ఖమ్మంఅర్బన్: జిల్లాలోని రైతులకు..ముఖ్యంగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ (ఎన్నెస్పీ) కాల్వల పరిధిలో పంటలను సాగు చేసేవారికి ఈ ఏడాది సాగునీరు పుష్కలంగా అందనుంది. ఇప్పటికే ప్రాజెక్ట్ నిండుకుండలా మారడంతో రెండు పంటలకు జలాలు విడుదల చేసేందుకు ఢోకా లేదని అధికారులు ప్రకటించడంతో...జిల్లా రైతులు పంటల తడులకు ఇబ్బంది ఉండదని ఆనందసాగరంలో ఉన్నారు. మొత్తం 21మండలాలు ఉండగా..17 మండలాల పరిధిలో సాగర్ ప్రధాన కాల్వ పారుతోంది. ప్రత్యక్షంగా రెండు లక్షల 50వేల ఎకరాల వరకు సాగు అవుతుండగా, పరోక్షంగా మరో లక్ష ఎకరాలకు చెరువులు, కుంటలు, వాగులు, బావుల్లో నీరు ఊరి..సాగు కష్టాలు తీరతాయి. సాగర్ ఎడమకాల్వ మొత్తానికి ఈఏడాది 132 టీఎంసీల నీరు సాగు, తాగు నీటి అవసరాలకు విడుదల చేయాలని నిర్ణయించారు.
దాంట్లో 99టీఎంసీలు తెలంగాణకు, మిగిలిన టీఎంసీలు ఏపీకి విడుదల చేసేందుకు నిర్ణయించారు. ఖరీఫ్‌లో ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో 45 టీఎంసీలు విడుదలకు నిర్ణయించగా మన జిల్లాలోని ఆయకట్టుకు 20 టీఎంసీలు వాడుకోనున్నారు. దీని ద్వారా ఖమ్మం ఎన్నెస్పీ సర్కిల్ పరిధిలో మొత్తంగా లక్షా 26 వేల ఎకరాల వరకు వరి పైర్లకు, లక్షా 28 వేల ఎకరాల్లో ఆరుతడి పంటలైన మిర్చి, పత్తి, మొక్కజొన్న, చెరకు, ఇతరత్రా కూరగాయలు సాగుకు నీరందనుంది. చుక్కనీరు వృథా కాకుండా..ఆయకట్టు చివరి భూములవరకు సాగు నీరు అందించేందుకు ప్రణాళిక ప్రకారం వ్యవహరించాలని ఇటీవల జరిగిన ఇంజినీర్ల సమావేశంలో ఎన్నెస్పీ ఎస్‌ఈ సుమతీదేవి సూచించారు.
గతేడాది నిరాశే..
జిల్లాలోని 16–17 బ్రాంచ్‌కాల్వ, బోనకల్, మధిర బ్రాంచ్ కాల్వల పరిధిలోని రెండు వేల కిలోమీటర్ల మేజర్లు, మైనర్లు, సబ్ మైనర్ కాల్వల ద్వారా రైతుల పంట భూములకు సాగర్ నీరు అందిస్తుంటారు. గతేడాది ఖరీఫ్‌కు సాగర్ నీరు విడుదల చేయలేదు. అయినా కొంతమంది రైతులు మొండిగా..పంటలు వేసి, నీరందక ఇబ్బంది పడుతుండడంతో మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వరరావులు ఆయకట్టుకు అక్టోబర్ నెలలో జలాలు విడుదల చేయించారు. అదీ..వారబందీ విధానంతో అమలు చేశారు. తర్వాత రబీ సాగుకు కూడా 9రోజులు ఆన్, 6 రోజులు ఆఫ్ విధానంలో మొత్తం 8తడుల నీరు క్రమపద్ధతిలో అందించడంతో గండం తొలగింది. ఈఏడాది ఖరీఫ్‌కు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సాగునీటి కష్టం ఉండబోదు.
గత నెలలో మిర్యాలగూడెంలో జరిగిన ఎన్నెస్పీ, ఆయకట్టు పరిధి రైతుల సంయుక్త సమావేశంలో జిల్లా నుంచి హాజరైన మాజీ నీటి సంఘాల చైర్మన్లు..గతేడాది రబీ తరహాలోనే వారబందీ విధానంలో విడుదల చేసినా సరిపోతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. తద్వారా తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ దిగుబడి కూడా వచ్చిందని వివరించారు. అయితే..నీటి నిల్వలు పుష్కలంగా ఉండడంతో ఇంజినీర్లు మాత్రం నిరంతరాయంగా మొదటి తడి వరకే ఇవ్వడానికి నిర్ణయించారు. వారబందీ విధానం ద్వారా అయితేనే నీటి వినియోగం తక్కువగా ఉంటుందని, పైగా దిగుబడి పెరగడంతోపాటు, తర్వాత కాలంలో రబీ సాగు, విద్యుత్ తయారీ, తాగు నీటి అవసరాలకు సాగర్ నీరు ఉపయోగ పడుతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఎంతో ఆనందంగా ఉంది..
గత 20రోజుల కిందట కూడా సాగర్ ఆయకట్టు పరిధిలో నీళ్లిస్తారో లేదోనని భయం భయంగా ఉన్నాం. ఇప్పుడు ప్రాజెక్ట్‌లోకి నీరు పుష్కలంగా చేరడంతో మా చింత తీరింది. నీళ్లొస్తే..బోర్లు, బావుల్లో ఊట పెరుగుద్ది. ఆయకట్టు పరిధిలోని పంటలకు డోకా ఉండదు. – మంకిన వెంకటేశ్వర్లు, చెన్నారం రైతు నేలకొండపల్లి మండలం
Comments
Please login to add a commentAdd a comment