Khamma
-
తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు.. భయంతో జనం పరుగులు
సాక్షి, ఖమ్మం: తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ, జగ్గయ్యపేట.. తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాలతో సహా హైదరాబాద్‌లో కూడా భూమి కంపించడంతో ఇళ్లలో నుంచి ప్రజలు పరుగులు తీశారు. పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం 7:27 గంటలకు రెండు నిమిషాల పాటు భూమి కంపించింది. దీంతో, ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది. కాగా, ములుగు జిల్లాలోని మేడారం కేంద్రంగా భూమి కంపించినట్టు అధికారులు చెబుతున్నారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత తెలుగు స్టేట్స్లో ఇలా భూమి కంపించడం గమనార్హం. ఈ మేరకు సీఎస్ఐఆర్ ఓ ఫొటోను విడుదల చేసింది. Got a whatsapp forward video from Bhadrachalam, Telangana. A strong one 😮Credits to respective owner pic.twitter.com/i3OR9wFfM4— Telangana Weatherman (@balaji25_t) December 4, 2024 వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బోరబండ, రాజేంద్రనగర్, రాజేంద్రనగర్ సహా రంగారెడ్డి జిల్లాలో దాదాపు ఐదు సెకన్ల పాటు భూమి కంపించినట్టు స్థానికులు చెబుతున్నారు. తెలంగాణలోని చాలా జిలాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అటు, మహారాష్ట్రలోని గడ్చిరోలిలో కూడా భూమి కంపించింది. ఖమ్మంలోకి నేలకొండపల్లి, భద్రాద్రి కొత్తగూడెంలోని చుండడ్రుగొండలో బుధవారం తెల్లవారుజామున కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్టు ప్రజలు తెలిపారు. భూ ప్రకంపనలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.For the first time in last 20years, one of the strongest earthquake occured in Telangana with 5.3 magnitude earthquake at Mulugu as epicentre.Entire Telangana including Hyderabad too felt the tremors. Once again earthquake at Godavari river bed, but a pretty strong one 😮 pic.twitter.com/RHyG3pkQyJ— Telangana Weatherman (@balaji25_t) December 4, 2024అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా భూమి కంపించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామంలో 10 సెకన్ల పాటు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గవ్యాప్తంగా స్వల్పంగా భూమి కంపించింది. దీంతో, ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అలాగే, కేససముద్రం, మహబూబాబాద్, బయ్యారంలో కూడా కొన్ని సెకండ్ల పాటు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.హన్మకొండ జిల్లా పరకాల డివిజన్లో భూ ప్రకంపనలు వచ్చాయి. అలాగే, వరంగల్‌లోని పలు ప్రాంతాల్లో 5 నుండి 15 సెకండ్ల వరకు స్వల్పంగా కంపించిన భూమి. దీంతో, భయాందోళనలో స్థానికులు ఉన్నాయి. భూమి కంపించడంపై ఉదయాన్నే సిటి మొత్తం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది. కరీంనగర్‌లోని పలు ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ, తిరువూరు, నందిగామ, గుడివాడ, మంగళగిరి, జగ్గయ్యపేటలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు భయంతో పరుగులు తీసినట్టు చెబుతున్నారు. బుధవారం ఉదయం కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్టు స్థానికులు చెబుతున్నారు. -
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలవనున్న బీజేపీ చేరికల కమిటీ
-
ధాన్యం కొనుగోళ్లలో ఖమ్మం జిల్లాలో రైతుల కష్టాలు
-
టికెట్ కోసం కాంగ్రెస్ అభ్యర్థి నిరసన..!
సాక్షి, సత్తుపల్లి(ఖమ్మం): పార్టీ టికెట్ రాకపోయే సరికి కొందరు రెబల్స్‌గా నామినేషన్ దాఖలు చేయగా..అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సత్తుపల్లి మున్సిపాలిటీ 11వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్‌ను ఆశిస్తున్న షేక్ ఖాదర్ అలీ శుక్రవారం ఏకంగా మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగడం చర్చనీయాంశంగా మారింది. నామినేషన్ స్క్రూట్నీ తర్వాత అభ్యర్థిని ప్రకటిస్తామని కాంగ్రెస్ నాయకులు సముదాయించారు. 17వ వార్డులో బీజేపీ తరఫున నామినేషన్ వేయకుండా ఊట్ల లక్ష్మీని కిడ్నాప్ చేశారంటూ బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. దీంతో నామినేషన్ కేంద్రం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే ఈ ఆరోపణలను అధికార టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఊట్ల లక్ష్మీని ఎవరూ కిడ్నాప్ చేయలేదని, అసలు ఆవిడ వచ్చిందో, లేదో స్పష్టత లేకుంటే ఎలా అని మండిపడుతుంది. చైర్మన్ వార్డులైన 2, 4, 22, 23వ వార్డుల్లో నామినేషన్లు వేసేందుకు ఆసక్తి కనబర్చారు. 16వ వార్డు జనరల్ అయినా బీసీ సామాజిక వర్గం నుంచి టిక్కెట్ కేటాయించే అవకాశాలు కన్పిస్తున్నాయి. సత్తుపల్లి మున్సిపాలిటీలో 23 వార్డులకు గాను మొత్తం 122 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు ప్రకటించారు. -
టీఆర్ఎస్కు షాక్.. జెడ్పీ ఛైర్పర్సన్ రాజీనామా
సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ గడిపల్లి కవిత పదవికి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా పార్టీపై అసంతృప్తిగా ఉన్న ఆమె తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. ఈమేరకు తన రాజీనామా పత్రాన్ని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్నన్‌కు అందజేశారు. గత కొంతకాలంగా పార్టీలో ఆమెకు సరైన ప్రాధ్యాన్యత ఇవ్వక పోవడంతో రాజీనామా చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి మధిర స్థానంలో పోటీ చేయాలని ఆమె భావించారు. కానీ మధిర టికెట్‌ను ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ వర్గానికి చెందిన లింగాల కమల్ రాజ్‌కు ఇవ్వడంతో ఆమె తీవ్ర అసంతృప్తి చెందారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన కవిత 2014లో రాజకీయాల్లోకి వచ్చి జెడ్పీ చైర్‌పర్సర్‌గా ఎన్నికయ్యారు. కాగా ఎన్నికల ముందు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బుడాన్ బేగ్ కూడా పార్టీని వీడి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. -
పెథాయ్ తుపాన్: నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి
సాక్షి, వరంగల్ / ఖమ్మం : పెథాయ్ తుపాన్ ప్రభావం వలన రాష్ట్రంలోని పాత వరంగల్, ఖమ్మం జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పాత వరంగల్ జిల్లాలోని ఏటూరు నాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వాజేడు, వెంకటాపురం మండలాల్లో రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తోన్న వర్షాలకు రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. మిరప పూతలు రాలిపోయి, దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని వాపోతున్నారు. జనగామా జిల్లా పాలకుర్తి మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం... జిల్లాలోని వైరా మండలంలో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాల వల్ల అన్నదాతలు భారీగా నష్టపోయారు. అశ్వరావుపేట మండలంలో అత్యధికంగా 80 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మధిర నియోజకవర్గ వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో ఇల్లందులోని జేకే 5 ఓసీ, కోయగూడెంలోని కేఓసీలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇవేకాక వర్షం కారణంగా సత్తుపల్లి నియోజకవర్గంలోని జేవీఆర్ సింగరేణి ఓపెన్ కాస్ట్లో సుమారు 5 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆంటకం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలో పలుచోట్ల వరి, మొక్కజొన్న, ధాన్యం తడిసి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భధ్రాద్రి కొత్తగూడెం... పెథాయ్ తుపాన్ కారణంగా పినపాక నియోజకవర్గంతో పాటు అశ్వాపురం, మణుగూరు గుండాల మండలాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. దాంతో పలు చోట్ల వరి ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని.. ప్రభుత్వం తక్షణమే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. కరీంనగర్.. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మురుసు కమ్ముకుంది. చలి గాలులతో జనం వణికిపోతున్నారు. హుజురాబాద్, సైదాపూర్, శంకరపట్నం మండలాలలో చిరుజల్లులు పడుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో చిరుజల్లులతో కూడిన ఓ మోస్తారు వర్షం కురిసింది. మంథని వ్యవసాయ మార్కెట్లో ధాన్యం తడిసిపోయింది. మార్కెట్‌ను ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు సందర్శించారు. రైతులకు టార్పాలిన్ కవర్లు ఇవ్వకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అబద్ధాలు కాదు.. అభివృద్ధిని చూసి ఓటు వేయండి
సాక్షి,కరకగూడెం: గడిచిన నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటర్లు టీఆర్ఎస్కు ఓటేయాలని పినపాక నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం ఆయన కరకగూడెం కొత్తగూడెం, పాయంవారి గుంపు, గొల్లగూడెం, అనంతారం, తుమ్మలగూడెం గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాకముందు సీమాంద్రుల పాలనలో రాష్ట్రం నిర్లక్ష్యానికి గురైందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడపడమే కాకుండా రాష్ట్ర ప్రజలకు సువర్ణపాలన అందించారని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం అనే రెండు ఆయుధాలతో సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని ముందంజలో ఉంచారని, ప్రజల అవసరాల మేరకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని చెప్పారు. విపక్షాలు కేసీఆర్‌ను ఒంటరిగా ఎదుర్కొలేక కూటమి కట్టి ప్రజలను మోసం చేయడానికి గ్రామాల్లోకి వస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిరంతరం కొనసాగాలంటే ఓటర్లు టీఆర్ఎస్ను మరోమారు ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం ఆయా గ్రామస్తులకు టీఆర్ఎస్ కరపత్రాలను అందజేసారు. కార్యక్రమాల్లో సార సాంబశివరావు, ఎర్ర సురేష్, భవానీ శంకర్, అక్కిరెడ్డి సంజీవరెడ్డి, వట్టం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
టెన్షన్.. టెన్షన్
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కాంగ్రెస్ టికెట్ల వ్యవహారంపై నేతల్లో టెన్షన్ నెలకొంది. ఒకప్పుడు జిల్లా కాంగ్రెస్‌లో అన్నీ తామై.. చక్రం తిప్పి.. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇప్పుడు టికెట్ల కోసం చక్కర్లు కొడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించిన మాజీ మంత్రులు పలువురు ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? మహాకూటమి పొత్తుల వల్ల వారు గతం నుంచి పోటీ చేస్తున్న స్థానాలను త్యాగం చేయాల్సి వస్తే పార్టీ వారికి ఎటువంటి భరోసా ఇస్తుంది? ఎలా రాజకీయ సర్దుబాటు చేస్తుందన్న అంశం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో మధిర, పినపాక నియోజకవర్గాలు మినహా మిగిలిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఎవరికి లభిస్తుందన్న అంశం ఉత్కంఠ రేపుతోంది. మధిర నుంచి టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క ఒక్కరే దరఖాస్తు చేయడంతో ఆయన పేరు ఖరారు కావడం లాంఛనంగా మిగిలింది. పినపాకలోనూ అక్కడి మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు టికెట్ ఖాయమన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఇక మిగిలిన నియోజకవర్గాల్లో రోజుకొకరి పేరు తెరపైకి రావడం, ఫలాన వారికి టికెట్ వస్తుందనే ప్రచారం జరగడం కొద్ది రోజులుగా జరుగుతున్నా.. అధిష్టానం ఆశీస్సులు లభించేదెవరికి అనే విషయం మాత్రం ఒక పట్టాన కార్యకర్తలకే అంతుచిక్కడం లేదు. ఉమ్మడి జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌లో ఉన్న ఇద్దరు రాష్ట్ర మాజీ మంత్రులు సంభాని చంద్రశేఖర్, వనమా వెంకటేశ్వరరావు, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగేందుకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే పార్టీ వారి పేర్లను పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నా.. వారు పోటీ చేయాలనుకున్న సత్తుపల్లి, కొత్తగూడెం, ఖమ్మం స్థానాలను మహాకూటమిలో భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, సీపీఐ కోరుతుండడంతో ఆ సీట్ల కేటాయింపుపై పార్టీపరంగా పీటముడి పడినట్లయింది. దీంతో మహాకూటమి భాగస్వామ్య పక్షాల నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో ఎవరికి టికెట్ దక్కుతుందన్న అంశం ప్రశ్నార్థకంగా మారింది. ‘సండ్ర’ ప్రచారం.. ఇప్పటికే సత్తుపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య మహాకూటమి అభ్యర్థిగా నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఆ సీటును టీడీపీకే కేటాయించడానికి కాంగ్రెస్ సిద్ధపడడం, అక్కడి నుంచి గత ఎన్నికల వరకు రెండుసార్లు పోటీ చేసిన మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌ను ఈసారి కాంగ్రెస్ ఎక్కడి నుంచి బరిలోకి దించుతుందన్న అంశం ఇంకా కొలిక్కి రాలేదు. సంభాని గతంలో పోటీ చేసి.. పలు పర్యాయాలు గెలిచి తనకు పట్టున్న పాలేరు జనరల్ స్థానం నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతుండడంతోపాటు ఇందుకోసం ఏఐసీసీ స్థాయిలో తనవంతు ప్రయత్నాలను వేగవంతం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పాలేరు నుంచి ఆయనను బరిలోకి దించే అంశం కాంగ్రెస్ పరిశీలనలో ఉన్నా.. సత్తుపల్లి నుంచి పోటీ చేసే అవకాశం మాత్రం లేకుండా పోయింది. అలాగే కొత్తగూడెం టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు సైతం టికెట్ కోసం పార్టీలో హోరాహోరీ పోరు జరపాల్సిన పరిస్థితి నెలకొంది. కూటమి పొత్తులో భాగంగా భాగస్వామ్య పక్షమైన సీపీఐ ఈ సీటును తమకే కేటాయించాలని పట్టుపట్టడం, 2009 ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలుపొందిన సీపీఐ మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మరోసారి మహాకూటమి తరఫున పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ ఈ సీటును కూటమిలోకి భాగస్వామ్య పక్షమైన సీపీఐకి కేటాయిస్తుందా? మాజీ మంత్రి వనమానే బరిలోకి దించుతుందా? అనే అంశంపై ఇప్పటికీ స్పష్టత కొరవడింది. కాంగ్రెస్‌కు కేటాయిస్తేనే విజయం సాధ్యమని ఆ పార్టీ వర్గాలు ప్రచారం చేస్తున్నా.. సీపీఐ సైతం కొత్తగూడెం తమకు పట్టున్న ప్రాంతమని, సింగరేణి కార్మికులు, ఆ ప్రాంత ప్రజా ఉద్యమాలతో పార్టీకి ఎనలేని అనుబంధం ఉన్నందున గెలిచి తీరుతామని వాదిస్తోంది. దీంతో వనమాకు టికెట్ లభించే విషయం చివరి నిమిషం వరకు తేలని పరిస్థితి. అలాగే కాంగ్రెస్ నుంచి స్వయానా వనమా తోడల్లుడు, కాంగ్రెస్ నేత ఎడవల్లి కృష్ణ, నియోజకవర్గానికి చెందిన నాగా సీతారాములు టికెట్ ఆశిస్తున్నారు. కాంగ్రెస్ పోటీ చేయాలని భావించినా.. టికెట్ ఎవరికి లభిస్తుందన్న అంశం మాత్రం ఒక పట్టాన అంతుపట్టడం లేదు. ఇక ఇప్పటివరకు లోక్‌సభ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేసి రెండుసార్లు ఖమ్మం ఎంపీగా విజయం సాధించి.. కేంద్రంలో మంత్రిగా పని చేసిన రేణుకాచౌదరి ఈసారి ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. పోటీ చేయాలంటూ నియోజకవర్గ కార్యకర్తలు, సాధారణ ప్రజల నుంచి ఒత్తిడి ఉందని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించడం ద్వారా రేణుకాచౌదరి సైతం ఖమ్మం నుంచి పోటీ చేసే అవకాశాన్ని కోరుతున్నట్లు ప్రచారమవుతోంది. అయితే ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు టీడీపీ సైతం సిద్ధపడడం, కాంగ్రెస్‌లో అనేక మంది పోటీపడుతుండడంతో ఇక్కడ కూటమిలోని ఏ భాగస్వామ్య పక్షం ఎన్నికల బరిలో నిలుస్తుందనే అంశం ఉత్కంఠ రేపుతోంది. సత్తుపల్లిలో మహాకూటమి భాగస్వామ్య పక్షం పోటీ చేస్తుండడంతో అక్కడ మాజీ మంత్రి సంభాని అవకాశం కోల్పోయినట్లయింది. ఇక టికెట్ల పోరులో ఉన్న మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని చేస్తున్న ప్రయత్నాలు, ఖమ్మం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరికి ఏ మేరకు పరిస్థితులు కలిసొస్తాయనే అంశం జిల్లా రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. -
పార్టీలు మారేవారికి ఓటు వేయకండి
ఖమ్మంమామిళ్లగూడెం: పార్టీలు మారేవారికి ఓటు వేయవద్దని మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తా త్రేయ కోరారు. ఆదివారం ఖమ్మం త్రీటౌన్‌లోని హర్షా హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు తమ స్వార్థం కోసం పార్టీలు మారి ప్రజల ను మోసం చేస్తున్నారని విమర్శించారు. నీతిమాలిన చర్యలకు పాల్పడిన వారిని ప్రజలు గమనిస్తున్నారని, వారికి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదన్నారు. మోడీ చరిష్మాతగ్గుతోందని ప్రచా రం జరుగుతోందని, చనిపోయే పార్టీ కాంగ్రెస్ అయితే, బతికే పార్టీ బీజేపీ అన్నారు. తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్ గ్రాఫ్ తగ్గిందన్నారు. బీజేపీకి ఏ పార్టీతో పొత్తు లేదని, స్పష్టం చేశారు. టీఆర్ఎస్పై వ్యతిరేకత తమకు కొండంత అండ అన్నారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీల అమలులో విఫలమైందన్నారు. డబుల్ బెడ్రూం, దళితులకు 3 ఎకరాల భూమి, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ ఊసే లేకుండా పోయిందన్నా రు. కేసీఆర్ ప్రగతి భవన్‌కు పరిమితం కావటం వల్ల సెక్రెటేరియేట్ మసకబారిపోయిందన్నారు. ప్రతి ఇంటికి నల్లా ఇచ్చిన తరువాతనే ఓట్లు అడుగుతామన్న కేసీఆర్ ఈ ఎన్నికల్లో ఏ మొఖం పెట్టుకొని ప్రజలను ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచిన ఏపీ సీఎం చంద్రబాబు కాంగ్రెస్‌తో ఎందుకు పొత్తుపెట్టుకున్నారో చెప్పాలన్నారు. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ఓటు నమోదు కార్యక్రమాన్ని చేపట్టలేదని కానీ బీజేపీ ఆధ్వర్యంలో 18 నుంచి 30 ఏండ్ల వయస్సు ఉన్న వారికి ఓటు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 1 నుంచి 25 వరకు ‘నవయువ సమ్మేళన్’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెల 3, 4, 5 తేదీలలో రాష్ట్రంలో ముఖ్య నాయకులతో సమా వేశం ఏర్పాటు చేసి నట్లు వివరించారు. వచ్చే నెల మూడవ వారంలో తెలంగాణలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పర్యటన ఉంటుందని చెప్పా రు. పార్టీ జిల్లా అధ్యక్షుడు సన్నె ఉదయ్ ప్రతాప్ మాట్లాడుతూ అందరికి అందుబాటులో ఉన్న కలెక్టరేట్‌ను 12 కిలోమీటర్ల దూరంకు మార్చాలని చూశారని అన్నారు. వారి ఆస్తులను కాపాడుకోవటానికేనని విమర్శించారు. నిధులు వచ్చినప్పటికి నగరంలోని గోళ్లపాడు చానల్ అభివృద్ధి ఏమా త్రం జరగలేదన్నారు. పాలేరులో టీఆర్ఎస్కు వ్యతిరేకత ఉందన్నారు. బంగారు తెలంగాణ అంటూ ప్రజలను మోసం చేశారని విమర్శించా రు. 9 నెలల ముందే ఎందుకు అసెంబ్లీ రద్దు చేశారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, కార్యవర్గసభ్యులు గెంటెల విద్యాసాగర్, దొంగల సత్యనారాయణ, ఉప్పల శారద, మట్టా దుర్గాప్రసాద్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జ్ యాదగిరిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు ప్రభాకర్‌రెడ్డి, నారాయణ, కోశాధికారి డోకుపర్తి రవీందర్‌కుమార్, నాయకులు మల్లుశివరాం, మహిళా మోర్చా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీ దేవీ, మందసరస్వతి, స్వచ్ఛ భారత్ కన్వీనర్ మార్తి వీరభద్రప్రసాద్, యువమోర్చా రాష్ట్ర కార్యవర్గసభ్యులు గోనెల శివ, జిల్లా అధ్యక్షుడు నకిరికంటి వీరభద్రం, ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ ఉపేందర్‌రావు, అసెంబ్లీ కన్వీనర్ మేకల నాగేందర్, నాయకులు ఎం.జనార్ధన్, వీరస్వామి పాల్గొన్నారు. సత్తుపల్లిటౌన్: కాంగ్రెస్, టీడీపీలు ఎన్నికలో చేతులు కలపటంతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ను కూకటి వేళ్లతో పెకిలించిన ఎన్టీఆర్ ఆత్మఘోషిస్తుందని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. సత్తుపల్లి కళాభారతిలో ఆదివారం రాత్రి సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారం కోసం చంద్రబాబునాయుడు అడ్డదారులు తొక్కుతున్నారని.. రానున్న ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. అనంతరం సత్తుపల్లి, వైరా, మధిర నియోజకవర్గాల అభ్యర్థులు నంబూరి రామలింగేశ్వరరావు, సినీనటి రేష్మారాథోడ్, సూర్యారావులను పరిచయం చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూసంపూడి రవీంద్ర, గెంటల విద్యాసాగర్‌రావు, ఉప్పల శారద, జిల్లా అధ్యక్షులు సన్నె ఉదయ్‌ప్రతాప్, జిల్లా ఇన్చార్జ్ యాదగిరిరెడ్డి, టి.వి.రమేష్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు మద్దిశెట్టి సామేలు, మహిళ మోర్చా జిల్లా అధ్యక్షురాలు కొలికిపాక శ్రీదేవి, ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి సోడపాక నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
ఒక్క చాన్స్!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: బరిలో నిలిచేందుకు కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కోసం పోటీ పెరుగుతోంది. నాకంటే నాకు టికెట్ కేటాయించాలంటూ రాజధాని స్థాయిలో నాయకులు బలప్రదర్శనకు దిగుతుండటం జిల్లాలో వేడెక్కుతున్న రాజకీయ పరిస్థితికి అద్దం పడుతోంది. వివిధ పార్టీలతో కాంగ్రెస్ ఏర్పాటు చేయనున్న మహాకూటమి వల్ల తమ నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం కోల్పోకుండా చూసుకునేందుకు వివిధ నియోజకవర్గాల కాంగ్రెస్ నేతలు ఒక్క చాన్స్ ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరేందుకు హైదరాబాద్ బాట పట్టారు. అధికార టీఆర్ఎస్ను ఓడించేందుకు కాంగ్రెస్ నేతృత్వంలో పలు పక్షాలు మహాకూటమి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఈ తరుణంలో జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న నేతలు తమ నియోజకవర్గంలో మరో పార్టీకి టికెట్ ఇవ్వొద్దంటూ కాంగ్రెస్ అధిష్టానానికి మొరపెట్టుకునేందుకు బారులు తీరుతున్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ పొత్తు కుదుర్చుకుని.. జిల్లాలోని పది నియోజకవర్గాలు, రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేసింది. ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ మద్దతుతో సీపీఐ అభ్యర్థి కె.నారాయణ పోటీ చేసి ఓటమి చెందగా.. మహబూబాబాద్ లోక్‌సభ స్థానం నుంచి సీపీఐ మద్దతుతో మాజీ మంత్రి బలరాంనాయక్ పోటీ చేసి ఓడిపోయారు. ఇక 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు.. వైరా, కొత్తగూడెం, పినపాక నియోజకవర్గాల్లో సీపీఐ.. కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసింది. మిగతా ఏడు నియోజకవర్గాల్లో సీపీఐ మద్దతుతో కాంగ్రెస్ ఎన్నికల బరిలో దిగి ఖమ్మం, పాలేరు, ఇల్లెందు, మధిర నియోజకవర్గాల్లో విజయం సాధించింది. ఇదే పద్ధతిలో ఈసారి జరిగే ఎన్నికల్లో సైతం సీపీఐ, కాంగ్రెస్ ఎన్నికల మైత్రి కొనసాగుతుందని భావించినా.. రాష్ట్రస్థాయిలో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో చేయి కలపడానికి ఇటు టీడీపీ, అటు తెలంగాణ జన సమితి సిద్ధం కావడంతో ఏ పార్టీ ఎక్కడి నుంచి టికెట్లు ఆశిస్తుందో.. తమకు పోటీ చేసే అవకాశం ఏ రకంగా కోల్పోవాల్సి వస్తుందోననే ఆందోళన కాంగ్రెస్ ఆశావహుల్లో పెల్లుబుకుతోంది. విన్నవించే పనిలో నాయకులు.. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను, ఓట్లను ప్రామాణికంగా తీసుకుని ఈ ఎన్నికల్లో మిత్రపక్షాలకు సీట్లు కేటాయించవద్దని, వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసి ఏ పార్టీకి బలముంటే ఆ పార్టీకి టికెట్ కేటాయిస్తేనే కాంగ్రెస్‌కు జిల్లాలో పునరుజ్జీవం కలుగుతుందని కాంగ్రెస్ ఆశావహులు నియోజకవర్గాలవారీగా వెళ్లి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని, పలువురు రాష్ట్ర నేతలను కలిసి విన్నవించే పనిలో పడ్డారు. రెండు రోజులుగా అశ్వారావుపేట, ఇల్లెందు, వైరా, కొత్తగూడెం నియోజకవర్గాలకు చెందిన పలువురు ఆశావహులు పెద్దసంఖ్యలో కార్యకర్తలతో సహా హైదరాబాద్ వెళ్లారు. తమ నియోజకవర్గాలను ఇతర పార్టీలకు కేటాయించకుండా కాంగ్రెస్ అభ్యర్థిని బరిలోకి దించితే గెలిపించి తీసుకొస్తామని భరోసా ఇస్తుండడంతో పార్టీ నేతలు ఆశావహులకు ఎలా నచ్చజెప్పాలో పాలుపోక ఆయా అభ్యర్థులను పరిశీలిస్తామని చెబుతున్నారు. అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాలను ఎన్నికల పొత్తులో భాగంగా టీడీపీ కోరుతుండడం.. పొత్తు ఉండడంతో ఆయా నియోజకవర్గాల నుంచి టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ నేతలు ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు గల ఆదరణ, టీడీపీ బలహీనపడిన తీరును ఓట్ల లెక్కలతో సహా పార్టీ నేతల ముందు ఉంచడం విశేషం. ఇక అశ్వారావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకే అవకాశం ఇవ్వాలని, పొత్తులో టీడీపీకి కేటాయించవద్దని కోరుతూ కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న ఆశావహులు సున్నం నాగమణి, కారం శ్రీరాములు, దంజునాయక్ తదితరుల నేతృత్వంలో కార్యకర్తలు హైదరాబాద్‌కు వెళ్లి టీపీసీసీ అధ్యక్షుడికి ఇక్కడి రాజకీయ పరిస్థితులను వివరించారు. గతంతో పోలిస్తే టీడీపీ ఇక్కడ బలహీనపడిందని, ఎక్కువ మంది కార్యకర్తలు మాజీ మంత్రి తుమ్మలను అనుసరిస్తున్నారని, అక్కడ బలమైన పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని వారు తమ వాదనను వినిపించారు. వైరాపై పట్టు.. వైరా నియోజకవర్గంలో గత ఎన్నికల్లో మిత్రపక్షాల పొత్తులో భాగంగా సీపీఐ పోటీ చేయగా.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌కే వైరా సీటు కేటాయించాలంటూ అక్కడి కాంగ్రెస్ నేతలు పట్టుపడుతున్నారు. టికెట్ ఆశిస్తున్న నేతలతోపాటు పలువురు కార్యకర్తలు తమ మనోభావాలను పార్టీ అధిష్టానానికి తెలియజేసేందుకు వారం రోజుల క్రితం మాజీ పోలీస్ అధికారి, వైరా నుంచి టికెట్ ఆశిస్తున్న రాములునాయక్ నేతృత్వంలో గాంధీ భవన్ వద్ద ఆందోళన నిర్వహించగా.. తాజాగా కాంగ్రెస్ నుంచి లకావత్ గిరిబాబు నాయకత్వంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌కు తరలివెళ్లి.. కాంగ్రెస్ పోటీ చేస్తే వైరాలో విజయం సాధించడం ఖాయమంటూ వివరించారు. ఎన్నికల పొత్తులో కాంగ్రెస్ సీటు చేజార్చుకోవడం సబబు కాదని, గత ఎన్నికలకు ఇప్పటికి రాజకీయంగా అనేక మార్పులు సంభవించాయని, వాటిని పరిగణనలోకి తీసుకుని కాంగ్రెస్ పార్టీ బలాన్ని పరిశీలించి కాంగ్రెస్ అభ్యర్థిని బరిలోకి దించాలని పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు ఉత్తమ్ ముందు తమ వాదన వినిపించారు. అలాగే వైరా నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న మంగీలాల్ సైతం టీపీసీసీ అధ్యక్షుడిని కలిసి కాంగ్రెస్‌కు గల సానుకూలతను వివరించారు. ఉత్కంఠ రేపుతున్న కొత్తగూడెం సీటు ఇక ఉమ్మడి జిల్లాలో అత్యధిక రాజకీయ ప్రాధాన్యం కలిగిన కొత్తగూడెం నియోజకవర్గంలో ఎన్నికల పొత్తు ఎవరికి మోదం.. మరెవరికి ఖేదం కానుంది.. అనే అంశం రాజకీయ ఉత్కంఠ రేపుతోంది. కాంగ్రెస్ కూటమిలోని ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, టీడీపీ, సీపీఐలు ఈసారి కొత్తగూడెం స్థానాన్ని తమకంటే తమకు కేటాయించాలని పట్టుపట్టడంతోపాటు తమకున్న రాజకీయ పరిచయాల ద్వారా పార్టీ నేతలపై ఒత్తిడి తేవడంతో ఈస్థానం నుంచి మిత్రపక్షాల అభ్యర్థి ఎవరు అవుతారన్న అంశం ఆసక్తి రేపుతోంది. కొత్త గూడెం అసెంబ్లీ స్థానాన్ని ఈ దఫా కాంగ్రెస్‌కే కేటాయించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవేంద్ర, జెడ్పీటీసీ పరం జ్యోతి నేతృత్వంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు హైదరాబాద్ తరలివెళ్లి కొత్తగూడెంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్‌కు టికెట్ లభిస్తే విజయం సునాయాసం అవడానికి గల అవకాశాలను వివరించినట్లు సమాచారం. నియోజకవర్గాల్లో పార్టీల బలాబలా లను బేరీజు వేసుకుని కాంగ్రెస్ నేతలకు న్యాయం చేయాలని, ఈసారి కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ పోటీ చేయకపోతే పార్టీ శ్రేణులకు నిరాశ నిçస్పృహ కలగడంతోపాటు పనిచేసే వారికి గుర్తింపు లేదన్న సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని పార్టీ నేతలు వాదించినట్లు తెలుస్తోంది. ఇక ఇల్లెందు నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న పార్టీ నాయకుడు దళ్‌సింగ్ టీపీసీసీ అధ్యక్షుడిని కలిసి దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న తనకు ఈసారి అవకాశం కల్పించాలని, కాంగ్రెస్ పార్టీ ఇల్లెందులో విజయం సాధించడానికి అనేక సానుకూల పరిస్థితులు దోహదం చేయనున్నాయని, తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరారు. దీంతో టీడీపీ, సీపీఐ కోరుతున్న స్థానాలపై కాంగ్రెస్ నేతలు సైతం గట్టి పట్టుపట్టడంతో ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేయడం, వారిని విజయపథంలో నడిపించడం మహాకూటమికి కత్తిమీద సామేనన్న ప్రచారంజరుగుతోంది. -
పొత్తులు.. చిక్కులు..
సాక్షి, కొత్తగూడెం: రానున్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి నడిచేందుకు సిద్ధమైన టీడీపీ భద్రాద్రి జిల్లాలో కనీసం రెండు సీట్లు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. ఈ రెండు పార్టీల మధ్య ఇప్పటికే పొత్తు వ్యవహారం తుదిదశకు చేరుకోవడంతో జిల్లాలో సీట్ల సర్దుబాటు విషయమై రాజకీయ వర్గాల్లో మరింత ఆసక్తి రేపుతోంది. పొత్తుల్లో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో ఖమ్మం ఎంపీ సీటుతో పాటు మూడు నుంచి నాలుగు శాసనసభ స్థానాల్లో పోటీ చేసేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. టీడీపీ అధినాయకత్వం సైతం రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లోనే ఎక్కువ సీట్లు అడుగుతోంది. ప్రస్తుతం సిట్టింగ్ సీటు అయిన సత్తుపల్లి టీడీపీకి ఇవ్వడం లాంఛనమే. ఇక ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు లేనందున ఖమ్మం ఎమ్మెల్యే సీటును టీడీపీ ఆశిస్తోంది. ఇక్కడి నుంచి మాజీ ఎంపీ, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావును పోటీ చేయించేందుకు ఆ పార్టీ యోచిస్తోంది. ఇక మిగిలిన రెండు సీట్లు భద్రాద్రి జిల్లా నుంచి ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో అశ్వారావుపేట నియోజకవర్గంలో రెండో స్థానంలో నిలిచిన టీడీపీ తిరిగి ఆ స్థానాన్ని కోరుతోంది. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో ఓడిపోయిన మెచ్చా నాగేశ్వరరావునే దింపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ సీటును టీడీపీకి ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సైతం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక మరో సీటును ఇల్లెందు, పినపాక, భద్రాచలంలో ఎక్కడ ఇచ్చినా తీసుకునేందుకు టీడీపీ సిద్ధపడుతోంది. ఇల్లెందు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ కోసం పోటీ తీవ్రం గా ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారిందనే చెప్పవచ్చు. దీంతో ఈ సీటును టీడీపీ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌తో పొత్తుల్లో భాగంగా టీడీపీ తనకు టికెట్ ఇస్తే తిరిగి పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికార పార్టీలోకి వెళ్లిన ఓ నాయకుడు ప్రతిపాదన చేస్తున్నట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్‌లోకి వెళ్లిన మరొకరు కూడా టీడీపీ టికెట్ ఇస్తే తిరిగి చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక టీడీపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తుళ్లూరు బ్రహ్మయ్య సొంత నియోజకవర్గం పినపాక ఇచ్చినా.. తీసుకునేందుకు టీడీపీ వారు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసేందుకు వట్టం నారాయణ, బచ్చల భారతి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును బరి లోకి దించితే ఈ సీటును వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు టీడీపీ శ్రేణులు చెబుతున్నా యి. ఒకవేళ భద్రాచలం సీటు ఇచ్చినప్పటికీ పోటీ చేసేందుకు ఆ పార్టీ రెడీగా ఉంది. భద్రాచలం టికెట్ వస్తే వట్టం నారాయణను ఇక్కడ నుంచి పోటీ చేయించే ఆలోచనలో టీడీపీ ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ తో పొత్తుకు తాము దూరంగా ఉంటామని, బీఎల్ఎఫ్ ద్వారానే అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని సీపీఎం చెబుతోంది. కాగా, సమీకరణలు ఏమైనా మారి సీపీఎం కూడా కాంగ్రెస్ కూటమిలోకి వస్తే భద్రాచలం సీటును ఆ పార్టీకి ఇవ్వా ల్సి ఉంటుంది. ఇక కాంగ్రెస్ కూటమిలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న సీపీఐ కొత్తగూడెం సీటు విషయంలో పట్టుపడుతోంది. అయితే ఈ సీటు సాధించేందుకు కాం గ్రెస్ నుంచి మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, టీపీసీసీ సభ్యుడు ఎడవల్లి కృష్ణ పోటీపోటీగా కృషి చేస్తున్నారు. ఇక భద్రాచలం నియోజకవర్గంలో ఓటుబ్యాంకు గణనీయంగానే ఉన్న కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్థి లేరు. ఇల్లెందులో మాత్రం పోటీ తీవ్రంగా ఉంది. దీంతో కాంగ్రెస్ పరిస్థితి జిల్లాలో విచిత్రంగా తయారైంది. అంతర్గతంగా సమస్య పరిష్క రించి అసంతృప్తులను బుజ్జగిస్తారా లేక పొత్తుల్లో భాగం గా మిత్రపక్షాలకు కేటాయిస్తారా అనేది ప్రతిఒక్కరి లోనూ ఆసక్తిని కలిగిస్తోంది. కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలతో పొత్తు కన్నా టీడీపీతో పొత్తుపైనే జిల్లాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. -
చెరో దారేనా..?
సాక్షిప్రతినిధి, ఖమ్మం: వామపక్ష పార్టీలు ఎవరి వైపు మొగ్గు చూపుతాయనే అంశం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కమ్యూనిస్టుల కంచుకోటగా పేరొందిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వచ్చే శాసన సభ ఎన్నికల్లో వారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. 2009 వరకు దాదాపు ప్రతి ఎన్నికల్లో వామపక్షాలు ఒకే కూటమిగా ఏర్పడి.. వివిధ రాజకీయ పక్షాల మద్దతుతో పోటీ చేసి శాసనసభ స్థానాలతోపాటు లోక్‌సభ స్థానాలను సైతం గెలుపొందిన పరిస్థితి జిల్లాలో ఉండగా.. 2014 శాసనసభ, లోక్‌సభ ఎన్నికల నుంచి సీపీఐ, సీపీఎంలు వేర్వేరు రాజకీయ పక్షాలతో ఎన్నికల పొత్తు కుదుర్చుకుని వేరు కూటములు గా పోటీ చేశాయి. గత ఎన్నికల్లో సీపీఐ, కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల పొత్తు పెట్టుకోగా.. సీపీఎం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల అవగాహన కుదుర్చుకుంది. కాంగ్రెస్‌తో కుదిరిన పొత్తు మేరకు సీపీఐ ఖమ్మం ఎంపీ స్థానంతోపాటు కొత్తగూడెం, పినపాక, వైరా నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓటమి చెందింది. ఇక సీపీఎం మద్దతిచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం ఎంపీ స్థానంతోపాటు పినపాక, అశ్వారావుపేట, వైరా నియోజకవర్గాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తు సీపీఐ కుదుర్చుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. గతంలో పోటీ చేసిన కొత్తగూడెం, వైరా, పినపాక నియోజకవర్గాలతోపాటు అదనంగా అశ్వారావుపేటను కోరాలని సీపీఐ అధినాయకత్వం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుండగా.. సీపీఐతోపాటు టీడీపీ సైతం కాంగ్రెస్‌తో పొత్తు కోసం ప్రయత్నిస్తుందన్న వార్తల నేపథ్యంలో ఎవరు ఆశించినా సీట్లు ఎవరికి లభిస్తాయి.. కాంగ్రెస్ జిల్లాలో ఎన్ని స్థానాల నుంచి పోటీ చేస్తుందన్న అంశం ఉత్కంఠ రేపుతోంది. టీడీపీ సైతం గతంలో తాము పోటీ చేసిన స్థానాల్లో సత్తుపల్లితోపాటు మరికొన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. సీపీఎం మాత్రం ఈసారి బహుజన లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్ఎఫ్) పేరుతో కొత్త కూటమికి తెరలేపింది. తమతో కలిసి వచ్చే రాజకీయ పార్టీలతో కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ కూటమిలో ప్రధాన రాజకీయ పక్షంగా సీపీఎం ఉంది. రాజకీయ పక్షాలే కాకుండా సమాజాన్ని ప్రభావితం చేసే వివిధ రంగాల ప్రముఖులను సైతం కలుపుకునిపోయి.. వారిని ఆయా ప్రాంతాల్లో పోటీ చేయించే అంశాన్ని సైతం బీఎల్ఎఫ్ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. తటస్థ అభ్యర్థులు బీఎల్ఎఫ్ నుంచి పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు వారికి ఎన్నికల గుర్తు ఏది కేటాయించాల్సి ఉంటుంది. తటస్థ అభ్యర్థులుగా అన్ని వర్గాల ఓట్లను పొందే అవకాశం కోసం బీఎల్ఎఫ్ను రాజకీయ పార్టీగా సైతం నమోదు చేశారు. దీంతో ఆ ఫ్రంట్ తరఫున పోటీ చేసే వారికి రాష్ట్రవ్యాప్తంగా ఒకే ఎన్నికల గుర్తు వచ్చే అవకాశం లభిస్తుందని బీఎల్ఎఫ్ భావిస్తోంది. సీపీఎంకు బలం ఉన్న ఖమ్మం, మధిర, భద్రాచలం, పాలేరు వంటి నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులను పోటీ చేయించాలని సీపీఎం భావిస్తున్నా.. బీఎల్ఎఫ్ తరఫున తటస్థ అభ్యర్థులు ముందుకు వస్తే వారిని బలపరిచేందుకు సైతం వ్యూహ ప్రతివ్యూహాలు రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. భంగపడిన వారికి అవకాశం? ఇక ఆయా పార్టీల నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ పలువురు నేతలు సైతం బీఎల్ఎఫ్ నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్లు భావిస్తున్న ఫ్రంట్ వర్గాలు చివరి నిమిషం వరకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేయకుండా వేచి చూసే ధోరణి అవలంబించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక మధిర నియోజకవర్గం నుంచి సామాజిక ఉద్యమకారుడు, ప్రజా గాయకుడు గద్దర్‌ను ఎన్నికల బరిలో బీఎల్ఎఫ్ తరఫున రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే ఒక దశలో ఖమ్మం నియోజకవర్గం నుంచి ప్రముఖ పాత్రికేయుడు, రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్‌ను సైతం బీఎల్ఎఫ్ నుంచి పోటీ చేయాలని ఆహ్వానించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే త్వరలో జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన పోటీ చేసే అవకాశం ఉన్నందున ఖమ్మం నుంచి పోటీచేసే అవకాశం లేకపోవచ్చని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే గత ఎన్నికల్లో భద్రాచలంలో విజయం సాధించడం ద్వారా ఏకైక శాసనసభ స్థానాన్ని గెలుపొందిన సీపీఎం మళ్లీ అదే స్థానాన్ని నిలుపుకునేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తోంది. సీపీఎం నుంచి గెలుపొందిన సున్నం రాజయ్య ఈసారి ఆంధ్రప్రదేశ్‌లోని రంపచోడవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉండటంతో భద్రాచలం సీపీఎం అభ్యర్థిగా మాజీ ఎంపీ మిడియం బాబూరావును రంగంలోకి దింపాలని పార్టీ యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దుమ్ముగూడెం ప్రాంతానికి చెందిన బాబూరావు 2004లో భద్రాచలం నుంచి సీపీఎం తరఫు న ఎంపీగా గెలుపొందారు. ఇక సీపీఐ మాత్రం కాంగ్రెస్ తో ఎన్నికల అవగాహన కుదిరే అవకాశం ఉండటంతో జిల్లాలో తాము గతంలో పోటీ చేసిన ఖమ్మం ఎంపీతోపాటు మూడు నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ప్రధానంగా కొత్తగూడెం నియోజకవర్గంలో ఈసారి పాగా వేసేందుకు ఆ పార్టీ శక్తియుక్తులు ఒడ్డుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీపీఎం, సీపీఐలు ఈ ఎన్నికల్లో తమదైన రీతిలో రాజకీయ పంథాను అవలంబించడం.. రాజకీయంగా చెరో దారిలో పయనించే అవకాశం స్పష్టంగా కనపడుతుండటంతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ బహుము ఖ పోటీ తప్పదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. -
ఆనంద‘సాగు’రం
ఖమ్మంఅర్బన్: జిల్లాలోని రైతులకు..ముఖ్యంగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ (ఎన్నెస్పీ) కాల్వల పరిధిలో పంటలను సాగు చేసేవారికి ఈ ఏడాది సాగునీరు పుష్కలంగా అందనుంది. ఇప్పటికే ప్రాజెక్ట్ నిండుకుండలా మారడంతో రెండు పంటలకు జలాలు విడుదల చేసేందుకు ఢోకా లేదని అధికారులు ప్రకటించడంతో...జిల్లా రైతులు పంటల తడులకు ఇబ్బంది ఉండదని ఆనందసాగరంలో ఉన్నారు. మొత్తం 21మండలాలు ఉండగా..17 మండలాల పరిధిలో సాగర్ ప్రధాన కాల్వ పారుతోంది. ప్రత్యక్షంగా రెండు లక్షల 50వేల ఎకరాల వరకు సాగు అవుతుండగా, పరోక్షంగా మరో లక్ష ఎకరాలకు చెరువులు, కుంటలు, వాగులు, బావుల్లో నీరు ఊరి..సాగు కష్టాలు తీరతాయి. సాగర్ ఎడమకాల్వ మొత్తానికి ఈఏడాది 132 టీఎంసీల నీరు సాగు, తాగు నీటి అవసరాలకు విడుదల చేయాలని నిర్ణయించారు. దాంట్లో 99టీఎంసీలు తెలంగాణకు, మిగిలిన టీఎంసీలు ఏపీకి విడుదల చేసేందుకు నిర్ణయించారు. ఖరీఫ్‌లో ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో 45 టీఎంసీలు విడుదలకు నిర్ణయించగా మన జిల్లాలోని ఆయకట్టుకు 20 టీఎంసీలు వాడుకోనున్నారు. దీని ద్వారా ఖమ్మం ఎన్నెస్పీ సర్కిల్ పరిధిలో మొత్తంగా లక్షా 26 వేల ఎకరాల వరకు వరి పైర్లకు, లక్షా 28 వేల ఎకరాల్లో ఆరుతడి పంటలైన మిర్చి, పత్తి, మొక్కజొన్న, చెరకు, ఇతరత్రా కూరగాయలు సాగుకు నీరందనుంది. చుక్కనీరు వృథా కాకుండా..ఆయకట్టు చివరి భూములవరకు సాగు నీరు అందించేందుకు ప్రణాళిక ప్రకారం వ్యవహరించాలని ఇటీవల జరిగిన ఇంజినీర్ల సమావేశంలో ఎన్నెస్పీ ఎస్ఈ సుమతీదేవి సూచించారు. గతేడాది నిరాశే.. జిల్లాలోని 16–17 బ్రాంచ్కాల్వ, బోనకల్, మధిర బ్రాంచ్ కాల్వల పరిధిలోని రెండు వేల కిలోమీటర్ల మేజర్లు, మైనర్లు, సబ్ మైనర్ కాల్వల ద్వారా రైతుల పంట భూములకు సాగర్ నీరు అందిస్తుంటారు. గతేడాది ఖరీఫ్‌కు సాగర్ నీరు విడుదల చేయలేదు. అయినా కొంతమంది రైతులు మొండిగా..పంటలు వేసి, నీరందక ఇబ్బంది పడుతుండడంతో మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వరరావులు ఆయకట్టుకు అక్టోబర్ నెలలో జలాలు విడుదల చేయించారు. అదీ..వారబందీ విధానంతో అమలు చేశారు. తర్వాత రబీ సాగుకు కూడా 9రోజులు ఆన్, 6 రోజులు ఆఫ్ విధానంలో మొత్తం 8తడుల నీరు క్రమపద్ధతిలో అందించడంతో గండం తొలగింది. ఈఏడాది ఖరీఫ్‌కు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సాగునీటి కష్టం ఉండబోదు. గత నెలలో మిర్యాలగూడెంలో జరిగిన ఎన్నెస్పీ, ఆయకట్టు పరిధి రైతుల సంయుక్త సమావేశంలో జిల్లా నుంచి హాజరైన మాజీ నీటి సంఘాల చైర్మన్లు..గతేడాది రబీ తరహాలోనే వారబందీ విధానంలో విడుదల చేసినా సరిపోతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. తద్వారా తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ దిగుబడి కూడా వచ్చిందని వివరించారు. అయితే..నీటి నిల్వలు పుష్కలంగా ఉండడంతో ఇంజినీర్లు మాత్రం నిరంతరాయంగా మొదటి తడి వరకే ఇవ్వడానికి నిర్ణయించారు. వారబందీ విధానం ద్వారా అయితేనే నీటి వినియోగం తక్కువగా ఉంటుందని, పైగా దిగుబడి పెరగడంతోపాటు, తర్వాత కాలంలో రబీ సాగు, విద్యుత్ తయారీ, తాగు నీటి అవసరాలకు సాగర్ నీరు ఉపయోగ పడుతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎంతో ఆనందంగా ఉంది.. గత 20రోజుల కిందట కూడా సాగర్ ఆయకట్టు పరిధిలో నీళ్లిస్తారో లేదోనని భయం భయంగా ఉన్నాం. ఇప్పుడు ప్రాజెక్ట్‌లోకి నీరు పుష్కలంగా చేరడంతో మా చింత తీరింది. నీళ్లొస్తే..బోర్లు, బావుల్లో ఊట పెరుగుద్ది. ఆయకట్టు పరిధిలోని పంటలకు డోకా ఉండదు. – మంకిన వెంకటేశ్వర్లు, చెన్నారం రైతు నేలకొండపల్లి మండలం -
గురువులే మార్గదర్శకులు
ఖమ్మంసహకారనగర్: ఈ సమాజంలో గురువులే మార్గదర్శకులని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గడిపల్లి కవిత అన్నారు. ఉపాధ్యాయులు వృత్తికే వన్నె తీసుకొస్తారని, విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తారని తెలిపారు. బుధవారం ఖమ్మంలోని ఎస్ఆర్ గార్డెన్స్‌లో గురుపూజోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె జ్యోతి ప్రజ్వలన చేశారు. డీఈఓ పి.మదన్మోహన్ అధ్యక్షతన మిగతా జిల్లా వ్యాప్తంగా 29మంది ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించి, జ్ఞాపిక, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు ఉపాధ్యాయులే కీలకపాత్ర పోషించాలన్నారు. జిల్లాలో గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలన్నారు. నూటికినూరు శాతం ఫలితాలు వచ్చేలా ఉపాధ్యాయుల బోధన విధానం ఉండాలన్నారు. మరింత నాణ్యమైన, మెరుగైన విద్యను అందించడమే లక్ష్యమన్నారు. పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తోందని, అందుకనుగుణంగా విద్యాశాఖ, ఉపాధ్యాయులు శ్రద్ధ పెంచాలన్నారు. అప్పుడే ఆశించిన లక్ష్యం సాధ్యమవుతుందని తెలిపారు. ఆ దిశగా అధికార యంత్రాంగం, ఉపాధ్యాయులు ముందుకు సాగాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కమర్, డీసీఈబీ సెక్రటరీ కనపర్తి వెంకటేశ్వర్లు, 7వ డివిజన్ కార్పొరేటర్ చేతుల నాగేశ్వరరావు, ఏడీ మురళీకృష్ణ, ఖమ్మంఅర్బన్ ఎంఈఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీకో కార్యదర్శి
ఖమ్మం సహకారనగర్: పంచాయతీల పరిధిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం.. వాటిని పరిష్కరించేందుకు మరింత పటిష్టమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. గ్రామస్థాయిలో అభివృద్ధి తదితర అంశాల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శులదే కీలకపాత్ర. జిల్లాలో ప్రస్తుతం కార్యదర్శులు తక్కువగా ఉండడం.. వారికి ఇతర పంచాయతీల బాధ్యతలు అప్పగించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదనపు బాధ్యతలు నిర్వర్తించే కార్యదర్శులు కూడా విధి నిర్వహణకు పూర్తి సమయం కేటాయించలేని పరిస్థితి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రతి పంచాయతీకి కార్యదర్శిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అందుకు సంబంధించిన ఉత్తర్వులను కూడా జారీ చేసింది. దీంతో పాత పంచాయతీలతోపాటు కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు కార్యదర్శులను నియమించనున్నారు. జిల్లాలో మొత్తం 584 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో పాత పంచాయతీలు 427 కాగా.. ఆగస్టు 2వ తేదీ నుంచి 167 గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పడ్డాయి. అదే సమయంలో 10 గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల పరిధిలో విలీనమయ్యాయి. మొత్తం పంచాయతీలకు కలిపి కేవలం 102 మంది కార్యదర్శులున్నారు. దీంతో ఖాళీగా ఉన్న గ్రామ పంచాయతీలకు కూడా కార్యదర్శులను నియమించి.. స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కార్యదర్శులు అందుబాటులో లేక.. 584 గ్రామ పంచాయతీలలో 102 మంది కార్యదర్శులు మాత్రమే ఉండటంతో పనిభారంతో ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్కరికీ 3 నుంచి 4 గ్రామాల బాధ్యతలను అప్పగించడంతో ఏ సమయంలో ఎక్కడ ఉంటారో అర్థంకాని పరిస్థితి. ఒకవైపు పని ఎక్కువగా ఉందని కార్యదర్శులు వాపోతుండగా.. మరోవైపు ప్రజలు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న సర్టిఫికెట్ కావాలన్నా.. అత్యవసరంగా గ్రామ కార్యదర్శి సంతకం కావాలన్నా రోజుల తరబడి కార్యదర్శుల కోసం వేచి ఉండాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. కార్యదర్శి ఏ గ్రామంలో ఉన్నాడో అర్థం కాకపోవడం, తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తే అక్కడ కూడా కార్యదర్శుల జాడ లేకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. ఇక విద్యార్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యదర్శుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. 485 పోస్టుల భర్తీ.. జిల్లాలో మొత్తం 584 గ్రామ పంచాయతీలుండగా.. 102 మంది మాత్రమే కార్యదర్శులున్నారు. మిగిలిన వాటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీగా ఉన్న 485 పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులు భర్తీ అయితే స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు త్వరితగతిన పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఇదే అవకాశం.. జిల్లాలో పంచాయతీ కార్యదర్శి పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావడంతో నిరుద్యోగ అభ్యర్థుల్లో ఆశలు మొదలయ్యాయి. ఈనెల 3 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా, ఈనెల 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇటీవల ప్రతిపాదించిన జోనల్ వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో వెంటనే పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న గ్రామ పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేయడంతోపాటు కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లో కూడా నూతన కార్యదర్శులను నియమించనున్నది. దీంతో ప్రస్తుతం ఉన్న పనిభారంతో సుదూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు ఇబ్బందులు తప్పనున్నాయి. పోస్టుల భర్తీ విషయంలో ప్రభుత్వం నిర్ణయం హర్షణీయం. – చెరుకూరి పవన్, పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా కార్యదర్శి -
విషాదానికి 25 ఏళ్లు
కరకగూడెం (ఖమ్మం): మణుగూరు సబ్ డివిజన్లో పినపాక, కరకగూడెం ఏజెన్సీ ప్రాంతాల్లో 25 ఏళ్ల క్రితం మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. సమాంతర ప్రభుత్వాన్ని తలపించే రీతిలో మావోయిస్టులు పోలీసులకు సవాల్ విసిరేవారు. అయితే వారిని అణచివేసేందుకు పోలీసు శాఖ ప్రత్యేక వ్యూçహాలు రచించేది. ఇలా ఇరు వర్గాల మధ్య భీకర పోరు సాగేది. ఈ క్రమంలో 1992 సెప్టెంబర్ 4వ తేదీన పినపాక–కరకగూడెం మండలాల మధ్య గల రాళ్లవాగు వద్ద మావోయిస్టులు బ్రిడ్జిని పేల్చివేశారు. ఈ భారీ విస్ఫోటనానికి ఐదు మందు పాతరలను వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. ఉమ్మడి పినపాక మండలంలో మావోయిస్టు కదలికలను అరికట్టేందుకు కరకగూడెంలో నూతన పోలీస్‌స్టేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భద్రత కోసం వస్తూ ప్రాణాలు కోల్పోయారు.. కాగా, కరకగూడెం స్టేషన్ భద్రత కోసం ఏడూళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్ నుంచి 10 మంది సిబ్బంది జీపులో కరకగూడెం పోలీస్ స్టేషన్‌కు బయలుదేరారు. వారి కదలికలను అడుగడుగునా తెలుసుకున్న మావోయిస్టులు పక్కా ప్రణాళికతో రాళ్లవాగు బ్రిడ్జికి మందుపాతరను అమర్చారు. 1992 సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రం 4 గంటలకు రాళ్లవాగు వద్దకు చేరుకున్న పోలీసుల జీపును మావోయిస్టులు పేల్చి వేశారు. పూర్తి అటవీ ప్రాంతమైన రాళ్లవాగు వద్ద నుంచి భారీ శబ్దాలు రావడంతో ఏజెన్సీ గ్రామాలు ఉలిక్కిపడ్డాయి. వేలాది మంది ఘటనా స్థలానికి చేరుకుని, పోలీసులు ప్రయాణిస్తున్న తునాతునకలయిన జీపును, చెట్టుకొకటి, పుట్టకొకటిగా పడి ఉన్న పోలీసుల మృతదేహాలు గమనించి తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన ఉమ్మడి రాష్ట్రంలో పెను సంచలనంగా నిలిచింది. ఇప్పటికీ ఏడూళ్ల బయ్యారం నుంచి కరకగూడెం రావాలంటే పోలీసులు భారీ బందోబస్తుగానే వస్తుంటారు. పోలీస్ శాఖలో రాళ్లవాగు ఘటన పెను విషాదాన్ని నింపింది. ఆనాటి విషాద ఘట్టంలో అమరులైన పోలీసులు వీరే.... డి. నరేందర్ పాల్ (రిజర్వ్ ఇన్స్పెక్టర్), ఎస్ఏ. జార్జ్ (సబ్ ఇన్స్పెక్టర్), డి. ప్రభాకర్ రావు (ఏఆర్ ఎస్సై), ఐ. రామారావు (హెడ్ కానిస్టేబుల్), కానిస్టేబుళ్లు డి. శంకర్‌బాబు, జి. నాగేశ్వరరావు, ఎం. వెంకటేశ్వరరావు, జి. సత్యనారాయణ, వై.బేబిరావు, టి. సుబ్బారావు అమరుల త్యాగాలు చిరస్మరణీయం సమాజంలో పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. అలాగే వెలకట్టలే నివి. ప్రజల మధ్యలో ఉంటూ సమాజ శ్రేయస్సే ధ్యేయంగా విధి నిర్వహణలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా అమరులైన పోలీసులను ప్రతి రోజు స్మరించుకుంటున్నాం. వారి ఆశయ సాధనకు కృషి చేస్తాం. – ఆర్ సాయిబాబా మణుగూరు డీఎస్పీ స్మరించుకోవడం అందరి బాధ్యత సమాజ శ్రేయస్సే లక్ష్యంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరించుకోవడం అందరి బాధ్యత. అలాగే అమరుల కర్తవ్యం, త్యాగాలను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలి. – ఇ రాజ్‌కుమార్ కరకగూడెం ఎస్సై -
చర్చోపచర్చలు..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ముందస్తు ఎన్నికలున్నట్లు ప్రచారమవుతున్న నేపథ్యంలో జిల్లాలోని పార్టీలన్నీ భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించాయి. ప్రధానంగా టీఆర్ఎస్ ఒంటరి పోరుకు సిద్ధం కాగా.. కాంగ్రెస్ మాత్రం కలిసొచ్చే పార్టీలతో మిత్రుత్వానికి సిద్ధం కావడంపై ఆ పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్.. సీపీఐతో ఎన్నికల పొత్తు పెట్టుకుని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం లోక్‌సభతోపాటు మూడు అసెంబ్లీ నియోజకవర్గాలను ఆ పార్టీకి కేటాయించింది. ఈసారి ఎన్నికల్లో సీపీఐతో మాత్రమే కాకుండా టీడీపీతో ఎన్నికల పొత్తు అంశం తెరపైకి రావడంతో ఈసారి మిత్రపక్షాలుగా టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ పోటీ చేసే పరిస్థితి ఏర్పడింది. దీంతో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐలలో ఎవరికి ఏ సీటు లభిస్తుంది? పొత్తులో లాభపడేది ఎవరు? సీటు కోల్పోయేది ఎవరు? అనే అంశంపై ఆయా పార్టీల్లో జోరుగా ఊహాగానాలు, చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్.. సీపీఐతో పొత్తులో భాగంగా ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి సీపీఐకి చెందిన జాతీయ నేత నారాయణ పోటీ చేయగా.. మహబూబాబాద్ ఎంపీ స్థానానికి సీపీఐ మద్దతుతో మాజీ మంత్రి బలరాంనాయక్ ఎన్నికల బరిలోకి దిగారు. ఇక వైరా, కొత్తగూడెం, పినపాక నియోజకవర్గాల్లో సీపీఐ అభ్యర్థులు బరిలోకి దిగగా.. కాంగ్రెస్ మద్దతిచ్చింది. మిగిలిన ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు సీపీఐ మద్దతు ప్రకటించగా.. ఉమ్మడి జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ గెలుపొందింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కొత్తగూడెం టికెట్ ఆశించి.. ఎన్నికల పొత్తు వల్ల చివరి నిమిషంలో టికెట్ చేజారడంతో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు వైఎస్సార్ సీపీలో చేరి కొత్తగూడెం శాసనసభ బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావు విజయం సాధించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌తో పొత్తుకు ఉబలాటపడుతున్న టీడీపీ ఖమ్మం లోక్‌సభ స్థానంపై కన్నేసి.. ఆ స్థానం కోసం పట్టుపడుతున్నట్లు ఇరు పార్టీల్లోనూ జోరుగా ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన నామా నాగేశ్వరరావు కాంగ్రెస్ మద్దతుతో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సమాయత్తమవుతున్నారని, ఈ మేరకు పార్టీ శ్రేణులకు సైతం రాజకీయ పరిస్థితులను వివరిస్తూ.. కాంగ్రెస్‌తో మైత్రి అంశాన్ని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రెండూ కోరుతున్నట్లు ప్రచారం అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా నుంచి టీడీపీ తరఫున ఎన్నికైన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సిట్టింగ్ అభ్యర్థి కావడంతో ఖమ్మం ఎంపీ స్థానంతోపాటు సత్తుపల్లి స్థానాన్ని టీడీపీ గట్టిగా కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున టీడీపీ అభ్యర్థి సండ్రతో సత్తుపల్లిలో తలపడిన మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌ను కాంగ్రెస్ పార్టీ ఎక్కడ సర్దుబాటు చేస్తుందన్నది ఉత్కంఠ రేపుతోంది. పాలేరు నియోజకవర్గంలో పలుమార్లు విజయం సాధించిన సంభాని ఈసారి జనరల్ స్థానమైన పాలేరు నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో దళితులు, గిరిజనులకు టికెట్లు ఇచ్చి గెలిపించుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని, అదే తరహాలో తనకు పాలేరు టికెట్ ఇవ్వాలని సంభాని పట్టుపడుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే టీడీపీతో ఎన్నికల పొత్తు దాదాపు ఖాయమని భావిస్తున్న కాంగ్రెస్ వర్గాలు సంభానిని ఎలా సర్దుబాటు చేస్తారనే అంశంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక 1999, 2004 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించడంతోపాటు కేంద్ర మంత్రిగా పనిచేసిన రేణుకా చౌదరి 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై ఓడిపోయారు. అప్పటి నుంచి జిల్లా రాజకీయాలను అంటిపెట్టుకుని ఉంటున్న రేణుక.. 2014లో కాంగ్రెస్, సీపీఐ ఎన్నికల పొత్తు వల్ల ఖమ్మం లోక్‌సభ స్థానాన్ని సీపీఐకి కేటాయించడంతో ఆ ఎన్నికల్లోనూ పోటీ చేసే అవకాశం కోల్పోయారు. ఈసారి సైతం ఎన్నికల పొత్తులో ఈ స్థానం సీపీఐకి కాకుండా టీడీపీకి ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు వస్తున్న వార్తలతో రేణుకాచౌదరి ఈసారి కూడా పోటీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా? ఆమెకు మరో సుస్థిర స్థానాన్ని ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందా? అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. టీడీపీ, కాంగ్రెస్‌లకు పొత్తు ఉంటే.. రాష్ట్ర, కేంద్ర మాజీ మంత్రులు సంభాని చంద్రశేఖర్, రేణుకాచౌదరి భవితవ్యం ఎలా ఉంటుంది? పార్టీ వారిని ఏ విధంగా సంతృప్తి పరుస్తుంది? ఎక్కడి నుంచి పోటీ చేయిస్తుందన్న అంశం చర్చనీయాంశంగా మారింది. అలాగే ఖమ్మం ఎంపీ స్థానం నుంచి ఈసారి కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని శాసన మండలి ఉపనేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి పార్టీ అధిష్టానాన్ని కోరడంతోపాటు తనకున్న పరిచయాల ద్వారా పార్టీని ఒప్పించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరికొన్ని సీట్లంటున్న టీడీపీ.. ఇక కాంగ్రెస్‌తో పొత్తుకు సై అంటున్న టీడీపీ.. ఖమ్మం ఎంపీ టికెట్‌తోపాటు సత్తుపల్లి సిట్టింగ్ స్థానం కావడంతో ఈ రెండు స్థానాలే కాకుండా గత ఎన్నికల్లో పోటీ చేసిన పాలేరు, అశ్వారావుపేట, కొత్తగూడెం, భద్రాచలం స్థానాలను కాంగ్రెస్‌ను అడుగుతున్నట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే రాష్ట్రం మొత్తంమీద కాంగ్రెస్ పార్టీ టీడీపీకి 15 లేదా.. అదనంగా ఒకటి, రెండు కేటాయించే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా నుంచి టీడీపీ నేతలకు ఎంతమందికి అవకాశం కల్పించడం సాధ్యమవుతుందన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో ఉత్పన్నమవుతోంది. ఇక గత ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీచేసి ఇప్పటికీ టీడీపీలోనే కొనసాగుతున్న పార్టీ సీనియర్ నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, కొత్తగూడెం నుంచి పోటీ చేసిన కోనేరు సత్యనారాయణ(చిన్ని), అశ్వారావుపేట నుంచి పోటీ చేసి ఓటమి చెందిన మెచ్చా నాగేశ్వరరావు, ఖమ్మం నుంచి పోటీ చేసేందుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య ఆసక్తి కనబరుస్తుండడంతో వీరిలో ఎవరి కల నెరవేరుతుంది? ఎన్నికల పొత్తు ఎంతమందికి కలిసొస్తుందన్న అంశంపై టీడీపీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అలాగే జనరల్ స్థానాలైన ఖమ్మం, కొత్తగూడెం, పాలేరు నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్, టీడీపీల నుంచి అనేక మంది పోటీ పడుతుండగా.. వీరిలో ఎవరికి టికెట్ లభిస్తుందన్న అంశం ఉత్కంఠ రేపుతోంది. సీపీఐ కూడా.. ఇక కాంగ్రెస్‌తో పొత్తు కొనసాగితే సీపీఐ వచ్చే ఎన్నికల్లోనూ ఖమ్మం ఎంపీ స్థానంతోపాటు గతంలో పోటీ చేసిన వైరా, కొత్తగూడెం, పినపాకతోపాటు మరో రెం డు స్థానాలను అదనంగా అడగాలని యోచిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మూడు రాజకీ య పక్షాలు ఖమ్మం జిల్లాలో ఆయా ప్రాంతాల్లో బలం గా ఉండటం.. ఎన్నికల మైత్రి ఆ పార్టీలకు లాభించే అవకాశం ఉన్నా.. సీట్ల సర్దుబాటు ఎలా కొనసాగుతుంది.. అనే అంశంపై రాజకీయ వర్గాల్లో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రస్థాయిలో కాంగ్రెస్, టీడీపీల మధ్య ఎన్నికల అవగాహన చర్చలు కొలిక్కి వచ్చాయన్న ప్రచారం ఊపందుకోవడంతో ఖమ్మం ఎంపీగా కాంగ్రెస్ మద్దతుతో నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ మద్దతుతో టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్యకు దాదాపు టికెట్ ఖాయమన్న ప్రచారం టీడీపీ వర్గాల్లో కొనసాగుతోంది. అయితే జిల్లాలోని ఆయా నియోజకవర్గాలపై ఆశలు పెట్టుకుని అనేక ఏళ్లుగా కాంగ్రెస్‌లో పని చేస్తున్న నేతలను ఆ పార్టీ ఎలా సర్దుబాటు చేస్తుందనేది ప్రధానంగా చర్చనీయాంశమైంది. కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి ఒక దశలో కాంగ్రెస్ తరఫున ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నా.. అదే సమయంలో ఆమె హైదరాబాద్‌కు సమీపంలోని మరో లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసే అవకాశాలున్నట్లు ప్రచారమవుతోంది. ఇక గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన వనమా.. ఈసారి పొత్తులో కొత్తగూడెం స్థానాన్ని కాంగ్రెస్‌కు కేటాయించాలని, టికెట్ తనకే ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానానికి విన్నవించడమే కాకుండా.. తనకున్న పరిచయాలతో పార్టీ పెద్దలను ఒప్పించే ప్రయత్నంలో నిమగ్నమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇక అదే నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి.. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఆశీస్సులతో కాంగ్రెస్‌లో చేరిన ఎడవల్లి కృష్ణ సైతం కొత్తగూడెం ఎమ్మెల్యే స్థానానికి కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారమవుతోంది. ఇందుకు రేణుకాచౌదరి ఆశీస్సులున్నాయని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుండడంతో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ మిత్రపక్షాల్లో ఈ సీటు ఎవరికి లభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. -
ఏదీ భరోసా..
ఖమ్మం సహకారనగర్: పట్టుదలతో చదివారు.. సర్కారు కొలువులు సాధించారు. ఇక బంగారు భవిష్యత్ ఉందనుకున్నారు. సర్వీసు పూర్తయి.. ఉద్యోగ విరమణ తర్వాత జీవితానికి ఆర్థిక భద్రత, విధి నిర్వహణలో ప్రాణా లు కోల్పోయినా.. ఆ కుటుంబానికి ఆర్థిక తోడ్పాటు, ప్రత్యేక ప్రయోజనాలు, సామాజిక భద్రతగా పెన్షన్ వస్తుందనుకున్నారు. కానీ.. ఇదంతా ఒకప్పటి మాట. ప్రస్తుతం పరిస్థితి మారింది. దశాబ్ద కాలంగా అమలవుతున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) ద్వారా ఉద్యోగులకు భవిష్యత్తుపై భరోసా కరువవుతోంది. వారిని ఆందోళనలు, పోరాటాల బాట పట్టేలా చేసింది. శనివారం జిల్లావ్యాప్తంగా సీపీఎస్ ఉద్యోగులు టీటీజేఏసీ, రెవెన్యూ తదితర ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. ప్రకటన ఇలా.. సీపీఎస్ విధానంపై 2003, డిసెంబర్ 22న కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. 2004, జనవరి 1 నుంచి సీపీఎస్‌ను అమలులోకి తెచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2004, సెప్టెంబర్ 1 నుంచి సర్వీసులో చేరిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల ఉద్యోగులు, విశ్వవిద్యాలయ గ్రాంట్ ఇన్ ఎయిడెడ్ పొందుతున్న సంస్థల్లోని ఉద్యోగులు, అటానమస్ కార్పొరేషన్ పరిధిలోని ఉద్యోగులందరికీ జీఓ నం.653, 654, 655 కింద 2004, నవంబర్ 22 నుంచి అమలు చేస్తోంది. దీనిని పెన్షన్ నిధి నియంత్రణ, అభివృద్ధి, ప్రాధికార సంస్థ(పీఎఫ్ఆర్డీఏ), నేషనల్ సెక్యూరిటీ డిపాజిట్ లిమిటెడ్(ఎన్ఎస్డీఎల్) అనే ప్రైవేటు సంస్థల సమన్వయంతో దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. సీపీఎస్ విధానంలో రకాలు.. సీపీఎస్ విధానంలో టైర్–1, టైర్–2 అనే రెండు రకాల ఖాతాలున్నాయి. ప్రస్తుతం ఉద్యోగ, ఉపాధ్యాయులకు టైర్–1 ఖాతాను మాత్రమే అమలు చేస్తున్నారు. టైర్–2లో ఎప్పుడైనా డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. తన పొదుపును తనకు నచ్చిన సంస్థల్లో పెట్టుబడి పెట్టుకోవచ్చు. కానీ.. ప్రస్తుతం టైర్–2ను అమలు చేయడం లేదు. టైర్–1 కింద ఉద్యోగ విరమణ చేస్తే.. ఉద్యోగి చందాకు సమానంగా ప్రభుత్వం తన వాటాను జమ చేయగా.. వచ్చిన మొత్తంలో ఉద్యోగ విరమణ చేశాక 60 శాతం మాత్రమే అతడికి చెల్లిస్తారు. అందులోనూ 30 శాతానికిపైగా వివిధ రకాల పన్నులు, చార్జీల రూపేణా మినహాయించుకుంటారు. మిగిలిన 40శాతం యాన్యూటీ పథకాల్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ బాండ్ల నుంచి వచ్చే డబ్బును ఉద్యోగి, అతడి కుటుంబ సభ్యులకు ఉద్యోగ విరమణ తర్వాత నెలనెలా పెన్షన్‌గా 70 ఏళ్ల వరకు చెల్లిస్తారు. ఆ తర్వాత మిగిలిన డబ్బు మొత్తం(ఆదాయపు పన్ను మినహాయించుకొని) ఇస్తారు. సీపీఎస్‌లోని లోపాలివే.. 30 నుంచి 35 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసి.. రిటైర్మెంట్ అయితే ఆసరాగా ఉండాల్సిన పెన్షన్ ఎంత వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఉద్యోగి సర్వీస్‌లో ఉండగా మరణిస్తే సీపీఎస్ అకౌంట్లో జమ అయిన డబ్బులు తిరిగి వచ్చే అవకాశం కష్టం. ఫండ్ మేనేజర్స్‌ను ఎంపిక చేసుకునే స్వేచ్ఛా స్వాతంత్య్రాలు చందాదారులకు లేకపోవడం. ఉద్యోగి తన సర్వీస్ కాలంలో 25 శాతం మాత్రమే విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. అది కూడా పదేళ్ల సర్వీస్ పూర్తయి ఉండాలి. ఉద్యోగ కాలంలో మూడుసార్లకు మించి అవకాశం లేదు. ప్రతి రెండు విత్‌డ్రాల మధ్య మూడేళ్ల విరామం పాటించాలి. విత్‌డ్రాలు కూడా ప్రత్యేక అవసరాలకు మాత్రమే. ఉదాహరణ ఇలా.. ప్రస్తుతం డీఎస్సీ–2008 ఉద్యోగుల మూలవేతనం రూ.26వేలు ఉంటే.. రిటైర్మెంట్ నాటికి మూల వేతనం రూ.80వేలు అనుకుంటే.. పాత పెన్షన్ లెక్కల్లో నెలకు మూల వేతనం రూ.40వేల పెన్షన్ వస్తుంది. కానీ.. నూతన పెన్షన్ విధానంలో ఎంత పెన్షన్ వస్తుందో చెప్పలేని పరిస్థితి. సీపీఎస్ అంశం రాష్ట్ర పరిధిలోనిదే.. సీపీఎస్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ జాతీయ స్థాయిలో పెద్ద ఉద్యమమే మొదలైంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం అయినందున దీనిని రద్దు చేయలేమని కొన్ని రాష్ట్రాలు పేర్కొంటున్నాయి. ఇటీవల ప్రవేశపెట్టిన జీఎస్టీ బిల్లును కొన్ని రాష్ట్రాలు ఆమోదించిన తర్వాతే కేంద్రం అమల్లోకి తెచ్చింది. ప్రస్తుతం త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా పాత పెన్షన్ విధానమే అమల్లో ఉంది. సమాచార హక్కు చట్టం కింద వివరాలను కోరినప్పుడు.. ఇది కేవలం రాష్ట్రాల పరిధిలోని అంశం మాత్రమే అని కేంద్రం స్పష్టం చేసినట్లు పలువురు ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. సీపీఎస్ విధానం రద్దు చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి పీఎఫ్ఆర్డీఏ నుంచి సుమారు రూ.3వేల కోట్లు వస్తాయని, నెలనెలా చెల్లించే రూ.300కోట్లు మిగులుతాయని, 1.27 లక్షల మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు కలిపి దాదాపు 4లక్షల మంది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతుగా నిలుస్తారని చెబుతున్నారు. ఉద్యోగుల పోరుబాట.. సీపీఎస్ రద్దు కోరుతూ తెలంగాణ టీచర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పలు టీచర్ల సంఘా లు ఐక్య ఉద్యమాలు చేస్తున్నాయి. దీంతోపాటు సీపీఎస్‌ను రద్దు చేయాలని ఏర్పాటైన రాష్ట్ర సీపీ ఎస్ ఉద్యోగుల సంఘం మూడేళ్లుగా ఆందోళనలు చేస్తోంది. కాగా.. జిల్లాలో 6వేల మంది సీపీఎస్ ఉద్యోగులున్నారు. రద్దు చేసే వరకూ ఆందోళనలు.. సీపీఎస్ రద్దు చేసి.. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించే వరకు ఆందోళనలు కొనసాగిస్తాం. ఇప్పటికే రాష్ట్రంలో సుమారు వెయ్యి మంది ఉద్యోగ విరమణ పొందారు. 260 మంది వరకు చనిపోయారు. సీపీఎస్ అంశం తమ పరిధిలోనిది కాదనేది అవాస్తవం. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు. – చంద్రకంటి శశిధర్, జిల్లా అధ్యక్షుడు, టీఎస్ సీపీఎస్ ఈయూ కేంద్రం జోక్యం అవసరం లేదు.. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి.. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. దీనికి కేంద్రం జోక్యం అవసరం లేదు. ఇతర రాష్ట్రాల్లో పాత పెన్షన్ విధానం అమలు చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రం పరిధిలోనిదిగా చెబుతూ.. దాటవేస్తోంది. దీంతో అనేక కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. – దేవరకొండ సైదులు, యూటీఎఫ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
హస్తం.. సమాయత్తం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: సార్వత్రిక ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్కు దీటుగా నిలిచేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది. అయితే పార్టీలో సంస్థాగతంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించి.. అందరినీ సమన్వయం చేయడంతోపాటు కలుపుకుని పోయే నేత కోసం కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. ఆది నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌కు ఆయువుపట్టుగా ఉంది. రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభంజనం వీచినా.. ఎదురొడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటిన సంఘటనలు అనేకం ఉన్నాయి. 2014లో రాష్ట్రమంతటా టీఆర్ఎస్ గాలి వీచినా.. ఉమ్మడి జిల్లాలో మాత్రం కాంగ్రెస్ నాలుగు శాసనసభ స్థానాలను గెలుపొంది.. మెజార్టీ శాసనసభ స్థానాలను గెలుచుకున్న పార్టీగా జిల్లాలో గుర్తింపు పొందింది. కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్తేజం కలిగించేందుకు, ప్రత్యర్థి పార్టీల వ్యూహాలకు దీటుగా వ్యూహ ప్రతివ్యూహాలు రూపొందించేందుకు జిల్లా పార్టీ నేతలు ప్రణాళికలు రూపొందించుకున్నా.. వర్గ పోరు వల్ల ఒకరు అవునంటే.. మరొకరు కాదనే పరిస్థితి ఉండటం.. దీనికి అధిష్టానం ఆమోదముద్ర అవసరం ఉండటం వంటి కారణాలతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేతలు దూకుడు పెంచలేకపోతున్నారనే భావన కార్యకర్తల్లో నెలకొంది. డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న అయితం సత్యం మరణంతో ఖాళీ అయిన కాంగ్రెస్ అధ్యక్ష పదవి నియామకం దాదాపు ఆరు నెలలు గడిచినా.. ఇప్పటికీ కొలిక్కి రాలేదు. దీనికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గ పోరే కారణమన్నది బహిరంగ రహస్యమే. దీనిపై అధిష్టానం సత్వర నిర్ణయం తీసుకుంటుందని, పార్టీ కార్యకర్తల్లో ఉత్తేజం నింపడంతోపాటు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పార్టీ కార్యకలాపాలను వేగిరం చేసేందుకు ఊతమిచ్చేలా చర్యలు తీసుకుంటుందని భావించిన కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతల ఆశలు ఇప్పటికీ ఫలించలేదు. మనోధైర్యం కల్పించే ప్రయత్నం.. రెండు నెలల క్రితం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఉత్తేజం నింపేందుకు, క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వచ్చే ఎన్నికల్లో వారిని కార్యోన్ముఖులను చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ జిల్లాలోని పలు నియోజకవర్గాల నాయకులు, ద్వితీయ శ్రేణి నేతలతో ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాలను పర్యవేక్షించే సలీం అహ్మద్.. జిల్లాలో రెండు రోజులపాటు పర్యటించి కార్యకర్తల్లో మనోధైర్యం కల్పించే ప్రయత్నం చేశారు. ఆయనకు జిల్లా పరిస్థితి గురించి కార్యకర్తలు నిర్మొహమాటంగా, కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నేతలకే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలని, స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలని, ఇతర ప్రాంతాల నుంచి నేతలను దిగుమతి చేసే విధానానికి ఈ ఎన్నికల్లోన్నైనా స్వస్తి చెప్పాలని పలువురు నేతలు, ద్వితీయ శ్రేణి నాయకులు ఏఐసీసీ కార్యదర్శికి విన్నవించారు. అలాగే డీసీసీ అధ్యక్ష పదవిని జిల్లాలోని అన్ని వర్గాలను సమన్వయం చేసి.. పార్టీ పట్ల అంకితభావం, పట్టున్న నేతకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. జలగంను చేర్చుకోవాలనే డిమాండ్.. ఇక సత్తుపల్లి నియోజకవర్గంతోపాటు మరికొన్ని నియోజకవర్గాల కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు మాజీ మంత్రి జలగం ప్రసాదరావును తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గుండెకాయలా ఉన్న ఖమ్మం నగర కాంగ్రెస్‌కు ఇప్పటివరకు కమిటీ వేయకపోవడంపై ఆ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఈ సమస్యలకు అధిష్టానం సత్వరమే పరిష్కారం చూపుతుందని, పార్టీ కార్యకర్తలు మరింత అంకితభావంతో పనిచేయాలని ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్, జిల్లా పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తదితరులు కార్యకర్తలకు మనోధైర్యం కల్పించినా.. కీలక సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క పార్టీ కార్యకర్తల్లో ఉత్తేజం నింపడంతోపాటు ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలనే లక్ష్యంతో పాదయాత్ర చేపట్టాలని గతంలోనే నిర్ణయించారు. అయితే అధిష్టానం అనుమతి కోసం ఆయన సన్నిహితులు, అనుచరులు, పార్టీ కార్యకర్తలు నిరీక్షిస్తున్నారు. సంస్థాగతంగా అనేక సమస్యలున్నా.. ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రత్యర్థి పార్టీలతో సమానంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ.. కేడర్ చేజారకుండా తమవంతు ప్రయత్నాలు చేసుకుంటూనే ఉన్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కార్యకర్తలను సమన్వయం చేసి.. గెలుపు కోసం దిశానిర్దేశం చేసే జిల్లా కాంగ్రెస్ రథసారథిపై ఇంకా స్పష్టత రాకపోవడంపై కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. ఇక సుదీర్ఘకాలంగా జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో పలు కీలక పదవులు చేపట్టిన ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డికి మరోసారి ఏఐసీసీ స్థాయిలో కీలక పదవి లభిస్తుందని ఆయన వర్గీయులు కొండంత ఆశతో ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి జిల్లాలో ఎంపీగా పోటీ చేస్తారా..? ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా..? అనే అంశం పార్టీ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. కాంగ్రెస్‌కు క్షేత్రస్థాయిలో మంచి పట్టున్నప్పటికీ పార్టీకి దిశానిర్దేశం చేసి.. కార్యకర్తలకు కష్టకాలంలో మనోనిబ్బరం కల్పించే నేతల కొరత జిల్లాస్థాయిలో ఉండటం వంటి సమస్యలు పార్టీ కార్యకర్తలకు మింగుడు పడటం లేదు. డీసీసీ అధ్యక్షుడి వ్యవహారం ఢిల్లీకి చేరినా.. ఇంకా దానిపై పూర్తిస్థాయి నిర్ణయం తీసుకోకపోవడం, జలగం ప్రసాదరావును పార్టీలోకి చేర్చుకోకపోవడంపై పార్టీ సంప్రదింపుల కమిటీ సానుకూలత వ్యక్తం చేసినా.. దానికి సంబంధించి కార్యాచరణ రూపొందించకపోవడం వంటి సంస్థాగత సమస్యలపై అధిష్టానం దృష్టి పెడితే కార్యకర్తల్లో మరింత మనోధైర్యం కలగడంతోపాటు కార్యకలాపాలను వేగవంతం చేసే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. -
ప్రేమ పేరుతో మోసగించాడంటూ...
కామేపల్లి (ఖమ్మం): ప్రేమ పేరుతో తనను మోసగించాడంటూ ప్రియుడి ఇంటి ఎదుట ఓ యువతి, తన బంధువులతో కలిసి మౌన దీక్షకు దిగింది. మండలంలోని రామకృష్ణాపురం పంచాయతీ శ్రీరాంనగర్ తండాలో శనివారం ఇది జరిగింది. ఆ యువతి యువతి దరావత్ ఉమ తెలిపిన వివరాలు... కామేపల్లి మండలం శ్రీరాంనగర్ తండాకు చెందిన భూక్య నరేష్, గార్ల మండలం కోట్యానాయక్ తండాకు చెందిన దరావత్ ఉమ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. హైదరాబాద్‌లోని అద్దె గదిలో రెండేళ్లపాటు ఉన్నారు. నరేష్‌కు ఇటీవల వ్యవసాయ శాఖలో ఏఈఓగా ఉద్యోగమొచ్చింది. తనను వివాహం చేసుకోవాలని ఆమె కోరింది. అతడు నిరాకరించాడు. దీంతో, ఆమె మూడు రోజుల క్రితం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు పట్టించుకోకపోవడంతో తన ప్రియుడు నరేష్ ఇంటి ఎదుట, తన బంధువులతో కలిసి శనివారం మౌన దీక్షకు దిగింది. తనను పెళ్లి చేసుకుంటానని నాలుగేళ్లపాటు నమ్మించి, తనతోపాటు కలిసుండి, ఇప్పుడు మొహం చాటేస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం జరిగేంత వరకు మౌన దీక్షను కొనసాగిస్తానంది. -
సంచార వాహనం ప్రారంభం
ఖమ్మంవైద్యవిభాగం: జంగాల రాజేశ్వరరావు సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత వైద్య సేవలు అందించేందుకు సంచార వాహనాన్ని ఏర్పాటు చేశారు. మయూరిసెంటర్‌లోని సాయిరాం గ్యాస్ట్రో, లివర్ వైద్యశాలలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంగాల సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ ద్వారా ఖమ్మం జిల్లా పరిసర ప్రాంత ప్రజలకు ప్రతి నెల మొదటి ఆదివారం ఉచిత వైద్య సేవలతో పాటు ఉచిత పరీక్షలు, వ్యాక్సినేషన్ ఇవ్వడం అభినందనీయమన్నారు. ఫౌండేషన్ ద్వారా రూ.10 లక్షల వ్యయంతో మొబైల్ వ్యాన్ ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం ప్రజలకు ఉపయోగకరమని పేర్కొన్నారు. దీన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు. వైద్యులు సునీల్‌కుమార్, స్వాతి మాట్లాడుతూ ఫౌండేషన్ స్థాపించిన ఏడాది కాలంలో 4 వేల మందికి ఉచితంగా వైద్య సేవలు అందించినట్లు తెలిపారు. ఇందులో 293 మందికి హెపటైటిస్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించామని, దాని నివారణకు మందులు ఇచ్చామని తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు కటకం గిరిప్రసాద్, కమర్తపు మురళి, ప్రమోద్‌కుమార్, తేజావత్ సురేశ్, పుల్లఖండం సురేశ్, బొమ్మిడి శ్యాంకుమార్, జంగాల శ్రీధర్, అబ్దుల్ కరీం, బొమ్మిడి సునీల్‌కుమార్, బండారు శివకుమార్, కూరపాటి ప్రదీప్, గోలీ అనూప్ పాల్గొన్నారు. -
సెగ రగిలింది..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఎన్నికలకు సమయం ఉన్నా.. జిల్లాలో మాత్రం రాజకీయ సెగ ప్రారంభమైంది. ఎప్పుడు ఎన్నికలొచ్చినా సిద్ధంగా ఉండాలంటూ ఆయా రాష్ట్ర పార్టీల సూచన మేరకు పలు పార్టీలు తమ కార్యకలాపాలను వేగవంతం చేస్తున్నాయి. జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో ప్రారంభమైన సందడితో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. గెలుపు గుర్రాల కోసం.. పూర్వ వైభవం కోసం.. సత్తా చాటేందుకు ఎవరికి వారే వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నారు. టీడీపీ సైతం వచ్చే ఎన్నికల్లో ఉనికి చాటుకునేందుకు తాపత్రయ పడుతోంది. కాంగ్రెస్ వంటి పార్టీలతో ఎన్నికల పొత్తే మేలన్న భావనతో పార్టీ కార్యకర్తలకు నచ్చజెప్పేందుకు యత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక జిల్లాలో బలమైన రాజకీయ పక్షాలుగా పేరున్న ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఈసారి ఎన్నికల్లో ఎటువంటి వ్యూహం రచిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. 2014లో జరిగిన ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టులు వేర్వేరు పార్టీల మద్దతుతో జిల్లాలో ఎన్నికల బరిలోకి దిగగా.. ఈసారి కూడా అదే పరిస్థితి ఆవిష్కృతమయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సీపీఎం బహుజన లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్ఎఫ్) కూటమితో కలిసి ఎన్నికల బరిలోకి దిగనుండగా.. సీపీఐ.. కాంగ్రెస్‌తో మరోసారి ఎన్నికల మైత్రి కొనసాగించే అవకాశం ఉన్నట్లు ప్రచారమవుతోంది. దీంతో కాంగ్రెస్ తరఫున కొత్తగూడెం నుంచి టికెట్ ఆశిస్తున్న ఆశావహుల్లో ఉత్కంఠ కలుగుతోంది. ఎన్నికల పొత్తులో ఏ నియోజకవర్గం ఎటువైపు వెళ్తుందో అనే అంశం ఒక పట్టాన తేలకపోవడంతో ఆయా నియోజకవర్గాలపై తమ పట్టు సడలకుండా పార్టీ కార్యకలాపాలను ఎవరికి వారే హోరాహోరీగా కొనసాగిస్తున్నారు. గత ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకే ఒక్క స్థానం గెలుచుకున్న టీఆర్ఎస్.. ఈసారి పది నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు పావులు కదుపుతోంది. గత ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన జలగం వెంకటరావు విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరరావు టీడీపీకి రాజీనామా చేసి.. 2014లో టీఆర్ఎస్లో చేరారు. ఆయన వెంట జెడ్పీ చైర్పర్సన్, ఎమ్మెల్సీ, డీసీసీబీ చైర్మన్ వంటి నేతలు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు వంటి నేతలు గులాబీ గూటికి చేరగా.. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ టీఆర్ఎస్లో చేరారు. పాలేరు నుంచి గెలుపొందిన మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అనారోగ్యంతో మరణించారు. దీంతో 2014 ఎన్నికల్లో నాలుగు ఎమ్మెల్యే స్థానాలను గెలుపొందిన కాంగ్రెస్‌కు.. ప్రస్తుతం మధిర ఎమ్మెల్యే, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క మాత్రమే జిల్లాలో మిగిలారు. పాలేరులో జరిగిన ఉప ఎన్నికల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ తరఫున గెలుపొందారు. ఇక గత శాసనసభ ఎన్నికల్లో జిల్లాలో వైఎస్సార్ సీపీ విజయఢంకా మోగించింది. ఖమ్మం ఎంపీతోపాటు వైరా, అశ్వారావుపేట, పినపాక ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది. అయితే ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, వైరా ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో వేర్వేరుగా టీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం టీఆర్ఎస్కు జిల్లాలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నట్లయింది. దీంతో వచ్చే ఎన్నికల్లో వీటిని నిలబెట్టుకోవడంతోపాటు రాజకీయంగా అత్యంత కీలకంగా, ప్రతిష్టాత్మకంగా భావించే సత్తుపల్లి, మధిర, భద్రాచలం నియోజకవర్గాల్లో సైతం గులాబీ జెండా ఎగరేసేందుకు టీఆర్ఎస్ కసరత్తు ప్రారంభించింది. ఆయా నియోజకవర్గాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక దృష్టి సారించడం.. తరచూ రాజకీయ పర్యటనలు చేస్తూ పార్టీశ్రేణుల్లో ఉత్తేజం నింపే ప్రయత్నం చేస్తున్నారు. పట్టున్న వాటిపై దృష్టి.. కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ వంటి రాజకీయ పక్షాలు తమకు పట్టున్న నియోజకవర్గాలపై ఇప్పటికే దృష్టి సారించారు. ఎన్నికల్లో గెలిచేందుకు అవసరమైన వ్యూహ ప్రతివ్యూహాలు రూపొందిస్తుండగా.. అందుకు దీటుగా అధికార పార్టీ జిల్లాలో అన్ని ఎమ్మెల్యే స్థానాలు, రెండు లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. టీఆర్ఎస్ కొద్ది రోజులుగా రాజకీయంగా దూకుడు పెంచింది. ప్రతిపక్ష కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంపై పూర్తిస్థాయి దృష్టి సారించింది. ఆయా మండలాల నుంచి వివిధ పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నేతలను టీఆర్ఎస్లో చేర్చుకోవడం ద్వారా మధిరలో తమకు సానుకూల పవనాలు వీస్తున్నాయన్న భావన కల్పించే ప్రయత్నం చేస్తుందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో కలుగుతోంది. ఇక పది అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంట్ స్థానాల్లో టీఆర్ఎస్ విజయ పతాకం ఎగురవేసే బాధ్యతను తానే తీసుకుంటానని మంత్రి తుమ్మల స్వయంగా ప్రకటించడంతో పార్టీ రాజకీయ వ్యూహాలకు పదును పెట్టిందన్న అభి ప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే నియోజకవర్గాల్లో పర్యటిస్తూ.. తమ బలాలు, బలహీనతలపై దృష్టి సారించి ఎన్నికల ప్రచార పర్వానికి అందరికంటే ముందు సిద్ధమవుతున్నారన్న భావన కలుగుతోంది. ఉత్తేజం నింపే యోచన.. ఇక ఆయా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్లో నెలకొన్న వర్గ విభేదాలు పార్టీకి నష్టం చేయకుండా.. వారికి సర్ది చెప్పడంతోపాటు నామినేటెడ్ పదవుల పందేరాన్ని మరోసారి ప్రారంభించడం ద్వారా జిల్లాలో ద్వితీయ శ్రేణి నేతల్లో ఉత్తేజం నింపాలన్న యోచనతో పార్టీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రి తుమ్మల, ఎంపీ పొంగులేటి తరచూ ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ.. పార్టీ కార్యకర్తలను ఎన్నికల కోసం కార్యోన్ముఖులను చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలో జరిగిన అభివృద్ధిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంతోపాటు జిల్లాలోని టీఆర్ఎస్యేతర రాజకీయ పక్షాల్లో పెల్లుబుకుతున్న అసంతృప్తులు, కీలక నేతల వ్యవహార శైలి, ఆయా పార్టీలతో వారు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్న తీరుపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల్లో రాజకీయంగా జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు మంత్రి తుమ్మలకు చేరవేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాలోని టీఆర్ఎస్లో నెలకొన్న పరిస్థితులపై మంత్రి ఆయా నియోజకవర్గాల నేతల ద్వారా ఆరా తీయడంతోపాటు పార్టీ నేతలకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ పరంగా నెలకొన్న జఠిల సమస్యలపై దృష్టి సారించేందుకు పార్టీ యంత్రాంగం సమాయత్తమైనట్లు తెలుస్తోంది. జిల్లాలో జనరల్ స్థానాలుగా ఉన్న పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం, ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తుమ్మల నాగేశ్వరరావు, పువ్వాడ అజయ్‌కుమార్, జలగం వెంకటరావు, ఖమ్మం ఎంపీగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా.. అక్కడ తిరిగి విజయం సాధించేందుకు ఆయా నేతలు ఇప్పటి నుంచే చెమటోడుస్తున్నారు. నియోజకవర్గాల్లో జరిగే ప్రతి కార్యక్రమంలో పాల్గొనడంతోపాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు తాము ఇస్తున్న ప్రాధాన్యాన్ని చాటిచెప్పుకునే ప్రయత్నం చేస్తుండటం గమనార్హం. -
కారు, లారీని ఢీ కొట్టిన బస్సు
కొణిజర్ల ఖమ్మం: ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం తెల్లవారుజామున ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లిపాడులో జరిగింది. ఎస్ఐ వడ్లకొండ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మంలో మాగ్మా ఫైనాన్స్ కార్పొరేషన్ బ్రాంచ్ హెడ్‌గా పని చేస్తున్న నకిరికంటి వెంకటజాన్‌రెడ్డి (36) కారులో కొత్తగూడెం వెళ్లి తిరిగి ఖమ్మం వస్తుండగా తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి మధిర వెళుతున్న ఆర్టీసీ లగ్జరీ బస్సు ఢీకొట్టింది. బస్సు అదే వేగంతో కారు వెనుక వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవింగ్ సీట్లో ఉన్న జాన్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు డ్రైవర్ భూక్యా నాగేశ్వరరావు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు లారీని ఢీకొని రోడ్డుకు అడ్డంగా నిలిచి పోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఎస్ఐ సురేష్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ సాయంతో బస్సు, లారీ, కారును రోడ్డు పక్కకు తీయించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. గాయపడ్డ బస్సు డ్రైవర్ నాగేశ్వరరావును 108 ద్వారా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు నుంచి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం తరలించారు. మృతుడు జాన్‌రెడ్డిది కృష్ణా జిల్లా షేర్‌మహ్మద్‌పేట, ఖమ్మంలోని ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో 6 నెలల క్రితమే బ్రాంచ్ హెడ్‌గా చేరాడు. మృతుడికి భార్య శృతి, కుమారుడు, కూతురు ఉన్నారు. బంధువులు ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
ఖమ్మంరూరల్: మండలంలోని వెంకటగిరి క్రాస్‌రోడ్ సమీపంలో శనివారం సాగర్ కాలువల మమ్మతుల కోసం సర్వే చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి ముదిగొండ మండలం బాణాపురం గ్రామానికి చెందిన గోదా స్వామి (40) మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. ఓ కన్స్ట్రక్షన్ సంస్థ కాలువ మరమ్మతులకు సర్వే చేపట్టింది. ఆ పనులకు కూలీగా వచ్చిన స్వామి ఇనుపకడ్డీ తీసుకుని కొలతలు వేస్తుండగా కాలువ పైనే ఉన్న విద్యుత్ తీగలకు తగిలింది. ఒక్కసారిగా షాక్‌కు గురై స్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. పరిహారం కోసం రాస్తారోకో: కూలి నాలి చేసుకుని కుటుం బాన్ని పోషించుకుంటున్న స్వామి కుటుంబ సభ్యులకు నష్టపరిహారం చెల్లించాలని బంధువులు మృతదేహాంతో రహదారిపై రాస్తారోకో చేశారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలగడంతో ఎస్సై చిరంజీవి ఆందోళనకారులకు నచ్చచెప్పి పక్కకు పంపించారు. అనంతరం మృతదేహాన్ని తీసుకొని సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్ళి అక్కడ కొంతసేపు రాస్తారోకో చేశారు. చివర కు సంస్థ వారు ఇచ్చిన హామీతో రాస్తారోకో విరమించారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం తరలించామని ఎస్సై తెలిపారు. -
అభివృద్ధే నమ్మకం
ఖమ్మం వైరారోడ్: టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలే ప్రజలకు తమపై నమ్మకాన్ని కల్పిస్తాయని రోడ్లు భవనాలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో మధిర నియోజకవర్గంలోని వివిధ పార్టీలకు చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి తుమ్మల వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు సంవత్సరాల కాలంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో తమ పార్టీవైపు ఆకర్షితులవుతున్నారని అన్నారు. అభివృద్ధి కోసం కష్టపడే వారి వెంటే ప్రజలు ఉంటారని గుర్తు చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యే లేకపోయినా మధిర నియోజకవర్గం అభివృద్ధికి కోట్ల రూపాయలు వెచ్చించామన్నారు. వచ్చే ఎన్నికల్లో మధిర నియోజకవర్గంలో టీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. అగస్టు 15 తర్వాత ప్రతి ఇంటికి నల్లా ద్వారా నీరందిస్తామన్నారు. చేతి వృత్తిదారుల కోసం రూ.1000 కోట్లు వెచ్చించామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం గొల్లకురుమలకు రూ.5000 కోట్లు వెచ్చించి గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టిందన్నారు. చేప పిల్లలు పంపిణీతో పాటు, రైతుల కష్టాలు తీర్చేందుకు నిరంతరం కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని అన్నారు. భవిష్యత్‌లో నాగార్జున సాగర్ నీటితో అవసరం లేకుండా సీతారామ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలను ఉమ్మడి జిల్లాలో పారిస్తామన్నారు. సూర్యాపేట– ఖమ్మం రహదారి నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలుస్తామని తెలిపారు. అలాగే ఖమ్మం – రాజమండ్రి జాతీయ రహదారి కోసం అంచనాలు సిద్ధం చేస్తున్నామన్నారు. మెరుగైన వైద్యం అందించటంలో ఖమ్మం, భద్రాచలం ఆసుపత్రులు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాయన్నారు. 2020 యేడాది కల్లా మిగులు రాష్ట్రంగా తెలంగాణ అవతరించబోతుందని గుర్తు చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్రావు, కార్యదర్శి తాతా మదు, విత్తనాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి సంస్ధ చైర్మన్లు కొండబాల కోటేశ్వరరావు, ఎస్.బి.బేగ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, దయాకర్‌రెడ్డి, కమర్తపు మురళి తదితరులు పాల్గొన్నారు. -
ఖమ్మం అభివృద్ధికి రూ.కోట్లు
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగరంలో అన్ని డివిజన్లలో రోడ్లనుసీసీ రోడ్లుగా మార్చి సుందర నగరంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. శనివారం ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 41, 41వ డివిజన్లలో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మేయర్ పాపాలాల్‌తో కలిసి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో నగరంలో రోడ్లు, సీసీ డ్రెయిన్ల అవసరాన్ని గుర్తించిన మేరకు నేడు శంకుస్థాపనలు చేస్తున్నట్లు తెలిపారు. ఖమ్మం నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేసి వాటిని వాడుకలోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు రుద్రగాని శ్రీదేవి, కొప్పెర సరిత, పాలడుగు పాపారావు, కొప్పెర నరసింహారావు, నాయకులు ఆర్జేసీ కృష్ణ, రుద్రగాని ఉపేందర్, మెంతుల శ్రీశైలం, నిరంజన్‌రెడ్డి, వసంతబాబు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కార్యవర్గం భేటీ ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ను అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ నూతన కార్యవర్గం శనివారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పద్మ, భవాని, శ్రీదేవి, ప్రేమబాయి, రమాదేవి, విమల, ప్రేమిలా, జ్యోతి, కల్పన పాల్గొన్నారు. -
రాకాసి గుంత... ఇద్దరిని మింగేసింది..
బూర్గంపాడు: సీతారామ ప్రాజెక్ట్ కాలువ పనుల కోసం తవ్విన గుంత ఇద్దరు పిల్లలను పొట్టన పెట్టుకుంది. ఇటీవలి వర్షాలకు ఈ నీటి గుంతలో నీరు చేరింది. శనివారం పాఠశాలలకు సెలవు కావటంతో గేదెలను సరదాగా మేపేందుకు ఆ కాలువ వైపు వెళ్లిన ఇద్దరు పిల్లలను ఆ నీటి గుంత అమాంతం మింగేసింది. మండలంలోని జింకలగూడెం గ్రామ సమీపంలోగల సీతారామ ప్రాజెక్ట్ కాలువల వద్ద ఇది జరిగింది. మండలంలోని మోరంపల్లిబంజర గ్రామాని కి చెందిన గంటా భార్గవ్(10), అతని సమీప బంధువైన దుబ్బాల సుధీర్(18) కలిసి జింకలగూడెం గ్రామ సమీపంలోని సీతారామ ప్రాజెక్ట్ కాలువ వద్దనున్న తమ పొలానికి గేదెలతోపాటు శనివారం ఉదయం వెళ్లారు. మధ్యాహ్నం వేళ అటుగా వెళ్తున్న స్థానికులు.. ఆ గుంత పక్కన రెండు జతలు చెప్పులు, పశువుల అదిలించేందు కు ఉపయోగించే కర్రలు ఉండటాన్ని గమనించా రు. గుంతలోకి నిశితంగా పరిశీలించారు. అందు లో ఇద్దరు పిల్లలు ఉన్నట్టుగా గమనించారు. వారిచ్చిన సమాచారంతో గ్రామస్తులు, పోలీసులు వచ్చారు. గుంత నుంచి ఇద్దరు పిల్లల మృతదేహాలను బయటకు తీశారు. వారిని మోరంపల్లిబంజర గ్రామానికి చెందిన గంటా రమేష్–సావిత్రి దంపతుల కుమారుడు భార్గవ్(10), వారి సమీప బంధువు దుబ్బాల సుధీర్(18)గా గుర్తించారు. స్థానిక ప్రైవేటు పాఠశాలలో భార్గవ్ ఐదవ తరగతి చదువుతున్నాడు. రమేష్ సోదరి కుమారుడైన దుబ్బాల సుధీర్ ది క్రిష్ణా జిల్లా నూజివీడు సమీపంలోని రమనాగుపేట గ్రామం. దుబ్బాల మంగళాద్రి–ఉమ దంపతులు రెండవ కుమారుడైన సుధీర్, చిన్నత నం నుంచి మోరంపల్లిబంజరలోని అమ్మమ్మ ఇం ట్లోనే ఉండి చదువుకుంటున్నాడు. ప్రస్తుతం పాల్వంచలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఐటీఐ చదువుతున్నాడు. శనివారం భార్గవ్, సుధీర్ కలిసి పొలానికి వెళ్లి గుంతలో ప్రాణాలు కోల్పోయారు. ఎలా జరుగిందో... ‘ఆ నీటిగుంతలో ముందుగా భార్గవ్ జారిపడి ఉంటాడు. అతడిని కాపాడే ప్రయత్నంలో సుధీర్ కూడా గుంతలో పడిపోయుంటాడు. సుధీర్ ప్యాంట్ జేబులో సెల్‌ఫోన్ ఉంది. దీనిని బట్టి, భార్గవ్‌ను రక్షించేందుకు వెంటనే గుంతలోకి వెళ్లి ఉంటాడని అర్థమవుతోంది’ అని, స్థానికులు భావి స్తున్నారు. భార్గవ్, సుధీర్ కుటుంబీకులు గుండెలవిసేలా రోదించారు. పిల్లల మృతితో మోరంపల్లి బంజరలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదస్థలాన్ని పాల్వంచ సీఐ రాఘవేంద్రరావు, స్థానిక ఎస్ఐ సంతోష్ పరిశీలించారు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. మున్నేరులో వ్యక్తి గల్లంతు ఖమ్మంరూరల్: మండలంలోని తీర్థాల వద్ద మున్నేటిలో శనివారం ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. స్థానికులు తెలిపిన ప్రకారం.. రామన్నపేటకు చెందిన ఆరెంపుల నాగయ్య(47), తాపీ కార్మికుడు. తోటి కార్మికులతోపాటు శుక్రవారం మంగళగూడెంలో పనికి వెళ్లాడు. అక్కడే బాగా పొద్దుపోయింది. వర్షం కూడా పడుతోంది. దీంతో ఆ రాత్రి మంగళగూడెంలోనే ఉన్నాడు. శనివారం ఉదయం రామన్నపేటకు బయలుదేరాడు. తీర్ధాల వద్ద మున్నేటిపై నిర్మిస్తున్న రోడ్ కం బ్రిడ్జి వద్దకు చేరుకున్నాడు. మున్నేటిలో దిగి కామంచికల్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో మున్నేటికి ఒక్కసారిగా వరద ఉధృతి రావడంతో కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. నాగయ్య కోసం గాలింపు సాగుతోంది. ఆయన కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. -
మమ్మల్ని ఆదుకోరూ..
సుజాతనగర్: కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించాడు... ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు కూడా చేశాడు.. కాని విధి వక్రీకరించి ప్రస్తుతం అనారోగ్యంతో మంచానపడ్డాడు. కుటుంబ బాధ్యత నెత్తికెత్తుకున్న మరో కూతురు విద్యుదాఘాతంతో మృతి చెందింది. కూతురిని కాపాడబోయి తల్లి కూడా విద్యుదాఘాతానికి గురైంది. దీంతో ఒక చేయి పనిచేయడం లేదు. కుటుంబ పోషణే భారమైన తరుణంలో ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారీ నిరుపేద దంపతులు సుజాతనగర్ మండలం సింగభూపాలేనికి చెందిన ఉగ్గం వెంకటేశ్వర్లు, భార్య సత్యవతికి ముగ్గురు కూతుళ్లు. కూలీనాలి చేసుకోవడంతోపాటు ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. ఏడాది క్రితం అనారోగ్యం పాలయ్యాడు. నిరుపేద కుటుంబానికి చెందిన వెంకటేశ్వర్లు అప్పోసప్పో చేసి వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. ఒక కిడ్నీ పాడైందని వైద్యులు చెప్పడంతో ఆర్థికస్థోమత అంతంతమాత్రంగా ఉన్న వెంకటేశ్వర్లు మెరుగైన వైద్యం చేయించుకోలేకపోయాడు. దీంతో రెండో కిడ్నీసైతం చెడిపోయింది. ప్రస్తుతం వెంకటేశ్వర్లు మంచానికే పరిమితమై తన పనులు కూడా తాను చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఒకరి ఊతం లేనిదే మంచం పైనుంచి లెగిసే పరిస్థితి లేదు. తల్లిదండ్రుల బాధ చూడలేని పెద్దకూతురు అరుణ ఇంటి బాధ్యతను స్వీకరించి తాను కూడా కూలీకి వెళ్తూ, కాయగూరలు అమ్ముతూ బతుకుబండిని నెట్టుకొస్తుండేది. విధి వక్రించి ఇంటి పనులు చేసుకుంటున్న తరుణంలో అరుణ ఇంట్లోనే విద్యుదాఘాతానికి గురైంది. కూతురిని రక్షించే క్రమంలో తల్లి సత్యవతి కూడా విద్యుత్ షాక్‌కు గురైంది. ఈ ప్రమాదంలో అరుణ అక్కడికక్కడే మరణించగా, సత్యవతికి కుడిచేయి సరిగ్గా పనిచేయని స్థితికి చేరుకోవడంతోపాటు కాలి వేళ్లు కూడా తెగిపోయాయి. సంవత్సర కాలం నుంచి జీవనం సాగించడానికి ఆ దంపతులిద్దరూ పడే వేదన వర్ణణాతీతం. పూట గడవడమే కష్టంగా ఉన్న దంపతులకు అనారోగ్యం మరింత కుంగదీస్తోంది. కూలీపనులు సైతం చేసుకునే పరిస్థితిలో లేని సత్యవతి చుట్టుపక్కలవారి సాయంతో రోజులు నెట్టుకొస్తోంది. మెరుగైన వైద్యానికి డబ్బులు లేకపోవడంతో భర్త ఆరోగ్య పరిస్థితి రోజురోజుకీ క్షీణిస్తుండటంతో కన్నీటిపర్యంతమవుతోంది. ఉండటానికి కనీసం సరైన ఇళ్లు కూడా లేక పూరిగుడిసెలోనే జీవనం సాగిస్తున్నారు. తన భర్తకు మెరుగైన వైద్యం అందితే కుటుంబ పోషణ బాగుంటుందని భార్య సత్యవతి ఆవేదన వ్యక్తం చేస్తుంది. దాతలు ఉంటే సాయం చేయాలంటూ ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది. -
పథకాల అమలులో ముందంజ
కొత్తగూడెంఅర్బన్: పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసి, వారి అభివృద్ధికి పాటుపడడంలో తమ ప్రభుత్వం ముందంజలో ఉందని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక రైటర్‌బస్తీలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో పలు పార్టీల నుంచి 150 కుటుంబాల వారు టీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, సరికొత్త సంక్షేమ పథకాలను తీసుకొస్తున్నామన్నారు. రైతుబంధు పథకం ద్వారా ఎంతోమంది కర్షకులకు మేలు జరిగిందని తెలిపారు. ప్రభుత్వ పాలన మెచ్చి..ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని వివరించారు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు జేడి చంటి, పట్టణ పరిధి బర్లిఫిట్ ఏరియా కాంగ్రెస్ నాయకులు రామయ్య, బుడబుక్కల సంఘం జిల్లా నాయకులు గోపి, ఇల్లెందు నుంచి ప్రదీప్, సందీప్, సోహెల్, వేణు, శశాంక్, రాజేష్, అఫ్రోజ్‌తో పాటుగా రుద్రంపూర్ తదితర ఏరియాల నుంచి పలువురు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ క్యాంపు కార్యాలయం ఇన్చార్జ్ కొదుమసింహ పాండురంగచార్యులు, టీఆర్ఎస్ నాయకులు గోపాలరావు, డాక్టర్ శంకర్‌నాయక్, ఆళ్ల మురళి, తూము చౌదరి, వార్డు కౌన్సిలర్లు దుంపల అనురాధ, సరోజ, నాయకులు కందుల సుధాకర్‌రెడ్డి, పులిరాబర్ట్ రామస్వామి, సోమిరెడ్డి, పురుషోత్తం, కృష్ణ ప్రసాద్, అక్రం పాష, కనుకుంట్ల శ్రీను, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
అమ్మ వచ్చింది.. ఆకలి తీర్చింది!
ఇల్లెందు: బందీగా మారిన ఆ తల్లికి విముక్తి లభించింది. అమ్మ స్పర్శ కరువై, ఆమె ఒడిలోని వెచ్చదనం దూరమై, తల్లి పాల అమృతం అందక రెండు రోజులుగా అల్లాడుతున్న ఆ పసికందును అక్కున చేర్చుకుంది. ఆకలి తీర్చింది. ‘‘బిడ్డా.. ఇంకెప్పటికీ నీ వెంటే ఉంట.. నిన్నొదిలి ఉండ..’’ అంటూ, ఆ పసివాడిపై ముద్దులు కురిపించింది. ఇల్లెందు మండలం రొంపేడు పంచాయతీ మిట్టపల్లి తండాకు చెందిన బి.రజిత, గార్ల మండలం ముల్కనూరుకు చెందిన బళ్లెం కళ్యాణ్ ప్రేమించుకున్నారు. ఏడాది క్రితం గార్ల శివాలయంలో పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమ పెళ్లికి ఆమె తల్లిదండ్రులు అంగీకరించలేదు. హైదరాబాద్‌లో కాపురం పెట్టిన ఈ దంపతులకు మూడు నెలల క్రితం బాబు జన్మించాడు. ఈ దంపతులు, తమ చిన్నారితో కలిసి ఇటీవల ఇల్లెందు వచ్చారు. రజితను ఆమె తల్లిదండ్రులు నమ్మించి, మిట్టపల్లిలోని తమ ఇంటికి శుక్రవారం రప్పించారు. సాయంత్రం వరకు వస్తానని చెప్పి, మూడు నెలల 11 రోజుల వయసున్న తన బిడ్డను ఇల్లెందులో తన భర్త కళ్యాణ్ వద్ద వదిలి వెళ్లింది. అక్కడ ఆమెను తల్లిదండ్రులు గృహ నిర్బంధంలో ఉంచారు. పసిబిడ్డ కోసం అక్కడ ఆ తల్లి వేదన. తల్లి కోసం ఇక్కడ ఈ పసిబిడ్డ రోదన. ఈ పరిస్థితిలో, పోలీసులను కళ్యాణ్ ఆశ్రయించాడు. వారు అంతగా స్పందించకపోవడంతో ‘సాక్షి’కి సమాచారమిచ్చాడు. దీనిపై, ఆదివారం రోజున ‘సాక్షి’లో ‘బందీగా తల్లి.. ఆకలితో పసికూన..’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ కథనంతో పోలీసులు కదిలారు. మిట్టపల్లిలోని రజిత పుట్టింటికి ఆదివారం ఉదయం ఎస్ఐ రాజు వెళ్లారు. రజితను, ఆమె పుట్టింటి వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అప్పటికే పోలీస్ స్టేషన్లో పసికూనతో కళ్యాణ్ ఎదురుచూస్తున్నాడు. బిడ్డను చూడగానే రజిత పరుగెత్తుకుంటూ వచ్చింది. వాడిని చేతుల్లోకి తీసుకుని తనవితీరా ముద్దాడింది. కన్నీటిపర్యంతమైంది. పాలు పట్టింది. ఆకలి తీర్చింది. ఆ తరువాత రజితను, కళ్యాణ్‌ను, రజిత కుటుంబీకులను ఎస్ఐ రాజు విచారించారు. తన కోసం భర్త కళ్యాణ్, పసిబిడ్డ ఎదురుచూస్తున్నారని, వెళతానని బయల్దేరిన తనను పుట్టింటోళ్లు ఇంటిలో బంధించారని ఎస్ఐతో రజిత చెప్పింది. తనకు భర్త కళ్యాణ్, బిడ్డ కావాలని స్పష్టంగా చెప్పింది. ఎస్ఐ అడగడంతో ఇదే విషయాన్ని రాసిచ్చింది. ఆమె కుటుంబీకులు, భర్త కళ్యాణ్ నుంచి కూడా రాయించుకున్నారు. రజితను ఆమె భర్త కళ్యాణ్‌తో పంపించారు. కళ్యాణ్, రజిత, బాబు, కళ్యాణ్ తల్లి సువార్త కలిసి ఇల్లెందు పోలీస్ స్టేషన్ నుంచి గార్ల ముల్కనూరులోని తమ ఇంటికి వెళ్లారు. చివరికి, కథ సుఖాంతమైంది. -
కేసీఆర్‌ది తుగ్లక్ పాలన
ఖమ్మం సహకారనగర్ : రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ది తుగ్లక్ పాలన అని కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి విమర్శించారు. నగరంలోని 27వ డివిజన్లో కార్పొరేటర్ నాగండ్ల దీపక్‌చౌదరి ఆధ్వర్యంలో 50 కుటుంబాలకు చెందిన వారు శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేణుకాచౌదరి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడితే బతుకులు బాగుంటాయని, ఉద్యోగాలు వస్తాయ ని పలువురు ఆశించారని, కానీ రాష్ట్రంలో ఒక కుటుంబంలోనే వెలుగులు నిండాయని విమర్శించారు. కేసీఆర్ కుటుంబంలోని నలుగురికే పండగలా ఉందన్నారు. ఎన్నికల హామీలలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని, డబుల్‌బెడ్ రూం, ఇంటికో ఉద్యో గం, దళితులకు మూడెకరాల భూమి, కాంట్రాక్ట్ ఉద్యోగుల పర్మనెంట్ వంటి హామీలన్నింటిని గాలికొదిలేశారని ఆరోపించారు. గతంలో కాం గ్రెస్ చేసిన అభివృద్ధినే తమదిగా టీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో వేసిన రోడ్లకు అదనంగా ఎక్కడైనా రోడ్లు వేశారా అని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న నాగండ్ల దీపక్‌చౌదరిని అభినందించారు. అనంతరం దీపక్‌చౌదరి మాట్లాడుతూ నగరంలో టీఆర్ఎస్ కార్పొరేటర్లు మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. అంతకముందు పార్టీ జెండా ను రేణుకాచౌదరి ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు దిరిశాల భద్రయ్య, ఎస్కె.పాషా, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్, కొత్తగూడెం జిల్లా నాయకుడు యడవల్లి కృష్ణ, సైదులు నాయక్, ఎస్కె.ఖాజా, మొహినుద్దీన్, పిడతల రామ్మూర్తి పాల్గొన్నారు. -
‘డబుల్’ పథకం ఓ వరం
రఘునాథపాలెం : డబుల్ బెడ్రూం పథకం పేద ప్రజలందరికీ ఓ వరంగా ఉందని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం రఘునాథపాలెం మండలంలోని శివాయిగూడెంలో తొలి విడతగా పూర్తయిన 218 డబుల్ బెడ్రూం ఇళ్లను 166 మంది లబ్ధిదారులకు కేటాయించగా, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పాపాలాల్‌తో కలిసి ఎమ్మెల్యే అజయ్‌కుమార్ ప్రాంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అజయ్‌కుమార్ మాట్లాడుతూ ఇళ్లు లేని పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్రూం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారన్నారు. 2016లో జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి నగరంలో అత్యధికంగా పేదలు ఉన్నారని, వారందరికి 2 వేల ఇళ్లను మంజూరు చేశారన్నారు. తొలి విడతగా ఖమ్మం నియోజకవర్గానికి కేటయించిన ఇళ్లు పలు నిర్మాణాల్లో ఉన్నాయన్నారు. శివాయిగూడెంలో చేపట్టిన ఇళ్లు పూర్తి చేసుకోవటంతో రెవెన్యూ అధికారులు ఎంపికను పారదర్శకంగా చేపట్టారన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం అర్బన్ తహసీల్దార్ శ్రీలతను, ఆర్వీఎం అధికారి రవికుమార్‌లను ఎమ్మెల్యే అభినందించారు. వచ్చే ఏడాది కల్లా నియోజకవర్గానికి కేటాయించిన 2 వేల ఇళ్లను పూర్తి చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలను కొనసాగిస్తామన్నారు. శివాయిగూడెంలో పూర్తయిన 216 ఇళ్లను నగర పరిధిలో 2, 3, 4, 56 డివిజన్లకు కేటాయించటం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఖమ్మం అర్బన్ తహసీల్దార్ శ్రీలత, కార్పొరేటర్లు చావా నారాయణ, కొనకంచి సరళాప్రసాద్, మందడపు మనోహర్, ఎస్.వెంకన్న, నాగండ్ల కోటి, ఆత్కూరి హనుమాన్, కమర్తపు మురళీ, పగడాల నాగరాజు, రైతు సమితి జిల్లా సభ్యులు మందడపు సుధాకర్, ఏఎంసీ మాజీ వైస్‌చైర్మన్ మందడపు నర్సింహారావు, ఆత్మ చైర్మన్ మెంటెం రామారావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మద్దినేని వెంకటరమణ, టీఆర్ఎస్ నాయకులు దండా జ్యోతిరెడ్డి, నర్రా యల్లయ్య, హెచ్చు ప్రసాద్, షేక్ మహ్మద్, శివాయిగూడెం గ్రామ టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు సిద్దయ్య, రవి, చెరుకూరి ప్రదీప్, శివాయిగూడెం సర్పంచ్ బాణోతు నాగమణి, నాగేశ్వరరావు, మాదగాని సుదర్శన్‌రావు, సుంకర వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
‘మంత్రి’దండం!
సాక్షిప్రతినిధి, ఖమ్మం : టీఆర్ఎస్లో అంతర్గత వర్గపోరు ఆ పార్టీ నేతలకు తలనొప్పిలా మారింది. పాత, కొత్త నేతలు పార్టీలో కొనసాగుతుండడం.. వారి మధ్య సఖ్యత లేకపోవడం.. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించేందుకు అనుసరించే వ్యూహంపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే అత్యధిక శాసనసభ స్థానాలతోపాటు రెండు లోక్‌సభ నియోజకవర్గాలను దక్కించుకోవడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు టీఆర్ఎస్ సిద్ధమవుతోంది. జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలో వచ్చే ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీ సిద్ధమవుతున్నా.. పది నియోజకవర్గాల్లో నెలకొన్న వర్గపోరు పార్టీకి పంటికింద రాయిలా మారిందన్న విమర్శలు పార్టీ వర్గాల నుంచే వ్యక్తమవుతున్నాయి. 2014లో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పది శాసనసభ స్థానాలకు, ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసిన టీఆర్ఎస్.. కేవలం కొత్తగూడెం ఎమ్మెల్యే, మహబూబాబాద్ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. అప్పటి వరకు జిల్లాలో నామమాత్రంగా ఉన్న టీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలోకి రావడం.. ఆ తర్వాత జిల్లాలో జరిగిన అనూహ్య పరిణామాల నేపథ్యంలో సీనియర్ నేతగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరడం, ఆయనతోపాటు ఎమ్మెల్సీగా ఉన్న బాలసాని, జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి, టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కొండబాలతోపాటు అనేక మంది ద్వితీయ, మండలస్థాయి నేతలు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్సార్ సీపీ నుంచి ఖమ్మం ఎంపీగా గెలుపొందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కమార్, కోరం కనకయ్య, మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు ఆయా పార్టీలను వీడి.. టీఆర్ఎస్లో చేరారు. 2014 సెప్టెంబర్‌లో టీఆర్ఎస్లో చేరిన తుమ్మల.. సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు కావడంతో కొద్ది కాలానికే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి.. ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2016లో మాజీ మంత్రి, పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి మరణించడం.. అదే ఏడాది మే నెలలో జరిగిన పాలేరు ఉప ఎన్నికలో తుమ్మల టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ‘తుమ్మల’ వ్యూహంపైనే ఆసక్తి.. జిల్లాలో పార్టీకి దిశానిర్దేశం చేసే నేతగా తుమ్మల ఎదగడంతోపాటు.. ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై దృష్టి సారించినట్లు పేరొందారు. తానొవ్వక.. నొప్పించని రీతిలో పార్టీ వ్యవహారాలను చక్కదిద్దుతున్న తుమ్మల.. జిల్లాలో పార్టీని గెలిపించేందుకు ఎటువంటి మంత్రదండం ప్రదర్శిస్తారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రతి నియోజకవర్గంలోనూ టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న కార్యకర్తలకు, అధికారం చేపట్టిన తర్వాత వివిధ పార్టీల నుంచి వచ్చిన కార్యకర్తల మధ్య నెలకొన్న అంతరం రోజురోజుకు పెరుగుతుందే తప్ప.. తగ్గని పరిస్థితి నెలకొంది. అలాగే పలు పార్టీల నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన ప్రజాప్రతినిధులు, ఉద్యమ కాలంలో పనిచేసిన కార్యకర్తలకు మధ్య పొసగని పరిస్థితి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం టీఆర్ఎస్కు సవాల్‌గానే మారింది. రాజకీయాలపై పూర్తి పట్టున్న మంత్రి తుమ్మల.. పార్టీలో అంతర్గత పోరును చల్లార్చేందుకు రాజకీయ చతురతను ఎలా ప్రదర్శిస్తారనే దానిపై చర్చ జరుగుతోంది. ఇటీవలి కాలంలో ఉమ్మడి జిల్లాలోని ప్రతి నియోజకవర్గాన్ని వివిధ సందర్భాల్లో చుట్టొచ్చిన తుమ్మల.. పార్టీ కార్యకర్తలకు భవిష్యత్‌పై భరోసా ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంతోపాటు ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తల మధ్య నెలకొన్న అంతరాలపై దృష్టి సారించాలని, సాధ్యమైనంత వరకు మండల, నియోజకవర్గస్థాయి నేతలు వాటిని పరిష్కరించి ఎన్నికలకు సమాయత్తం చేయాలని ప్రజాప్రతినిధులకు, జిల్లాస్థాయి నేతలకు మంత్రి చేస్తున్న ఉద్భోద ఇందులో భాగమేనన్న భావన రాజకీయ వర్గాల్లో కలుగుతోంది. లోతు అధ్యయనానికే పర్యటన.. రైతుబంధు పథకం ప్రారంభానికి మూడు రోజుల ముందు నుంచి కార్యక్రమం పూర్తయ్యే వరకు రోజూ జిల్లాలోని మూడు నుంచి ఐదు మండలాల వరకు మంత్రి సుడిగాలి పర్యటన చేశారు. ఆయా మండలాల్లో పార్టీ పరిస్థితిని లోతుగా అధ్యయనం చేయడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారని ప్రచారం జరుగుతోంది. గ్రామ, మండల స్థాయిలో వర్గ పోరుకు అనేకచోట్ల వ్యక్తిగత ప్రతిష్టలే కారణమన్న భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే మండల, నియోజకవర్గ స్థాయిలో పార్టీ పటిష్టానికి ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో చర్చించి కాయకల్ప చికిత్స చేయాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జిల్లాలో టీఆర్ఎస్ ఎన్నికల గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే జలగం వెంకటరావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొత్తగూడెం, మంత్రి తుమ్మల ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరుతోపాటు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యేల నియోజకవర్గాలైన వైరా, అశ్వారావుపేట, పినపాక, ఖమ్మం, ఇల్లెందు నియోజకవర్గాలతోపాటు ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ స్థానాలపై టీఆర్ఎస్ జెండా ఎగుర వేయాల్సిన బాధ్యత మంత్రిగా తుమ్మలపై పడింది. ఇవేకాక ప్రస్తుతం కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర, టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తుపల్లి, సీపీఎం ఎమ్మెల్యే ఉన్న భద్రాచలం ని యోజకవర్గాల్లో సైతం టీఆర్ఎస్ విజయం సాధించాల్సిన ఆవశ్యకతపై ఆయా నియోజకవర్గాల నేతలతో మంత్రి తుమ్మలతోపాటు ఆయా నియోజకవర్గాల ఎంపీలు తరచూ సమావేశం అవుతూ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అయితే జిల్లా, మం డలస్థాయిలో నామినేటెడ్ పోస్టుల భర్తీ అనేక కారణాలతో ఏళ్లతరబడి వాయిదా పడుతుండటం, ఖ మ్మం జిల్లాలో అనేక మార్కెట్ కమిటీలకు పాలక వర్గాలు లేని పరిస్థితి. రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఉమ్మడి జిల్లాకు నాలుగు లభించినా.. పదుల సంఖ్యలో ఉండే డైరెక్టర్ పదవులు మాత్రం ఏ ఒక్క ద్వితీయశ్రేణి నేతను వరించకపోవడంతో పార్టీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నా.. సరైన గుర్తింపు లభించడం లేదన్న కారణంతో పలువురు సీనియర్ నేతలు టీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పి ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జనసమితిలో చేరారు. మంత్రి తుమ్మల ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గానికి చెందిన వారు సైతం టీజేఎస్‌లో చేరడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది. పార్టీకి కష్టకాలంలో అండగా ఉన్న నేతలకు భరోసా కల్పించేందుకు పార్టీ నేతలు తీసుకునే చొరవ సైతం పార్టీ విజయావకాశాలను పెంచుతుందన్న భావన ఉద్యమకారుల్లో నెలకొంది. -
కొడుకును కాపాడబోయి.. తండ్రి గల్లంతు
ఖమ్మంరూరల్ : మండలంలోని ముత్తగూడెం వద్ద నాగార్జున సాగర్ ప్రధాన కాల్వలో పడిన కుమారుడిని కాపాడబోయిన తండ్రి.. నీటిలో గల్లంతయ్యా డు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు... నల్గొండ జిల్లా మిర్యాలగూడేనికి చెందిన ఎండీ జహంగీర్(35), తన భార్య ఫర్జాన్, కుమారుడు అఫ్రోజ్, కుమార్తె సమీనతో కలిసి కొంత కాలంగా ముత్తగూడెంలో నివసిస్తున్నాడు. అక్కడే చికెన్ షాపు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం భార్యాపిల్లలతో కలిసి దుస్తులు ఉతికేందుకు సాగర్ కాల్వ వద్దకు వెళ్లాడు. అక్కడ దుస్తులు ఉతుకుతుండగా కుమారుడు అఫ్రోజ్, కాలుజారి కాల్వలో పడిపోయాడు. అతడిని కాపాడేందుకు తండ్రి జహంగీర్ వెంటనే కాల్వలోకి దూకాడు. సరిగ్గా అదే సమయంలో కాల్వ పక్కన చేపలు పడుతున్న మత్స్యకారులు స్పందించి, ముందుగా అఫ్రోజ్‌ను బయటకు లాగారు. జహంగీర్‌ను కూడా కాపాడేందుకు ప్రయత్నించారు. అతడికి ఈత వచ్చు. కానీ, వరదఉధృతి ఎక్కువగా ఉండటంతో కొట్టుకు పోయాడు.. గల్లంతయ్యాడు. ప్రమాద స్థలాన్ని ఎస్సై ఎం.చిరంజీవి పరిశీలించారు. అప్పటికే పొద్దుపోవడంతో గాలింపు సాధ్యపడలేదు. జహంగీర్, ప్రతి రోజూ ఈ కాల్వలో ఈత కొడుతుండేవాడు. కేసును ఎస్సై నమోదు చేశారు. -
అన్ని దానాల్లో.. అన్నదానం మిన్న
భద్రాచలంటౌన్: అన్ని దానాల్లో.. అన్నదానం గొప్పదని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. సోమవారం శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి వచ్చిన భక్తులకు పలు స్వచ్ఛంద సంస్థలు అన్నదానం, మజ్జిగ, మంచినీరు, పులిహోర, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌సెంటర్ నందు సెంట్రింగ్ అండ్రాడ్ బెండింగ్ వర్కర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రామ్‌కో సిమెంట్ ఆధ్వర్యంలో స్థానిక మాధవి ఎంటర్‌ప్రైజస్‌ద్వారా భక్తులకు 10వేల మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైవీ రామారావు, వెంకటరెడ్డి, గడ్డం స్వామి, ఎంబీ నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గాయతి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో.. భక్తులకు 5వేల లీటర్ల పానకం, వడపప్పు, 2క్టింటాళ్ల పులిహోర పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పాకాల దుర్గాప్రసాద్, కోవూరు సంతోష్‌కుమార్, తిరుమలరావు, కృష్ణమోహన్, మూర్తి, పీ గౌతమ్, మహిళా అధ్యక్షురాలు సాగరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. వాడబలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో.. భక్తులకు పులిహోర పొట్లాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మల్లేశ్వరరావు, బద్ది శ్రీనివాసరావు, సాయిబాబా, తదితరులు పాల్గొన్నారు. ఇండియన్‌రెడ్‌క్రాస్ సోసైటీ ఆధ్వర్యంలో.. భక్తులకు 5వేల మంచినీటి ప్యాకెట్లను 5వేల మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మారుతి కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ ఎస్ఎల్ కాంతారావు, జీ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పురగిరి క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో.. భద్రాచలం విచ్చేసిన భక్తులకు 10వేల మజ్జిగ ప్యాకెట్లు అందించారు. కార్యక్రమంలో బుడగం శ్రీనివాసరావు, కుంచాల రాజారాం, సాగర్, శ్రీను, శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. మథ«ర్ థెరిస్సా ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో.. స్థానిక బస్టాండులో మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమంలో వ్యవస్థాపకుడు కొప్పుట మురళీ, జీ నాగరాజు, అజిత్, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఖమ్మంలో కంచ ఐలయ్య అరెస్ట్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర మహాసభల్లో పాల్గొనేందుకు ఖమ్మం వచ్చిన ప్రొఫెసర్ కంచ ఐలయ్యను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మహాసభలకు పోలీసులు అనుమతి ఇచ్చినప్పటికీ.. సభలో పాల్గొనేందుకు కంచ ఐలయ్యకు అనుమతి లేదని, ఆయన వస్తే అడ్డుకుంటామని సంఘానికి హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో సభలో పాల్గొనేందుకు ఆదివారం ఉదయం 5 గంటలకు ఖమ్మంలోని సుందరయ్య భవనానికి ఐలయ్య చేరుకున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ పెద్దఎత్తున మోహరించారు. సభలో ఐలయ్య పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కమిటీ నేత నున్నా నాగేశ్వరరావు, జిల్లా కమిటీ నాయకులు పోలీస్ ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి చర్చలు జరిపారు. అధికారులు అనుమతి లేదని, ఐలయ్యను ఖమ్మం నుంచి పంపించేందుకు సహకరించాలని సూచించారు. ఐలయ్య మాత్రం ఎట్టి పరిస్థితిలో సభలో పాల్గొంటానని చెప్పడంతో బహిరంగ సభ వేదిక వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సుందరయ్య భవనం నుంచి సభకు వెళ్లేందుకు బయటకు వస్తున్న ఐలయ్యను పోలీసులు భవనం బయట అడ్డుకొని అరెస్టు చేశారు. ఐలయ్య అరెస్ట్‌ను నిరసిస్తూ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, టీమాస్ నాయకులు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు తోపులాట జరిగి తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఆందోళనకారులు ఐలయ్యను ఎక్కించిన వాహనం ఎదుట పడుకొని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఐలయ్యను పోలీస్ భద్రత మధ్య ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు తరలించారు. నాకేమైనా ప్రభుత్వానిదే బాధ్యత : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం శ్రమిస్తున్న తనకు ఏదైనా జరిగితే తెలంగాణ ప్రభుత్వమే బాధ్యత వహించాలని, తన పెన్నును చూసి గన్నులు ఎందుకు వణుకుతున్నాయో ప్రభుత్వమే సమాధానం చెప్పాలని ప్రొఫెసర్ కంచ ఐలయ్య డిమాండ్ చేశారు. ఖమ్మం వచ్చిన ఆయన సుందరయ్యభవనంలో విలేకరులతో మాట్లాడారు. -
డెంగీతో బాలుడి మృతి
అశ్వరావుపేట: డెంగీతో బాలుడు మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లా అశ్వరావుపేటలో గురువారం వెలుగు చూసంది. పట్టణానికి చెందిన మహ్మద్ అమన్ (5) అనే బాలుడు గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో కుటుంబ సభ్యలు అతన్ని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం బాలుడు మృతి చెందాడు. బాలుడి మృతితో తల్లి దండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
తెలంగాణ వ్యాప్తంగా జోరుగా వర్షాలు
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా వరణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. శనివారం రాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జోరువానతో హోరెత్తిస్తున్నాడు. వరణుడి దెబ్బకు పలు రహదారుల్లో నీళ్లు చేరి రాకపోకలకు అంతరాయం కలిగింది. అక్కడక్కడా వాహనాలు వర్షపు నీటిలో ఇరుక్కుపోయాయి. గిరిజన ప్రాంతాల్లో కొన్ని గ్రామాలు నీట మునిగాయి. ఎన్నో వాగులు పొంగి పొర్లుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాన్ని జిల్లాల వారీగా చూస్తే.. ఆదిలాబాద్: జిల్లాలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. వాగులు పొంగి పొర్లుతున్నాయి. గొల్లపల్లి, కృష్ణపల్లి వాగులు పొంగటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అర్జునగుట్ట వద్ద ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా ఓపెన్ కాస్టుల్లో వర్షపు నీరు భారీగా చేరింది. దీంతో డోర్‌ని -1, 2, శ్రీరాంపూర్, కైరీగూడ, రామకృష్ణాపూర్ బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. కొమురంభీం ప్రాజెక్టుకు వరదనీరు చేరింది. అక్కడ ఇన్ ఫ్లో 22 వేలు, ఔట్ ఫ్లో 12 వేల క్యూసెక్కులుగా నమోదవటంతో 5 గేట్లు ఎత్తివేశారు. కరీంనగర్: ఆదివారం జిల్లా వ్యాప్తంగా సగటున 6.8 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మహదేవ్‌పూర్‌లో 13.6 సెంటీ మీటర్లు, కమలాపూర్, మహాముత్తారంలో 12.6, వీణవంకం, కాటారంలలో 11 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కమలాపూర్ మండలం అంబాల, శంబునిపల్లిలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. అంబాల కల్వర్టు తెగిపోవడంతో హన్మ కొండ, కమలాపూర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రామగుండం ఓపెన్ కాస్ట్‌లోకి వరద నీరు చేరి బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. ఖమ్మం: జిల్లాలోని దుమ్ముపేటలో 15 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.భద్రాచలం, ఏజెన్సీల్లో దాదాపు 40 గ్రామాలు నీట మునిగాయి. పినపాక మండలం బోటిగూడెం, పాల చెరువులకు గండి పడింది. దాంతో వాటి సమీపంలో ఉన్న మారేడుగూడెం, బోటిగూడెం గ్రామాల్లోకి వరద నీరు చేరింది. మధిర మండలం జాలిముడి ప్రాజెక్టు వద్ద వైరా నదిలో ఇద్దరు ఇంజనీర్లు చిక్కుకున్నారు. నామాలపాడు వద్ద జిన్నేయ వాగు పొంగడంతో ఇల్లెందు - మహబూబ్ నగర్ మధ్య రాకాపోకలు నిలిచిపోయాయి. వరంగల్: నర్సంపేట డివిజన్లో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు పొంగి పొర్లడంతో భద్రాచలం - నర్సంపేట మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. ఉత్తర తెలంగాణలో ఆదివారం కురిసిన భారీ వర్షంతో ధవళేశ్వరం బ్యారేజికి భారీగా వరద నీరు చేరుతోంది. -
ఖమ్మం విప్లవాల గుమ్మం
‘ఖమ్మం విప్లవాల గుమ్మం.. పోరాటాల ఖిల్లా.. నా హయాంలోనే జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది’ అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్లో టీడీపీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ప్రజాగర్జన సభకు పార్టీ జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు అధ్యక్షత వహించగా చంద్రబాబు హాజరై ప్రసగించారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల్లో రాజీవ్‌సాగర్ పూర్తి కాలేదని, ఇందిరాసాగర్ కాంట్రాక్టర్ల వరంగా మారిందన్నారు. ఈ ప్రాజెక్టులతో పాటు మొండికుంట, పాలెంవాగు, కిన్నెరసాని ప్రాజెక్టులను ప్రభుత్వం విస్మరించిందని.. ఈ ప్రాజెక్టులన్నింటిని టీడీపీ అధికారంలోకి రాగానే పూర్తి చేస్తుందన్నారు. జిల్లాలో నాగార్జునసాగర్ ఆయకట్టు కింద లక్షా యాభై వేల ఎకరాల్లో పంటలు వేశారని, నీటి విడుదల లేక ఈ పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందన్నారు. వేసిన పంటలకు నీళ్లివ్వాలని జిల్లా రైతుల పక్షాన గవర్నర్‌కు లేఖ రాయనున్నట్లు తెలిపారు. పోలవరం నిర్వాసితులకు ఆధునిక చట్టంతో పునరావాసం కల్పించేలా, వారికి పూర్తిగా న్యాయం జరిగే వరకు టీడీపీ పోరాడుతుందన్నారు. ఎస్సారెస్పీ ద్వారా జిల్లాలో పంటలకు నీళ్లందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. జిల్లా ప్రజలకు ఏదో చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇక్కడ అభివృద్ధినే విస్మరించిందన్నారు. భద్రాచలంలో గిరిజన యూనివర్శిటీ, కొత్తగూడెంలో మైనింగ్ యూనివర్శిటీ, కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుకు టీడీపీ కృషి చేస్తుందన్నారు. ఖమ్మంను హైదరాబాద్‌కు దీటైన నగరంగా అభివృద్ధి చేస్తామన్నారు. జిల్లా నుంచి ఇండియాలో ఎక్కడికైనా వెళ్లేందుకు విమానాశ్రయం ఏర్పాటు చేయిస్తానన్నారు. నష్టాల్లో ఉన్న సింగరేణికి తన ప్రభుత్వ హయాంలో రూ.663 కోట్లు రుణం ఇప్పించి ఆదుకున్నానన్నారు. జిల్లా అభివృద్ధికి పాటు పడకుండా నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్ నేతలకు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. రానున్న ఎన్నికల్లో జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు, రెండు ఎంపీ స్థానాలు గెలిపించేలా ప్రజలు ఆశీర్వదించాలన్నారు.ఈ సభలో ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు హయాంలోనే జిల్లా అభివృద్ధి జరిగిందని, గత ప్రభుత్వం అభివృద్ధిలో జిల్లాను విస్మరించిందన్నారు. కొత్త రాష్ట్రంలో అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమవుతుందన్నారు. ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ నవ తెలంగాణలో ఖమ్మం జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. పోలవరంతో 2 లక్షల మంది గిరిజనులు నిర్వాసితులవుతున్నారన్నారు. కొత్త భూ చట్టం ప్రకారం నిర్వాసితులకు న్యాయం చేసే బాధ్యత టీడీపీపై ఉందని పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి గిరిజనులకు న్యాయం చేయాలన్నారు. ప్రజాగర్జన సభలో తెలంగాణ పార్టీ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, మోత్కుపల్లి నర్సింహులు, ఎల్.రమణ, విజయరమణారావు, ఉమా మాధవరెడ్డి, రమేష్ రాథోడ్, గుండు సుధారాణి, రేవూరిప్రకాశ్రెడ్డి, సీతక్క, ఈ. పెద్దిరెడ్డి, రావులపాటి సీతారామారావు, ప్రకాశ్‌గౌడ్, అరవింద్‌కుమార్‌గౌడ్, జిల్లా నేతలు సండ్ర వెంకటవీరయ్య, ఊకె అబ్బయ్య, బాలసాని లక్ష్మీనారాయణ, పోట్ల నాగేశ్వరరావు, బాణోతు మోహన్‌లాల్, మద్దినేని బేబిస్వర్ణకుమారి, నాగప్రసాద్, కోనేరు సత్యనారాయణ, ఫణీశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. -
కుమ్ములాటలో పుట్టుకొచ్చిన కొత్తనేత
ఖమ్మం: జిల్లా తెలుగుదేశం పార్టీలో ఎంపి నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావుల మధ్య ఆధిపత్య పోరులో మరో కొత్త నేత పుట్టుకువచ్చారు. ల్యాంకో సంస్థలకు సిఇఓగా పనిచేసిన కందిమళ్ల వెంకట నాగప్రసాద్ అనే పారిశ్రామిక వేత్త టిడిపిలో హటాత్తుగా చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయనను ఏకంగా పార్టీ అధికార ప్రతినిధిగా ప్రకటించేశారు. జిల్లాలోని దమ్మపేట మండలానికి చెందిన కందిమళ్ల కుటుంబం ఆది నుంచీ టిడిపిలో పనిచేస్తోంది. అయితే బిసి వర్గానికి చెందిన ఈ కుటుంబం నుంచి పారిశ్రామిక వేత్తగా, ల్యాంకో సంస్ధలో సిఇఓగా పనిచేస్తున్న నాగప్రసాద్ ఒక్కసారిగా టిడిపి తీర్థం పుచ్చుకుని తన వ్యాపార బాధ్యతలకు స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామం వెనుక ఖమ్మం ఎంపి నామా నాగేశ్వరరావు చక్రం తిప్పినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జిల్లాలో పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే జనరల్ స్థానాలుగా ఉన్నాయి. ఖమ్మం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా తుమ్మల నాగేశ్వరరావు ఉండగా, కొత్తగూడెం నుంచి మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు తనయుడు చిన్నికి లేదా కొత్తగూడెం ఎఎంసి మాజీ చైర్మన్ కిలారు నాగేశ్వరరావులలో ఒకరికి ఈ సారి టిక్కెట్టు వస్తుందని అందరూ భావిస్తున్నారు. ఇక పాలేరు నుంచి నామా వర్గంలో కొనసాగుతున్న బేబీ స్వర్ణకుమారికి టిక్కెట్టు దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. అయితే మూడు స్థానాలూ ఒకే సామాజిక వర్గంకు ఇస్తే జిల్లాలో బిసిలకు ప్రాతినిధ్యం లేకుండా పోయిందనే ప్రచారాన్ని మిగిలిన పార్టీలు ముందుకు తీసుకువస్తాయనే చర్చ పార్టీలో మొదలైంది. ఈ నేపథ్యంలో పాలేరు స్థానంను బిసిలకు కేటాయించాలనే డిమాండ్‌ను బిసి నేతలు తెరమీదికి తీసుకువచ్చారు. దాంతో జిల్లాలో తుమ్మల వర్గంలో కొనసాగుతున్న ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పేరును కూడా వెంటనే ఆయన వర్గం ప్రచారంలోకి తెచ్చింది. ఎమ్మెల్సీగా పనిచేస్తుండటంతోపాటు ఏజెన్సీ ప్రాంతం నుంచి ఎదిగిన నేతగా బాలసానికి టిక్కెట్టు ఇస్తే అటు ఏజెన్సీలోనూ, ఇటు బిసి వర్గాల్లోనూ పార్టీకి ఓట్లు రాలతాయని తుమ్మల వర్గం అనుకూల వాదనను మొదలుపెట్టింది. ఈ పరిణామాలతో ఒక్కసారిగా అటు నామా వర్గం ఉలిక్కిపడింది. తమ వర్గంలోని స్వర్ణకుమారికి టిక్కెట్టు రాకుండా చేసేందుకు తుమ్మల వర్గం ముందు నుంచే ప్రణాళికలను అమలు చేస్తోందని ఆశించిన నామా వెంటనే పావులు కదపడం మొదలుపెట్టారు. బాలసానికి చెక్ పెట్టేందుకు అదే సామాజిక వర్గం నుంచి పార్టీకి అనుకూలంగా వున్న కందిమళ్ల కుటుంబం నుంచి వ్యాపార రంగంకు చెందిన నాగప్రసాద్‌ను తెరమీదికి తీసుకువచ్చారు. నాగప్రసాద్ అయితే ఎన్నికల్లో ఖర్చు పరంగా పార్టీపై భారం వుండదని, పైగా అవసరమైతే పార్టీకే నాగప్రసాద్ ఆర్ధిక పరిస్థితి అండగా నిలుస్తుందంటూ అధినేత చంద్రబాబు వద్ద నామా చేసిన ప్రతిపాదనలు ఆయనకు అమాంతం నచ్చేశాయి. చంద్రబాబు వెంటనే నాగప్రసాద్‌ను పార్టీలోకి ఆహ్వానించడం, రాష్ట్రస్ధాయి పదవిని కట్టబెట్టడం చకచకా జరిగిపోయాయి. ఇక జిల్లాలో అడుగుపెట్టిన నాగప్రసాద్‌ను నామా వర్గం ఘనంగా ఆహ్వానించి రేపో, మాపో పాలేరు స్థానంపై కుర్చోబెట్టేందుకు సిద్దపడుతోంది. జిల్లా పార్టీ కార్యాలయంకు తొలిసారి వచ్చిన నాగప్రసాద్‌ను పాలేరు నియోజకవర్గానికి చెందిన నేతలు కలుసుకుని పరిచయం చేసుకునేందుకు పోటీ పడటమే ఇందుకు నిదర్శనం. దీంతో ఇప్పటి వరకూ నామాను నమ్మకున్న స్వర్ణకుమారి పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులైంది. ఏదో ఒక విధంగా ఆమెకు న్యాయం చేస్తానని నామా హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద నాగప్రసాద్ రాక అటు బాలసానికి నిరాశను, తుమ్మల వర్గానికి ఊహించని ఎదురుదెబ్బను మిగిల్చింది. పారిశ్రామిక వేత్తగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చి జిల్లా తెలుగుదేశంను శాసిస్తున్న నామా నాగేశ్వరరావుకు మరో వ్యాపారవేత్త నాగప్రసాద్ తోడవ్వడంతో ఇక జిల్లా తెలుగుదేశంలో నామా వర్గం మరింత బలోపేతం అవుతుందని, తుమ్మల వర్గం ప్రాభవం మసకబారక తప్పదనే భావం పార్టీ వర్గాలలో వ్యక్తమవుతోంది. -
కాస్త శాంతించిన గోదావరి
ఖమ్మం: వరద నీటితో పొంగుతున్న గోదావరి కాస్త శాంతించింది. పరీవాహక ప్రాంతంలోని గ్రామాలను ముంచెత్తుతోంది. ఖమ్మం జిల్లా భద్రాచలం, పాల్వంచ డివిజన్లోని ఏజెన్సీ గ్రామాలు నీట మునిగాయి. భద్రాచలం వద్ద గోదావరి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. వరద ఉధృతి కాస్త శాంతించడంతో ఇప్పుడిప్పుడే అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఖమ్మం జిల్లాను గోదావరి వరదలు ముంచెత్తాయి. వందల గ్రామాలు వరద ముంపులో చిక్కుకొని అల్లాడుతున్నాయి. సాయం అందక లోతట్టు ప్రాంతాల ప్రజలు విలవిలలాడుతున్నారు. పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. గోదావరి వరద 62 అడుగులు చేరి ప్రవహించడంతో భద్రచలం, పాల్వంచ డివిజన్లు అతాలాకుతలం అయ్యాయి. గత రెండు రోజులుగా వరద ఉధృతి తగ్గుముకం పట్టింది. ప్రస్తుతానికి గోదావరి వరద ఉదృతి తగ్గి 48 అడుగులకు చేరింది. దీంతో అధికారులు 3వ ప్రమాద హెచ్చరిక ఉపసంహరించుకున్నారు.