
ఖమ్మం సహకారనగర్: పంచాయతీల పరిధిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం.. వాటిని పరిష్కరించేందుకు మరింత పటిష్టమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. గ్రామస్థాయిలో అభివృద్ధి తదితర అంశాల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శులదే కీలకపాత్ర. జిల్లాలో ప్రస్తుతం కార్యదర్శులు తక్కువగా ఉండడం.. వారికి ఇతర పంచాయతీల బాధ్యతలు అప్పగించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదనపు బాధ్యతలు నిర్వర్తించే కార్యదర్శులు కూడా విధి నిర్వహణకు పూర్తి సమయం కేటాయించలేని పరిస్థితి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రతి పంచాయతీకి కార్యదర్శిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు అందుకు సంబంధించిన ఉత్తర్వులను కూడా జారీ చేసింది. దీంతో పాత పంచాయతీలతోపాటు కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు కార్యదర్శులను నియమించనున్నారు.
జిల్లాలో మొత్తం 584 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో పాత పంచాయతీలు 427 కాగా.. ఆగస్టు 2వ తేదీ నుంచి 167 గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పడ్డాయి. అదే సమయంలో 10 గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల పరిధిలో విలీనమయ్యాయి. మొత్తం పంచాయతీలకు కలిపి కేవలం 102 మంది కార్యదర్శులున్నారు. దీంతో ఖాళీగా ఉన్న గ్రామ పంచాయతీలకు కూడా కార్యదర్శులను నియమించి.. స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
కార్యదర్శులు అందుబాటులో లేక..
584 గ్రామ పంచాయతీలలో 102 మంది కార్యదర్శులు మాత్రమే ఉండటంతో పనిభారంతో ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్కరికీ 3 నుంచి 4 గ్రామాల బాధ్యతలను అప్పగించడంతో ఏ సమయంలో ఎక్కడ ఉంటారో అర్థంకాని పరిస్థితి. ఒకవైపు పని ఎక్కువగా ఉందని కార్యదర్శులు వాపోతుండగా.. మరోవైపు ప్రజలు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న సర్టిఫికెట్ కావాలన్నా.. అత్యవసరంగా గ్రామ కార్యదర్శి సంతకం కావాలన్నా రోజుల తరబడి కార్యదర్శుల కోసం వేచి ఉండాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. కార్యదర్శి ఏ గ్రామంలో ఉన్నాడో అర్థం కాకపోవడం, తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తే అక్కడ కూడా కార్యదర్శుల జాడ లేకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. ఇక విద్యార్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యదర్శుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది.
485 పోస్టుల భర్తీ..
జిల్లాలో మొత్తం 584 గ్రామ పంచాయతీలుండగా.. 102 మంది మాత్రమే కార్యదర్శులున్నారు. మిగిలిన వాటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీగా ఉన్న 485 పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులు భర్తీ అయితే స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు త్వరితగతిన పరిష్కారం అయ్యే అవకాశం ఉంది.
నిరుద్యోగులకు ఇదే అవకాశం..
జిల్లాలో పంచాయతీ కార్యదర్శి పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావడంతో నిరుద్యోగ అభ్యర్థుల్లో ఆశలు మొదలయ్యాయి. ఈనెల 3 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా, ఈనెల 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇటీవల ప్రతిపాదించిన జోనల్ వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో వెంటనే పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం
రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న గ్రామ పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేయడంతోపాటు కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లో కూడా నూతన కార్యదర్శులను నియమించనున్నది. దీంతో ప్రస్తుతం ఉన్న పనిభారంతో సుదూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు ఇబ్బందులు తప్పనున్నాయి. పోస్టుల భర్తీ విషయంలో ప్రభుత్వం నిర్ణయం హర్షణీయం. – చెరుకూరి పవన్, పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment