ఆయకట్టులో ఆనంద సంబురం
నాగార్జునసాగర్ :సాగర్ ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కృష్ణానదికి ఎగువ నుంచి ఇన్‌ఫ్లో వస్తున్న నేపథ్యంలో ఎడమక్వాల పరిధిలోని మొదటిజోన్‌కు 40 టీఎంసీల నీటిని ఖరీఫ్ సాగుకు విడుదల చేస్తామని మంత్రులు హరీష్‌రావు, జగదీష్‌రెడ్డి చెప్పారు. నిన్నమొన్నటి దాకా సాగునీరు వస్తుందో రాదోనన్న ఆందోళనలో ఆయకట్టు రైతులు ఉన్నారు. చాలా మండలాల్లో వరినార్లు పోసుకుని రైతులు సాగర్‌నీటి కోసం ఎదురుచూస్తున్నారు. మంత్రుల ప్రకటనతో ఇక ఖరీఫ్‌సాగుపై రైతుల్లో భరోసా ఏర్పడింది.
ఎగువ కృష్ణా నుంచి భారీగా ఇన్‌ఫ్లో ఉంటే, ఎడమకాల్వ రెండోజోన్‌కు కూడా ఖరీఫ్ సాగుకు నీటివిడుదలను పునఃసమీక్షిస్తామని మంత్రులు చెప్పారు. దీంతో రెండోజోన్ పరిధిలోని రైతుల్లోనూ ఆశలు చిగురిస్తున్నాయి. ఆల్మట్టి జలాశయానికి 1,23,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, దిగువకు 1,08,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. నారాయణపూర్ జలాశయానికి 1,34,000 క్యూసెక్కులనీరు వచ్చి చేరుతుండగా, దిగువకు 88,900 క్యూసెక్కుల వరదనీటిని వదులుతున్నారు. జూరాలప్రాజెక్టుకు 1,70,500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, దిగువకు 1,66,300 క్యూసెక్కులనీ టిని వదులుతున్నారు.
అలాగే తుంగభద్ర ,జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి 2,92,147 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయ నీటిమట్టం ప్రస్తుతం 871.10 అడుగులకు చేరింది. ఇది 146.2060 టీఎంసీలతో సమానం. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 885 అడుగులు. నాగార్జునసాగర్ జలాశయానికి విద్యుదుత్పాదనతో 75,930 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సాగర్‌నీటిమట్టం ప్రస్తుతం 516.60 అడుగులకు చేరింది. ఇదే తరహాలో శ్రీశైలం జలాశయానికి మరో వారంరోజులపాటు ఇన్‌ఫ్లో కొనసాగితే జలాశయ నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకుంటుంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లెత్తి దిగువన ఉన్న నాగార్జునసాగర్ జలాశయానికి నీటిని వదిలే అవకాశాలున్నాయి.
3,20,000 ఎకరాలకు సాగునీరు
ఎడమ కాల్వ పరిధిలోని మొదటిజోన్‌లో మూడులక్షల ఇరవై వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఇప్పటికే ఆయకట్టులోని రైతులు బోర్లు,వ్యవసాయబావుల కింద వరినార్లు పోసి పెంచారు. నాగార్జునసాగర్ నియోజకవర్గం లోని అనుముల, నిడమనూరు, త్రిపురారం, మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని మిర్యాలగూడ, దామరచర్ల,వేములపల్లి, హుజూర్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని హుజూర్‌నగర్, నేరేడుచర్ల, గరిడేపల్లి, మఠంపల్లి, కోదాడ పరిధిలోని కోదాడ, చిలుకూరు, నడిగూడెం, మునగాల, సూర్యాపేట పరిధిలోని పెన్‌పహాడ్ మండలానికి సాగునీరు అందనుంది.