పెరిగిన కొబ్బరి ధర
వెయ్యి కాయల ధర రూ.18 వేలు
కొబ్బరి మార్కెట్‌లో దసరా,దీపావళి ధమాకా
ఆచితూచి అమ్ముతున్న రైతులు
రోజుకు 70 లారీల వరకూ ఎగుమతి
కోనసీమ అంటేనే కొబ్బరికి ప్రసిద్ధి. ఇక్కడి రైతులు వరి కంటే మక్కువగా కొబ్బరికి ప్రాధాన్యమిస్తారు. కొబ్బరికాయ దిగుబడి ఇక్కడ బాగుంది అనుకునేలోపే తమిళనాడు, కేరళ రూపంలో గట్టి సవాల్ ఎదురయ్యేది. దాంతో కాయ ఉన్నా.. సరైన ధర ఎన్నడూ లభించేది కాదు.
కానీ ఇప్పుడు కేరళలో ఓనం పండుగ వచ్చి అక్కడి కాయ అక్కడికే సరిపోతోంది. తమిళనాడు, కర్నాటకల్లో సరైన దిగుబడి లేకపోవడం, ఉత్తరాదిన దసరా, దీపావళి, కార్తికమాసం రూపంలో పండగలు క్యూ కట్టడంతో కోనసీమ కొబ్బరికి, రైతులకు ముందే పండగొచ్చింది.
సాక్షి, అమలాపురం/అంబాజీపేట: కేరళలో ఓనం పండుగ... తమిళనాడులో కొబ్బరికాయ అందుబాటులో లేకపోవడం... కోనసీమ కొబ్బరి రైతులకు పండగ వచ్చింది. కొబ్బరికాయ ధర రికార్డ్ స్థాయిలో పెరగడంతో వారికి దసరా... దీపావళి పండగ ముందే వచ్చింది. కొబ్బరి వెయ్యి కాయల ధర సైజును బట్టి రూ.17,500ల నుంచి రూ.18 వేల వరకు పలుకుతుంది. అంబాజీపేట కొబ్బరి మార్కెట్ చరిత్రలో ఇది ఆల్ టైమ్ హై. కొబ్బరి ధరలు రికార్డు స్థాయిలో పెరగడంతో ఉమ్మడి గోదావరి జిల్లాలోని కొబ్బరి రైతులకు ముందే దసరా, దీపావళి పండగ వచ్చినట్టయింది.
వరుస పండగల నేపథ్యంలో కొబ్బరి ధరలు అనూహ్యంగా పెరిగాయి. నెల రోజుల క్రితం వెయ్యి కొబ్బరికాయల ధర రూ.8,500 మాత్రమే ఉండేది. తర్వాత నెమ్మదిగా పెరుగుతూ ఆగస్టు నెలాఖరు నాటికి రూ.10,500కు చేరింది. వినాయక చవితి సమయానికి రూ.11,500 నుంచి రూ.12 వేల వరకు ధర రావడంతో రైతులు చాలా వరకు కోలుకున్నారు. కానీ గత వారం రోజుల నుంచి ధర రోజురోజుకూ పెరుగుతూ వచ్చింది, తమిళనాడు, కర్ణాటకల్లో కొబ్బరి దిగుబడులు తక్కువగా ఉన్నాయి.
కేరళలో ఓనం పండగ కారణంగా స్థానికంగా కొబ్బరి వినియోగం ఎక్కువగా ఉంది. దీనితో ఆ రాష్ట్రం నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు కొబ్బరి ఎగుమతులు మందగించాయి. ఈ కారణంగా ఉత్తరాది మార్కెట్ అవసరాలను ఉమ్మడి గోదావరి జిల్లాల కొబ్బరి తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల గతంలో ఎన్నడూ లేనంత ధర రావడం విశేషం. విజయదశమి, దీపావళి, కార్తికమాసం దృష్టిలో పెట్టుకుని ఇతర రాష్ట్రాల్లోని కొబ్బరి అమ్మకాలు పెరిగాయి.
ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరాంచల్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి కొబ్బరి ఆర్డర్లు అధికంగా వస్తున్నాయి. సాధారణంగా ఈ రాష్ట్రాలకు డొక్క ఒలిచిన కొబ్బరి ఎగుమతి అవుతుంటుంది. కానీ ఈసారి డొక్కా ఒలుపు చేయని కాయను కొనుగోలు చేస్తుండటం గమనార్హం. రాసుల రూపంలో రూ.18 వేల వరకు ధర ఉండగా 60 రకం (పెద్ద కాయ) డొక్కతో వెయ్యి కాయలు ధర రూ.20 వేలు పలుకుతుంది.
ఏడేళ్ల తర్వాత రికార్డు ధర
ఏడేళ్ల తర్వాత కొబ్బరికాయకు రికార్డు స్థాయి ధర వచ్చింది. 2017లో కొబ్బరికాయకు జాతీయ మార్కెట్లో రూ.17 వేల ధర రాగా ఈసారి అంతకుమించి ధర పలుకుతుండటం విశేషం.
మార్కెట్లో ఈ స్థాయి ధర రావడం అరుదైన విషయమని కొబ్బరి రైతులు, వ్యాపారులు చెబుతున్నారు. కొబ్బరికాయతో పాటు మిగిలిన కొబ్బరి ఉత్పత్తుల ధరలు సైతం పెరిగాయి. ప్రస్తుతం పాత కురిడీ కాయ గండేరా వేయింటికి రూ.14 వేలు, గటగటా రూ.17,500, కురిడీ కొత్త కాయ గండేరా రూ.13 వేలు, గటగట రూ.15,500 పలుకుతుంది.
Comments
Please login to add a commentAdd a comment