సాక్షి, అమరావతి: కేరళ ‘కరిమీన్’ చేప ఆంధ్ర తీరప్రాంత మత్స్యకారులను మురిపిస్తోంది. సాగుయోగ్యం కాని తీరప్రాంత భూముల్లో సిరులు కురిపించే ఈ చేపల సాగును మన రాష్ట్రంలో ప్రోత్సహిస్తున్నారు. పైలెట్ ప్రాజెక్టుగా కృష్ణా జిల్లాలో చేపట్టిన ఈ సాగు సత్ఫలితాలివ్వడంతో గోదావరి జిల్లాల్లో కూడా ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. వీటి సాగుకు అవసరమైన సాంకేతికతను సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీఎంఎఫ్‌ఆర్‌ఐ) అందిస్తోంది.
కేరళ రాష్ట్ర అధికారిక చేప
పెరల్స్ పాట్.. (శాస్త్రీయ నామం–ఎట్రోప్లస్ సురాటెన్సిస్). ఒళ్లంతా ముత్యాల్లా తెల్లటి మచ్చలుండడంవల్ల దీన్ని ముత్యాల మచ్చగా పేరొందింది. కేరళ రాష్ట్ర అధికారిక చేపగా ప్రసిద్ధి చెందిన ఈ చేపను అక్కడ ‘కరిమీన్’గా పిలుస్తారు. మన వాడుక భాషలో ఈ చేపను ప్రాంతాన్ని బట్టి మురి మీను/చుక్కగొరక/దువ్వెన చేపని పిలుస్తుంటారు. మన ప్రాంతంలో పెద్దగా డిమాండ్‌లేని ఈ చేపకు కేరళలో మాత్రం మంచి మార్కెట్ ఉంది. అక్కడ స్టార్‌హోటళ్లు, రెస్టారెంట్ మెనూల్లో స్పెషల్ డిష్ ఇదే. స్థానికులే కాదు..అక్కడకొచ్చే విదేశీయులు ఈ చేపతో చేసే కరిమీన్ ఫ్రై, కరిమీన్ మోలీ, కరిమీన్ పొల్లిచాతు వంటకాలను అమితంగా ఇష్టపడతారు.
ఈ చేపల సాగుకు సీజన్ అంటూ ఏమీలేదు. ఇది ప్రాథమికంగా ఉప్పునీటి చేప. కానీ, మంచినీరు, సముద్రపు నీటిలో జీవిస్తుంది. లోతు జలాల్లో దొరికే ఆల్గే మొక్కలు, కీటకాలను ఆహారంగా తీసుకునే ఈ చేప గరిష్టంగా 20 సెం.మీ వరకు పెరుగుతుంది. 150 గ్రాముల సైజు పెరిగితే చాలు కిలో రూ.325 నుంచి రూ.400 వరకు పలుకుతుంది. డిమాండ్‌ను బట్టి రూ.500 నుంచి రూ.600 వరకు కూడా విక్రయిస్తారు.
పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన కృష్ణాజిల్లా పెద్దపాలెంలో గిరిజన మత్స్యకారులు పట్టిన చేపలు
‘కృష్ణా’లో ప్రయోగం విజయవంతం
ఐసీఎఆర్–సీఎంఎఫ్‌ఆర్‌ఐ విశాఖ ప్రాంతీయ కేంద్రం సహకారంతో ఎలెర్ట్ ఎన్‌జీఓ అనే సంస్థ కృష్ణాజిల్లా నాగాయలంక మండలం పెద్దపాలెంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ మురిమీను సాగు అద్భుత ఫలితాలిచ్చింది. వివిధ గ్రామాలకు చెందిన యానాదులతో ఏర్పాటుచేసిన గ్రూపులకు ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎంఎస్‌ఎస్‌ఆర్‌ఎఫ్) ద్వారా ప్రత్యేక శిక్షణనిచ్చి చేపల సాగుకు శ్రీకారం చుట్టారు. 20 గ్రాముల పరిమాణం కలిగిన 5వేల చేప పిల్లలను అందించారు. పది నెలలపాటు సాగుచేయగా, ఒక్కో చేప సగటున 120 గ్రాముల పరిమాణంలో 510 కిలోల చేపలను శుక్రవారం పట్టుబడి చేశారు. కిలో రూ.225ల చొప్పున విక్రయించగా రూ.1.14లక్షల ఆదాయం ఆర్జించారు. పెట్టుబడి పోనూ రూ.60 వేలకు పైగా మిగలడంతో వారి ఆనందానికి అవధుల్లేవు.
తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం
ఈ సాగు ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందవచ్చు. నిరుపయోగంగా ఉన్న తీరప్రాంత భూముల్లో వీటి సాగును ప్రోత్సహించవచ్చు. చేపల పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది. మనుగడ మాత్రం 83 శాతానికి పైగా ఉంటుంది. సీడ్ క్రీక్ వాటర్‌లో విరివిగా దొరుకుతుంది. కృష్ణా జిల్లాతో పాటు గోదావరి జిల్లాల్లో కూడా ఈ చేపల సాగుకు అనుకూలం. విత్తన సాంకేతిక సీఐబీఏ–చెన్నై, సీఎంఎఫ్‌ఆర్‌ఐ, కొచ్చిన్ వద్ద ఉంది.
– డాక్టర్ శుభదీప్ ఘోష్, హెడ్, ఐసీఏఆర్–సీఎంఎఫ్‌ఆర్‌ఐ, విశాఖపట్నం ప్రాంతీయ కేంద్రం
Comments
Please login to add a commentAdd a comment