సన్న, మధ్యస్థ సన్న రకాలైన ఎంటీయూ 1271, బీపీటీ 2846
అధిక పోషక విలువలు కలిగిన బీపీటీ 2841, ఎన్‌ఎల్‌ఆర్ 3238 వెరైటీలు
గత ఏడాది విడుదల చేసిన ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం
అధిక శాతం విస్తీర్ణంలో కొత్త వెరైటీల సాగుకు కసరత్తు
సాక్షి, భీమవరం: ఖరీఫ్ సాగుకు రైతులు సన్నద్ధమవుతున్న తరుణంలో పంట తెగుళ్లు, వైపరీత్యాలను ఎదురొడ్డి నిలిచే ఆధునిక వంగడాల సాగు ద్వారా నాణ్యమైన అధిక దిగుబడులు సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 300 వరి రకాలు సాగుచేస్తున్నప్పటికీ బీపీటీ 5204, ఎన్‌డీఎల్‌ఆర్ 7, స్వర్ణ, పీఏపీఎల్ 1100, ఆర్‌జీఎల్ 2537 వంటి కొన్ని రకాలు మాత్రమే తినడానికి అనువుగా ఉంటున్నాయి.
ఈ సమస్యను అధిగమించేందుకు మరిన్ని రకాలను, అధిక పోషక విలువలు కలిగిన వాటిని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గత ఏడాది జూలై 19న విడుదల చేసింది. అందులో బీపీటీ 5204, ఎంటీయూ 1271, బీపీటీ 2846, బీపీటీ 2841, ఎన్‌ఎల్‌ఆర్ 3238 రకాలు ఉన్నాయి. వాటి వివరాలను మార్టేరు రీజినల్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ (వరి) డాక్టర్ టి.శ్రీనివాస్ తెలిపారు. ఆయా రకాల వరి వంగడాలు, వాటి ప్రత్యేకతలు ఆయన తెలిపారు.
ఎంటీయూ 1271
అధిక గింజలతో ఎక్కువ దిగుబడి ఇచ్చే సన్న రకం. పంట కాలం 140 రోజులు. రెండు వారాల నిద్రావస్థ కలిగి ఉండి గింజ మొలకెత్తదు. కాండం దృఢంగా ఉండి చేను పడిపోదు. పచ్చి బియ్యానికి అనుకూలం. బియ్యం పారదర్శకంగా ఉండి 69.7 శాతం నిండు గింజలు కలిగి అధిక దిగుబడి ఇస్తుంది. రైతు, మిల్లర్, సన్నగింజ ధాన్యం మార్కెట్‌కి అనుకూలమైన వెరైటీ. కడప, కర్నూలు, చిత్తూరు, తిరుపతి, నంద్యాల, ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో సార్వాకు అనువైన రకం. దోమ, ఎండాకు తెగుళ్లను కొంతవరకు తట్టుకుంటుంది. సగటున ఎకరాకు 2.8 టన్నుల నుంచి మూడు టన్నుల వరకు దిగుబడి వస్తుంది.
బీపీటీ 2846
కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ప్రాంతాల్లో బీపీటీ 5204కు దీటైన ప్రత్యామ్నాయంగా, భోజనానికి అనువుగా ఉంటూ అధిక దిగుబడినిచ్చే మధ్యస్థ సన్న గింజ రకం. మార్కెట్‌కు, వినియోగదారులకు అనువుగా ఉంటుంది. పంట కాలం 145 నుంచి 150 రోజులు. రెండు వారాల నిద్రావస్థ కలిగి ఉండి గింజ మొలకెత్తదు. సన్నగింజ రకం. కాండం దృఢంగా ఉండి చేను పడిపోదు. గింజ మధ్యస్థ సన్నంగా ఉంటుంది. భోజనానికి అనుకూలమైన రకం. 65.2 శాతం నిండు గింజలు కలిగి మిల్లర్, మార్కెట్‌కు అనుకూలమైన వెరైటీ. అగ్గి తెగులు, మెడ విరుపు, పొట్ట కుళ్లు తెగుళ్లను తట్టుకుంటుంది. సగటున ఎకరాకు మూడు టన్నుల దిగుబడి సామర్థ్యం కలిగి, రైతుకు మంచి ఆదాయం ఇస్తుంది. నేరుగా విత్తే విధానం, సేంద్రియ వ్యవసాయ విధానానికి అనువైన రకం.
బీపీటీ 2841
అధిక ప్రొటీన్, జింక్, ఇతర పోషక విలువలు కలిగి, మధుమేహ రోగులకు భోజనానికి అనువైన నల్ల బియ్యపు రకం. బీపీటీ 5204 ప్రత్యామ్నాయంగా, భోజనానికి అనువుగా ఉంటూ అధిక దిగుబడినిచ్చే మధ్యస్థ సన్న గింజ రకం. పంట కాలం 130 నుంచి 135 రోజులు. రెండు వారాల నిద్రావస్థ కలిగి ఉండి గింజ మొలకెత్తదు. కాండం దృఢంగా ఉండి చేనుపై పడిపోదు. 65.2 శాతం నిండు గింజలు కలిగి పచ్చి బియ్యానికి అనువుగా ఉంటుంది. బియ్యం పారదర్శకంగా ఉండి భోజనానికి బాగుంటుంది. అగ్గి తెగులు, మెడవిరుపు, దోమ పోటును తట్టుకుంటుంది. సగటున ఎకరాకు 2.4 టన్నుల దిగుబడి సామర్థ్యం కలిగి, రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయం చేసే అన్ని ప్రాంతాలకూ అనువుగా ఉంటూ, డిజిటల్ మార్కెటింగ్‌లో కిలో సింగిల్ పాలిష్ బియ్యానికి రూ. 200 పైచిలుకు ధర పలికే అవకాశం ఉన్న రకం.
ఎన్‌ఎల్‌ఆర్ 3238
అధిక జింక్ కలిగి ఉంటుంది. మధ్యస్థ సన్న గింజ రకం. 120 – 125 రోజుల కాల పరిమితి కలిగిన స్వల్పకాలిక వెరైటీ. రెండు వారాల నిద్రావస్థ కలిగి ఉండి గింజ చేనుపై మొలకెత్తదు. కాండం దృఢంగా ఉండి చేనుపై పడిపోదు. 62% నిండు గింజలు కలిగి, బియ్యం పారదర్శకంగా ఉండి భోజనానికి అనువుగా ఉంటుంది. అగ్గి తెగులు, మెడ విరుపు తెగుళ్లను తట్టుకుంటుంది. తక్కువ నత్రజనితో (సిఫారసు చేసిన నత్రజనిలో 75%) సగటున ఎకరాకు 2.6 టన్నుల దిగుబడి ఇస్తుంది. రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయం చేసే అన్ని ప్రాంతాలకు అనువుగా ఉంటూ, డిజిటల్ మార్కెటింగ్‌కి అనువైన రకం.
విత్తనాల కోసం వీరిని సంప్రదించవచ్చు
అధిక శాతం విస్తీర్ణంలో కొత్త వెరైటీల సాగుకు కసరత్తు చేస్తున్నట్లు డా. టి.శ్రీనివాస్ తెలిపారు. ఎంటీయూ వరి రకాల విత్తనాల కోసం మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీడ్ ఆఫీసర్ డాక్టర్ పీవీ రమణారావు (ఫోన్ 94404 41922), బీపీటీ రకాల కోసం డాక్టర్ కృష్ణవేణి (ఫోన్ 94417 21120), ఎన్‌ఎల్‌ఆర్ రకాలకు డాక్టర్ శ్రీలక్ష్మి (ఫోన్ 98855 27227), వరి రకాల వివరాలు, సాగులో సందేహాల నివృత్తి కోసం డాక్టర్ టి.శ్రీనివాస్ (ఫోన్ 93968 48380) సంప్రదించాలని డా. టి.శ్రీనివాస్ వివరించారు.
2023లో అఖిల భారత స్థాయిలో విడుదలైన వరి వంగడాలు
ఎంటీయూ 1275
పంట కాలం 135 నుంచి 140 రోజులు. రెండు వారాల నిద్రావస్థ కలిగి ఉండి గింజ మొలకెత్తదు. కాండం దృఢంగా ఉండి చేనుపై పడిపోదు. గింజ మధ్యస్థ సన్నంగా ఉండి పచ్చి బియ్యానికి అనుకూలం. బియ్యం పారదర్శకంగా ఉండి భోజనానికి అనువుగా ఉంటుంది. అగ్గి తెగులు, మెడ విరుపు, బ్యాక్టీరియా ఆకు ఎండు, గోధుమ రంగు మచ్చ తెగుళ్లను తట్టుకుంటుంది. సగటున ఎకరాకు మూడు టన్నుల దిగుబడి ఇస్తుంది.
బీపీటీ 3050
కేంద్ర రకాల విడుదల కమిటీ ద్వారా గుజరాత్, మహారాష్ట్రలలో సాగు కోసం విడుదల చేసిన రకం. పంట కాలం 130 నుంచి 135 రోజులు. రెండు వారాల నిద్రావస్థ కలిగి గింజ మొలకెత్తదు. కాండం ధృఢంగా ఉండి చేనుపై పడిపోదు. గింజ పొడవుగా లావుగా ఉండి అధిక బియ్యం రికవరీ కలిగిన రకం. అగ్గి తెగులు, మెడ విరుపు, గోధుమ రంగు మచ్చ తెగుళ్లను తట్టుకుంటుంది. సగటున ఎకరాకు 2.4 నుంచి 2.6 టన్నుల దిగుబడి వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment