ఆకివీడు: ఖరీఫ్ పంట పండింది. రైతు ఇంట ఆనందం వెల్లివిరుస్తోంది. ప్రకృతి అనుకూలించకపోయినా, అతివృష్టిలోనూ అధిక దిగుబడుల సాధనలో జిల్లా రైతాంగం విజయం సాధించారు. మెట్ట ప్రాంతంలో మాసూళ్లు పూర్తి కావచ్చాయి. ఇప్పటికే రైతులు ఎకరాకు 40 నుంచి 45 బస్తాల దిగుబడి సాధించారు. కొన్నిచోట్ల ఎకరానికి 53 బస్తాల దిగుబడి వచ్చింది. డెల్టా ప్రాంతంలో కోతలు పారంభమయ్యాయి. వ్యవసాయశాఖ, గంణాంక శాఖ అధికారులు దిగుబడులపై అంచనాలు వేస్తున్నారు. ర్యాండమ్ పద్ధతిలో పంట కోత ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. సరాసరి దిగుబడి 35 బస్తాల నుంచి 40 బస్తాల వరకూ వస్తున్నట్లు అంచనా వేశారు. డెల్టాలో దిగుబడి ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. కొన్ని మండలాల్లో దిగుబడులు భారీగా ఉంటే, చేపల చెరువులు ఉన్న గ్రామాల పరిధిలో దిగుబడి స్వల్పంగా తగ్గిందని రైతులు, వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
అధిక దిగుబడులు
జిల్లాలో ఖరీఫ్‌లో 2,58,118 హెక్టార్లలో వరి సాగు చేపట్టారు. దీనిలో మెట్ట, డెల్టా ప్రాంతాల్లో సాగు ఉంది. ఈ ఏడాది ఖరీఫ్ సాగులో 13 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి లక్ష్యంగా నిర్ణయించగా, లక్ష్యాన్ని అధిగమించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఖరీఫ్‌లో ఎంటీయూ 1061, 1064, 1121, 1156, 1153,సంపత్ వంగడంతో పాటు అక్కడక్కడా స్వర్ణ రకం సాగు చేశారు. ఈ రకాల్లో 1061, 1064 వంగడాలు అధిక దిగుబడులు ఇచ్చేలా కనిపిస్తున్నాయి.
అతివృష్టిని అధిగమించి
ఈ ఏడాది భారీ వర్షాలు, వరదలతో జిల్లా అతలాకుతలమైంది. ఖరీఫ్ సాగును ఆలస్యంగా చేపట్టిన డెల్టా ప్రాంతంలో వరి సాగుకు తీవ్ర ఇబ్బంది తలెత్తింది. ఒకటి రెండుసార్లు నారు పోసుకోవాల్సి వచ్చింది. వరి పొట్ట, పాలు, పూత దశలో ఉండగా భారీ వర్షాలు కురిశాయి. ఆ తర్వాత తెగుళ్లు వేధించాయి. దోమ విజృంభించింది. అయినా అన్ని ఒడిదుడుకులనూ ఈ సార్వా సమర్థంగా ఎదర్కొంది. దోమ ఉధృతి ఎదురైనప్పుడు రైతులు ఆందోళన చెందకుండా పరిమితికి మించకుండా పురుగు మందులు వినియోగించారు. తూర్పు గాలులకు దోమ తుడిచిపెట్టుకుపోయింది.
8 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు..
ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకూ 8 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. జిల్లాలో 311 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభ్తుత్వం ఏర్పాటు చేసింది. దీనిలో 203 ధాన్యం కొనుగోలు కేంద్రాలను సహకార సంఘాల ద్వారానూ, 108 కేంద్రాలను వెలుగు ప్రాజెక్టు ద్వారా డ్వాక్రా మహిళలకు కేటాయించారు. ఈ ఏడాది ధాన్యం కొనుగోలు కేంద్రాలను గిడ్డంగి సౌకర్యం ఉన్న సొసైటీలకు అధికంగా ఇవ్వడంతో ధాన్యం నిల్వ ఉంచే అవకాశం ఏర్పడింది. వెలుగు కేంద్రాల వద్ద కూడా మార్కెట్ యార్డు గొడౌన్లు, స్థానిక గొడౌన్లను వినియోగించుకుంటున్నారు. డెల్టా ప్రాంతంలో వరి కోతలు మొదలు కావడంతో ధాన్యం ఇకపై ముమ్మరంగా కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉంది.
ప్రభుత్వ ప్రోత్సాహం..
ఈ ఏడాది సార్వా సీజన్‌లో ప్రభుత్వం రైతులకు అండగా నిలబడింది. కష్టమొచ్చిన ప్రతిసారీ భరోసా ఇచ్చింది. పెట్టుబడి కోసం అక్టోబర్‌లో రైతు భరోసా అందించడంతో అన్నదాతలు కొన్ని ఖర్చులకు ఆ మొత్తాన్ని వినియోగించుకోగలిగారు. అధికారులు కూడా రైతులకు అందుబాటులో ఉంటూ ప్రతికూల పరిస్థితులు తలెత్తిన ప్రతిసారీ సలహాలు, సూచనలు ఇచ్చారు. ఫలితంగా దిగుబడులు ఆశాజనకంగా వచ్చాయి.
40–45 బస్తాల దిగుబడి..
జిల్లాలో ఖరీప్ పంట దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. ఇప్పటికే మెట్టలో 45 బస్తాల పైబడి దిగుబడి వచ్చింది. డెల్టాలో మాసూళ్లు ప్రారంభమవుతున్నాయి. అక్కడక్కడా పంటకోత ప్రయోగంలో సరాసరి 40 బస్తాల దిగుబడి వస్తోంది. అతివృష్టి సంభవించినా వరిసాగుకు నష్టం కలగలేదు.
– గౌసియా బేగం, జిల్లా వ్యవసాయాధికారి, ఏలూరు
90 కేంద్రాల్లో కొనుగోళ్లు..
జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకూ 8 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. 311 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా 90 కేంద్రాల్లో కొనుగోలు జరుగుతోంది. డెల్టాలో మాసూళ్లు ప్రారంభం కావడంతో ధాన్యం అధికంగా వచ్చే అవకాశం ఉంది.
– వర కుమార్, మేనేజర్, జిల్లా పౌరసరఫరాల శాఖ, ఏలూరు
40 బస్తాలొస్తుంది..
ఖరీప్‌పంట దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రకృతి కరుణించింది. ఎకరానికి 40 బస్తాలు వస్తాయని ఆశిస్తున్నాం. కంకులు బలంగా ఉండటంతో దిగుబడి బాగుంటుంది.
– ఎరిచర్ల ప్రభాకరరావు, చెరుకుమిల్లి
దిగుబడి బాగుంది..
ఖరీఫ్ దిగుబడి బాగుంది. అధిక వర్షాలకు తీవ్రంగా నష్టం వస్తుందని బాధపడ్డాం. ఆ విధంగా జరగలేదు. నష్టాలను అధిగమించినట్లే. పంట బాగుండటంతో ఆనందంగా ఉంది.
– జంపన అర్జునరాజు, కౌలు రైతు, అయిభీమవరం
Comments
Please login to add a commentAdd a comment