సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
నర్సంపేట: దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించని చందాన తయారైంది నర్సంపేట పట్టణ పరిస్థితి. సుందరీకరణ కోసం ఎన్నికలకు ముందు ప్రస్తుత ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో అప్పటి మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి టీయూఎఫ్‌ఐడీసీ జీఓ 51 ద్వారా రూ.35 కోట ప్రత్యేక నిధులు మంజూరు చేయించారు. పనులు పూర్తి చేసేందుకు పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల అభివృద్ధి పనులకు గ్రహణం పట్టింది. పట్టణ ప్రజలకు కనీస వసతులు లేకుండా పోయింది. విడుదలైన నిధులతో డబుల్, సింగిల్ డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టం, ప్రధాన జంక్షన్లు, కుమ్మరికుంట పార్కు, సైడ్ డ్రెయినేజీ నిర్మాణాలు, రోడ్ల నిర్మాణం, ఓపెన్ జిమ్, కమ్యూనిటీ హాళ్లు, కూరగాయల మార్కెట్, ఆడిటోరియం, అంబేడ్కర్ భవన్ లాంటి అభివృద్ధి పనులతో పట్టణ సుందరీకరణ కోసం నిధులను కేటాయించారు.
అప్పట్లోనే ఎమ్మెల్యే రాష్ట్ర స్థాయి అధికారులను నర్సంపేటకు తీసుకువచ్చి అభివృద్ధి పనుల ప్రణాళికపై వివరించి సకాలంలో పూర్తిచేసే విధంగా సహకరించాలని కోరారు. కాని సంబంధిత అధికారులు ఉదాసీనత పాటించారు. పట్టణంలోని డివైడర్ల పనులు కొనసాగుతుండగా రూ.3 కోట్లతో కుమ్మరికుంట పార్కు అభివృద్ధి చేయాల్సిన పనులతో పాటు రూ.15 కోట్లతో నిర్మించాల్సిన 33 కమ్యూనిటీ భవనాలు నిర్మాణం పనులు అటకెక్కాయి. 7 కమ్యూనిటీ భవనాలకు మాత్రమే టెండర్లు పూర్తికాగా 26 భవన నిర్మాణాల కోసం టెండర్లు, 5 కోట్లతో నిర్మించాల్సిన ఎస్సీ ఆడిటోరియం , 30 లక్షలతో ఏర్పాటు కానున్న లైబ్రరీ పనులకు టెండర్లు జరగాల్సి ఉంది. ఎన్నికల కోడ్ సాకుతో అధికారులు పట్టణ అభివృద్ధిపై పట్టింపులేకపోవడం వల్లనే పూర్తిస్థాయి అభివృద్ధి ఆలస్యమవుతోందని పలువురు విమర్శిస్తున్నారు.
అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం..
పట్టణ సుందరీకరణలో జరగాల్సిన పనులకు టెండర్ల ప్రక్రియ చేయని వాటిపై ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మునిసిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణ సుందరీకరణ కోసం పట్టు బట్టి రూ.35 కోట్లు విడుదల చేయించినప్పటికీ టెండర్లు పూర్తిస్థాయిలో నిర్వహించని పనులకు సంబంధించిన అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు వెంటనే చేయాలని పూర్తిస్థాయి పనుల నిర్మాణానికి వెంటనే టెండర్లను నిర్వహించాలని ఆదేశించారు. పట్టణ ప్రజలకు తాగునీరందించేందుకు మిషన్ భగీరథ పైప్‌లైన్‌కు అనుసంధానంగా గతంలో ఉన్న పైప్‌లైన్‌కు లింకేజీ ఇస్తూ సమస్యను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. నర్సంపేట పట్టణాన్ని గ్రీన్‌సిటీగా తీర్చిదిద్దేందుకు ఇంటింటికీ కావాల్సిన మొక్కలను అందజేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఈఈ వెంకటరమణారెడ్డి, మునిసిపల్ చైర్మన్ నాగెల్లి వెంకటనారాయణ, కమిషనర్ వెంకటేశ్వర్లు, త్రిబుల్ ఆర్ కన్‌స్ట్రక్షన్ అధినేత రాయిడి రవీందర్‌రెడ్డి, మునిగాల వెంకట్‌రెడ్డి, నల్లా మనోహర్‌రెడ్డి, ఏఈ సతీష్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment