farmers happiness
-
రైతును రాజును చేసిన రాజన్న
ఏదైనా ఇవ్వడానికైనా, చేయడానికైనా మనసుండాలి. ఆ మంచి మనసున్న మారాజు కాబట్టే వైఎస్ రాజశేఖరరెడ్డి ఏ ముఖ్యమంత్రీ చేయలేనివి చేయగలిగారు, ఇవ్వలేనివి ఇవ్వగలిగారు. ఒక తార్కిక ఆలోచనతో రైతులకు ఉచిత విద్యుత్ ఎవరైనా ఇచ్చారా? మహత్తరమైన ఆరోగ్యశ్రీ ఆలోచన అంతకుముందు ఎవరికైనా వచ్చిందా? కలలో కూడా సంకల్పించలేని జలయజ్ఞానికి ఏ నాయకుడైనా శ్రీకారం చుట్టారా? అందుకే రైతు సంక్షేమం కోసం అహరహం తపించిన ఆ మహా నాయకుడి జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో సముచితం. రైతు నాయకుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్య మంత్రిగా, దేశ ఆర్థికమంత్రిగా, ప్రధానిగా రైతుల సంక్షేమం కోసం అనేక చట్టాల రూప కర్త అయిన చౌదరి చరణ్‌సింగ్ జయంతి డిసెంబర్ 23ను జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం. పేదవాడి పౌష్టికాహారం అయిన చేపల ఉత్పత్తిని పెంచడం కోసం హేరాలాల్ చౌదరి, కె.హెచ్.అలీ కున్హి శాస్త్ర వేత్తల బృందం 1957 జూలై 10న కృత్రిమ పద్ధతి ద్వారా చేప పిల్లల ఉత్పత్తి పెంచే విధానాన్ని కనుక్కొంది. నీలి విప్లవ విజయానికి కారణమైన ఆ పరిశోధన విజయవంతమైన రోజును జాతీయ మత్స్య రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ విషయంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినందున ఆయన జయంతి అయిన జూలై 8ని ప్రతి సంవత్సరం రైతు దినోత్సవంగా జరుపుకోవాలని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కేవలం ఐదేళ్ల మూడు నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రైతు సంక్షేమం కోసం ఏ ముఖ్యమంత్రీ చేయలేని పనులు చేశారు. 2004లో ఆయన సీఎంగా ప్రమాణం చేసే నాటికి వ్యవసాయ రంగం కుదేలైంది. వర్షాలు పడక, ప్రాజెక్టుల నుండి నీరు విడుదల కాక, ఉత్పత్తులు గణనీయంగా తగ్గిపోయి, రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఎగతాళిగా మాట్లాడారు అప్పటి ముఖ్య మంత్రి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 22 జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లుంటే 18 బ్యాంకులు దివాలా తీసిన పరిస్థితి. సీఎంగా వైఎస్ మే నెల రెండవ వారంలో ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ మొదటి వారంలోనే ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలు అనా«థలు కాకూడదని రెండు లక్షల రూపాయల పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. సాగునీటి వనరుల అభివృద్ధి మొదలైన కృష్ణదేవరాయల పాలన నుండి వైఎస్ ముఖ్య మంత్రి అయ్యేదాకా ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి వనరులు ఉన్న భూమి సుమారు 80 లక్షల ఎకరాలు మాత్రమే. ఇలాంటి పరిస్థితిలో లక్ష కోట్లతో కోటి ఎకరాలకు నీరు అందిస్తానని జలయజ్ఞం ప్రారంభించారు. జలయజ్ఞంలో మొదట ప్రారంభించిన ప్రాజెక్టు పులిచింతల. మొదట పూర్తయ్యింది నిజామాబాద్ జిల్లాలోని అలీసాగర్ ప్రాజెక్టు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా పేర్లు పెట్టి ఏమాత్రం కూడా పనులు జరగని హంద్రీ– నీవా, గాలేరు–నగరి సుజల స్రవంతులకు అవే పేర్లు కొనసాగించడం, ప్రకాశం జిల్లాలోని కరువు ప్రాంతానికి జీవనాడి అయిన వెలుగొండ ప్రాజెక్టును చేపట్టి దానికి కమ్యూనిస్టు నాయకుడైన పూల సుబ్బయ్య పేరు పెట్టడం, కృష్ణా డెల్టా రైతుల చిరకాల స్వప్నమైన పులిచింతలకు కృష్ణా డెల్టా వాసి, ఆంధ్రప్రదేశ్ గర్వించే ఇంజనీర్ కె.ఎల్.రావు పేరు పెట్టడం ఆయన రాజకీయ విజ్ఞతకు నిదర్శనం. పోలవరం ప్రాజెక్టు కోసం గోదావరి జిల్లా వాసులు పోలవరం సాధనా సమితి పేరుతో అనేక ఉద్యమాలు చేసి చివరికి అది అసాధ్యం అనుకున్న తరుణంలో అన్ని అనుమతులు సాధించి, రాష్ట్రానికే వరమైన పోలవరంను మొదలు పెట్టడమే కాదు, సీఎంగా ఉండగానే 70 శాతం పూర్తి చేసిన గొప్పతనం ఆయనది. సాగునీటి వనరులకు ప్రధాన ఆధారం ఒకటి ప్రాజెక్టులయితే, రెండవది భూగర్భ జలాలు. ఒక ప్రాజెక్టు కట్టి ఒక ఎకరానికి నీరివ్వా లంటే ప్రభుత్వానికి లక్షలలో ఖర్చు అవుతుంది. కాల్వల నిర్వహణ ప్రభుత్వమే భరించాలి. అదే భూగర్భ జలాలకైతే రైతు స్వయంగా బోరు బావి ఏర్పాటు చేసుకుంటున్నాడు. సొంత ఖర్చుతో మోటార్లు కొనుక్కుంటున్నాడు. రైతు ఒక ఎకరంలో పంట పండించడం ద్వారా 40–60 పని దినాలు కల్పిస్తున్నాడు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కె టింగ్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం కల్పిస్తున్నాడు. కాబట్టి వ్యవసా యానికి ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని ఆయన సంకల్పిస్తే కొంతమంది ఎగతాళి చేశారు. అయినా సంకల్ప బలం గెలిచింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఆదర్శమై తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లో అమలవుతోంది. వ్యవసాయ ఉత్పత్తి వ్యయం ఎక్కువ. రైతుకు ఆదాయం తాను పండించిన పంటను లాభసాటి ధరకు అమ్ముకుంటేనే వస్తుంది. పెరుగుతున్న పెట్టుబడులకు అనుగుణంగా మద్దతు ధరలు లేవని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవి పెరిగేలా చేశారు. ఉదాహరణకు 1999 నుండి 2004 వరకు రాష్ట్రంలో ఎక్కువగా సాగు జరిగే ధాన్యానికి పెరిగిన మద్దతు ధర రూ. 490 నుండి 550. అంటే 12.5 శాతం పెరుగుదల. అదే 2004 నుండి 2009 వరకు వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ. 550 నుండి 1,000 రూపాయలకు పెరిగింది. అంటే 82.5 శాతం పెరుగుదల. రాజశేఖరరెడ్డి ప్రోద్బలంతోనే కేంద్ర ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించింది. అదీగాక కేంద్రం ప్రకటించిన రుణమాఫీలో సకాలంలో బకాయిలు చెల్లించిన రైతులకు లబ్ధి జరగలేదని గ్రహించి, రైతు సంఘాలు కూడా లేవనెత్తక ముందే, 36 లక్షల మంది రైతులకు ఐదు వేల రూపాయల చొప్పున రూ. 1,800 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశారు. దేశంలో ఇలా చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్. సన్న, చిన్న కారు రైతులు, కౌలు రైతులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడానికి కారణాలు విద్య, వైద్యం ఖర్చు. అందుకే గొప్ప పథకాలైన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108, 104 అమలు చేశారు. రాష్ట్రంలో సరాసరి 65 శాతం మంది రైతుల భూకమతాల పరి మాణం 1.05 సెంట్లు. మరో 22 శాతం మంది రైతుల పరిమాణం 3.45 ఎకరాలు మాత్రమే. అంటే 87 శాతం మంది రైతులకు తెల్ల రేషన్ కార్డులు, వృద్ధాప్య పెన్షన్లు, బలహీన వర్గాల గృహాలు కేటా యించి ఈ వర్గాలను కాపాడటం జరిగింది. 90 శాతం రాయితీతో పెద్ద ఎత్తున బిందుసేద్య పరికరాలు ఇచ్చారు. ఒక్క రూపాయి పన్ను పెంచలేదు, ఒక్క రూపాయి కొత్త పన్ను వెయ్యలేదు. సంక్షేమ పథ కాలన్నీ అర్హులందరికీ అందాయి. భూములు అమ్ముకోవలసిన అవ సరం రాలేదు. రైతులకు ఆదాయం పెరగడంతో వ్యవసాయ కార్మి కులు, చిన్న వ్యాపారులు, చిరు వ్యాపారుల ఆదాయం పెరిగింది. అభివృద్ధి, సంక్షేమం తన రెండు కళ్లుగా పాలనగావించారు వైఎస్. నాన్న ఒక అడుగు వేస్తే, ఆయన వారసుడిగా తాను రెండు అడుగులు వేస్తానని ప్రకటించారు ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి. రైతు లకు ఉత్పత్తి వ్యయం తగ్గాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప ట్టిన రెండేళ్లలోనే రైతులకు రూ. 13,101 కోట్లు అందించిన పథకానికి వైఎస్సార్. రైతు భరోసా –పీఎంకిసాన్గా నామకరణం చేయడం జరి గింది. అలాగే వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం, వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం, వైఎస్సార్ కాపరి బంధు పథకాలను రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తోంది. పశు నష్ట పరిహారం పథకం, జలకళ పథకం, ఆసరా పథకం, చేయూత పథకం, కాపునేస్తం పథకం, వాహనమిత్ర పథకం, లా నేస్తం పథకం, కల్యాణ కానుక పథకం, కంటి వెలుగు పథకం, సంపూర్ణ పోషణ పథకం, గిరి పుత్రిక పథకం, ఈబీసీ నేస్తం లాంటివాటిని వైఎస్సార్ పేరుతో కొనసాగిస్తూ ప్రభుత్వం ఆ మహానేత పరిచిన బాటలో నడుస్తోంది. ఎం.వి.ఎస్. నాగిరెడ్డి వ్యాసకర్త వైస్ చైర్మన్, ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ -
కొత్త బంగారు లోకం.. సతత హరిత పంటలు
మానవాళికి, పశు పక్ష్యాదులకు ప్రాణాధారమైన నేల తల్లి ఆచ్ఛాదన లేక మండుటెండల్లో అల్లాడిపోతోంది. వాతావరణంలో పెరిగిపోతున్న తాపం ధాటికి జీవాన్ని కోల్పోతోంది. ఇటువంటి సంక్షోభ కాలంలో సాధారణ పేద రైతులు ఆకుపచ్చని పంటలతో భూతల్లికి వస్త్రం కప్పుతున్నారు. ఏడాది పొడవునా ప్రతి రోజూ పొలం అంతటా పచ్చని పంటలు పండిస్తున్నారు. సాంత్వన పొందిన ఆ తల్లి ప్రేమతో ఇస్తున్న కూరగాయలు, ధాన్యాలను కృతజ్ఞతాపూర్వకంగా స్వీకరిస్తూ ఆనందంగా ఉన్నారు. అపురూపమైన ఈ రైతులు నీటి వసతి ఉన్నవారో, సుభిక్షమైన ప్రాంతవాసులో అనుకుంటే పొరపాటు. ఎడారిగా మారిపోతున్న అనంతపురం జిల్లాలో! అదికూడా.. వర్షాధార వ్యవసాయ భూముల్లో!! ‘భూమాతను పునరుద్ధరించుకుందాం’ అన్న నినాదంతో ఈ నెల 22న ‘ధరిత్రీ దినోత్సవం’ జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా.. కరువు సీమలో ఎండాకాలంలోనూ పచ్చని పంటలతో భూమాతను తమ గుండెలకు హత్తుకుంటున్న కొందరు రైతుల సుసంపన్నమైన అనుభవాల సమాహారమే ఈ కథనం. ప్రకృతి వ్యవసాయానికి చిరునామా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయం’లో ఒకానొక సరికొత్త ఆవిష్కరణ ‘వర్ష రుతువు కన్నా ముందుగానే విత్తనాలు విత్తుకోవటం’. దీన్నే ఆంగ్లంలో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (పి.ఎం.డి.ఎస్.) అంటారు. ఈ పద్ధతిలో ఏడాదిలో 365 రోజులూ పంటలతో భూమిని కప్పి ఉంచడం.. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపు మందులు చల్లకుండా ఉండటం వల్ల భూమాత తిరిగి జీవాన్ని సంతరించుకుంటున్నది. ఏడాది పొడవునా ఆకుపచ్చని పంటలతో పి.ఎం.డి.ఎస్. పంట భూములు కళకళలాడుతుండటం విశేషం. సాధారణంగా నీరు నదుల్లోనే ఉంటుందనుకుంటాం. కానీ, నదుల్లో కన్నా పది రెట్లు ఎక్కువ నీరు గాలిలో ఉంది. గాలిలో తేమ రూపంలో నీరుంది. ఆ తేమను గ్రహించి నేలను చెమ్మగిల్లేలా చేస్తూ వర్షం లేని కాలాల్లోనూ పంటలు నిలిచేలా.. సహజసిద్ధంగానే ఏడాది పొడవునా పచ్చగా ఉండేలా చేయటమే.. వినూత్నమైన పి.ఎం.డి.ఎస్. ప్రకృతి సాగు పద్ధతి విశిష్టత. ఆస్ట్రేలియాకు చెందిన ప్రసిద్ధ సాయిల్ మైక్రోబయాలజిస్ట్ డాక్టర్ యన సిద్ధాంతం మూలాధారంగా ఈ పద్ధతిని అమలు చేస్తున్నారు. దీని ద్వారా కరువును జయించడం, స్థానికంగా ఆహార భద్రతను కల్పించడమే కాకుండా.. భూతాపోన్నతిని సైతం తగ్గించే అవకాశం ఉందని డా. యన స్పష్టం చేస్తున్నారు. తమకున్న పొలంలో కొద్దిపాటి విస్తీర్ణాన్ని మాత్రమే చిన్న, సన్నకారు, పేద రైతులు.. ముఖ్యంగా మహిళా రైతులు పి.ఎం.డి.ఎస్. పద్ధతిలోకి మార్చుతున్నారు. ఆ పొలాలు ప్రస్తుత ఎర్రని ఎండల్లోనూ పచ్చగా అలరారుతూ కూరగాయలను అందిస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. తమ పంట పొలాల్లో ఎప్పుడూ పచ్చగా ఉండే ‘ఆహారపు అడవి’ని సృష్టిస్తున్నారు! గత మూడేళ్లుగా ఒక్క అనంతపురం జిల్లాలోనే కాదు ఆంధ్రప్రదేశ్ అంతటా కొంత మంది రైతులు పి.ఎం.డి.ఎస్. పద్ధతిలో పంటలు సాగు చేస్తున్నారు. వీరి కుటుంబాలకు ఏడాది పొడవునా కూరగాయలు వంటి పంటలతో అమృతాహారం అందుతున్నది. తినగా మిగిలిన కూరగాయలను అమ్ముకుంటూ చెప్పుకోదగ్గ ఆదాయాన్ని సైతం సమకూర్చు కుంటున్నారు. పి.ఎం.డి.ఎస్. ప్రకృతి సాగు అంటే..? సాధారణంగా వర్షం పడి భూమి పదును అయిన తర్వాత దున్ని విత్తనం వేస్తారు రైతులు. అయితే, ఈ పద్ధతిలో రైతులు చేస్తున్నదేమిటంటే.. వర్షం రాక మునుపే, ఎండాకాలంలోనే, నేల పొడిగా ఉన్నప్పుడే.. ఎకరానికి 600 కిలోల ఘన జీవామృతం వేస్తున్నారు.. దుక్కి చేసి నవధాన్య విత్తనాలకు మట్టి, పేడతో లేపనం చేసి విత్తన బంతులు తయారు చేసి చల్లుతున్నారు. ఆ పైన వేరుశనగ కాయల పొట్టు, కంది పొట్టు, శనగ పొట్టు వంటి పంట వ్యర్థాలను రెండు, మూడు అంగుళాల మందాన వేస్తున్నారు. భూతల్లికి ఆచ్ఛాదనగా కప్పుతున్నారు. గాలిలో ఉన్న తేమను ఈ ఆచ్ఛాదన ఒడిసిపట్టి ఘనజీవామృతానికి, మట్టి కణాలకు అందిస్తోంది. ఆ విధంగా ప్రకృతి సాగు ద్వారానే వాతావరణంలోని తేమను ఒడిసిపట్టి పంట పొలాన్ని సస్యశ్యామలం చేస్తున్న వైనం ప్రపంచానికే ఆదర్శప్రాయం. ధరిత్రీ దినోత్సవం సందర్భంగా పి.ఎం.డి.ఎస్. ప్రకృతి సాగుదారులందరికీ ‘సాక్షి సాగుబడి’ జేజేలు పలుకుతోంది! – పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ మెట్ట రైతులందరికీ ఈ సాగు పద్ధతిని నేర్పిస్తాం! ప్రకృతి వ్యవసాయం, వర్షానికి ముందే విత్తనాలు వేయటం వంటి సరికొత్త పద్ధతులను అనుసరించడం వల్ల ఎకరం, అరెకరం భూములను వర్షాధారంగా సాగు చేసే రైతులు కూడా ఏడాది పొడవునా అనేక రకాల కూరగాయలు పండించగలుగుతున్నారు. వారు తినగా మిగిలిన కూరగాయలు అమ్మి రూ. 60 వేల నుంచి రూ. 1,50,000 వరకు నికరాదాయాన్ని పొందుతున్నారు. అంతేకాదు, భూసారం పెంపుదలకు, పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నారు. ఏడాదంతా పొలాన్ని పంటలతో పచ్చగా ఉంచుతున్న పుష్పావతి, చంద్రకళ వంటి రైతులు ఏపీలో ప్రస్తుతం 110 మంది ఉన్నారు. 2021–22 సంవత్సరంలో కనీసం 1,500 మంది రైతులతో 365 రోజులూ పచ్చని పంటలు ఉండేలా ప్రకృతి వ్యవసాయం చేయిస్తాం. మున్ముందు రాష్ట్రంలో మెట్ట రైతులందరికీ ఆహార, ఆదాయ, పర్యావరణ భద్రతను కల్పించే ఈ పద్ధతిని నేర్పించాలన్నది మా లక్ష్యం. – టి. విజయకుమార్, ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షులు, ఏపీ రైతు సాధికార సంస్థ vjthallam@gmail ఎడారిలో పంటల ఒయాసిస్సు పి.ఎం.డి.ఎస్. ప్రకృతి సేద్యంలో అరెకరంలో 16 పంటలు పండిస్తున్న బండారి పుష్పావతి మండు వేసవిలోనూ పైరు పచ్చని నిరంతర వర్షాధార సేద్యం 2020 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు అరెకరంలో రూ. 61,818ల నికరాదాయం వచ్చే ఒకటి, రెండు నెలల్లో రానున్న మరో రూ. 26,800 ఆదాయం రాయలసీమ... అందులోనూ... అనంతపురం జిల్లా... కరువుకు ఓ చిరునామా... అలాంటి జిల్లాలో నీరు చుక్క లభ్యం కాని గుండాల తాండా క్లస్టర్‌లోని ‘గుండాల’ ఓ గిరిజన గ్రామం. ఆ గ్రామంలోని కోడలు పిల్ల బండారి పుష్పావతి. ఆమె భర్త పేరు డేవిడ్... ఆమె చదువుకున్నది 10వ తరగతి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ‘ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయం’ కార్యక్రమంలో గ్రామస్ధాయి కార్యకర్తగా ఆమె గత 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఆమె అత్త వారి తరపున లెక్కకయితే స్వంతంగా 6 ఎకరాల మెట్ట భూముంది. కానీ ఎప్పుడూ లక్ష రూపాయలకు మించి ఆదాయం చూడలేదు.. బ్రతుకు బండి సాఫీగా సాగాలంటే ఏదో రూపంలో బ్రతుకు తెరువు వెదుక్కోవలసిందే. ఇటు ఉపాధి హావిూ పనులతోపాటు పెద్ద రైతుల వద్ద కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి పరిస్ధితులలో ప్రకృతి వ్యవసాయం మార్గదర్శనం చేసింది. ఈ విభాగం జిల్లా మేనేజర్‌గా చేస్తున్న లక్ష్మానాయక్ ఆమెలో ప్రేరణ కలిగించారు. ‘వర్ష రుతువు రాక ముందే పొలంలో విత్తనాలు చల్లుకొనే’ ఒక వినూత్న పద్ధతిని పరిచయం చేశారు. ఒక వైపు ఆదాయంతోపాటు మరో వైపు వందలాది సందర్శకుల అభిమానాన్ని కూడా స్వంతం చేసుకున్నారు పుష్పావతి. 2018లో అర ఎకరాలో దుక్కి చేసి ప్రారంభించిన పచ్చని పంటల సాగు మూడేళ్ల తర్వాత ఇప్పుడు కూడా విరామ మెరుగని దిగుబడులను అందజేస్తుంటే ఆశ్చర్యమే కదా! నేటికీ ఆ పొలంలో 16 రకాల పంటలు అప్పుడే వర్షంలో తడిసి కేరింతలు కొడుతున్న పసి పిల్లల్లా మిలమిలా మెరిసిపోతున్నాయి. వంగ, టమాట, మిరప, క్యాబేజీ, ముల్లంగి, అలసందలు, క్లస్టర్ బీన్స్, గోంగూర, తోటకూర, పాలకూర, కాకర, వేరుశనగ, బంతి పంటలు మరో ఒకటి, రెండు నెలలు దిగుబడులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. బహువార్షిక రకాలయిన కంది, ఆముదం అయితే ఒక సంవత్సరంలోనే మూడు దఫాలు దిగుబడులిచ్చాయి. తిండి గడవక ప్రతి ఏటా వలస పోయే ఆ కుటుంబం వలస మాటే మర్చిపోయింది. వచ్చిన దిగుబడిలో తమ కుటుంబం యావత్తూ తినగా మిగిలిన పంట అమ్మడం వలన వచ్చిన డబ్బులతో ఇతర ఖర్చులు కూడా గట్టెక్కుతున్నాయని చెబుతున్న పుష్పవతి కళ్ళల్లో ఏదో కొట్టొచ్చిన మెరుపు. ఆ ఆనందంతో మొత్తం దిగుబడులు, ఖర్చులు టకటకా చెప్పేశారు. ఈ అరెకరంలో పెరుగుతున్న కూరగాయ పంటల ద్వారా 2020 ఏప్రిల్ నుంచి జూలై వరకు వచ్చిన మొత్తం ఆదాయం రూ. 15,178. ఖర్చులు పోను నికరాదాయం రూ.10,738. అదే సంవత్సరం ఖరీఫ్‌లో మొత్తం రూ. 38,540ల దిగుబడి రాగా, ఖర్చులు పోను రూ. 32,630ల నికరాదాయం వచ్చింది. ఇంకా రబీలో ఖర్చులు పోను రూ.18,450 నికరాదాయం చేతికందింది. ఇప్పటి వరకు గత ఏడాదిలో రూ. 61,818 నికరాదాయం వచ్చింది. మరో రెండు నెలల్లో వంగ మీద రూ.9 వేలు, కంది మీద రూ. 3 వేలు, ఆముదం మీద రూ. 4 వేలు, క్యాబేజీ మీద మరో రూ. 4 వేలు, ముల్లంగి మీద రూ. 4 వేలు, గోరుచిక్కుడు మీద రూ. 400, టమాటా మీద రూ. 2 వేలు, బీర, గోంగూర పంటల ద్వారా రూ. 400 (మొత్తం మరో రూ. 26,800) ఆదాయం వస్తుందని పుష్పావతి ధీమాగా చెప్పారు. ఇంత ఆదాయం తీసుకుంటున్న ఈమె అరెకరం పి.ఎం.డి.ఎస్. పొలానికి నీటి వసతి లేదు. అంతా వర్షాధారమే. 4 అంగుళాల మందంలో ఆచ్ఛాదనగా వేసిన శెనక్కాయల పొట్టుతోపాటు నెలకు రెండు సార్లు 100 లీటర్లు చొప్పున ద్రవ జీవామృతాన్ని క్రమం తప్పకుండా పంటలకు పుష్పావతి అందిస్తున్నారు. అత్యవసర పరిస్ధితులలో గత మూడేళ్లలో కేవలం 5 సార్లు ట్యాంకర్లతో (బోదెలకు ఇరువైపులా వున్న నీటి కాలువల ద్వారా) పంట రక్షక తడులు అందించారు. పుష్పావతి సేద్యం గురించి తప్పక తెలుసుకోవలసిన మరో విశేషం వుంది. వీళ్ళకున్న 6 ఎకరాల భూమిలో అరెకరంలో పి.ఎం.డి.ఎస్. ప్రకృతి సాగు మినహాయిస్తే మిగిలిన 5.5 ఎకరాలలో గత ఖరీఫ్‌లో ఏక పంటగా వేరుశనగ వేశారు. ఖర్చులు పోను నికరంగా మిగిలింది కేవలం రూ. 90 వేలు మాత్రమే. అంటే ఒక అరెకరంలో పి.ఎం.డి.ఎస్. ప్రకృతి సాగు ద్వారా తీసుకున్న నికరాదాయం 5.5 ఎకరాల్లో వచ్చిన నికరాయంతో దాదాపుగా సమానమన్నమాట. వచ్చే నెలలో మరో అరెకరాలో 365 రోజులు కొనసాగే పంటల సాకు శ్రీకారం చుడతానని చెబుతున్నారు పుష్పావతి. ఈమె పొలానికి ఆనుకొని వున్న పొలం రైతులకు బోరుబావి వున్నప్పటికీ గత ఖరీఫ్‌లో వేరుశనగను సాగు చేసి, రబీలో భూమిని ఖాళీగా వుంచేశారు. అయితే, పుష్పావతి పొలంలో వస్తున్న మార్పులను గమనిస్తున్నారు. ఆచ్ఛాదన చల్లదనానికి భూమిపైకి వస్తున్న వానపాములను, పంట దిగుబడులను చూసి పక్క రైతులు తాము కూడా పి.ఎం.డి.ఎస్. ప్రకృతి సేద్యం చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. మండు వేసవిలోనూ పచ్చని పంటలతో నేలతల్లికి రక్షణ కల్పిస్తూ.. తమ కుటుంబానికి ఆహార, ఆదాయ భద్రతను అందిస్తున్న చల్లని తల్లి పుష్పావతి (91821 75892)కి జేజేలు. అరెకరంలో రూ.79 వేల నికరాదాయం లీడ్ ఫార్మర్ చంద్రకళ అనుభవం అరెకరంలో పి.ఎం.డి.ఎస్. ప్రకృతి సేద్యం చేపట్టిన పరిశపోగుల చంద్రకళ దంపతులు గత ఏడాదిలో తమ కుటుంబానికి సరిపడా కూరగాయలు పండించుకోవడమే కాకుండా రూ. 79 వేల నికరాదాయాన్ని కూడా పొందారు. అనంతపురం జిల్లా పూడేరు మండలం జయపురానికి చెందిన చంద్రకళ ప్రకృతి వ్యవసాయ విస్తరణ విభాగంలో లీడ్ ఫార్మర్‌గా పనిచేస్తూ ఆదర్శప్రాయమైన సేద్యం చేస్తున్నారు. తమకున్న ఎకరం డి.పట్టా మెట్ట భూమిలోని అరెకరంలో గత ఏడాది ఏప్రిల్‌లో పి.ఎం.డి.ఎస్. ప్రకృతి సేద్యం ప్రారంభించారు. ప్రభుత్వ సహకారంతో తీసిన బోరు బావికి ఉద్యాన శాఖ బిందు సేద్య పరికరాలను మంజూరు చేసింది. సజ్జ, జొన్న, కొర్ర, నువ్వులు, ఆవాలు, ధనియాలు, అలసందలు, పెసలు, ఆనప, చిక్కుడు, కాకర, బీర, బంతి, ఆముదం, ఉలవలు, కందులు, మినుములు (ఉద్దులు), వేరుశనగ సాగు చేస్తున్నారు. చివరి దుక్కిలో 150 కేజీల ఘనజీవామృతం, 500 కేజీల టైప్2 ఘనజీవామృతం వేసుకొని కలియదున్నారు. 4 అడుగుల వెడల్పుతో బోదెలు (మట్టి పరుపులు) వేసుకొని, ఇరువైపులా 2 అడుగుల వెడల్పున కాలువలు తీశారు. ప్రతి 4 నెలలకొకసారి రిలే పంటలు వేసిన ప్రతి సారీ 150 కేజీల చొప్పున ఘనజీవామృతం చల్లుకున్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతాన్ని మొక్కంతా తడిసి క్రిందకు జారేలా క్రమం తప్పకుండా పిచికారీ చేశారు. 3 ట్రాక్టర్లతో తెచ్చిన వేరుశనగ పొట్టును పొలమంతా 4 అంగుళాల ఎత్తులో సమతలంగా ఆచ్చాదనగా పరిచారు. ఈ ఆచ్ఛాదన వలన నీటి అవసరం తగ్గడంతోపాటు.. వేరుశనగ పొట్టు కొద్దికొద్దిగా కుళ్ళుతూ మొక్కలకు సారాన్ని అందించడం వలన పంటలన్నీ ఆరోగ్యంగా నిగనిగలాడుతు న్నాయి. బీజ రక్షతో విత్తనశుద్ధి చేసి.. అలసంద, జొన్న పంటలను సరిహద్దు పంటలుగా వేసుకున్నారు. బంతి, ఆముదం పంటలను ఎర పంటలుగా నాటారు. పంటల వైవిధ్యం పాటించారు. ఒక వరుసలో 45 రకాల పంటలుండేలా జాగ్రత్త తీసుకున్నారు. వంగ తరువాత టమోటా, ఆ తరువాత మిరప, క్యాబేజీ మళ్ళీ వంగ.. ఈ విధంగా బహుళ పంటలు పొలమంతా వేశారు. దోమపోటు రాకుండా నీమాస్త్రంను, పూత రాలకుండా పుల్లటి మజ్జిగ పిచికారీ చేశారు. రసాయన అవశేషాలు లేని ముల్లంగి దుంపల కూర తినడం వలన తన భర్తకు వచ్చిన మొలల వ్యాధి శస్త్రచికిత్స చేయకుండానే నయమయ్యిందని చంద్రకళ ఆనందంగా చెప్పారు. వచ్చే ఖరీఫ్‌లో ఆముదం, క్యాబేజీ, క్యారట్, బీట్రూట్ పంటలు వేసుకొని రాబోయే సంవత్సరం మరింత ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తానని చంద్రకళ (99637 17844) ఆశాభావంతో ఉన్నారు. (ఇన్పుట్స్ : డా. డి.పారినాయుడు, జట్టు ట్రస్టు) -
బడ్జెట్ 2021: రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
సాక్షి, న్యూఢిల్లీ: రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రైతుల ఉత్పత్తుల్లో భారీగా పెరుగుదల ఉందన్నారు. వ్యవసాయ సంస్కరణలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఆర్థిక మంత్రి.. బడ్జెట్లో వ్యవసాయ రంగానికి భారీగా నిధులు కేటాయించారు. 2021-22లో ఆహార ఉత్పత్తుల సేకరణ, కనీస మద్దతు ధరకుగాను 1,72,000వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశామన్నారు. 2020-21లో రైతులకు 75వేల కోట్ల రూపాయలు కేటాయించామని.. దీని వల్ల 1.5 కోట్ల మంది రైతులు లబ్ధి పొందారని తెలిపారు. ఇక ఈ ఏడాది రైతు రుణాల లక్ష్యం 16.5 లక్షల కోట్ల రూపాయలు అన్నారు. అలానే గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి 40వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా మరో 1000 మండీలను ఈనామ్‌తో అనుసంధానిస్తమన్నారు. అస్సాం, బెంగాల్లో పని చేస్తున్న టీ కార్మికుల కోసం1,000 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. -
కొందరు తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు: కాకాణి
సాక్షి, నెల్లూరు: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వరసగా రెండో ఏడాది జలాశయాలకు పుష్కలంగా నీరు వచ్చిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. నదులు పొంగి ప్రవహిస్తున్నాయన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులు ఎంతో సంతోషంగా రెండు పంటలు పండించుకుంటున్నారని తెలిపారు. కరోనా నేపథ్యంలో కూడా దిగుబడి సాధించారని పేర్కొన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా.. అధికారుల సమన్వయ లోపం వల్ల రైతులు ఆందోళనకు దిగారని తెలిపారు. (చదవండి: సీఎం జగన్ ఆకాంక్ష అదే: ఆళ్ల నాని) రైతులపై కేసులు పెట్టడం సరికాదని, వెంటనే కేసులు ఎత్తివేయాలని కోరారు. రైతులను ఇబ్బందులు పెడుతున్న దళారులు, మిల్లర్లు, వ్యాపారులపై చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాల వల్ల ధాన్యం రంగు మారడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని, వారి సమస్యలను అధికారులు అర్థం చేసుకుని స్పందించాలని విజ్ఞప్తి చేశారు. కొందరు అధికారుల తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందన్నారు. ధాన్యం కొనుగోళ్ల గడువును పెంచే విషయంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చొరవ తీసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. రైతుల సమస్యలను సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్తామని గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. (చదవండి: శాఖ బాబుది.. సంతకం చినబాబుది) -
తెలంగాణలో ‘తొలకరి’ ఉత్సాహం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రైతాంగం వానాకాలం సాగు కోసం పొలం బాట పడుతోంది. రుతుపవనాల ప్రవేశానికి ముందే తొలకరి జల్లులతో ఈ ఏడాది వర్షాలు బాగానే కురుస్తాయనే ఆశలు రైతుల్లో చిగురిస్తున్నాయి. సాగుకు వీలుగా భూమిని చదును చేసుకుని వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతాంగంలో ఈ తొలకరి జల్లులు కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఇప్పటికే ఏరువాకతో దుక్కి దున్ని, గొర్లు సిద్ధం చేసుకుని, నార్లు పోసుకునేందుకు సిద్ధంగా ఉన్న కర్షకుడు.. గత రెండ్రోజులుగా కురుస్తున్న ఈ వర్షాలు మరో 3, 4 రోజులు కొనసాగితే ఇక పూర్తిస్థాయిలో పొలం బాట పట్టనున్నాడు. బుధ వారం రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురిసిన వర్షాలు మరో రెండ్రోజులు కొనసాగుతాయని, గురువారం 12 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భువనగిరిలో అత్యధికం.. బుధవారం రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. రాజధాని హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లోనూ వర్షపాతం నమోదైందని వాతావరణ గణాంకాలు వెల్లడించాయి. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో అత్యధికంగా 16.9 సెం.మీ వర్షపాతం నమోదైంది. గురు, శుక్రవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ములుగు, వరంగల్ (అర్బన్, రూరల్), యాదాద్రి భువనగిరి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, నల్లగొండ, నాగర్‌కర్నూల్, వనపర్తి, జనగామ జిల్లాల్లో ఒకట్రెండుచోట్ల గురువారం భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం కూడా భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. యాదాద్రి జిల్లా భువనగిరిలో అత్యధికంగా కురిసిన వర్షపాతం - 16.9 సెం.మీ. నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే జిల్లాల సంఖ్య -12 రుతుపవనాల విస్తరణ తమిళనాడులో మిగిలిన ప్రాంతాలు, పశ్చిమ మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలు, త్రిపుర మిజోరంలో కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు బుధవారం విస్తరించాయి. మధ్య అరేబియా సముద్రం, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, రాయలసీమలోని మరికొన్ని ప్రాంతాలు, తెలంగాణ, కోస్తా ఆంధ్రాలో కొన్ని ప్రాంతాలు, మధ్య, ఉత్తర బంగాళాఖాతం, ఈశాన్య భారతదేశంలో మరికొన్ని ప్రాంతాల్లోకి వచ్చే 48 గంటల్లో విస్తరించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాతి 48 గంటల్లో మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ, కోస్తా ఆంధ్ర, బంగాళాఖాతం, ఈశాన్య భారతదేశంలో మిగిలిన ప్రాంతాలు, సిక్కింలోని మొత్తం ప్రాంతాలు, ఒడిశా, పశ్చిమబెంగాల్లోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని వెల్లడించింది. కొనసాగుతున్న అల్పపీడనం తూర్పు, మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పియర్ ఎత్తు వరకు నైరుతి దిశగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది 48 గంటల్లో పశ్చిమ వాయువ్యం దిశగా ప్రయాణించి బలపడే అవకాశం ఉందని, దీని కారణంగానే రాష్ట్రానికి వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం అత్యధిక వర్షపాతం (సెం.మీ.) నమోదైన ప్రాంతాలు జిల్లా గ్రామం/పట్టణం వర్షపాతం యాదాద్రి భువనగిరి 16.9 యాదాద్రి మర్యాల 13.7 ఆదిలాబాద్ పోచర 11.8 యాదాద్రి వెంకిర్యాల 10.5 ఖమ్మం మధిర 9.3 యాదాద్రి యాదగిరిగుట్ట 8.85 ఖమ్మం ఎర్రుపాలెం 8.85 వరంగల్ అర్బన్ కాశీబుగ్గ 8.75 (రంగారెడ్డి, వరంగల్ (అర్బన్/రూరల్ జిల్లాలు), సిద్దిపేట, యాదాద్రి, ఖమ్మం,నిజామాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 7 సెం.మీ. చొప్పున వర్షం కురిసింది) -
‘సార్వా’త్రా సంతోషం..
ఆకివీడు: ఖరీఫ్ పంట పండింది. రైతు ఇంట ఆనందం వెల్లివిరుస్తోంది. ప్రకృతి అనుకూలించకపోయినా, అతివృష్టిలోనూ అధిక దిగుబడుల సాధనలో జిల్లా రైతాంగం విజయం సాధించారు. మెట్ట ప్రాంతంలో మాసూళ్లు పూర్తి కావచ్చాయి. ఇప్పటికే రైతులు ఎకరాకు 40 నుంచి 45 బస్తాల దిగుబడి సాధించారు. కొన్నిచోట్ల ఎకరానికి 53 బస్తాల దిగుబడి వచ్చింది. డెల్టా ప్రాంతంలో కోతలు పారంభమయ్యాయి. వ్యవసాయశాఖ, గంణాంక శాఖ అధికారులు దిగుబడులపై అంచనాలు వేస్తున్నారు. ర్యాండమ్ పద్ధతిలో పంట కోత ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. సరాసరి దిగుబడి 35 బస్తాల నుంచి 40 బస్తాల వరకూ వస్తున్నట్లు అంచనా వేశారు. డెల్టాలో దిగుబడి ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. కొన్ని మండలాల్లో దిగుబడులు భారీగా ఉంటే, చేపల చెరువులు ఉన్న గ్రామాల పరిధిలో దిగుబడి స్వల్పంగా తగ్గిందని రైతులు, వ్యవసాయాధికారులు చెబుతున్నారు. అధిక దిగుబడులు జిల్లాలో ఖరీఫ్‌లో 2,58,118 హెక్టార్లలో వరి సాగు చేపట్టారు. దీనిలో మెట్ట, డెల్టా ప్రాంతాల్లో సాగు ఉంది. ఈ ఏడాది ఖరీఫ్ సాగులో 13 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి లక్ష్యంగా నిర్ణయించగా, లక్ష్యాన్ని అధిగమించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఖరీఫ్‌లో ఎంటీయూ 1061, 1064, 1121, 1156, 1153,సంపత్ వంగడంతో పాటు అక్కడక్కడా స్వర్ణ రకం సాగు చేశారు. ఈ రకాల్లో 1061, 1064 వంగడాలు అధిక దిగుబడులు ఇచ్చేలా కనిపిస్తున్నాయి. అతివృష్టిని అధిగమించి ఈ ఏడాది భారీ వర్షాలు, వరదలతో జిల్లా అతలాకుతలమైంది. ఖరీఫ్ సాగును ఆలస్యంగా చేపట్టిన డెల్టా ప్రాంతంలో వరి సాగుకు తీవ్ర ఇబ్బంది తలెత్తింది. ఒకటి రెండుసార్లు నారు పోసుకోవాల్సి వచ్చింది. వరి పొట్ట, పాలు, పూత దశలో ఉండగా భారీ వర్షాలు కురిశాయి. ఆ తర్వాత తెగుళ్లు వేధించాయి. దోమ విజృంభించింది. అయినా అన్ని ఒడిదుడుకులనూ ఈ సార్వా సమర్థంగా ఎదర్కొంది. దోమ ఉధృతి ఎదురైనప్పుడు రైతులు ఆందోళన చెందకుండా పరిమితికి మించకుండా పురుగు మందులు వినియోగించారు. తూర్పు గాలులకు దోమ తుడిచిపెట్టుకుపోయింది. 8 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు.. ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకూ 8 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. జిల్లాలో 311 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభ్తుత్వం ఏర్పాటు చేసింది. దీనిలో 203 ధాన్యం కొనుగోలు కేంద్రాలను సహకార సంఘాల ద్వారానూ, 108 కేంద్రాలను వెలుగు ప్రాజెక్టు ద్వారా డ్వాక్రా మహిళలకు కేటాయించారు. ఈ ఏడాది ధాన్యం కొనుగోలు కేంద్రాలను గిడ్డంగి సౌకర్యం ఉన్న సొసైటీలకు అధికంగా ఇవ్వడంతో ధాన్యం నిల్వ ఉంచే అవకాశం ఏర్పడింది. వెలుగు కేంద్రాల వద్ద కూడా మార్కెట్ యార్డు గొడౌన్లు, స్థానిక గొడౌన్లను వినియోగించుకుంటున్నారు. డెల్టా ప్రాంతంలో వరి కోతలు మొదలు కావడంతో ధాన్యం ఇకపై ముమ్మరంగా కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ప్రోత్సాహం.. ఈ ఏడాది సార్వా సీజన్లో ప్రభుత్వం రైతులకు అండగా నిలబడింది. కష్టమొచ్చిన ప్రతిసారీ భరోసా ఇచ్చింది. పెట్టుబడి కోసం అక్టోబర్‌లో రైతు భరోసా అందించడంతో అన్నదాతలు కొన్ని ఖర్చులకు ఆ మొత్తాన్ని వినియోగించుకోగలిగారు. అధికారులు కూడా రైతులకు అందుబాటులో ఉంటూ ప్రతికూల పరిస్థితులు తలెత్తిన ప్రతిసారీ సలహాలు, సూచనలు ఇచ్చారు. ఫలితంగా దిగుబడులు ఆశాజనకంగా వచ్చాయి. 40–45 బస్తాల దిగుబడి.. జిల్లాలో ఖరీప్ పంట దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. ఇప్పటికే మెట్టలో 45 బస్తాల పైబడి దిగుబడి వచ్చింది. డెల్టాలో మాసూళ్లు ప్రారంభమవుతున్నాయి. అక్కడక్కడా పంటకోత ప్రయోగంలో సరాసరి 40 బస్తాల దిగుబడి వస్తోంది. అతివృష్టి సంభవించినా వరిసాగుకు నష్టం కలగలేదు. – గౌసియా బేగం, జిల్లా వ్యవసాయాధికారి, ఏలూరు 90 కేంద్రాల్లో కొనుగోళ్లు.. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకూ 8 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. 311 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా 90 కేంద్రాల్లో కొనుగోలు జరుగుతోంది. డెల్టాలో మాసూళ్లు ప్రారంభం కావడంతో ధాన్యం అధికంగా వచ్చే అవకాశం ఉంది. – వర కుమార్, మేనేజర్, జిల్లా పౌరసరఫరాల శాఖ, ఏలూరు 40 బస్తాలొస్తుంది.. ఖరీప్పంట దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రకృతి కరుణించింది. ఎకరానికి 40 బస్తాలు వస్తాయని ఆశిస్తున్నాం. కంకులు బలంగా ఉండటంతో దిగుబడి బాగుంటుంది. – ఎరిచర్ల ప్రభాకరరావు, చెరుకుమిల్లి దిగుబడి బాగుంది.. ఖరీఫ్ దిగుబడి బాగుంది. అధిక వర్షాలకు తీవ్రంగా నష్టం వస్తుందని బాధపడ్డాం. ఆ విధంగా జరగలేదు. నష్టాలను అధిగమించినట్లే. పంట బాగుండటంతో ఆనందంగా ఉంది. – జంపన అర్జునరాజు, కౌలు రైతు, అయిభీమవరం -
రైతన్నల్లో ‘వర్షా’తిరేకం
సాక్షి, విజయనగరం గంటస్తంభం: జిల్లాపై వరుణుడు కరుణచూపాడు. రెండు రోజులుగా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిపించాడు. దీంతో చెరువుల్లో నీరు చేరింది. వరి సాగుపై రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. వరి నాట్లు కాస్త ఆలస్యమైనా.. వెద పద్ధతిలో సాగుచేసిన వరి చేను ఆశాజనకంగా ఉండడం, వర్షానికి పొలాల్లో నీరు చేరడంతో రైతులు సంబరపడుతున్నారు. మరోవైపు రానున్న రోజుల్లో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. దీంతో పంటలకు ఇబ్బంది ఉం డదని, అక్టోబర్‌లో వరుణుడు కరుణిస్తే పంట చేతికి అందుతుందని రైతులు ఆశపడుతున్నారు. రెండు రోజులుగా భారీ వర్షాలు.. రాష్ట్ర వ్యాప్తంగా గురు, శుక్రవారాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధి కారులు ప్రకటించినట్టే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. విజయనగరం జిల్లాలోని సగానికిపైగా మండలాల్లో వర్షించింది. గుర్ల మండలంలో అత్యధికంగా 5.8 సెంటీమీటర్లు, మక్కువలో 4.1 సెంటీమీటర్లు, నెల్లిమర్లలో 3.8, వేపాడ, పూసపాటిరేగ, సీతానగరంలో 3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మిగతా మండలాల్లో ఒకటి, రెండు సెంటీమీటర్ల వర్షం పడిం ది. దీంతో జిల్లాలో సగటున 2.1 సెంటీమీటరు వర్షపాతం నమోదైంది. ఇదిలాఉండగా శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. శని, ఆదివారాల్లో వర్షాలు అంతగా కురవకపోయినా సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తులు నిర్వహణశాఖ అధికారులు జిల్లా అధికారులు వెల్లడించారు. రైతుల్లో హర్షం.. వర్షాలతో పొలాల్లో నీరు చేరింది. పంటలు ఆశాజనకంగా ఉండడంతో రైతులు సంతోషపడుతున్నారు. కలుపుతీత, ఎరువువేయడంలో బిజీ అయ్యారు. వర్షాలకు జలాశయాలు, చెరువులు నిండితే పంట చేతికొస్తుందని ధీమా వ్యక్తంచేస్తున్నారు. వాస్తవానికి ఈ ఏడాది ఖరీఫ్ కొంత నిరాశజనకంగా ప్రారంభమైంది. ఆలస్యంగా వర్షాలు ప్రారంభమయ్యాయి. ఆగష్టు వరకు సరైన వర్షాలు లేవు. అయితే, సెప్టెంబర్ నెల రైతులకు కలిసొచ్చింది. ఇప్పటికే కురవాల్సి వర్షాలు కంటే ఎక్కువ వర్షాలు పడ్డాయి. దీంతో ఈ నెలారంభం నాటికి వేసిన వరి, ఇతర పంటలు సాగుకు భరోసా లభించగా వరినాట్లు వేయని ప్రాంతాల్లో రైతులు వేసుకున్నారు. వరికి ప్రస్తుతం నీరు అవసరమైన సమయంలో వర్షాలు పడుతుండడంతో ఆనందపడుతున్నారు. రానున్న రోజుల్లో మరింత వర్షాలు పడితే ఈఏడాది గంటెక్కినట్లేనని చెబుతున్నారు. ఆనందంగా ఉంది.. వర్షాలు కురుస్తుండడం, పొలాల్లో నీరు చేరడంతో ఆనందంగా ఉంది. ఈ ఏడాది ఖరీఫ్ పంటలు చేతికందవు అనుకున్నాం. గతేడాది మాదిరిగా కరువు తప్పదనుకున్నాం. ఆలస్యంగానైనా వర్షాలు అనుకూలించాయి. రెండురోజులపాటు కురిసిన భారీ వర్షాలతో ధీమా కలిగింది. రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురిస్తే రైతులకు మేలు జరుగుతుంది. – పి.గోపి, పిడిశీల, గజపతినగరం మండలం -
వ్యవసాయ పనుల్లో రైతులు బిజీ..
వారం రోజులుగా జిల్లాలో కురుస్తున్న మోస్తరు వర్షాలతో రైతులు ఆనంద పడుతున్నారు. రెండు నెలలుగా వరుణుడు కరుణించకపోవడంతో దిగాలుగా ఉన్న రైతులు ప్రస్తుతం వ్యవసాయ పనుల్లో బిజీ అయ్యారు. కొందరు ఇప్పటికీ విత్తనాలు వేస్తుండగా.. మరికొందరు గుంటుక తోలుతున్నారు. సాక్షి, మెదక్ : ఈ సీజన్లో ఇప్పటివరకు భారీ వర్షం పడకపోవడంతో చెరువులు, కుంటలు బోసిగానే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ముసురేసిన వాన ఆరుతడి పంటలకు ఊపిరి పోస్తుండగా.. నల్లరేగడి నేలలో వేసిన పత్తికి దెబ్బేనని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు జిల్లాలో ఇప్పటివరకు లోటు వర్షపాతమే నమోదైంది. భారీ వర్షాలు కురిసి జలాశయాలు, చెరువులు, కుంటలు జలకళ సంతరించుకోవడంతోపాటు భూగర్భ జలమట్టం పెరిగితేనే రైతులు ఈ ఖరీఫ్‌లో గట్టెక్కే పరిస్థితులు ఉన్నాయి. లోటు వర్షపాతమే.. జిల్లాలో జూన్ నుంచి ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 8303.3 మిల్లీ మీటర్లు.. ఇప్పటివరకు కురిసింది 7604.2 మి.మీటర్లే. ఈ మేరకు లోటు వర్షపాతం 699.1 మి.మీలు. సగటున లెక్కేస్తే జిల్లాలో సాధారణ వర్షపాతం 415.2 మి.మీలు.. కురిసింది 380.2 మి.మీలు మాత్రమే. అంటే లోటు వర్షపాతం ఎనిమిది శాతం నమోదైనట్లు తెలుస్తోంది. ఐదు మండలాల్లో అత్యల్పం.. జిల్లాలో 20 మండలాలు ఉండగా.. ఏడు మండలాల్లో మాత్రమే సాధారణం కంటే ఎక్కువ కురిసినట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. మిగిలిన 13 మండలాల్లోనూ లోటు వర్షపాతమే నమోదైంది. జిల్లాలో పాపన్నపేట మండలంలో ఇప్పటివరకు అధిక వర్షపాతం 43.7 శాతం నమోదైంది. మొత్తం మూడు మండలాల్లో అధిక, 12 మండలాల్లో సాధారణం, మిగిలిన 5 మండలాల్లో అత్యల్పంగా వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. వరి సాగు పెరిగే అవకాశం.. జిల్లాలో ఈ ఖరీఫ్‌లో సాధారణ సాగు అన్ని పంటలు కలిపి అంచనా 83,373 హెక్టార్లు.. ఇప్పటివరకు 55,109 హెక్టార్లలో రైతులు పంటలు వేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో జిల్లాలో వరి సాగు పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో వరి సాగు అంచనా 34,985 హెక్టార్లు కాగా.. ఇప్పటివరకు 20,000 హెక్టార్లలో రైతులు సాగు చేశారు. వరి నాటేందుకు ఆగస్టు 15 వరకు సమయం ఉందని వ్యవసాయ అధికారులు చెబుతున్న క్రమంలో ఇంకా సుమారు 8,000 హెక్టార్ల మేర సాగు పెరగనున్నట్లు తెలుస్తోంది. అంచనాలు తారుమారు.. రెండు నెలలుగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వ్యవసాయ అధికారులు వేసిన పంట అంచనాలు తారుమారయ్యాయి. ఆరుతడి పంటలకు చెందిన రాగులు, కొర్రలను గతంలో తక్కువగా పండించేవారు. వీటికి వ్యవసాయాధికారులు అంచనా కూడా వేయలేదు. కానీ జిల్లాలో ఇప్పటివరకు పలువురు రైతులు 100 హెక్టార్లలో రాగులు, 110 హెక్టార్లలో కొర్రలు సాగు చేశారు. 600 హెక్టార్లలో జొన్న సాగు చేస్తారనే అంచనా కాగా.. 410 హెక్టార్లలో సాగైంది. అదేవిధంగా.. జిల్లాలో 13,000 హెక్టార్లలో పత్తి సాగవుతుందని భావించగా.. 17,000 హెక్టార్లలో రైతులు పంట వేశారు. 22,000 హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేస్తారని అధికారులు అంచనా వేయగా.. 13500 హెక్టార్లలో మాత్రమే మక్క సాగైంది. పలువురు మక్క రైతులు పత్తి వైపు దృష్టి సారించడంతో జిల్లాలో తెల్లబంగారం సాగు పెరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. తెగుళ్లు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రస్తుతం ప్రతిరోజూ వర్షం కురుస్తోంది. వరి సాగు పెరిగే అవకాశం ఉంది. రేగడి భూముల్లో పత్తి పంట వేసిన వారు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే వేరుకుళ్లు తెగులు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా.. వాతావరణంలో తేమతో పలు పంటలకు అగ్గితెగులు వంటివి సోకుతాయి. ఈ మేరకు రైతులు వ్యవసాయాధికారులు సూచించిన మేరకు జాగ్రత్తలు తీసుకోవాలి. – రెబల్సన్, జిల్లా నోడల్ అధికారి -
రైతు బడ్జెట్
సాక్షి వనపర్తి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ వ్యవసాయరంగానికి ప్రాధాన్యం కల్పించేలా ఉంది. ఈ బడ్జెట్‌ను లోతుగా పరిశీలిస్తే ఇటీవల ఎన్నికల్లో ఇచ్చిన హమీలను నెరవేర్చే ప్రయత్నం చేశారని స్పష్టమవుతోంది. మొత్తం బడ్జెట్ రూ.1,82,017 లక్షల కోట్లు కాగా ఇందులో ప్రగతి పద్దు రూ.లక్ష 7 వేల 302 కోట్లు, నిర్వహణ వ్యయం రూ.74,715 కోట్లుగా కేటాయించారు. ఇప్పటికే సంక్షేమ రంగంలో రాకెట్లా దూసుకెళ్తున్న తెలంగాణ మరింత అభివృద్ధి దిశగా అడుగులు వేయనున్నడంతో దేశంలోని అన్ని రాష్ట్రాల దృష్టి తెలంగాణపై పడింది. మరింత ఆసరా... టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడానికి ఆసరా పింఛన్లే ప్రధాన కారణమనే విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికల హమీల్లో భాగంగా సీఎం కేసీఆర్ పింఛన్ డబ్బులను రెట్టింపు చేశారు. వనపర్తి జిల్లాలో 28,521 మంది వృద్ధులు, 27,705 మంది వితంతువులు, 701 మంది చేనేత కార్మికులు, 460 గీత కార్మికులు, 1004 మంది బీడీ కార్మికులు, 2,604 మంది ఒంటరి మహిళలు ఉన్నారు. వీరికి నెలకు రూ. 1,000 చొప్పున పింఛన్ అందిస్తున్నారు. 11,329 మంది వికలాంగులకు నెలకు రూ.1500 చొప్పున అందిస్తున్నారు. ఏప్రిల్ నెల నుంచి రూ.1000 ఇస్తున్న వారికి రూ. 2016, రూ. 1500 తీసుకుంటున్న వికలాంగులకు నెలకు రూ.3016 ఇవ్వనున్నారు. జిల్లాలో ప్రస్తుతం ప్రతి నెల ఆసరా ఫించన్లకు ప్రభుత్వం రూ.8 కోట్ల 33 లక్షల 78 వేలను ఖర్చు చేస్తోంది. ఇకమీదట ఇది రెట్టింపు కానుంది. పెరిగిన ‘రైతుబంధు’ సాయం తెలంగాణ ప్రభుత్వం 2018 మే నెలలో ప్రారంభించిన రైతుబంధు పథకం కేంద్రంతో పాటు పలు రాష్ట్రాల ప్రభుత్వాలను విశేషంగా ఆకట్టుకుంది. దీనిని ఆదర్శంగా తీసుకునే కేంద్రంలోని మోదీ సర్కార్ ఎకరానికి రూ.6 వేల చొప్పున ఇస్తామని కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకాన్ని రూపకల్పన చేసింది. రైతుబంధు పథకంలో జిల్లాలో రెండో విడతలో 1,30,737 మంది రైతులకు గాను 1,07,528 మంది రైతులకు రూ.117 కోట్ల 51 లక్షల 66 వేలను ఎకరానికి రూ.4 వేల చొప్పున అందించారు. రెండు పంటలకు కలిపి రూ. 8 వేలు చెల్లించారు. ప్రస్తుతం బడ్జెట్లో దానిని రూ.10 వేలకు పెంచారు. దీనివల్ల రైతులకు అదనంగా ఎకరానికి రూ. 2 వేలు అందనున్నాయి. నిరుద్యోగ యువతకు భరోసా.. ఎన్నికల్లో ఇచ్చిన మరో ప్రధానమైన హమీ నిరుద్యోగ భృతి. ఈ పథకం వల్ల డిగ్రీ చదువుకుని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు ఎంతో మేలు చేకూరనుంది. ఈ పథకం అమలుకోసం ప్రభుత్వం బడ్జెట్లో రూ.1,810 కోట్లు కేటాయించింది. ఈ పథకం అమలు కోసం విధి విధానాలను రూపకల్పన చేయాల్సిందిగా అధికారులను ఆదేశించింది. వ్యవసాయరంగానికి పెద్దపీట ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిందనే చెప్పాలి. రైతులను ఆదుకునేందుకు మరోసారి రుణ మాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. బడ్జెట్లో రుణమాఫీ పథకానికి రూ.6000 కోట్లు కేటాయించారు. వనపర్తి జిల్లాలో 3.87 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి 1.52 లక్షల మంది రైతులు ఉన్నారు. 2018 డిసెంబర్ 11వ తేదీ నాటికి బ్యాంకులో వ్యవసాయానికి తీసుకున్న లక్ష రూపాయల వరకు రుణ మాఫీ కానుంది. ఇప్పటికే రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ప్రభుత్వం పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు నడుం బిగించింది. జిల్లాలో ఇప్పటికే వనపర్తి మండలంలోని దత్తాయిపల్లిలో వేరుశనగ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను నెలకొల్పి మహిళలకు స్వయం ఉపాధి కల్పించడంతో పాటు, స్థానికంగా ఎక్కువగా ఉత్పత్తి అయ్యే వేరుశనగకు మంచి మార్కెటింగ్ కల్పించేందుకు కలెక్టర్ శ్వేతామహంతి కృషి చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఇలాంటివి మరిన్ని పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఎన్నికల వేళ సంచలనాత్మక బడ్జెట్!
సాక్షి, న్యూఢిల్లీ: ఊహించినట్టుగానే ఎన్నికల వేళ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో నరేంద్రమోదీ సర్కారు పలు ప్రజాకార్షక పథకాలకు పెద్దపీట వేసింది. అన్ని వర్గాల ఓటర్లను ఆకట్టుకునేవిధంగా సంచలనాత్మకరీతిలో మధ్యంతర బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టింది. తాత్కాలికంగా ఆర్థికమంత్రి బాధ్యతలు నిర్వర్తిస్తున్న పీయూష్ గోయల్ శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక చిట్టాలో ఆద్యంతం ఓటర్ల మనోభావాలను సంతృప్తి పరిచేలా ప్రతిపాదనలు చేశారు. ఎన్నికల వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఓటర్లపై వరాల జల్లు కురిపించారు. ముఖ్యంగా మధ్యతరగతి వేతనజీవులు, రైతులు, అసంఘటిత రంగ కార్మికులు, అంగన్వాడీ టీచర్లు.. ఇలా అన్ని వర్గాలను ఆకర్షించేవిధంగా.. గోయల్ తన బడ్జెట్లో తాయిలాలు కురిపించారు. నూటికి నూరుశాతం ఎన్నికల బడ్జెట్‌ను తలపించేలా గోయల్ చిట్టాపద్దులు సాగాయి. ఎన్నికల ముందు వేతన జీవులకు మోదీ సర్కారు భారీ ఊరటనిచ్చింది. ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని ఏకంగా రెట్టింపు చేస్తూ.. మధ్యతరగతి ఉద్యోగులపై వరాల జల్లు కురిపించింది. ఇప్పటివరకు వార్షికాదాయం రూ. 2.50 లక్షలు దాటితే ఉద్యోగులు పన్ను కట్టాల్సి ఉండగా.. ఇప్పుడు ఆ పరిమితిని ఏకంగా రూ. 5 లక్షలకు పెంచుతూ మోదీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక, అదేవిధంగా గృహరుణాలు, ఇంటి అద్దెలు, ఇన్సురెన్స్‌లు కలిపి 6.50 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను ఉండబోదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న మూడు కోట్ల మంది మధ్యతరగతి ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ఇక, స్టాండర్డ్ డిడక్షన్ రూ.50 వేలకు పెంచినట్టు ప్రకటించిన గోయల్.. పొదుపు ఖాతాలపై వచ్చే వడ్డీ 10 వేల నుంచి 40 వేలకు పెంచుతున్నట్టు తెలిపారు. నెలకు 50 వేల జీతం వరకు టీడీఎస్ వర్తించబోదని, సొంతిల్లు అద్దెకు ఇస్తే వచ్చే ఆదాయంపై రూ. 2.50 లక్షల వరకు పన్ను ఉండదని స్పష్టం చేశారు. ఇవన్నీ మధ్యతరగతి ఓటర్లను సంతృప్తిపరిచే నిర్ణయాలే కావడం గమనార్హం. రైతులకు ఆర్థిక చేయూత వ్యవసాయ రంగంలో తీవ్ర సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు మోదీ సర్కారు ముందుకొచ్చింది. ఎన్నికల నేపథ్యంలో అన్నదాతలను తమవైపు తిప్పుకునేందుకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరిట ఒక కొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం ద్వారా చిన్నసన్నకారు రైతులకు ఏడాదికి రూ. 6వేల నగద సాయం నేరుగా అందజేస్తామని, ఐదెకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల ఖాతాలకు ఈ నగదును మళ్లిస్తామని గోయల్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఈ పథకం కోసం రూ. 75 వేల కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు తెలిపారు. మూడు విడతల్లో నగదు అందజేస్తామని, 2018 డిసెంబర్ నుంచి ఈ పథకం అమల్లో ఉంటుందని, తొలి విడతగా రూ.2వేల సాయం తక్షణమే రైతులకు అందజేస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేకుండా ఈ నగదు నేరుగా రైతుల ఖాతాలోకి మళ్లిస్తామని చెప్పారు. ఈ పథకంతో దేశవ్యాప్తంగా ఉన్న 12 కోట్ల రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇక, కిసాన్ క్రెడిట్ కార్డుల కింద రుణాలు అందిస్తామని, రుణాలు సకాలంలో చెల్లించినవారికి రాయితీలు చెల్లిస్తామని పేర్కొంది. ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయిన రైతుల రుణాల రీషెడ్యూల్ చేస్తామని హామీ ఇచ్చింది. పాడి పరిశ్రమ రుణాలు సకాలంలో చెల్లించే వారికి అదనంగా మూడు శాతం వడ్డీ రాయితీ ఇస్తామని చెప్పారు. అసంఘటిత రంగ కార్మికులకూ భారీ ఊరట.. దేశంలోని అసంఘటితరంగ కార్మికులకూ మోదీ సర్కారు తన మధ్యంతర బడ్జెట్లో భారీ ఊరటనిచ్చింది. ప్రధానమంత్రి శ్రమయోగి బంధన్ పేరుతో అసంఘటిత కార్మికులకు పింఛన్ పథకాన్ని కేంద్రం ప్రకటించింది. 60 ఏళ్లు నిండిన వారందరికీ ప్రతి నెలా రూ.3వేలు పింఛన్ వచ్చే విధంగా ఈ పథకం రూపొందించారు. ఈ పథకంలో భాగంగా నెలకు రూ.100 చొప్పున ప్రీమియం చెల్లిస్తే 60 ఏళ్ల దాటిన తర్వాత రూ.3వేల పింఛన్ పొందవచ్చు. అసంఘటిత రంగంలోని 10 కోట్లమంది కార్మికులకు ఈ పథకం వర్తించనుంది. ఇక ఉపాధి అవకాశాలు మెరుగుపరడటంతో ఈపీఎఫ్‌వో సభ్యులు పెరిగారని, ఈపీఎఫ్‌వో బోనస్ పరిమితిని 21వేలకు పెంచుతున్నట్టు గోయల్ తెలిపారు. గ్రాట్యూటీ పరిధిని 10 లక్షల నుంచి 30 లక్షల పెంచారు. ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలు కార్మికులు, ఉద్యోగులకు అందాలని ఈ సందర్భంగా గోయల్ పేర్కొన్నారు. ఎన్పీఎస్ విధానంలో ప్రభుత్వ వాటాను 14 శాతానికి పెంచుతున్నట్టు తెలిపారు. అదేవిధంగా 2022 నాటికి ప్రతి ఒక్కరికి ఇళ్లు, దేశవ్యాప్తంగా అత్యంత వెనుకబడిన 150 జిల్లాలపై ప్రత్యేక దృష్టి, దేశంలో ప్రస్తుతం 21 ఎయిమ్స్, త్వరలోనే హరియాణలో 22వ ఎయిమ్స్ ఏర్పాటు, అంగన్వాడీ టీచర్ల జీతం 50 శాతం పెంపు, ఈఎస్ఐ పరిధి 15 వేల నుంచి 21 వేలకు పెంపు తదితర ప్రతిపాదనల ద్వారా మధ్యంతర బడ్జెట్లో మోదీ సర్కారు సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసినట్టు కనిపిస్తోంది. అయితే, ఇది నూటికి నూరుపాళ్లు ఎన్నికల బడ్జెట్ అని, నాలుగేళ్లు ప్రజాసంక్షేమ పథకాలు అమలు చేయని మోదీ సర్కారు.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే.. ఈ విధంగా అన్నివర్గాల వారికీ తాయిలాలు ప్రకటించిందని, ఇది ఎన్నికల గిమ్మిక్కు అని విపక్షాలు కొట్టిపారేస్తున్నాయి. -
రైతులపై వరాల జల్లు కురిపించనున్నమోదీ సర్కార్?
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రైతులపై వరాల జల్లు కురిపించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రతిపాదనల అమలుకు ఆమోదానికి మొగ్గు చూపనుందని తెలుస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన వ్యవసాయం రంగంలో నెలకొన్న సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు స్వల్ప, దీర్ఘకాలిక పరిష్కాలను మంత్రిత్వ శాఖ కేంద్రానికి సూచించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన తుది నిర్ణయం కేబినెట్ సమావేశంలో తీసుకోనున్నారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకుగాను వడ్డీ మినహాయింపు, ఇన్సూరెన్స్ ప్రీమియం మాఫీ, నగదు బదిలీ లాంటి ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించేలా నిర్ణయాలు ఉండొచ్చని విశ్వసనీయ వర్గాలు సమాచారం. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సఫర్ ద్వారా ఎకరానికి సీజనుకు 4వేల రూపాయలను అందించే పథకాన్ని ప్రకటించనుంది. అంటే తెలంగాణ, ఒడిశా ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాల మాదిరిగా రైతు బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమచేయడం. దీని వల్ల ప్రభుత్వానికి అదనంగా ఏడాదికి రూ. 2లక్షల కోట్ల భారం పడనుంది. అలాగే రైతు రుణాలపై వడ్డీ మినహాయింపు కీలకమైనదిగా తెలుస్తోంది. లక్ష రూపాయల దాకా వడ్డీలేని రుణ సదుపాయాన్ని కల్పించనుంది. ప్రస్తుతం రుణాలపై అతి తక్కువగా 4శాతం వడ్డీని చెల్లిస్తున్నారు. అలాగే ఆహార పంటలకు తీసుకున్న ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని పూర్తిగా మాఫీ చేయడం మరో ప్రతిపాదన. కాగా 2019-20 మధ్యంతర బడ్జెట్ కంటే ముందే రైతులకు ప్రత్యేక ప్యాకేజ్ ఉంటుందంటూ వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ వ్యాఖ్యలు అంచనాలను మరింత బలాన్నిస్తున్నాయి. -
ముహూర్తం ఖరారు
యాసంగి పంటలకు పెట్టుబడి సాయం పంపిణీకి ముహూర్తం ఖరారయ్యింది. సోమవారం నుంచి పంపిణీ ప్రారంభం కానుంది. ఈసారి చెక్కుల రూపంలో కాకుండా నేరుగా రైతుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేయనున్నారు. ఈ పథకం ద్వారా జిల్లాలో లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. సాక్షి, కామారెడ్డి: రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా ఏటా రెండు పంటలకు ఎకరాకు రూ.4 వేల చొప్పున అందిస్తున్నారు. ఖరీఫ్‌లో రైతులకు చెక్కుల రూపంలో అందించారు. ప్రస్తుతం ఎన్ని కల కోడ్ అమలులో ఉన్నందున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు జమ చేయాలని నిర్ణయించారు. దీంతో వ్యవసాయ అధికారులు రైతుల బ్యాంకు ఖాతాల వివరాలు సేకరిస్తున్నారు. జిల్లాలో 2,07,611 మంది రైతులకు యాసం గిలో రూ. 176 కోట్ల పెట్టుబడి సాయం అందించా ల్సి ఉంది. వ్యవసాయ శాఖ అ«ధికారులు ఇప్పటివరకు 60 వేల మంది రైతుల బ్యాంకు ఖాతా నంబర్లను సేకరించారు. అయితే ప్రభుత్వం ఈ నెల 22 నుంచి రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం సొమ్మును జమ చేయడానికి నిర్ణయించింది. జిల్లాలో తొలిరోజు 6,133 మంది రైతుల ఖాతాల్లో రూ. 6.25 కోట్లు జమ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. రోజు కొన్ని ఖాతాల చొప్పున రైతుల ఖాతాల్లో పెట్టుబడి సొమ్ము జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 60 వేలమంది వివరాలు మాత్రమే.. ఖరీఫ్ సీజన్లో రైతులకు పెట్టుబడి సాయాన్ని చెక్కులద్వారా పంపిణీ చేశారు. రైతులు చెక్కులను బ్యాంకులకు తీసువెళ్లి డ్రా చేసుకున్నారు. అయితే ఈసారి కూడా చెక్కుల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. కానీ ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో చెక్కుల పంపిణీకి ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వలేదు. దీంతో రైతుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేయాలని నిర్ణయించారు. చాలా మంది రైతులకు అప్పు కోసం తీసుకున్న ఖాతాలే ఉన్నాయి. కొందరికి మాత్రమే సేవింగ్స్ ఖాతాలున్నాయి. దీంతో రైతుల నుంచి బ్యాంకు ఖాతా నంబర్ల సేకరణ వ్యవసాయ శాఖకు కొంత ఇబ్బందికరంగా తయారైంది. రైతులు బ్యాంకులకు వెళ్లి కొత్త ఖాతాలు తీయడానికి సమయం పడుతుండడంతో ఇప్పటి వరకు కేవలం 60 వేల ఖాతాలు మాత్రమే వ్యవసాయ శాఖ సేకరించగలిగింది. రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను ఈ నెల 25 లోగా సేకరించడం పూర్తయితే ఈ నెలాఖరులోపు అందరి ఖాతాల్లో పెట్టుబడి సాయం డబ్బులు జమ చేసే అవకాశాలుంటాయి. సాగు చేసేవారికి అందిస్తేనే.. ఎకరాకు రూ.4 వేల చొప్పున ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. గత ఖరీఫ్ సీజన్లో రైతుబంధు పథకం మొదలైంది. యాసంగితో రెండో విడత పంపిణీ జరుగుతోంది. అయితే పెట్టుబడి సాయం పెద్ద రైతులకే ఎక్కువగా మేలు చేస్తోందన్న అభిప్రాయం చిన్న, సన్నకారు రైతుల్లో ఉంది. జిల్లాలో అత్యధికంగా చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. వారిలో ఎకరం, ఎకరంనర, రెండెకరాలు ఉన్న రైతులు 80 శాతంపైనే ఉన్నారు. అయితే పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసి, పడావుగా వదిలేసిన వారికి రూ.లక్షల్లో పెట్టుబడి సాయం అందుతుండడంపై రైతులు పెదవి విరుస్తున్నారు. పంట సాగు చేసేవారికి సాయం అందించకుండా భూములు పెద్ద ఎత్తున కొనుగోలు చేసి వృథాగా వదిలేసిన వారికి ఇవ్వడం వల్ల ప్రజాధనం వృథా అవుతోందన్న అభిప్రాయం ఉంది. అలాగే కౌలు రైతులకు ఈ పథకం వర్తించకపోవడంతో వారు నష్టపోతున్నారు. తమకు కూడా పెట్టుబడి సాయం అందించాలని కౌలు రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
సేకరణ లక్ష్యం
సాక్షి, వరంగల్ రూరల్: అన్నదాతలు ఆరుగాలం కష్టించి పండించిన పంటలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో ఖరీఫ్‌లో పండించిన ధాన్యం కొనుగోలు చేయడానికి శ్రీకారం చుట్టనున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే కలెక్టర్ ముండ్రాతి హరిత, జేసీ మహేందర్ రెడ్డి అధికారులతో సమీక్షలు నిర్వహించారు. జిల్లాలో 102 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో పీఏసీఎస్–67, ఐకేపీ–33, జీజేసీ–2 ఏర్పాటు చేయనున్నారు. ఖరీఫ్‌లో 20 వేల హెక్టార్లలో వరి సాగు చేశారు. దిగుబడి దాదాపు 1.35 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ధాన్యం ఏ గ్రేడ్‌కు రూ.1,770, సాధారణ రకం రూ.1,750 ధరను ప్రభుత్వం నిర్ణయించింది. లక్ష టన్నులు కొనుగోలు లక్ష్యంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. రెండు రోజుల్లోనే డబ్బులు... గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన తర్వాత డబ్బుల కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. దీంతో అన్నదాతలు గత్యంతరం లేక ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు పంటలను విక్రయించేవారు. ప్రభుత్వం గత విధానాలకు స్వస్తి పలుకుతూ రెండు, మూడు రోజుల్లోనే అన్నదాతలకు డబ్బులు అందజేసేలా చర్యలు తీసుకోనున్నారు. ధాన్యం కొనుగోలు చేసే మహిళా సంఘాలకు ట్యాబ్‌లు అందజేసి, కొనుగోళ్లు ఏ విధంగా చేయాలి, వివరాల క్రోడీకరణ, బ్యాంకు ఖతాల సేకరణ వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. గతంలో కేంద్రాల్లో పంటను విక్రయించిన అన్నదాతల వివరాలను ఖాతాల్లో నిక్షిప్తం చేశారు. లాగిన్‌లో రైతు వివరాలు పొందుపర్చిన తర్వాత పౌరసరఫరాల సంస్థకు వివరాలను అందజేస్తారు. అనంతరం డీఎం రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఆన్లైన్లో జరగడంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. 26.50 లక్షల గన్నీ బ్యాగులు ఈ సారి 26.50 లక్షల గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచబోతున్నారు. గన్నీ బ్యాగుల కొరతతో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగానే 9.50 లక్షల బ్యాగులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించేందుకు తూకం మిషన్లు, గన్నీ బ్యాగుల కోసం ఐదుగురు కాంట్రాక్టర్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు.17 లక్షల బ్యాగులు ఇంకా రావాల్సి ఉంది. ఆరబెట్టి తీసుకురావాలి.. రైతులు పంట పొలం నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకురాకుండా ఆరబెట్టి తీసుకురావాలి. 17 శాతం కంటే ఎక్కువ తేమ ఉండకుండా తీసుకరావాలని అధికారులు అంటున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టకుండ తమ పొలాల వద్దనే ఆరబెట్టుకుని తీసుకరావాలని అధికారులు సూచిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాట్లు చేస్తున్నాం.. నవంబర్ మొదటి వారం నుంచి పంట చేతి కొస్తుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశాం. ఈ సారి రెండు రోజుల్లోనే డబ్బులు రైతులకు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. 17 శాతం కంటే ఎక్కువ తేమ ఉంటే కొనుగోలు చేయరు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాం. రైతులకు నేరుగా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వస్తాయి. –వెంకటేశ్వర్లు, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ -
ఆనంద‘సాగు’రం
ఖమ్మంఅర్బన్: జిల్లాలోని రైతులకు..ముఖ్యంగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ (ఎన్నెస్పీ) కాల్వల పరిధిలో పంటలను సాగు చేసేవారికి ఈ ఏడాది సాగునీరు పుష్కలంగా అందనుంది. ఇప్పటికే ప్రాజెక్ట్ నిండుకుండలా మారడంతో రెండు పంటలకు జలాలు విడుదల చేసేందుకు ఢోకా లేదని అధికారులు ప్రకటించడంతో...జిల్లా రైతులు పంటల తడులకు ఇబ్బంది ఉండదని ఆనందసాగరంలో ఉన్నారు. మొత్తం 21మండలాలు ఉండగా..17 మండలాల పరిధిలో సాగర్ ప్రధాన కాల్వ పారుతోంది. ప్రత్యక్షంగా రెండు లక్షల 50వేల ఎకరాల వరకు సాగు అవుతుండగా, పరోక్షంగా మరో లక్ష ఎకరాలకు చెరువులు, కుంటలు, వాగులు, బావుల్లో నీరు ఊరి..సాగు కష్టాలు తీరతాయి. సాగర్ ఎడమకాల్వ మొత్తానికి ఈఏడాది 132 టీఎంసీల నీరు సాగు, తాగు నీటి అవసరాలకు విడుదల చేయాలని నిర్ణయించారు. దాంట్లో 99టీఎంసీలు తెలంగాణకు, మిగిలిన టీఎంసీలు ఏపీకి విడుదల చేసేందుకు నిర్ణయించారు. ఖరీఫ్‌లో ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో 45 టీఎంసీలు విడుదలకు నిర్ణయించగా మన జిల్లాలోని ఆయకట్టుకు 20 టీఎంసీలు వాడుకోనున్నారు. దీని ద్వారా ఖమ్మం ఎన్నెస్పీ సర్కిల్ పరిధిలో మొత్తంగా లక్షా 26 వేల ఎకరాల వరకు వరి పైర్లకు, లక్షా 28 వేల ఎకరాల్లో ఆరుతడి పంటలైన మిర్చి, పత్తి, మొక్కజొన్న, చెరకు, ఇతరత్రా కూరగాయలు సాగుకు నీరందనుంది. చుక్కనీరు వృథా కాకుండా..ఆయకట్టు చివరి భూములవరకు సాగు నీరు అందించేందుకు ప్రణాళిక ప్రకారం వ్యవహరించాలని ఇటీవల జరిగిన ఇంజినీర్ల సమావేశంలో ఎన్నెస్పీ ఎస్ఈ సుమతీదేవి సూచించారు. గతేడాది నిరాశే.. జిల్లాలోని 16–17 బ్రాంచ్కాల్వ, బోనకల్, మధిర బ్రాంచ్ కాల్వల పరిధిలోని రెండు వేల కిలోమీటర్ల మేజర్లు, మైనర్లు, సబ్ మైనర్ కాల్వల ద్వారా రైతుల పంట భూములకు సాగర్ నీరు అందిస్తుంటారు. గతేడాది ఖరీఫ్‌కు సాగర్ నీరు విడుదల చేయలేదు. అయినా కొంతమంది రైతులు మొండిగా..పంటలు వేసి, నీరందక ఇబ్బంది పడుతుండడంతో మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వరరావులు ఆయకట్టుకు అక్టోబర్ నెలలో జలాలు విడుదల చేయించారు. అదీ..వారబందీ విధానంతో అమలు చేశారు. తర్వాత రబీ సాగుకు కూడా 9రోజులు ఆన్, 6 రోజులు ఆఫ్ విధానంలో మొత్తం 8తడుల నీరు క్రమపద్ధతిలో అందించడంతో గండం తొలగింది. ఈఏడాది ఖరీఫ్‌కు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సాగునీటి కష్టం ఉండబోదు. గత నెలలో మిర్యాలగూడెంలో జరిగిన ఎన్నెస్పీ, ఆయకట్టు పరిధి రైతుల సంయుక్త సమావేశంలో జిల్లా నుంచి హాజరైన మాజీ నీటి సంఘాల చైర్మన్లు..గతేడాది రబీ తరహాలోనే వారబందీ విధానంలో విడుదల చేసినా సరిపోతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. తద్వారా తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ దిగుబడి కూడా వచ్చిందని వివరించారు. అయితే..నీటి నిల్వలు పుష్కలంగా ఉండడంతో ఇంజినీర్లు మాత్రం నిరంతరాయంగా మొదటి తడి వరకే ఇవ్వడానికి నిర్ణయించారు. వారబందీ విధానం ద్వారా అయితేనే నీటి వినియోగం తక్కువగా ఉంటుందని, పైగా దిగుబడి పెరగడంతోపాటు, తర్వాత కాలంలో రబీ సాగు, విద్యుత్ తయారీ, తాగు నీటి అవసరాలకు సాగర్ నీరు ఉపయోగ పడుతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎంతో ఆనందంగా ఉంది.. గత 20రోజుల కిందట కూడా సాగర్ ఆయకట్టు పరిధిలో నీళ్లిస్తారో లేదోనని భయం భయంగా ఉన్నాం. ఇప్పుడు ప్రాజెక్ట్‌లోకి నీరు పుష్కలంగా చేరడంతో మా చింత తీరింది. నీళ్లొస్తే..బోర్లు, బావుల్లో ఊట పెరుగుద్ది. ఆయకట్టు పరిధిలోని పంటలకు డోకా ఉండదు. – మంకిన వెంకటేశ్వర్లు, చెన్నారం రైతు నేలకొండపల్లి మండలం -
కృష్ణమ్మ వస్తోంది..
రైతులు.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కృష్ణమ్మ పరవళ్లు మొదలయ్యాయి. శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో సాగర్‌వైపు కృష్ణమ్మ పరుగులిడుతోంది. శ్రీశైలానికి ఎగువ నుంచి 3లక్షల క్యూసెక్కులకు పైగా నీరు వచ్చి చేరుతుండడంతో దిగువకు 2లక్షల క్యూసెక్కులకుపైగా నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో మరికొద్ది రోజుల్లో ఆశల సాగరం నిండనుందని ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జునసాగర్ (నల్గొండ) : శ్రీశైలం జలాశయం ఆరుగేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్ వైపుగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువనుంచి శ్రీశైలం జలాశయానికి 3,08,217 క్యూసెక్కుల నీరు వస్తుండడంతో విద్యుదుత్పాదన కేంద్రాలతో పాటు ఆరుగేట్ల ద్వారా 2,32,912 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఒక్కోగేటును నాలుగు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. శ్రీశైలం జలాశయం నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకునేందుకు మరో మూడు అడుగులు మాత్రమే ఉంది. సాగర్ జలాశయం నీటిమట్టం శనివారం ఏడుగంటలకు 532.20 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. గత రెండు రోజులతో పోలిస్తే జలాశయ నీటిమట్టం శరవేగంగా పెరుగుతోంది. కృష్ణాపరీవాహక ప్రాంతాలైన కర్నాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు ఎగువనున్న ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. అదనంగా వచ్చే ప్రతినీటి బొట్టును దిగువకు వదులుతున్నారు. దీంతో ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, తుంగభద్రతో పాటు శ్రీశైలం జలాశయం నిండుకుండలా తొణికిసలాడుతున్నాయి. ఎగువనుంచి అన్ని ప్రాజెక్టులకు సగటున నిత్యం లక్షన్నర క్యూసెక్కులకు పైచిలుకు నీరు వచ్చి చేరుతుండగా అంతేమోతాదులో దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయానికి గత యేడాదితో పోలిస్తే ముందస్తుగానే నీరు వచ్చి చేరుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకునే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. సాగర్ ప్రస్తుత పరిస్థితి.. ప్రస్తుతం సాగర్‌లో 172.4730 టీంసీల నీరుంది. గరిష్ట నీటిమట్టానికి చేరుకుంటే జలాశయంలో 312.24టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవాలంటే మరో 140టీఎంసీల నీరు వచ్చి చేరాల్సి ఉంటుంది. నిత్యం రెండు లక్షల క్యూసెక్కుల నీరు 8రోజులపాటు వస్తే సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోనుంది. జాలరులు, రైతులు అప్రమత్తంంగా ఉండాలి జలాశయంలోకి నీరు వచ్చి చేరుతుండడంతో జలాశయంతీరం వెనుకభాగంలో ఉండే జాలరులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని డ్యాం అధికారులు హెచ్చరిస్తున్నారు. జలాశయంలో నీరు లేని సమయంలో రైతులు పంటలు వేస్తారు. నీటిగుంతల్లో మోటార్లు పెట్టి నడుపుతారు. ఒకేసారి నీరు పెరగడంతో పంటచేలు మునగడంతో పాటు మోటార్లు నీటిమునగనున్నాయి. వాటిని వెంటనే ఒడ్డుకు చేర్చుకోవాలని అధికారులు హెచ్చరించారు. అలాగే జాలరులు నీటికి అడ్డంగా వలలు వేయ వద్దని కొట్టుకుపోయే అవకాశలున్నాయని, నివాసాలను జలాశయంలోనుంచి ఒడ్డుపైకి మార్చుకోవాలని సూచించారు. ఏదిఏమైనా శ్రీశైలం గేట్లు ఎత్తడం.. సాగర్ వైపు కృష్ణమ్మ పరుగులు పెట్టడంతో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 22నుంచి నీటి విడుదల ఖరీఫ్ పంటల సాగుకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో.. ఆరు విడతలుగా 69 రోజులపాటు మొదటి, రెండో జోన్లకు విడుదల 40 టీఎంసీల నీరు కేటాయింపు మిర్యాలగూడ : నాగార్జునసాగర్ ఎడమ కాలు వకు 2018 ఖరీఫ్ పంటల సాగుకు గాను విడతల వారీగా నీటిని విడుదల చేయనున్నట్లు ఎన్ఎస్పీ మిర్యాలగూడ ఒ అండ్ ఎం సర్కిల్ ఎస్ఈ నర్సింహ వెల్లడించారు. శనివారం స్థానికంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఖరీఫ్‌లో నీటి లభ్యత ఆధారంగా ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో ఎడ మ కాలువకు 40 టీఎంసీల నీటిని కేటాయించినట్లు తెలిపారు. మిర్యాలగూడ, ఖమ్మం సర్కిల్ పరిధిలో మొత్తం 6.25 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని, నల్లగొండ జిల్లాలో 1,45,720 ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 2,29,961 ఎకరాల ఆయకట్టు ఉన్నట్లు పేర్కొన్నారు. ఖరీఫ్‌లో విడుదల చేసే నీరు మొదటి జోన్, రెండో జోన్‌కు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 510 అడుగుల కంటే తక్కువగా నీరుంటే సాగు అవసరాలకు ఇవ్వవద్దని ఉన్నందున ఇప్పటివరకు విడుదల చేయలేదని తెలిపారు. కానీ ప్రస్తుతం సాగర్ జలాశయంలో 531.30 అడుగుల మేర 170.696 టీఎంసీ నీరుందన్నారు. దాంతో ఖరీఫ్‌లో ఎడమ కాలువకు సాగు అవసరాలకు గాను 40 టీఎంసీలు కేటాయించామని, ఆరు విడతలుగా నీటిని 69 రోజుల పాటు విడుదల చేయనున్నట్లు వివరించారు. నవంబర్ 28 వరకు.. ఈ నెల 22వ తేదీనుంచి నవంబర్ 28వ తేదీ వరకు ఆరు విడతలుగా ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో విడుదల చేయనున్నట్లు ఎస్ఈ నర్సింహ పేర్కొన్నారు. మొదటి విడుతలో వరినాట్లు వేసుకునే వీలు కోసం 24రోజుల పాటు నిరంతరంగా నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ఆరు రోజుల పాటు నీటిని నిలిపివేసి తొమ్మిది రోజులపాటు విడుదల చేయనున్నామన్నారు. చివరి ఆయకట్టు వరకు నీటిని అందించడానికి గాను నీటి పారుదల శాఖ అధికారులు టెయిల్ టు హెడ్ పద్ధతి ద్వారా నీటిని అందించనున్నట్లు తెలిపారు. ఆన్ అండ్ ఆఫ్ పద్ధతికి రైతులంతా సహకరించాలని ఆయన కోరారు. కాలువకు గండ్లు పెట్టకుండా నీటిని వినియోగించుకోవాలని, నీటిని వృథా చేసి చివరి దశలో ఇబ్బందులు పడవద్దని కోరారు. 20న సమావేశం.. సాగర్ ఎడమ కాలువకు ఖరీఫ్ నీటి విడుదల ప్రణాళికపై వర్క్‌షాప్ నిర్వహించనున్నట్లు ఎన్ఎస్పీ ఎస్ఈ నర్సింహ తెలిపారు. 20వ తేదీన మధ్యాహ్న రెండు గంటలకు లక్ష్మి కల్యాణమండపంలో ఈ సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు, రైతు సమన్వయ కమిటీ కోఆర్డినేటర్లు, మాజీ డీసీ, నీటి వినియోగదారుల సంఘ సభ్యులు పాల్గొనాలని కోరారు. -
పైరుకు ప్రాణం!
మహబూబ్‌నగర్ రూరల్ : కళ్లు కాయలు కాచేలా రైతులు ఎదురుచూసిన వానలు కాస్త ఆలస్యంగానైనా వచ్చాయి. నెల రోజులుగా వర్షాధార పంటలు వాడుపట్టిపోయాయి. పంటలపై ఆశలు వదులుకుంటున్న తరుణంలో వరుణుడు ఎట్టకేలకు రైతులపై కరుణ చూపాడు. రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ముసురు వర్షాలు కురుస్తుండటంతో రైతుల కళ్లల్లో ఆనంద బాష్పాలు కనిపిస్తున్నాయి. పలుగుపార పట్టి పొలానికి పరులుగు పెడుతున్నారు. కూలీలకు సైతం చేతినిండా పని దొరికింది. వర్షాధారమే అధికం.. సాధారణంగా జిల్లాలో ఖరీఫ్ పంటల సేద్యం ఎక్కువగా వర్షాధారంపైనే ఉంటుంది. అయితే జి ల్లాలో ఇప్పటి వరకు వర్షాలు సమృద్ధిగా కురియక పోవడంతో ఖరీఫ్ సేద్యం డోలాయమానంలో పడింది. ఇతర రాష్ట్రాలు, జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో ఆ ప్రభావం జిల్లాపై పడి ముసురు పట్టింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కురిసిన ఓ మోస్తారు వర్షానికి రైతన్నకు ఉపశమం కలిగించింది. మెట్ట పంటలు ప్రాణం పోసుకున్నాయి. పొలాలకు ఉరుకులు.. పరుగులు నెల రోజులుగా చినుకు రాలక వాడుపట్టిన పంటల కు ఈ వర్షం ప్రాణం పోసింది. ముఖ్యంగా పత్తి, మొక్కజొన్న, కందులు పలు వాణిజ్య పంటలకు మేలు జరిగింది. కురిసిన వర్షంతో రైతన్న పొలంబా ట పట్టారు. పత్తి పంటకు ఎరువులు వేస్తున్నారు. ముఖ్యంగా కంది పైరుకు జీవం పోసింది. కానీ ఈ వర్షం వరి పంటకు ఏ మాత్రం సరిపోదు. ఇంకా వ ర్షాలు బాగా పడితేనే ప్రయోజనం చేకూరుతుంది. అత్యధికంగా బాలానగర్‌లో.. జిల్లాలో అత్యధికంగా బాలానగర్ మండలంలో 73.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇంత పెద్దమొత్తంలో ఇక్కడే వర్షం ఎక్కువగా కురిసింది. అలాగే అతితక్కువగా క్రిష్ణ మండలంలో 9.8 మి.మీ వర్షపాతం నమోదైంది. దామరగిద్ద మండలంలో 29.2 మి.మీ, నారాయణపేటలో 22.2 మి.మీ, ఊట్కూర్‌లో 15 మి.మీ, మాగనూర్‌లో 10 మి.మీ, మక్తల్‌లో 13 మి.మీ, నర్వలో 10 మి.మీ, చిన్నచింతకుంటలో 10 మి.మీ, మరికల్లో 10 మి.మీ, దేవరకద్రలో 15.2 మి.మీ, కోయిలకొండలో 14.2 మి.మీ, మద్దూరులో 31.0 మి.మీ, కోస్గిలో 50.2 మి.మీ, గండీడ్‌లో 47.6 మి.మీ. హన్వాడలో 34.0 మి.మీ, మహబూబ్‌నగర్‌లో 20.5 మి.మీ, దేవరకద్రలో 16.8 మి.మీ, అడ్డాకులలో 18.0 మి.మీ, ముసాపేటలో 20.5 మి.మీ, భూత్పూర్లో 26.2 మి.మీ, మహబూబ్‌నగర్ అర్బన్‌లో 34.6 మి.మీ, నవాబుపేటలో 59.6 మి.మీ, రాజాపూర్‌లో 63.5 మి.మీ, జడ్చర్లలో 30.2 మి.మీ, మిడ్జిల్‌లో 39.2 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. జిల్లాలో సగటున సరాసరి 27.9 మి.మీ వర్షపాతం నమోదైంది. పెసరకు నష్టం ముసురు వర్షాలు మెట్ట, వరి పంటలకు మేలు చేకూరినా పెసర పంటకు మాత్రం నష్టం కలిగించేలా ఉంది. ముసురు వర్షం వస్తే పెసరకు నష్టం వాటిల్లుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ పంట నారాయణపేట, దామరగిద్ద మండలాల్లో ఎక్కువ గా సాగుచేస్తారు. జిల్లాలో వేరే ప్రాంతాల్లో ఈ పం ట సేద్యం అంతగా ఉండదు. కొన్ని రోజులుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడం.. చివరగా ముసురు పట్టడంతో పెసర దిగుబడి ఆశించేలా వచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఇదిలాఉండగా జిల్లాలో ఈ ఖరీఫ్‌లో 33,089 హెక్టార్లలో వరి సాగుకు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 18,014 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. జిల్లాలో అన్ని పంటలు కలిపి 2,42,508 హెక్టార్లలో సేద్యం చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 2,27,972 హెక్టార్లలో సాగులో ఉంది. మహబూబ్‌నగర్ రూరల్ మండలం బొక్కలోనిపల్లిలో వరి నాట్లు వేస్తున్న కూలీలు అంతా దేవుడి కరుణే.. ఈ యేడు వర్షాలు సరిగా రాలేదు. నాలుగున్నర ఎకరాల్లో వరి, జొన్న పంటలు సాగు చేశాను. ఈ పంటలన్నీ ఎండిపోయినయి. కష్టమంతా పాయే..అని ఆశలు వదులుకున్నాం. కానీ వరుణదేవుడు కరుణించాడు. పంటలకు ప్రాణం పోశాడు. ఇలాంటి పెద్దవర్షం ఇంకా పడితేనే ప్రయోజనం. – జంగం దాసు, రైతు, బొక్కలోనిపల్లి -
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
మదనాపురం (కొత్తకోట): రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. సరళాసాగర్ ప్రాజెక్టు నుంచి ఖరీఫ్ పంట అవసరాల కోసం ఎమ్మెల్యే బుధవారం నీరు విడుదల చేశారు. అంతకు ముందు కృష్ణాజలాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు చేయూతనిస్తూ వారిని అభివృద్ధి పథంలో నడిపించాలన్నదే ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అనంతరం పోలీస్ శాఖ ఆధ్వర్యాన మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే మార్కెట్ యార్డు స్థలంలో నిర్మిస్తున్న 160 ఇళ్ల పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలు రెండు నెలల్లోగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. అనంతరం మండలంలోని కొన్నూరు, నర్సింగపురం, గోపన్‌పేట గ్రామాలకు చెందిన 14 మంది ఎస్టీ లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ మౌనిక, సర్పంచ్ భాగ్యమ్మ, ఎంపీటీసీ సభ్యులు వెంకటనారాయణ, జయంతి, రైతు సమన్వ సమితి అధ్యక్షుడు హనుమాన్‌రావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణయ్యయాదవ్, నాయకులు రవీందర్‌రెడ్డి, గోపాలకృష్ణ, రాములు, బాలకృష్ణ, సాయిలుయాదవ్, చాంద్‌పాషా, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మహదేవన్‌గౌడ్, సత్యనారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆయకట్టులో ఆనంద సంబురం
నాగార్జునసాగర్ :సాగర్ ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కృష్ణానదికి ఎగువ నుంచి ఇన్‌ఫ్లో వస్తున్న నేపథ్యంలో ఎడమక్వాల పరిధిలోని మొదటిజోన్‌కు 40 టీఎంసీల నీటిని ఖరీఫ్ సాగుకు విడుదల చేస్తామని మంత్రులు హరీష్‌రావు, జగదీష్‌రెడ్డి చెప్పారు. నిన్నమొన్నటి దాకా సాగునీరు వస్తుందో రాదోనన్న ఆందోళనలో ఆయకట్టు రైతులు ఉన్నారు. చాలా మండలాల్లో వరినార్లు పోసుకుని రైతులు సాగర్‌నీటి కోసం ఎదురుచూస్తున్నారు. మంత్రుల ప్రకటనతో ఇక ఖరీఫ్‌సాగుపై రైతుల్లో భరోసా ఏర్పడింది. ఎగువ కృష్ణా నుంచి భారీగా ఇన్‌ఫ్లో ఉంటే, ఎడమకాల్వ రెండోజోన్‌కు కూడా ఖరీఫ్ సాగుకు నీటివిడుదలను పునఃసమీక్షిస్తామని మంత్రులు చెప్పారు. దీంతో రెండోజోన్ పరిధిలోని రైతుల్లోనూ ఆశలు చిగురిస్తున్నాయి. ఆల్మట్టి జలాశయానికి 1,23,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, దిగువకు 1,08,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. నారాయణపూర్ జలాశయానికి 1,34,000 క్యూసెక్కులనీరు వచ్చి చేరుతుండగా, దిగువకు 88,900 క్యూసెక్కుల వరదనీటిని వదులుతున్నారు. జూరాలప్రాజెక్టుకు 1,70,500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, దిగువకు 1,66,300 క్యూసెక్కులనీ టిని వదులుతున్నారు. అలాగే తుంగభద్ర ,జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి 2,92,147 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయ నీటిమట్టం ప్రస్తుతం 871.10 అడుగులకు చేరింది. ఇది 146.2060 టీఎంసీలతో సమానం. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 885 అడుగులు. నాగార్జునసాగర్ జలాశయానికి విద్యుదుత్పాదనతో 75,930 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సాగర్‌నీటిమట్టం ప్రస్తుతం 516.60 అడుగులకు చేరింది. ఇదే తరహాలో శ్రీశైలం జలాశయానికి మరో వారంరోజులపాటు ఇన్‌ఫ్లో కొనసాగితే జలాశయ నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకుంటుంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లెత్తి దిగువన ఉన్న నాగార్జునసాగర్ జలాశయానికి నీటిని వదిలే అవకాశాలున్నాయి. 3,20,000 ఎకరాలకు సాగునీరు ఎడమ కాల్వ పరిధిలోని మొదటిజోన్‌లో మూడులక్షల ఇరవై వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఇప్పటికే ఆయకట్టులోని రైతులు బోర్లు,వ్యవసాయబావుల కింద వరినార్లు పోసి పెంచారు. నాగార్జునసాగర్ నియోజకవర్గం లోని అనుముల, నిడమనూరు, త్రిపురారం, మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని మిర్యాలగూడ, దామరచర్ల,వేములపల్లి, హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలోని హుజూర్నగర్, నేరేడుచర్ల, గరిడేపల్లి, మఠంపల్లి, కోదాడ పరిధిలోని కోదాడ, చిలుకూరు, నడిగూడెం, మునగాల, సూర్యాపేట పరిధిలోని పెన్‌పహాడ్ మండలానికి సాగునీరు అందనుంది.