ పంటలకు ముందు మేలో నవధాన్య (ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్) పంటలు చల్లాం. వర్షం లేక సరిగ్గా మొలవలేదు. మళ్లీ జూలైలో వేశాం. వర్షానికి మొలిచింది. పెరిగినాక కోసి, గొడ్లకు మేతగా వాడుకున్నాం. వరుసగా మూడేళ్లుగా నవధాన్య పంటలు వేయటం వల్ల ఉపయోగం ఏమిటంటే.. భూమి బాగా గుల్లబారింది. నవధాన్య పంటలు వేయని పక్క పొలంలోకి వెళ్లి మట్టి చేత్తో తీయాలంటే చాలా కష్టపడాలి. మా పొలంలో సులువుగానే మట్టి తీయొచ్చు. పొలం దున్నకుండానే, 3 అడుగులకు ఒక చోట అడుగు నేలను గుల్లగా తవ్వి, గత ఏడాది అక్టోబర్ 27న 5 రకాల విత్తనాలు నాటుకున్నాం. ప్రధాన పంటగా మధ్యలో ఆముదం లేదా కందిని నాటాం. దానికి నాలుగు వైపులా చిక్కుడు, అలసంద, అనుములు, సజ్జలు విత్తుకున్నాం. బీజామృతంతో విత్తన శుద్ధి చేసి, విత్తన గుళికలు తయారు చేసుకొని నాటుకున్నాం. సీడ్ పెల్లటైజేషన్ చేయటం వల్ల భూమిలో విత్తుకున్న తర్వాత మొలక శాతం బాగుంటుంది. ఒకవేళ వర్షం రాకపోయినా లేదా మనం నీళ్లు పెట్టటం లేటైనా ఆ విత్తనం చెడిపోకుండా ఉంటుందని పెల్లటైజేషన్ చేశాం. విత్తనం పెట్టిన కొద్ది రోజులకు తుపాను వానకు విత్తనాలు మొలిచాయి. విత్తనం పెట్టేటప్పుడు అరెకరంలో 200 కిలోల ఘనజీవామృతం వేశాం. రెండుసార్లు ద్రవ జీవామృతం పిచికారీ చేశాం. తర్వాత మరో రెండు సార్లు వాన వచ్చింది. అదే వాన సరిపోయింది. మిరపకు ఈ పంటలకు చాలా తేడా ఉంది. మిరపకు రెండు రోజులు నీరు లేకపోతే వడపడిపోయి ఎండిపోతుంది. డ్రాట్ ప్రూఫ్ మోడల్లో పంటలు అలా కాదు. నీరు లేకపోయినా చాలా వరకు జీవ కళ ఉంటుంది. అదీకాక, మేం చేసిన విత్తన గుళికలుగా చేసి వేసినందు వల్ల, భూమిలో వేసిన ఘనజీవామృతం వల్ల, ద్రవ జీవామృతం పిచికారీ వల్ల పంటలు ఎదిగాయి. ప్రధాన పంటతో పాటు పెట్టిన అనుములు, చిక్కుళ్ల వల్ల ఉపయోగం ఏమిటంటే.. ఈ తీగలు పాకి నేలపై ఎండపడకుండా కప్పి ఉంచి కాపాడటం, భూమిలో తేమ ఆరిపోకుండా కాపాడింది. సజ్జ ద్వారా రూ. 8,000లు వచ్చాయి. సజ్జ ఇంకా తీయాల్సి ఉంది. చిక్కుళ్లు,సొర కాయలు, దోసకాయల ద్వారా మరో ఆరేడు వేలు ఆదాయం వచ్చింది. సజ్జ బాగా పెరగటంతో నీరు లేక కంది సరిగ్గా ఎదగలేదు. ఇప్పటికి అన్నీ కలిపి రూ. 15 వేల వరకు ఆదాయం వచ్చింది. ఇంకా ఆముదాలు ఒక బస్తా వరకు వస్తాయి. పనులు మేమే చేసుకుంటాం. ఖాళీ ఉన్న రోజుల్లో కూలికి వెళ్తాం. బెట్టను తట్టుకొని పంట పండించుకోవచ్చని, ఎంతో కొంత దిగుబడి వస్తుందని నాకైతే నమ్మకం కుదిరింది..’’ – ఎం. ఆదిలక్ష్మి (83091 18867), ఈపూరు, పల్నాడు జిల్లా బీడులోనూ పంటలు.. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కపట్రాళ్ళ గ్రామానికి చెందిన రంగస్వామి బిఎస్సీ బీఈడీ చదువుకొని తమ రెండెకరాల్లో ఐదేళ్లుగా ప్రకృతి వ్వవసాయం చేస్తున్నారు. ఒక ఎకరంలో సపోట, మామిడి చెట్లు ఉన్నాయి. మరో ఎకరంలో టొమాటో, మిర్చి, వంగ, గోరుచిక్కుడు పంటలను బోరు నీటితో సాగు చేశారు. రెండో పంటగా వేరుశనగ, కంది, ముల్లంగి తదితర పంటలు వేశారు. రెండెకరాల్లో సగటున ఏడాదికి రూ. లక్షా 70 వేల వరకు నికరాదాయం పొందుతున్నట్లు తెలిపారు. సపోట, మామిడి తోటలో మూడు ఏళ్లుగా దుక్కి చేయని 30 సెంట్ల విస్తీర్ణంలో డ్రాట్ ప్రూఫింగ్ మోడల్లో 2023 డిసెంబర్లో ప్రయోగాత్మకంగా సజ్జ, గోరు చిక్కుడు, అనుములు, అలసంద, కంది, ఆముదం పంటలను సాగు చేశారు. 3 అడుగుల దూరంలో ఒక అడుగు విస్తీర్ణంలో తవ్వి, ఘనజీవామృతం వేసి విత్తనాలు విత్తారు. మామిడి ఆకులతో ఆచ్ఛాదన చేశారు. వారానికోసారి బక్కెట్లతో పాదికి 2,3 లీటర్ల నీరు పోశారు. మూడు నెలల వ్యవధిలో అలసంద, అనుములు అమ్మితే రూ. 2 వేల దాకా ఆదాయం వచ్చింది. పశుగ్రాసం రూపంలో మరో రూ. 3 వేల ఆదాయం వచ్చింది. రూ. 2 వేల గోరుచిక్కుళ్లు పండాయి. తమ ఇంటి కోసం, బంధువులకు వినియోగించారు. సజ్జ పక్షులు తిన్నాయి. కంది, ఆముదం పంటలు కోయాల్సి ఉంది. పంటలకు నీరు పోస్తున్నందున మొక్కల మధ్యన 3 అడుగుల ఖాళీలో గడ్డి పెరుగుతోంది. ఆ గడ్డిని కోసి ఆవులు, గేదెలకు వేస్తున్నారు. డ్రాట్ ప్రూఫింగ్ మోడల్ పంటలతో వదిలేసిన భూమిని దుక్కి చేయకుండానే.. పంటలు పెట్టుకునే చోట తవ్వి విత్తనాలు పెట్టుకొని తిరిగి సాగులోకి తెచ్చుకోవచ్చని, ఎంతో కొంత పంట దిగుబడి తీసుకోవచ్చని రంగస్వామి అంటున్నారు. ప్రకృతి వ్యవసాయం వల్ల రంగస్వామి పొలంలో వానపాముల సంఖ్య పెరిగింది. నేల గుల్లబారి మృదువుగా తయారవడంతో వర్షాలు తగ్గినా పంట పెరగుదల బాగా కనిపిస్తోంది. రంగస్వామి ప్రకృతి వ్యవసాయం చూసి రంగస్వామి (88869 60609) తండ్రి కూడా ప్రకృతి వ్యవసాయం చేపట్టడం విశేషం. -
పంగాసియస్.. కేరాఫ్ ఏపీ
పంగాసియస్గా పిలిచే ఈ చేపకు వెన్ను ముల్లు తప్ప చూద్దామంటే మరో ఎముక కనిపించదు. పైగా నీచు వాసన రాదు. దీంతో చేసే ఏ వంటకమైనా చాలా మృదువుగా.. రుచికరంగా ఉంటుంది. తింటే ఇట్టే జీర్ణమైపోతుంది. పిల్లల నుంచి వృద్ధుల వరకు వీటిని ఇష్టపడని వారుండరు. అందుకే స్టార్ హోటల్స్‌తోపాటు సాధారణ హోటళ్లలోనూ ఈ చేప వంటకాలకు డిమాండ్ ఎక్కువ. అపోలో ఫిష్‌గా దీనిని ఎక్కువగా వండుతారు. వియత్నాంలో పుట్టిన ఈ చేపలు మన ప్రాంతంలో పెరిగే ఏటి జెల్లను పోలి ఉంటాయి. దేశీయంగా వీటిని పంగా, పంగస్, అపోలో, వెండి చేప అని కూడా పిలుస్తారు. సాక్షి, అమరావతి: పంగాసియస్ చేపల సాగులోను.. అధిక దిగుబడులు సాధించడంలోను దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 50 వేల హెక్టార్లలో ఈ చేపల్ని పెంచుతుండగా.. అందులో 20 వేల హెక్టార్లు మన రాష్ట్రంలోనే ఉండటం విశేషం. ఏటా 80 లక్షల టన్నుల పంగాసియస్ చేపలు ఉత్పత్తి అవుతుండగా.. వాటిలో 30నుంచి 35 లక్షల టన్నులు ఏపీ నుంచే దిగుబడి వస్తుండటం గమనార్హం. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, ఉభయ గోదావరి, కోనసీమ జిల్లాల్లో వీటి సాగు విస్తరించి ఉంది. స్థానికంగా ఈ చేపల వినియోగం కేవలం 2 శాతమే కాగా.. మిగిలిందంతా పొరుగు రాష్ట్రాలకే ఎగుమతి అవుతోంది. అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌కు 10 లక్షల టన్నుల వరకు వెళుతోంది. బిహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, అస్సాం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జమ్మూకశ్మీర్లోనూ వీటికి డిమాండ్ ఎక్కువే. నీటిపైకి వచ్చి ఆక్సిజన్ తీసుకోగలవు వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండడంతో ఈ చేపలు ఎలాంటి తెగుళ్లు, వ్యాధులనైనా తట్టుకుంటాయి. మొప్పలు కాకుండా వీటికి ఉండే గాలి తిత్తుల ద్వారా గాలి పీల్చుకుంటాయి. నీటిలో ఆక్సిజన్ తగ్గినప్పుడు నీటి ఉపరితలానికి చేరి వాతావరణంలోని ఆక్సిజన్‌ను తీసుకుంటాయి. ఎలాంటి వాతావరణంలో అయినా చాలా ఆరోగ్యకరంగా పెరుగుతాయి. వేసిన ప్రతి పిల్ల బతకడం వీటి ప్రత్యేకత. రెండేళ్లలో మూడు పంటలు తీస్తున్నారు. గరిష్టంగా ఏడాది పాటు పెంచగలిగితే ఒక్కో చేప 3నుంచి 4 కేజీల వరకు పెరుగుతుంది. ఎకరాకు సైజును బట్టి 12 నుంచి 20 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. పోషకాలు పుష్కలం ప్రొటీన్స్, ఐరన్, జింక్, కాల్షియం, ఒమేగా–3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉండే ఈ చేపల్లో కార్బోహైడ్రేట్స్, సోడియం తక్కువగా ఉంటాయి. 100 గ్రాముల చేపలో ప్రొటీన్ 15.2 గ్రాములు, కొవ్వు 2.9 గ్రాములు, కార్బోహైడ్రేట్స్, యాష్ గ్రాము, నీరు 60 గ్రాములు, 89 కిలో కేలరీల శక్తి లభిస్తుంది. హాని కల్గించే కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండటం వల్ల గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. అధికంగా ఉండే కాల్షియం ఎముకలు, కీళ్ల బలోపేతానికి, సేంద్రియ ఆమ్లాలు కంటిచూపు మెరుగుదలకు ఉపయోగపడతాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ప్రీరాడికల్స్‌ను నిరోధిస్తాయి. బ్రూడర్ కేంద్రం ఏపీలోనే.. కేంద్రీయ మంచినీటి మత్స్య పరిశోధనా సంస్థ (భువనేశ్వర్)కు అనుబంధంగా కృష్ణా జిల్లా కానూరు వద్ద గల ప్రాంతీయ పరిశోధనా కేంద్రం పంగాసియస్ బ్రూడర్గా కేంద్రం గుర్తింపు పొందింది. 2013లో వియత్నాం నుంచి తీసుకొచ్చిన బ్రూడర్స్ ద్వారా తల్లి చేపలను ఉత్పత్తి చేసి కనీసం 4 ఏళ్లపాటు పెంచి పిల్లలను ఉత్పత్తి చేస్తూ వస్తున్నారు. ఇక్కడ ఉత్పత్తి అయిన 30–40 గ్రాముల సైజు పిల్లలను హేచరీలకు ఇస్తుంటారు. హేచరీల్లో మరో మూడేళ్ల పాటు సీడ్ ఉత్పత్తి జరుగుతుంది. ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సీడ్ ఉత్పత్తి చేస్తారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో 6 టన్నుల బ్రూడర్స్ ఉన్నాయి. ఏటా 100 లక్షల సీడ్ అవసరం కాగా.. 50 లక్షల సీడ్ ఈ కేంద్రం అభివృద్ధి చేసిన బ్రూడర్స్ నుంచే ఉత్పత్తి చేస్తారు. అపోలో ఫిష్‌గా, ఫిష్ స్టాటర్స్గా ఉపయోగించే ఈ చేపకు స్టార్ హోటల్స్ నుంచి సాధారణ హోటల్స్ వరకు డిమాండ్ ఎక్కువ. ఈ కారణంగానే వీటికి అపోలో ఫిష్ అనే పేరొచ్చింది. పదేళ్లుగా ఇదే సాగు పదేళ్లుగా వంద ఎకరాల్లో పంగాసియస్ సాగు చేస్తున్నా. మిగిలిన చేపలతో పోలిస్తే వీటి సాగులో ఏమాత్రం నష్టాలు ఉండవు. కేజీ, కేజీన్నర సైజులో చేపలు పట్టుబడి చేస్తా. ఎకరాకు 9నుంచి 12 టన్నుల వరకు దిగుబడులొస్తాయి. మంచి ఆదాయం వస్తుంది. – ఉమాశంకర్‌రెడ్డి, రైతు, గుడివాడ, కృష్ణా జిల్లా బ్రూడర్స్ ఉత్పత్తిలో.. పదేళ్లుగా పంగాసియస్ తల్లి చేపల(బ్రూడర్స్)ను ఉత్పత్తి చేస్తున్నాం. జన్యుపరమైన సమస్యలు లేకుండా వీటిని అభివృద్ధి చేసి హేచరీలకు ఇస్తున్నాం. వీటి సాగు, దిగుబడుల్లో ఏపీ మొదటి స్థానంలో ఉంది. 2013లో 200 బ్రూడర్స్ తీసుకొచ్చాం. ప్రస్తుతం 6వేల కిలోల బ్రూడర్స్ ఉన్నాయి. – బి.శేషగిరి, ప్రిన్సిపల్ సైంటిస్ట్, ప్రాంతీయ మత్స్య పరిశోధనా కేంద్రం -
ప్రతికూలతలను తట్టుకునే ‘కుద్రత్–3’
ప్రసిద్ధ రైతు శాస్త్రవేత్త ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రకాశ్ సింగ్ రఘువంశీ రూపుకల్పన చేసిన కుద్రత్–3 రకం కంది ప్రతికూల వాతవరణ పరిస్థితులను ధీటుగా తట్టుకొని అధిక దిగుబడులనిస్తూ అనేక రాష్ట్రాల రైతులను ఆకర్షిస్తోందని బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో పప్పుధాన్యాల విభాగం పూర్వ ప్రధాన శాస్త్రవేత్త డా. యు.పి. సింగ్ తెలిపారు. హెక్టారుకు 36 క్వింటాళ్ల కందుల దిగుబడినిచ్చే ఈ రకం యూపీతోపాటు బీహార్, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రైతుల ఆదరణ పొందిందన్నారు. భూతాపం వల్ల మారిన వాతావరణ పరిస్థితుల్లో ఈ రకం రైతులకు స్థిరమైన భరోసానిస్తుందని కుద్రత్–3 ఆవిష్కర్త రఘువంశీ అంటున్నారు. దీని పంటకాలం 235 రోజులు. వంద గింజల బరువు 17.57 గ్రాముల బరువు తూగుతాయి. వివరాలకు.. ప్రకాశ్ సింగ్ రఘువంశీ – 98392 53974, 70203 07801. -
‘సార్వా’త్రా సంతోషం..
ఆకివీడు: ఖరీఫ్ పంట పండింది. రైతు ఇంట ఆనందం వెల్లివిరుస్తోంది. ప్రకృతి అనుకూలించకపోయినా, అతివృష్టిలోనూ అధిక దిగుబడుల సాధనలో జిల్లా రైతాంగం విజయం సాధించారు. మెట్ట ప్రాంతంలో మాసూళ్లు పూర్తి కావచ్చాయి. ఇప్పటికే రైతులు ఎకరాకు 40 నుంచి 45 బస్తాల దిగుబడి సాధించారు. కొన్నిచోట్ల ఎకరానికి 53 బస్తాల దిగుబడి వచ్చింది. డెల్టా ప్రాంతంలో కోతలు పారంభమయ్యాయి. వ్యవసాయశాఖ, గంణాంక శాఖ అధికారులు దిగుబడులపై అంచనాలు వేస్తున్నారు. ర్యాండమ్ పద్ధతిలో పంట కోత ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. సరాసరి దిగుబడి 35 బస్తాల నుంచి 40 బస్తాల వరకూ వస్తున్నట్లు అంచనా వేశారు. డెల్టాలో దిగుబడి ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. కొన్ని మండలాల్లో దిగుబడులు భారీగా ఉంటే, చేపల చెరువులు ఉన్న గ్రామాల పరిధిలో దిగుబడి స్వల్పంగా తగ్గిందని రైతులు, వ్యవసాయాధికారులు చెబుతున్నారు. అధిక దిగుబడులు జిల్లాలో ఖరీఫ్‌లో 2,58,118 హెక్టార్లలో వరి సాగు చేపట్టారు. దీనిలో మెట్ట, డెల్టా ప్రాంతాల్లో సాగు ఉంది. ఈ ఏడాది ఖరీఫ్ సాగులో 13 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి లక్ష్యంగా నిర్ణయించగా, లక్ష్యాన్ని అధిగమించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఖరీఫ్‌లో ఎంటీయూ 1061, 1064, 1121, 1156, 1153,సంపత్ వంగడంతో పాటు అక్కడక్కడా స్వర్ణ రకం సాగు చేశారు. ఈ రకాల్లో 1061, 1064 వంగడాలు అధిక దిగుబడులు ఇచ్చేలా కనిపిస్తున్నాయి. అతివృష్టిని అధిగమించి ఈ ఏడాది భారీ వర్షాలు, వరదలతో జిల్లా అతలాకుతలమైంది. ఖరీఫ్ సాగును ఆలస్యంగా చేపట్టిన డెల్టా ప్రాంతంలో వరి సాగుకు తీవ్ర ఇబ్బంది తలెత్తింది. ఒకటి రెండుసార్లు నారు పోసుకోవాల్సి వచ్చింది. వరి పొట్ట, పాలు, పూత దశలో ఉండగా భారీ వర్షాలు కురిశాయి. ఆ తర్వాత తెగుళ్లు వేధించాయి. దోమ విజృంభించింది. అయినా అన్ని ఒడిదుడుకులనూ ఈ సార్వా సమర్థంగా ఎదర్కొంది. దోమ ఉధృతి ఎదురైనప్పుడు రైతులు ఆందోళన చెందకుండా పరిమితికి మించకుండా పురుగు మందులు వినియోగించారు. తూర్పు గాలులకు దోమ తుడిచిపెట్టుకుపోయింది. 8 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు.. ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకూ 8 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. జిల్లాలో 311 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభ్తుత్వం ఏర్పాటు చేసింది. దీనిలో 203 ధాన్యం కొనుగోలు కేంద్రాలను సహకార సంఘాల ద్వారానూ, 108 కేంద్రాలను వెలుగు ప్రాజెక్టు ద్వారా డ్వాక్రా మహిళలకు కేటాయించారు. ఈ ఏడాది ధాన్యం కొనుగోలు కేంద్రాలను గిడ్డంగి సౌకర్యం ఉన్న సొసైటీలకు అధికంగా ఇవ్వడంతో ధాన్యం నిల్వ ఉంచే అవకాశం ఏర్పడింది. వెలుగు కేంద్రాల వద్ద కూడా మార్కెట్ యార్డు గొడౌన్లు, స్థానిక గొడౌన్లను వినియోగించుకుంటున్నారు. డెల్టా ప్రాంతంలో వరి కోతలు మొదలు కావడంతో ధాన్యం ఇకపై ముమ్మరంగా కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ప్రోత్సాహం.. ఈ ఏడాది సార్వా సీజన్లో ప్రభుత్వం రైతులకు అండగా నిలబడింది. కష్టమొచ్చిన ప్రతిసారీ భరోసా ఇచ్చింది. పెట్టుబడి కోసం అక్టోబర్‌లో రైతు భరోసా అందించడంతో అన్నదాతలు కొన్ని ఖర్చులకు ఆ మొత్తాన్ని వినియోగించుకోగలిగారు. అధికారులు కూడా రైతులకు అందుబాటులో ఉంటూ ప్రతికూల పరిస్థితులు తలెత్తిన ప్రతిసారీ సలహాలు, సూచనలు ఇచ్చారు. ఫలితంగా దిగుబడులు ఆశాజనకంగా వచ్చాయి. 40–45 బస్తాల దిగుబడి.. జిల్లాలో ఖరీప్ పంట దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. ఇప్పటికే మెట్టలో 45 బస్తాల పైబడి దిగుబడి వచ్చింది. డెల్టాలో మాసూళ్లు ప్రారంభమవుతున్నాయి. అక్కడక్కడా పంటకోత ప్రయోగంలో సరాసరి 40 బస్తాల దిగుబడి వస్తోంది. అతివృష్టి సంభవించినా వరిసాగుకు నష్టం కలగలేదు. – గౌసియా బేగం, జిల్లా వ్యవసాయాధికారి, ఏలూరు 90 కేంద్రాల్లో కొనుగోళ్లు.. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకూ 8 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. 311 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా 90 కేంద్రాల్లో కొనుగోలు జరుగుతోంది. డెల్టాలో మాసూళ్లు ప్రారంభం కావడంతో ధాన్యం అధికంగా వచ్చే అవకాశం ఉంది. – వర కుమార్, మేనేజర్, జిల్లా పౌరసరఫరాల శాఖ, ఏలూరు 40 బస్తాలొస్తుంది.. ఖరీప్పంట దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రకృతి కరుణించింది. ఎకరానికి 40 బస్తాలు వస్తాయని ఆశిస్తున్నాం. కంకులు బలంగా ఉండటంతో దిగుబడి బాగుంటుంది. – ఎరిచర్ల ప్రభాకరరావు, చెరుకుమిల్లి దిగుబడి బాగుంది.. ఖరీఫ్ దిగుబడి బాగుంది. అధిక వర్షాలకు తీవ్రంగా నష్టం వస్తుందని బాధపడ్డాం. ఆ విధంగా జరగలేదు. నష్టాలను అధిగమించినట్లే. పంట బాగుండటంతో ఆనందంగా ఉంది. – జంపన అర్జునరాజు, కౌలు రైతు, అయిభీమవరం -
పత్తి/కంది.. మధ్యలో పచ్చిరొట్ట
మహారాష్ట్ర.. విదర్భ.. యవత్మాల్.. ఈ పేర్లు వినగానే అప్పుల్లో కూరుకుపోయి బలవన్మరణాల పాలైన వేలాది మంది పత్తి రైతుల విషాద గాథలు మదిని బరువెక్కిస్తాయి. అయితే, ఈ కథ అంతటితో ముగిసిపోలేదు. ఎడారిలో ఒయాసిస్సు మాదిరిగా సేద్యాన్ని ఆనందమయంగా మార్చుకున్న అతి కొద్ది మంది ప్రకృతి వ్యవసాయదారులు కూడా అదృష్టవశాత్తూ అక్కడ ఉన్నారు. రసాయనాలను త్యజించి, నేలతల్లికి ప్రణమిల్లుతూ భూసారాన్ని పరిరక్షించుకుంటూనే అధిక దిగుబడులు సాధిస్తున్న అద్భుత ప్రకృతి వ్యవసాయదారుల్లో సుభాష్ శర్మ ఒకరు. ప్రకృతి వ్యవసాయంలో ఆచ్ఛాదన అతి ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయితే, ఆచ్ఛాదనగా వేయడానికి గడ్డీ గాదం ఎక్కడ దొరుకుతుంది అని రైతులు ప్రశ్నిస్తుంటారు. ఈ సమస్యకు సుభాష్ శర్మ అద్భుతమైన పరిష్కారాన్ని కనుగొన్నారు. రెండు సాళ్లు పత్తి వేస్తారు (కందిని కూడా ఇలాగే సాగు చేయవచ్చు). ఆ పక్కనే 3 సాళ్లలో పచ్చిరొట్ట మొక్కలు పెంచి, వాటినే కత్తిరించి ఆచ్ఛాదనగా వేస్తారు. పొలం అంతా ఇలాగే వేయడం ద్వారా అధిక దిగుబడిని సాధించే వినూత్న పద్ధతిని ఆయన గత కొన్నేళ్లుగా అనుసరిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయదారుడిగా, పరిశోధకుడిగా ప్రయోగాలు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్న సుభాష్ శర్మతో ‘సాక్షి సాగుబడి’ ఇటీవల ముచ్చటించింది. ముఖ్యాంశాలు.. సుభాష్ శర్మకు 60 ఏళ్లు. వ్యవసాయంలో 40 ఏళ్ల అనుభవం ఉన్న రైతు. అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకుని, గడ్డు సమస్యలకు అద్భుతమైన పరిష్కారాలను వెదకి తలపండిన ప్రకృతి వ్యవసాయదారుడు, రైతుశాస్త్రవేత్త. క్షేత్రస్థాయిలో వ్యవసాయ సమస్యలను లోతుగా పరిశీలిస్తూ.. తన అనుభవం, ప్రజ్ఞలతో ప్రకృతికి అనుగుణమైన సాగు పద్ధతులను రూపొందించుకున్నారు. కరువుకు, పత్తి రైతుల ఆత్మహత్యలకు నిలయమైన మహారాష్ట్ర విదర్భలోని యవత్మాల్ జిల్లా (చోటి గుజారి) వితస గ్రామ వాస్తవ్యుడైన ఆయనకు 19 ఎకరాల నల్లరేగడి భూమి ఉంది. 1975 నుంచి వ్యవసాయం చేస్తున్న సుభాష్ శర్మ 20 ఏళ్ల పాటు రసాయనిక ఎరువులు, పురుగుమందులతోనే వ్యవసాయం చేశారు. ఫలితంగా ఆర్థికంగా నష్టాలపాలవటమే కాకుండా భూసారం సర్వనాశనమైపోయింది. 1986 తర్వాత ఖర్చులు పెరుగుతున్నా దిగుబడులు తగ్గిపోతూ వచ్చాయి. ఆ దశలో రసాయనిక వ్యవసాయ పద్ధతే నష్టదాయకమైనదన్న సత్యాన్ని గ్రహించారు. 1994 నుంచి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల వైపు మళ్లారు. నిశిత పరిశీలనతో ప్రకృతికి అనుగుణమైన ఆచరణాత్మక సుస్థిర వ్యవసాయ పద్ధతులను రూపొందించుకుని అనుసరిస్తూ మంచి నికరాదాయాన్ని పొందుతున్నారు. ఆయనకున్న 13 ఎకరాల నల్లరేగడి భూమిలో 3 ఎకరాలను ఆవులు, ఎద్దులు మేయడానికి కేటాయించి మిగతా పది ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ముఖ్యంగా కంది, పత్తి, కూరగాయలు, ఆకుకూరలను ఏడాది పొడవునా సాగు చేస్తుంటారు. పత్తి/కంది సాళ్ల మధ్యలో పచ్చి రొట్ట సాగు పత్తి లేదా కంది సాగులో సుభాష్ శర్మ అధిక దిగుబడులు పొందుతున్న పద్ధతి ఆసక్తికరంగానే కాదు.. రైతులెవరైనా సులభంగా అనుసరించడానికి వీలుగానూ ఉంది. రెండు సాళ్లలో పత్తి లేదా కంది పంట, వాటి పక్కనే మూడు సాళ్లలో పచ్చిరొట్ట మొక్కలను సాగు చేస్తారు. ప్రతి సాలుకు మధ్య 2 అడుగుల దూరం ఉంటుంది. ఈ ఐదు సాళ్లు 10 అడుగుల స్థలంలో ఉంటాయి. అంటే.. 4 అడుగుల్లో పంట, 6 అడుగుల్లో పచ్చిరొట్ట పెరుగుతాయి. పత్తి లేదా కంది సాళ్ల మధ్య 2 అడుగులు, మొక్కల మధ్య అడుగున్నర దూరం ఉంటుంది. సాధారణంగా పత్తి సాగు చేసేరైతులు 4“2 అడుగుల దూరం పాటిస్తారు. 2“1.5 అడుగుల దూరాన వేస్తున్నందున ఎకరానికి వేసే మొక్కల సంఖ్య గానీ దిగుబడి గానీ తగ్గబోదని, ఎకరానికి కిలో పత్తి విత్తనాలు అవసరమవుతాయని సుభాష్ శర్మ అన్నారు. పచ్చిరొట్ట పంటలుగా ఎకరానికి 4 కిలోల సజ్జ, 6 కిలోల అలసంద, 15 కిలోల జనుము విత్తనాలను కలిపి వరుసలుగా బోదెలపై విత్తుతారు. పత్తి లేదా కంది సాళ్లలో కలుపును అతి చిన్నగా ఉన్నప్పుడే మనుషులు పీకేస్తారు లేదా కుర్ఫీతో తీసేస్తారు. నెలకోసారి కలుపు తీసి అక్కడే ఆచ్ఛాదనగా వేస్తారు. మరీ అవసరమైతే పంట తొలిదశలో గుంటక తోలుతారు. కలుపు మొక్కలు చిన్నగా ఉన్నప్పుడే తీసేస్తే కలుపు తీత ఖర్చు 80% తగ్గుతుందని సుభాష్ శర్మ తెలిపారు. పచ్చిరొట్ట పంటలున్న సాళ్లలో కలుపు తియ్యరు. 45–50 రోజులు పెరిగిన తర్వాత పచ్చిరొట్ట పంట మొక్కలను, కలుపును కోసి అక్కడే ఆచ్ఛాదనగా వేస్తారు. ఆ తర్వాత 30–35 రోజులు గడచిన తర్వాత మరోసారి కోసి అక్కడే ఆచ్ఛాదనగా వేస్తారు. ఈ రెండు సార్లూ ఆచ్ఛాదనగా వేసే పచ్చిరొట్ట మూరెడు ఎత్తున వస్తుంది. కాబట్టి, ఆచ్ఛాదనతో సత్ఫలితాలు వస్తున్నాయి. పంటలో పచ్చిరొట్ట సాగుతో అనేక ప్రయోజనాలు పంటల సాళ్ల పక్కనే పచ్చిరొట్టను పెంచి ఆచ్ఛాదన చేయటం వల్ల చాలా స్థలం వృథా అయినట్లు పైకి కనిపిస్తుంది. కానీ, నిజానికి బహుళప్రయోజనాలు నెరవేరతాయి. దీని వెనుక ఉన్న శాస్త్రీయతను రైతులు సరిగ్గా అర్థం చేసుకోవాలని సుభాష్ శర్మ అంటారు. పొలం బెట్టకు రాకుండా భూమిలో తేమను పచ్చిరొట్ట పంటలు కాపాడతాయి. కోసి వేసిన ఆచ్ఛాదన వల్ల నేలలోని తేమ ఆరిపోకుండా ఉండటమే కాకుండా, వాతావరణంలో నుంచి నీటి తేమను ఆచ్ఛాదనగా వేసిన గడ్డీ గాదం గ్రహించి భూమికి అందిస్తుంది. ఫలితంగా వానపాములు, సూక్ష్మజీవులు తమ కార్యకలాపాలను సజావుగా నిర్వర్తిస్తూ నేలను సారవంతం చేస్తూ ఉంటాయి. పత్తి లేదా కంది మొక్కల వేర్లు పక్కన ఉన్న పచ్చిరొట్ట ఆచ్ఛాదన కిందికే చొచ్చుకు వచ్చి దాహాన్ని తీర్చుకోవడంతోపాటు పోషకాలను గ్రహిస్తాయి. ఈ విధంగా పచ్చిరొట్ట సాగు వల్ల పత్తి లేదా కంది పంట దిగుబడి పెరుగుతుంది. పచ్చిరొట్ట ఆచ్ఛాదనతో ప్రయోజనాలు.. 1. పంట పక్కనే పచ్చిరొట్టను కూడా పెంచడం వల్ల సూర్యరశ్మి పూర్తిగా వినియోగమవుతుంది. ఆచ్ఛాదన వల్ల నేలలో సేంద్రియ కర్బనం పెరిగి భూసారం ఇనుమడిస్తుంది. 2. పొలం అంతటా వత్తుగా పంటలు ఆవరించి ఉండటం వల్ల, ఆచ్ఛాదన వల్ల వర్షాలకు భూమి పైపొర మట్టి కొట్టుకుపోకుండా రక్షింపబడుతుందని తెలిపారు. 3. పచ్చిరొట్ట పంటలు ఎర పంటగా పనిచేస్తాయి. జీవ నియంత్రణ వల్ల చీడపీడలు కూడా అదుపులో ఉంటాయి. ప్రతి 75 మిత్రపురుగులకు 25 శత్రుపురుగుల చొప్పున పెరుగుతుంటాయని.. మిత్రపురుగులు శత్రుపురుగులను తింటూ వాటి సంతతిని అదుపు చేస్తూ ఉంటాయి. పురుగుల మందులు, కషాయాలు కూడా చల్లాల్సిన అవసరం లేదని, ఆ ఖర్చంతా రైతుకు మిగిలిపోతుందని సుభాష్ శర్మ తెలిపారు. సూరజ్ సూటి రకం పత్తి గులాబీ పురుగును సైతం తట్టుకుంటుందన్నారు. 4. భూమిలో తేమ ఆరిపోకుండా ఎక్కువ కాలం నీటి ఎద్దడి రాకుండా చూస్తుంది. పత్తి వేర్లకు బోజనంతోపాటు తేమ కూడా దొరుకుతుంది. వర్షాలు మొహం చాటేసి మరీ ఇబ్బంది అయినప్పుడు ఒకటి, రెండు తడులు ఇస్తున్నామని సుభాష్ శర్మ తెలిపారు. పత్తి లేదా కంది సాళ్లు వేసిన చోట వచ్చే పంటకాలంలో పచ్చిరొట్ట పంటలు వేస్తామని, ఇప్పుడు పచ్చిరొట్ట విత్తనాలు చల్లిన చోట పత్తి లేదా కంది పంటలు వేస్తూ పంటమార్పిడి చేస్తుంటామన్నారు. పత్తి 12, కంది 15 క్వింటాళ్ల దిగుబడి పత్తిని పచ్చిరొట్టతో కలిపి సాగు చేసే ప్రయోగంలో.. సూరజ్(సూటి రకం) పత్తి తొలి ఏడాది ఎకరానికి 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మూడో ఏడాదికి 12 క్వింటాళ్లకు పెరిగింది. మరో రెండు, మూడేళ్లలో 20 క్వింటాళ్లకు పెరుగుతుందని సుభాష్ శర్మ ధీమా వ్యక్తం చేశారు. నల్లరేగడి నేలలో ఇది ఒకటి, రెండు తడులు ఇచ్చే పద్ధతిలో దిగుబడి వివరాలు. పూర్తిగా వర్షాధారంగా ప్రయోగాత్మక సాగు వచ్చే ఏడాది ప్రారంభిస్తామన్నారు. అదేవిధంగా, కంది స్థానిక సూటి రకాలను విత్తి 15–20 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నామని తెలిపారు. రైతులు ఈ పద్ధతి వెనుక దాగి ఉన్న శాస్త్రీయతను అర్థం చేసుకొని సాగు చేస్తే చక్కటి ఫలితాలు వస్తాయని, తక్కువ ఖర్చుతోనే అధిక దిగుబడి, అధిక నికరాదాయం పొందవచ్చని తెలిపారు. (సుభాష్ శర్మ–హిందీ– 94228 69620,డా. రాజశేఖర్(సి.ఎస్.ఎ.)–తెలుగు– 83329 45368) ప్రకృతి సేద్యంలో శాస్త్రీయతను రైతులు అర్థం చేసుకోవాలి పత్తి 2 సాళ్లు వేసి.. ఆ పక్కనే 3 సాళ్లలో అనేక రకాల పచ్చిరొట్టను సాగు చేస్తే దిగుబడి పెరగడంతోపాటు భూసారం పెరగడం, బెట్టను తట్టుకోవడం వంటి ఎన్నో ప్రయోజనాలు నెరవేరతాయి. చీడపీడల బెడద కూడా తీరిపోతుంది. పత్తి మాదిరిగానే కందిని కూడా ఇలాగే సాగు చేయవచ్చు. ప్రకృతి వ్యవసాయంలో ఈ విషయాలు చాలా కీలకం. రైతులు మనసుపెట్టి ప్రకృతి సేద్యంలో దాగి ఉన్న శాస్త్రీయతను అర్థం చేసుకోవాలి. పచ్చిరొట్ట సాగుకు స్థలం వృథా అవుతున్నదని పొరబడకూడదు. రసాయనిక వ్యవసాయంలో కన్నా ప్రకృతి వ్యవసాయంలో అధిక దిగుబడి, అధికాదాయం పొందటం ముమ్మాటికీ సాధ్యమే. – సుభాష్ శర్మ, ప్రసిద్ధ ప్రకృతి వ్యవసాయదారుడు, రైతు శాస్త్రవేత్త, వితస, యవత్మాల్, మహారాష్ట్ర ఎక్కడ కురిసిన వాన అక్కడే ఇంకాలి నల్లరేగడి భూమి అయినప్పటికీ ఏ గజం స్థలంలో పడిన వర్షాన్ని ఆ గజంలోనే ఇంకింపజేయడం సుభాష్ శర్మ ప్రత్యేకత. ఏ పంటనైనా బోదెలపైనే సాగు చేస్తారు. బోదెల మధ్యలో ప్రతి మీటరుకూ అడ్డుకట్ట వేసి జల స్తంభన చేస్తారు వేసవికి ముందు నుంచే ఇలా వాన నీటి సంరక్షణ ఏర్పాటు చేస్తారు. మరీ కుండపోత వర్షం కురిస్తే పంట ఉరకెత్తకుండా అడ్డుకట్టలను తాత్కాలికంగా తొలగించి, వరద నీరు పోయిన తర్వాత మళ్లీ కట్టలు వేస్తారు. ఏడాదిలో ఏ సీజన్లోనైనా అకాల / సకాల వర్షాలన్నిటినీ ఒడిసిపడతారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి నీటి బొట్టునూ పొలంలో ఎక్కడికక్కడే ఇంకింపజేస్తారు. దీంతో భూగర్భ జలాలకు లోటుండదు. అయినా చాలా పొదుపుగా మరీ అవసరమైతేనే ఒకటి, రెండు తడులు ఇస్తూ పత్తి, కంది, కూరగాయలను సాగు చేస్తారు. భూమిలో ఎకరానికి 4 టన్నుల చొప్పున దిబ్బ ఎరువు వేసి కలియదున్నుతారు. ఆ తర్వాత పంట ఏదైనా సరే బోదెలు తోలి, బోదెలపైన విత్తనాలు వేసి సాగు చేస్తారు. విత్తనాలతో పాటే ప్రతి పాదులో దోసెడు తాను స్వయంగా తయారు చేసుకున్న ‘అలౌకిక్ ఖాద్’ను ఎకరానికి టన్ను చొప్పున వేస్తారు. బోదెలపై 2 సాళ్లలో పత్తి మొక్కల మధ్యలోని 3 సాళ్లలో ఏపుగా పెరుగుతున్న పచ్చిరొట్ట. వర్షపు నీరు పొలంలోనే ఎక్కడికక్కడే ఇంకింపజేసేందుకు బోదెల మధ్య వేసిన అడ్డుకట్టలు కంది మధ్య పచ్చిరొట్టను 2 సార్లు కోసేసిన తర్వాత ఆకుకూరలు కూడా పండించుకోవచ్చు – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
ముగ్గురూ ముగ్గురే!
సాగుబడి మహిళ లేనిదే వ్యవసాయం లేదు. వ్యవసాయ పనుల్లో నిమగ్నం కావడం, అత్యధిక సమయాన్ని కేటాయించడంలోనే కాదు.. నిర్ణాయకపాత్ర నిర్వహిస్తూ వ్యవసాయదారులుగా భేష్ అనిపించుకుంటున్న మహిళా రైతులెందరో ఉన్నారు. ఈ ముగ్గురూ తమ తరాల మహిళలకు స్ఫూర్తినందిస్తున్న మహిళా రైతులకు జేజేలు..! ‘సిన్ననాటి నుంచి వెవసాయం అంటే ఇష్టం..’ పిట్ల చిన్నమ్మి(65) పెద్దగా చదువుకోలేదు. ప్రభుత్వం అందించిన భూములను శ్రద్ధగా సాగు చేసుకుంటూ.. భర్త సింహాచలం తోడ్పాటుతో ఇద్దరు పిల్లలను వృద్ధిలోకి తెచ్చిన దళిత మహిళా రైతుగా గుర్తింపు పొందారు. విజయనగరం జిల్లా బొబ్బిలి రూరల్ మండలంలో అలజంగి ఆమె స్వగ్రామం. తొలుత ప్రభుత్వం ఎకరా 30 సెంట్ల భూమిని అందించింది. డా. వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరో ఎకరా భూమిని ఆమెకు ఇచ్చారు. ఆ భూమిలో అనుదినం కాయకష్టం చేసి పంటలు పండిస్తూ కుటుంబాన్ని కుదురుగా నడుపుతున్నదామె. ఆడవాళ్లు చేసే వ్యవసాయ పనులతోపాటు దుక్కి దున్నటం, ఎడ్ల బండి తోలటం.. చివరకు ట్రాక్టరు తోలడం కూడా ఆమె నేర్చుకొని చేస్తూ ఉండటం చూపరులను ఆశ్చర్యపరుస్తోంది. అన్ని పొలం పనులు స్వయంగా చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ.. ప్రభుత్వం ఇచ్చిన భూమితోపాటు మరికొంత భూమిని కూడా సమకూర్చుకున్నారు. ఇప్పుడు ఆమెకు 5 ఎకరాల భూమి ఉంది. ఎకరంలో చిలగడ దుంపలు, ఎకరాలో వేరుశెనగ, ఒకటిన్నర ఎకరాల్లో అరటి, మిగతా పొలంలో వరి పండిస్తున్నారు. ఏ భూమిలో ఏ పంట పండుతుంది? ఏ పంటకు ఎకరాకు ఎంత ఖర్చవుతుంది? ఎంత దిగుబడి వస్తుంది? వంటి విషయాలను తడుముకోకుండా చెబుతారు. ఎలాంటి భూమిని అయినా సాగు చేసి పంట దిగుబడి తీయడం చిన్నమ్మి ప్రత్యేకత. కుమారులు రమేష్, రాజశేఖర్ ప్రైవేటు కంపెనీలలో టెక్నీషియన్లుగా పనిచేస్తున్నారు. ఉత్తమ రైతు పురస్కారాన్ని సైతం అందుకున్నారు. దుక్కి దున్నుతున్న చిన్నమ్మి ఆసక్తితో సేత్తన్నా.. ‘సిన్ననాటి నుంచి వెవసాయం అంటే ఇష్టం. మా అయ్య, అమ్మ ఈ పనులు నేర్పారు. సిన్న పని నుంచి పెద్ద పని వరకు నానే సేసేదాన్ని. అన్ని పనులు నేర్చుకుని వెవసాయంలో లీనమై అన్ని పనులూ నేనే సేసుకునే దాన్ని. నా పెనిమిటి సాయం సేసేవాడు. పిల్లలకు సదువు సెప్పిద్దామనే ఆలోచనతో వారికి వెవసాయం నేర్పలేదు. పొద్దు పోయాక పొలాల్లో నీరు కట్టడం దగ్గర నుంచి బండి తోలడం వరకు అన్నీ నేర్చుకున్నాను. నా పని నానే సేసుకోవాలనుకుని పొలం పనులు నేర్చుకున్నాను..’ అంటారు చిన్నమ్మి సగర్వంగా. – రంపా రాజమోహనరావు, సాక్షి, బొబ్బిలి రూరల్, విజయనగరం జిల్లా సంతోషకరం.. ‘అక్షర’ సేద్యం! బీఎడ్ పూర్తి చేసిన సేంద్రియ సాగుపై మక్కువ చూపుతున్న యువతి బీఎస్సీ, బీఎడ్ పూర్తి చేసి విద్యార్థులకు విద్యాబోధన చేయాల్సిన అక్షర (దీపిక) సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. తన భర్త శ్రీనివాస్ సేంద్రియ వ్యవసాయం చేస్తుండడంతో ఆమె కూడా సంతోషంగా సాగు పనులు చేస్తూ తోటి మహిళా యువ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని తిర్మలాపూర్ గ్రామానికి చెందిన కట్ల శ్రీనివాస్ ఏంబీఏ చదువుకొని ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ సంతృప్తి లేక తిరిగి ఇంటికి వచ్చేశారు. ఆరేళ్లుగా తమ సొంత భూమిలో అధునాతన, శాస్త్రీయ సేంద్రియ పద్ధతులను పాటిస్తూ సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. రెండేళ్ల క్రితం శ్రీనివాస్ వెదిర గ్రామానికి చెందిన బీఎస్సీ, బీఎడ్ పూర్తి చేసిన అక్షరను వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచీ వ్యవసాయ పనులపై మక్కువ పెంచుకున్న అక్షర తన భర్తతో కలిసి సాగు పనుల్లో పాలు పంచుకున్నారు. అక్షర ప్రత్యేకంగా బోడ కాకర, కాకర, వంగ, టమటా, బెండ, చిక్కుడులాంటి కూరగాయలను ఎలాంటి క్రిమిసంçహారక మందులను పిచికారీ చేయకుండా సాగు చేస్తున్నారు. – వి.రాజిరెడ్డి, సాక్షి, రామడుగు, కరీంనగర్ జిల్లా సంతోషంగా ఉంది! ఎలాంటి రసాయనిక మందులు వాడకుండా కూరగాయలు పండించడం చాలా ఆనందంగా ఉంది. వీటిని మార్కెట్లో మంచి ధరకు అమ్ముకుంటున్నాం. చదువుకున్న యువ మహిళలు ఆధునాతన పద్ధతులలో పంటల సాగుపై దృష్టి సారించాలి. – అక్షర, మహిళా రైతు, తిర్మలాపూర్, కరీంనగర్ జిల్లా డ్రిప్ పనుల్లో మహిళా రైతు అక్షర 18 ఏళ్లుగా అన్నీ తానై..! అధిక దిగుబడులు.. ప్రశంసలు.. సత్కారాలు.. యువ మహిళా రైతు మంజుల వ్యవసాయంలో ఆధునిక పద్ధతుల ద్వారా అధిక దిగుబడులు సాధిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. కృషి, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని రుజువు చేస్తున్నారు. అనంతపురం జిల్లా నల్లమాడ మండల పరిధిలోని రాగానిపల్లి ఆమె స్వగ్రామం. శివమ్మ, మాధవరెడ్డి దంపతుల కుమార్తె అయిన మంజుల ఇంటర్ వరకూ చదువుకున్నారు. తండ్రికి వయసు మీద పడటంతో ఆమె చదువుకు స్వస్తిపలికి వ్యవసాయంలోకి అడుగుపెట్టారు. 18 ఏళ్లుగా వ్యవసాయంలో అన్నీ తానై రాణిస్తోంది. తమకున్న పదెకరాల పొలంలో వేరుశెనగ, వరి, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, మల్బరీ తదితర పంటలు సాగుచేసి అధిక దిగుబడులు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. ట్రాక్టర్‌తో భూమి దున్నడం, విత్తనాలు, ఎరువుల ఎంపిక, చీడపీడల నివారణకు స్వయంగా మందుల పిచికారీ, వ్యవసాయ పరికరాలు సమకూర్చుకోవడం, పంటలకు నీరందించడం తదితర పనులన్నీ ఈమెకు వెన్నెతో పెట్టిన విద్య. వ్యవసాయ రంగంలో తనదైన ముద్రవేసుకున్న మంజుల వేరుశెనగ, వరి, మల్బరీ పంటల్లో రెట్టింపు దిగుబడులు సాధించి అధికారుల నుంచి ప్రశంసలు, సన్మానాలు అందుకున్నారు. కదిరి వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో తయారైన కే–5, కే–6, కే–134 రకాలను సాగుచేసి గతంలో రెట్టింపు దిగుబడులు సాధించారు. పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు మంజులను సత్కరించారు. కదిరి తాలూకాలోనే అత్యధిక ధర పలికే పట్టుగూళ్లను పండించిన ఘనత మంజులది. పంటల సాగు, చీడపీడల నివారణకు గ్రామ రైతులు మంజుల సలహాలు తీసుకుంటుంటారు. ‘మంజుల మా గ్రామ సైంటిస్ట్’ అంటూ పలువురు రైతులు కొనియాడుతున్నారు. – సోమశేఖర్, సాక్షి, నల్లమాడ, అనంతపురం జిల్లా ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతున్న మహిళా రైతు మంజుల -
మెళకువలు పాటిస్తేనే అధిక దిగుబడి
♦ పశువులకు మాంసకృత్తులు, విటమిన్లు ♦ సమపాళ్లలో అందించాలి ♦ రైతులకు పశువైద్యురాలు ♦ దుర్గా రమాదేవి సూచనలు మిర్యాలగూడ రూరల్ : పశువులకు తమ దైనందిన కార్యక్రమాల నిర్వహణకు కావాల్సిన శక్తి కోసం, శరీరాభివృద్ధికి, పునరుత్పాదకశక్తికి మాంసకృత్తులు, పిండి పదార్థాలు, కొవ్వు లవణాలు, ఖనిజ లవణాలు, విటమిన్లు, నీరు చాలా అవసరం ఉంటుంది. రైతులు మెళకువలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని మిర్యాలగూడ మండలం తుంగపహాడ్ పశు వైద్యురాలు దుర్గరమాదేవి పేర్కొంటున్నారు. ఈ విషయంపై రైతులు తీసుకోవాల్సిన సలహాలను వివరించారు. మాంసకృత్తులు.. శరీర పెరుగుదలకు, వ్యాధి నిరోధక శక్తి, హిమోగ్లోబిన్ నివారణకు తోడ్పడతాయి. శరీరానికి శక్తిని అందజేస్తాయి. పెయ్యలు, పడ్డల ఎదుగుదలకు, పాడిపశువుల్లో పాడి దిగుబడికి దోహదపడతాయి. మాంసకృత్తులు ఆహారంలో లోపిస్తే పశువులు చిక్కిపోవడం, పెరుగుదల స్తంభించడం, అండాశయాలు చిన్నగా ఉండడం, ఆలస్యంగా యుక్త వయసుకు రావడం, వ్యాధి నిరోధక శక్తి తగ్గడం, కండరాల బలహీనత వంటి సమస్యలు ఏర్పడతాయి. పత్తి గింజలు, వేరుశనగ పిండి, కొబ్బరి పిండి, నువ్వుల పొడి, చేపల, మాంస పొడి వంటి ముడిపదార్థాల్లో, పప్పు జాతికి చెందిన పశుగ్రాసాల్లో మాంసకృత్తులు అధికంగా ఉంటాయి. పిండి పదార్థాలతో 50 శాతం శక్తి పశువుల్లో రోజువారి కార్యక్రమా ల నిర్వహణకు కావాల్సిన శక్తిలో 50 శాతం పిండి పదార్థాల ద్వారా లభి స్తుంది. ఒకగ్రాము పిండి పదార్థాలు నాలుగు కిలో ల క్యాలరీల శక్తిని అందజేస్తుంది. పిండిపదార్థాలు తక్కువైతే కొవ్వుగా మారి పశువుల స్థూలకాయానికి దారితీస్తుంది. పిండి పదా ర్థాలు సరిపోను లభ్యంకాకపోతే పశువుల శరీరాభివృద్ధి, ఉత్పాదక సామర్థ్యం దెబ్బతిని శరీర బరువు తగ్గి నీరపడిపోతాయి. మొక్కజొన్న, జొన్న, నూకలు, సజ్జల వంటి ధాన్యాలు, చెరుకు మడ్డి, ఎండు మేతలు, చొప్ప ధాన్యం జాతి పశుగ్రాసాల్లో పిండి పదార్థాలు లభిస్తాయి. కొవ్వు పదార్థాలు ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని కొంత వరకు అందజేస్తాయి. విటమిన్ ‘ఏ’ శరీరంలో సక్రమంగా వినియోగపడేందుకు దోహదపడతాయి. శరీరంలో అంతర్గత కొవ్వు నిల్వలు దెబ్బలనుంచి అంతర్గత అవయవాలను రక్షిస్తాయి. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తాయి. ఆహారంలో రుచిని పెం పొందిస్తాయి. పశువుల కృత్తిమ పునరుత్పత్తిలో మాంసకృత్తుల కంటే కొవ్వు అం దించే శక్తి అధికంగా ఉంటుంది. ఒక గ్రాము కొవ్వు పదార్థం 9 కిలో క్యాలరీల ఉష్ణ శక్తిని విడుదల చేస్తుంది. వేరుశనగపిండి, బొబ్బరి పిండి, నూనె గింజల చక్క, గోధుమ, వరి తౌడు లాంటి పదార్థాల్లో కొవ్వు అధికంగా ఉంటుంది. జీవక్రియలకు నీరు దోహదం మేత లేకుండా పశువు మూడు నెలలు బతుకుతుంది గానీ.. నీరు లేకుండా ఐదు రోజుల పాటు బతుకలేదు. నీరు శరీర జీవ క్రియలకు, ఉత్పాదకతకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. నీరు శరీరంలో వివిధ పోషక పదార్థాలు సంగ్రహించడానికి, పోషక పదార్థాలు, ఖనిజ లవణాలు, విటమిన్లు శరీరంలో వివిధ భాగాలకు చేర్చడానికి, శారీరక ఊష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి, శ్వాసక్రియ కొనసాగించడానికి చర్మం సాగే గుణం ఉండడానికి, జీర్ణక్రియలో ఉపయోగపడే కొన్ని ఎంజైముల తయారీకి, వ్యర్థ పదార్థాలను విసర్జించడానికి నీరు దోహదపడుతుంది. పాలల్లో 90 శాతం నీరు ఉంటుంది. సాధారణంగా పచ్చి మేతలో 70 శాతం, ఎండు మేతలో 10 శాతం నీరు ఉంటుంది. ఈ మేత తినడం ద్వారా కొంత నీరు లభిస్తుంది. శరీరంలో నీరు తక్కువ అయితే పొడిగా మారడం, మూత్ర సంబంధ వ్యాధులు, అజీర్తి, మలబద్దకం వంటి వ్యాధి సమస్యలు రావడానికి ఆస్కారం ఉంటుంది. పశువులు ఢీహైడేరషన్‌కు గురై మరణిస్తాయి. కాబట్టి పశువులకు నీరు కూడా పశు పోషణలో అత్యవసరమైన పోషక పదార్థంగా గుర్తించాలి. పశువుకు రోజుకు 50 నుంచి 60 లీటర్ల నీరు అవసరం.