పంగాసియస్‌గా పిలిచే ఈ చేపకు వెన్ను ముల్లు తప్ప చూద్దామంటే మరో ఎముక కనిపించదు. పైగా నీచు వాసన రాదు. దీంతో చేసే ఏ వంటకమైనా చాలా మృదువుగా.. రుచికరంగా ఉంటుంది. తింటే ఇట్టే జీర్ణమైపోతుంది. పిల్లల నుంచి వృద్ధుల వరకు వీటిని ఇష్టపడని వారుండరు. అందుకే స్టార్ హోటల్స్‌తోపాటు సాధారణ హోటళ్లలోనూ ఈ చేప వంటకాలకు డిమాండ్ ఎక్కువ. అపోలో ఫిష్‌గా దీనిని ఎక్కువగా వండుతారు. వియత్నాంలో పుట్టిన ఈ చేపలు మన ప్రాంతంలో పెరిగే ఏటి జెల్లను పోలి ఉంటాయి. దేశీయంగా వీటిని పంగా, పంగస్, అపోలో, వెండి చేప అని కూడా పిలుస్తారు.
సాక్షి, అమరావతి: పంగాసియస్ చేపల సాగులోను.. అధిక దిగుబడులు సాధించడంలోను దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 50 వేల హెక్టార్లలో ఈ చేపల్ని పెంచుతుండగా.. అందులో 20 వేల హెక్టార్లు మన రాష్ట్రంలోనే ఉండటం విశేషం. ఏటా 80 లక్షల టన్నుల పంగాసియస్ చేపలు ఉత్పత్తి అవుతుండగా.. వాటిలో 30నుంచి 35 లక్షల టన్నులు ఏపీ నుంచే దిగుబడి వస్తుండటం గమనార్హం.
కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, ఉభయ గోదావరి, కోనసీమ జిల్లాల్లో వీటి సాగు విస్తరించి ఉంది. స్థానికంగా ఈ చేపల వినియోగం కేవలం 2 శాతమే కాగా.. మిగిలిందంతా పొరుగు రాష్ట్రాలకే ఎగుమతి అవుతోంది. అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌కు 10 లక్షల టన్నుల వరకు వెళుతోంది. బిహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, అస్సాం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జమ్మూకశ్మీర్‌లోనూ వీటికి డిమాండ్ ఎక్కువే.
నీటిపైకి వచ్చి ఆక్సిజన్ తీసుకోగలవు
వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండడంతో ఈ చేపలు ఎలాంటి తెగుళ్లు, వ్యాధులనైనా తట్టుకుంటాయి. మొప్పలు కాకుండా వీటికి ఉండే గాలి తిత్తుల ద్వారా గాలి పీల్చుకుంటాయి. నీటిలో ఆక్సిజన్ తగ్గినప్పుడు నీటి ఉపరితలానికి చేరి వాతావరణంలోని ఆక్సిజన్‌ను తీసుకుంటాయి. ఎలాంటి వాతావరణంలో అయినా చాలా ఆరోగ్యకరంగా పెరుగుతాయి. వేసిన ప్రతి పిల్ల బతకడం వీటి ప్రత్యేకత. రెండేళ్లలో మూడు పంటలు తీస్తున్నారు. గరిష్టంగా ఏడాది పాటు పెంచగలిగితే ఒక్కో చేప 3నుంచి 4 కేజీల వరకు పెరుగుతుంది. ఎకరాకు సైజును బట్టి 12 నుంచి 20 టన్నుల వరకు దిగుబడి వస్తుంది.
పోషకాలు పుష్కలం
ప్రొటీన్స్, ఐరన్, జింక్, కాల్షియం, ఒమేగా–3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉండే ఈ చేపల్లో కార్బోహైడ్రేట్స్, సోడియం తక్కువగా ఉంటాయి. 100 గ్రాముల చేపలో ప్రొటీన్ 15.2 గ్రాములు, కొవ్వు 2.9 గ్రాములు, కార్బోహైడ్రేట్స్, యాష్ గ్రాము, నీరు 60 గ్రాములు, 89 కిలో కేలరీల శక్తి లభిస్తుంది. హాని కల్గించే కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండటం వల్ల గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. అధికంగా ఉండే కాల్షియం ఎముకలు, కీళ్ల బలోపేతానికి, సేంద్రియ ఆమ్లాలు కంటిచూపు మెరుగుదలకు ఉపయోగపడతాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ప్రీరాడికల్స్‌ను నిరోధిస్తాయి.
బ్రూడర్ కేంద్రం ఏపీలోనే..
కేంద్రీయ మంచినీటి మత్స్య పరిశోధనా సంస్థ (భువనేశ్వర్)కు అనుబంధంగా కృష్ణా జిల్లా కానూరు వద్ద గల ప్రాంతీయ పరిశోధనా కేంద్రం పంగాసియస్ బ్రూడర్‌గా కేంద్రం గుర్తింపు పొందింది. 2013లో వియత్నాం నుంచి తీసుకొచ్చిన బ్రూడర్స్ ద్వారా తల్లి చేపలను ఉత్పత్తి చేసి కనీసం 4 ఏళ్లపాటు పెంచి పిల్లలను ఉత్పత్తి చేస్తూ వస్తున్నారు. ఇక్కడ ఉత్పత్తి అయిన 30–40 గ్రాముల సైజు పిల్లలను హేచరీలకు ఇస్తుంటారు.
హేచరీల్లో మరో మూడేళ్ల పాటు సీడ్ ఉత్పత్తి జరుగుతుంది. ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సీడ్ ఉత్పత్తి చేస్తారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో 6 టన్నుల బ్రూడర్స్ ఉన్నాయి. ఏటా 100 లక్షల సీడ్ అవసరం కాగా.. 50 లక్షల సీడ్ ఈ కేంద్రం అభివృద్ధి చేసిన బ్రూడర్స్ నుంచే ఉత్పత్తి చేస్తారు. అపోలో ఫిష్‌గా, ఫిష్ స్టాటర్స్‌గా ఉపయోగించే ఈ చేపకు స్టార్ హోటల్స్ నుంచి సాధారణ హోటల్స్ వరకు డిమాండ్ ఎక్కువ. ఈ కారణంగానే వీటికి అపోలో ఫిష్ అనే పేరొచ్చింది.
పదేళ్లుగా ఇదే సాగు
పదేళ్లుగా వంద ఎకరాల్లో పంగాసియస్ సాగు చేస్తున్నా. మిగిలిన చేపలతో పోలిస్తే వీటి సాగులో ఏమాత్రం నష్టాలు ఉండవు. కేజీ, కేజీన్నర సైజులో చేపలు పట్టుబడి చేస్తా. ఎకరాకు 9నుంచి 12 టన్నుల వరకు దిగుబడులొస్తాయి. మంచి ఆదాయం వస్తుంది.
– ఉమాశంకర్‌రెడ్డి, రైతు, గుడివాడ, కృష్ణా జిల్లా
బ్రూడర్స్ ఉత్పత్తిలో..
పదేళ్లుగా పంగాసియస్ తల్లి చేపల(బ్రూడర్స్)ను ఉత్పత్తి చేస్తున్నాం. జన్యుపరమైన సమస్యలు లేకుండా వీటిని అభివృద్ధి చేసి హేచరీలకు ఇస్తున్నాం. వీటి సాగు, దిగుబడుల్లో ఏపీ మొదటి స్థానంలో ఉంది. 2013లో 200 బ్రూడర్స్ తీసుకొచ్చాం. ప్రస్తుతం 6వేల కిలోల బ్రూడర్స్ ఉన్నాయి.
– బి.శేషగిరి, ప్రిన్సిపల్ సైంటిస్ట్, ప్రాంతీయ మత్స్య పరిశోధనా కేంద్రం
Comments
Please login to add a commentAdd a comment