ప్రాజెక్టులు ఖాళీ చేద్దామా! | AP, Telangana ENC discussion | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టులు ఖాళీ చేద్దామా!

Published Wed, Feb 11 2015 3:47 AM | Last Updated on Fri, Oct 19 2018 7:22 PM

ప్రాజెక్టులు ఖాళీ చేద్దామా! - Sakshi

ప్రాజెక్టులు ఖాళీ చేద్దామా!

- సాగు, తాగునీటి అవసరాలపై ఏపీ, తెలంగాణల ఈఎన్‌సీల చర్చ
- సాగర్, శ్రీశైలం కనీస నీటిమట్టాలకు దిగువ నీటినీ వాడుకుందాం
- ఈ ఏడాది సమస్యలను అధిగమిద్దాం.. కొనసాగుతున్న లేఖల పరంపర

సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టాల కంటే దిగువన ఉన్న నీటిని కూడా వాడుకోవడం ద్వారా ప్రస్తుత సాగు, తాగునీటి సమస్యను పరిష్కరించుకొనే దిశగా ఏపీ, తెలంగాణలు అడుగులు వేస్తున్నాయి.

రెండు రాష్ట్రాలకు నీటి అవసరాలున్నాయని, ఎవరూ రాజీపడి తమ అవసరాలను వదులుకొనే పరిస్థితుల్లో లేనందున, ప్రాజెక్టులు దాదాపుగా ఖాళీ అయ్యే వరకు నీటిని వాడుకొని ఈ ఏడాది గట్టెక్కడమే ఉత్తమ మార్గంగా రెండు రాష్ట్రాలు భావిస్తున్నట్లు సమాచారం. ఏపీ ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు, తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ మంగళవారం ఏపీ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ చాంబర్‌లో సమావేశమయ్యారు. కనీస నీటిమట్టాలను పట్టించుకోకుండా రెండు ప్రాజెక్టులను వీలైనంత మేరకు ఖాళీ చేసి ప్రస్తుత అవసరాలు తీర్చుకోవాలనే ప్రతిపాదనపై చర్చించారు. అయితే ఎలాంటి తుది నిర్ణయానికీ రాలేదని తెలిసింది.

ప్రస్తుతం శ్రీశైలంలో 839.3 అడుగుల మట్టం వద్ద 60 టీఎంసీల నీటి నిల్వ ఉంది. తాగునీటి అవసరాల కోసం 834 అడుగుల వరకు ఖాళీ చేయడానికి అవకాశం ఉంది. అయితే 800 అడుగుల వరకు ఖాళీ చేయాలని రెండు రాష్ట్రాలు యోచిస్తున్నాయి. నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం 533 అడుగుల మట్టం వద్ద 174 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 510 అడుగుల వరకు నీటిని వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టులో నీటిని 500 అడుగుల వరకు వాడుకోవాలనే ప్రతిపాదన ఉంది.  కనీస నీటి మట్టాల కంటే దిగువన ఉన్న నీటిని కూడా వాడుకోవడంపై రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వస్తే.. మొత్తం 50-60 టీఎంసీల నీటిని వాడుకోవడానికి అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

ఇలావుండగా.. నీటి కేటాయింపులపై రెండు రాష్ట్రాలు, కృష్ణా బోర్డు మధ్య లేఖల పరంపర కొనసాగుతోంది. రెం డురోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. ‘రెండు రాష్ట్రాల కేటాయింపులు త్వరగా తేల్చాలి. ఏపీ ప్రభుత్వం తన వాటా కంటే 51 టీఎంసీల నీటిని అదనం గా వాడుకుంది. ఇంకా నీటి విడుదల కోసం ఒత్తిడి చేస్తోంది. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటిని ఈ ఏడాది వాడుకోలేదు. ఏపీ ఎడాపెడా నీటిని వాడుకుంటే ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు పడిపోతాయి.

తర్వాత వాడుకోవడానికి తెలంగాణకు అవకాశం ఉండదు. బోర్డు సమావేశం ఏర్పాటు చేసి న్యాయం చేయాలి..’ అని పేర్కొంది. కాగా తెలంగాణ రాసిన లేఖ ప్రతిని జత చేస్తూ కృష్ణా బోర్డు ఏపీకి మంగళవారం మరో లేఖ రాసింది. ఆ రాష్ట్రం డిమాం డ్లను ప్రస్తావిస్తూ.. ఇరు రాష్ట్రాల అధికారులు   సమస్యను పరిష్కరిం చుకోవాలని సూచిం చింది. బోర్డు సభ్యులైన ఇరు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు, ఈఎన్‌సీల మధ్య సయోధ్య లేకుండా బోర్డు సమావేశం ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం లేదని స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement