Villages Development Committee
-
అభివృద్ధికి గ్రహణం
నర్సంపేట: దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించని చందాన తయారైంది నర్సంపేట పట్టణ పరిస్థితి. సుందరీకరణ కోసం ఎన్నికలకు ముందు ప్రస్తుత ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో అప్పటి మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి టీయూఎఫ్ఐడీసీ జీఓ 51 ద్వారా రూ.35 కోట ప్రత్యేక నిధులు మంజూరు చేయించారు. పనులు పూర్తి చేసేందుకు పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల అభివృద్ధి పనులకు గ్రహణం పట్టింది. పట్టణ ప్రజలకు కనీస వసతులు లేకుండా పోయింది. విడుదలైన నిధులతో డబుల్, సింగిల్ డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టం, ప్రధాన జంక్షన్లు, కుమ్మరికుంట పార్కు, సైడ్ డ్రెయినేజీ నిర్మాణాలు, రోడ్ల నిర్మాణం, ఓపెన్ జిమ్, కమ్యూనిటీ హాళ్లు, కూరగాయల మార్కెట్, ఆడిటోరియం, అంబేడ్కర్ భవన్ లాంటి అభివృద్ధి పనులతో పట్టణ సుందరీకరణ కోసం నిధులను కేటాయించారు. అప్పట్లోనే ఎమ్మెల్యే రాష్ట్ర స్థాయి అధికారులను నర్సంపేటకు తీసుకువచ్చి అభివృద్ధి పనుల ప్రణాళికపై వివరించి సకాలంలో పూర్తిచేసే విధంగా సహకరించాలని కోరారు. కాని సంబంధిత అధికారులు ఉదాసీనత పాటించారు. పట్టణంలోని డివైడర్ల పనులు కొనసాగుతుండగా రూ.3 కోట్లతో కుమ్మరికుంట పార్కు అభివృద్ధి చేయాల్సిన పనులతో పాటు రూ.15 కోట్లతో నిర్మించాల్సిన 33 కమ్యూనిటీ భవనాలు నిర్మాణం పనులు అటకెక్కాయి. 7 కమ్యూనిటీ భవనాలకు మాత్రమే టెండర్లు పూర్తికాగా 26 భవన నిర్మాణాల కోసం టెండర్లు, 5 కోట్లతో నిర్మించాల్సిన ఎస్సీ ఆడిటోరియం , 30 లక్షలతో ఏర్పాటు కానున్న లైబ్రరీ పనులకు టెండర్లు జరగాల్సి ఉంది. ఎన్నికల కోడ్ సాకుతో అధికారులు పట్టణ అభివృద్ధిపై పట్టింపులేకపోవడం వల్లనే పూర్తిస్థాయి అభివృద్ధి ఆలస్యమవుతోందని పలువురు విమర్శిస్తున్నారు. అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం.. పట్టణ సుందరీకరణలో జరగాల్సిన పనులకు టెండర్ల ప్రక్రియ చేయని వాటిపై ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మునిసిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణ సుందరీకరణ కోసం పట్టు బట్టి రూ.35 కోట్లు విడుదల చేయించినప్పటికీ టెండర్లు పూర్తిస్థాయిలో నిర్వహించని పనులకు సంబంధించిన అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు వెంటనే చేయాలని పూర్తిస్థాయి పనుల నిర్మాణానికి వెంటనే టెండర్లను నిర్వహించాలని ఆదేశించారు. పట్టణ ప్రజలకు తాగునీరందించేందుకు మిషన్ భగీరథ పైప్‌లైన్‌కు అనుసంధానంగా గతంలో ఉన్న పైప్‌లైన్‌కు లింకేజీ ఇస్తూ సమస్యను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. నర్సంపేట పట్టణాన్ని గ్రీన్‌సిటీగా తీర్చిదిద్దేందుకు ఇంటింటికీ కావాల్సిన మొక్కలను అందజేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఈఈ వెంకటరమణారెడ్డి, మునిసిపల్ చైర్మన్ నాగెల్లి వెంకటనారాయణ, కమిషనర్ వెంకటేశ్వర్లు, త్రిబుల్ ఆర్ కన్స్ట్రక్షన్ అధినేత రాయిడి రవీందర్‌రెడ్డి, మునిగాల వెంకట్‌రెడ్డి, నల్లా మనోహర్‌రెడ్డి, ఏఈ సతీష్, తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీకో కార్యదర్శి
ఖమ్మం సహకారనగర్: పంచాయతీల పరిధిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం.. వాటిని పరిష్కరించేందుకు మరింత పటిష్టమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. గ్రామస్థాయిలో అభివృద్ధి తదితర అంశాల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శులదే కీలకపాత్ర. జిల్లాలో ప్రస్తుతం కార్యదర్శులు తక్కువగా ఉండడం.. వారికి ఇతర పంచాయతీల బాధ్యతలు అప్పగించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదనపు బాధ్యతలు నిర్వర్తించే కార్యదర్శులు కూడా విధి నిర్వహణకు పూర్తి సమయం కేటాయించలేని పరిస్థితి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రతి పంచాయతీకి కార్యదర్శిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అందుకు సంబంధించిన ఉత్తర్వులను కూడా జారీ చేసింది. దీంతో పాత పంచాయతీలతోపాటు కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు కార్యదర్శులను నియమించనున్నారు. జిల్లాలో మొత్తం 584 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో పాత పంచాయతీలు 427 కాగా.. ఆగస్టు 2వ తేదీ నుంచి 167 గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పడ్డాయి. అదే సమయంలో 10 గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల పరిధిలో విలీనమయ్యాయి. మొత్తం పంచాయతీలకు కలిపి కేవలం 102 మంది కార్యదర్శులున్నారు. దీంతో ఖాళీగా ఉన్న గ్రామ పంచాయతీలకు కూడా కార్యదర్శులను నియమించి.. స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కార్యదర్శులు అందుబాటులో లేక.. 584 గ్రామ పంచాయతీలలో 102 మంది కార్యదర్శులు మాత్రమే ఉండటంతో పనిభారంతో ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్కరికీ 3 నుంచి 4 గ్రామాల బాధ్యతలను అప్పగించడంతో ఏ సమయంలో ఎక్కడ ఉంటారో అర్థంకాని పరిస్థితి. ఒకవైపు పని ఎక్కువగా ఉందని కార్యదర్శులు వాపోతుండగా.. మరోవైపు ప్రజలు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న సర్టిఫికెట్ కావాలన్నా.. అత్యవసరంగా గ్రామ కార్యదర్శి సంతకం కావాలన్నా రోజుల తరబడి కార్యదర్శుల కోసం వేచి ఉండాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. కార్యదర్శి ఏ గ్రామంలో ఉన్నాడో అర్థం కాకపోవడం, తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తే అక్కడ కూడా కార్యదర్శుల జాడ లేకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. ఇక విద్యార్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యదర్శుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. 485 పోస్టుల భర్తీ.. జిల్లాలో మొత్తం 584 గ్రామ పంచాయతీలుండగా.. 102 మంది మాత్రమే కార్యదర్శులున్నారు. మిగిలిన వాటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీగా ఉన్న 485 పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులు భర్తీ అయితే స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు త్వరితగతిన పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఇదే అవకాశం.. జిల్లాలో పంచాయతీ కార్యదర్శి పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావడంతో నిరుద్యోగ అభ్యర్థుల్లో ఆశలు మొదలయ్యాయి. ఈనెల 3 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా, ఈనెల 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇటీవల ప్రతిపాదించిన జోనల్ వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో వెంటనే పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న గ్రామ పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేయడంతోపాటు కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లో కూడా నూతన కార్యదర్శులను నియమించనున్నది. దీంతో ప్రస్తుతం ఉన్న పనిభారంతో సుదూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు ఇబ్బందులు తప్పనున్నాయి. పోస్టుల భర్తీ విషయంలో ప్రభుత్వం నిర్ణయం హర్షణీయం. – చెరుకూరి పవన్, పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా కార్యదర్శి -
సారాపై సమరం
- గ్రామాభివృద్ధి కమిటీలకు అవగాహన కల్పిసున్న ఎక్సైజ్ - నిషేధం అమలుకు పకడ్బందీ చర్యలు - 48 మంది సారా విక్రేతల బైండోవర్ మోర్తాడ్ : సారాపై ఎక్సైజ్ శాఖ సమర భేరి మోగించింది. సారా అమ్మకాలపై ఇప్పటివరకు చూసీ చూడనట్టుగా వ్యవహరించారన్న విమర్శలను మూటగట్టుకున్న ఎక్సైజ్ అధికారులు.. తమపై పడిన మచ్చను తుడుచుకునేందుకు చర్యలు చేపట్టారు. గ్రామాలలో తిరుగుతూ, సారా అమ్మితే ఏర్పడే ఇబ్బందులు.. తాగితే కలిగే నష్టాలను ప్రజలకు వివరిస్తున్నారు. సారా నిషేధం అమలు దిశగా ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. సారా విక్రయాలను పూర్తిగా అరికట్టాలని, ఇందుకోసం సర్వాధికారాలను ఉపయోగించుకోవాలని, ఈ విషయంలో విఫలమైతే ఊరుకునేది లేదని ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఎక్సైజ్ అధికారుల్లో మునుపెన్నడూ లేనంత కదలిక వచ్చింది. ఒకవైపు దాడులు కొనసాగిస్తూ, మరోవైపు ప్రజలను చైతన్యవంతం చేస్తూ ద్విముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. కేసులు, బైండోవర్లు మోర్తాడ్, భీమ్‌గల్, ఆర్మూర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, నిజామాబాద్, బోధన్, బాన్సువాడ, బిచ్కుంద, దోమకొండలో ఎక్సైజ్ సర్కిల్ స్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలోని గ్రామాలలో సారా తయారీ, విక్రయదారులపై ఎక్సైజ్ అధికారులు దృష్టి సారించారు. వీరిని అరెస్టు చేస్తున్నారు. గతంలో కేసులలో ఉన్న వారిని సంబంధిత తహశీల్దారుల ముందు బైండోవర్ చేస్తున్నారు. ఇకపై సారా విక్రయించబోమంటూ వారి నుంచి లక్ష రూపాయలకు పూచీకత్తు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 48 మంది సారా విక్రేతలను బైండోవర్ చేశారు. వీరిలో ఒక్క మోర్తాడ్ సర్కిల్ పరిధిలోనే 22 మంది ఉన్నారు. నల్ల బెల్లం వ్యాపారులను కూడా తహశీల్దారుల ఎదుట బైండోవర్ చేసి, కేసులు నమోదు చేస్తున్నారు. ప్రజలతో సమావేశాలు జిల్లాలోగల పది ఎక్సైజ్ సర్కిళ్ల పరిధిలో రోజుకు కొన్ని గ్రామాల చొప్పున సారా నిషేధంపై ప్రజలతో సమావేశాలను అధికారులు నిర్వహిస్తున్నారు. సారా విక్రయాలకు అంతర్గతంగా సహకరిస్తున్న గ్రామాభివృద్ధి కమిటీలకు అవగాహన కల్పిస్తున్నారు. తమ గ్రామం నుంచి సారాను పారదోలుతామంటూ ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. సారా తయారీ, విక్రయాలు సాగకుండా చూస్తామంటూ మోర్తాడ్ సర్కిల్ పరిధిలోని గుమ్మిర్యాల్, తిమ్మాపూర్, రామన్నపేట్, దోన్పాల్, సుంకెట్ తాండ, చౌట్పల్లి, గట్ల కోనాపూర్; భీమ్‌గల్ సర్కిల్ పరిధిలోని సంతోష్‌నగర్; కామారెడ్డి సర్కిల్ పరిధిలోని క్యాసంపల్లి, శాబ్దిపూర్; దోమకొండ సర్కిల్ పరిధిలోని యాడారం, సంగమేశ్వర్ గ్రామాల ప్రజల నుంచి ఎక్సైజ్ అధికారులు హామీ తీసుకున్నారు. మిగతా గ్రామాల ప్రజల నుంచి కూడా ఇలాగే మాట తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. జరిమానాకు తీర్మానం గుమ్మిర్యాల్‌లో సారా విక్రయాలకు అక్కడి గ్రామాభివృద్ధి కమిటీ గతంలో వేలం నిర్వహించింది. దీనిని, ఆ కమిటీ తాజాగా రద్దు చేసింది. సారా విక్రయిస్తే రూ.10వేల జరిమానా విధించాలని తిమ్మాపూర్, చౌట్పల్లి, రామన్నపేట్, దోన్పాల్, గట్ల కోనాపూర్‌లోని గ్రామాభివృద్ధి కమిటీలు తీర్మానించాయి. సారా విక్రయాలను నిలిపివేస్తే తాగేవారు మానుకుంటారని ఈ కమిటీలు భావిస్తున్నాయి. పూర్తిగా అడ్డుకుంటాం సారా విక్రయాలను పూర్తిగా అడ్డుకుంటాం. సారాతో కలిగే నష్టాలను ప్రజలకు వివరిస్తున్నాం. సారాతో ఆరోగ్యం దెబ్బతింటుందని, ఆర్థిక ఇబ్బం దులతో కుటుంబాలు వీధిన పడతాయని ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలి. - అరుణ్ రావు, డిప్యూటి కమిషనర్, ఎక్సైజ్ శాఖ లొల్లి పోయింది సారా టెండర్లను రద్దు చేస్తున్నట్టుగా గ్రా మాభివృద్ధి కమిటీలు ప్రకటించడంతో సారా లొల్లి పోయింది. గ్రామాభివృద్ధి కమిటీ టెండర్లు నిర్వహించడంతో ఇన్నాళ్లూ మేము అడ్డు చెప్పలేకపోయాం. - తస్లీమ్, గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు, గుమ్మిర్యాల్ కమిటీలు గుర్తించాయి సారాతో కలిగే నష్టాలను గ్రామాభివృద్ధి కమిటీలు గుర్తించాయి. సారా నిషేధానికి అవి నడుం బిగించడంతో సత్ఫలితాలు వస్తాయి. సారా వ్యాపారులు, తాగేవారిలోనూ కూడా మార్పు వస్తుంది. - ఉగ్గెర భూమేశ్వర్, సర్పంచ్, తిమ్మాపూర్