సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆంధ్ర క్రికెట్ జట్టు జోరు కొనసాగుతుంది. ఈ టోర్నీలో ఇప్పటికే వరుసగా నాలుగు విజయాలు సాధించిన ఆంధ్ర.. తాజాగా ఐదో విజయం నమోదు చేసింది. కేరళతో ఇవాళ (డిసెంబర్ 3) జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సంజూ సేనను ఆంధ్ర బౌలర్లు 87 పరుగులకే (18.1 ఓవర్లలో) మట్టికరిపించారు. కేవి శశికాంత్ 3, కే సుదర్శన్, సత్యనారాయణ రాజు, బోధల కుమార్ తలో 2 వికెట్లు పడగొట్టారు.
కేరళ ఇన్నింగ్స్‌లో జలజ్ సక్సేనా (27) టాప్ స్కోరర్‌గా నిలువగా.. అబ్దుల్ బాసిత్ (18), నిధీశ్ (14) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. టీమిండియా ఆటగాడు, కేరళ సారధి సంజూ శాంసన్ కేవలం 7 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆంధ్ర జట్టు.. 13 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. శ్రీకర్ భరత్ అజేయమైన అర్ద శతకంతో (56) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అశ్విన్ హెబ్బర్ 12, షేక్ రషీద్ 5, పైలా అవినాశ్ 0, రికీ భుయ్ 14 పరుగులు చేసి ఔటయ్యారు.
కేరళ బౌలర్లలో జలజ్ సక్సేనా 3 వికెట్లు పడగొట్టగా.. నిధీశ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. తాజా ఓటమితో కేరళ గ్రూప్-ఈ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది. ఆంధ్ర గ్రూప్ టాపర్‌గా కొనసాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment