TRS Govt.
-
పదోన్నతుల జాతర..
ఆదిలాబాద్‌అర్బన్: పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగుల ఇరవై నాలుగేళ్ల నిరీక్షణకు ప్రస్తుత సర్కారు తెర వేసింది. మండల అభివృద్ధి అధికారులకు పదోన్నతులు కల్పించాలని పంచాయతీ రాజ్ ఉద్యోగులు ఏళ్లుగా చేస్తున్న పోరాటాలు ఫలించాయి. పెండింగ్‌లో ఉన్న ఎంపీడీవోల పదోన్నతుల ఫైలుపై సీఎం కేసీఆర్ సోమవారం సంతకం చేయడంతో పంచాయతీ రాజ్ శాఖలో పదోన్నతులకు లైన్ క్లియరైంది. అప్పటి ప్రభుత్వం 1994లో పీఆర్ శాఖలో పదోన్నతులు చేపట్టింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ జరగలేదు. ప్రస్తుత ప్రభుత్వం తాజాగా జూన్, జూలైలో సాధారణ బదిలీలు చేపట్టినా.. పంచాయతీ రాజ్ శాఖలో ఎలాంటి బదిలీలు చేపట్టని విషయం తెలిసిందే. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 130 మంది ఎంపీడీవోలు సీనియార్టీ ప్రకారం పదోన్నతులకు అర్హులుగా ఉండగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఏడుగురికి పదోన్నతుల్లో అవకాశం లభించనుంది. ఈ ప్రక్రియ ద్వారా ఎంపీడీవోలు డిప్యూటీ సీఈవో, డీఆర్డీవోలుగా పదోన్నతులు పొందనున్నారు. ఈ హోదా స్టేట్ క్యాడర్ కావడంతో ప్రభుత్వం నుంచి పదోన్నతులకు సంబంధించిన ఉత్తర్వులు రావాల్సి ఉంటుందని సంబందిత అధికారులు పేర్కొంటున్నారు. పదోన్నతులతో ఖాళీ అయినా ఎంపీడీవో స్థానాలను భర్తీ చేయడానికి మరికొంతమంది ఉద్యోగులకు పదోన్నతులు లభించనున్నాయి. ఆ ఏడుగురు అధికారులు వీరే.. సీనియార్టీ జాబితా ప్రకారం పదోన్నతులు పొందునున్న ఆయా ఎంపీడీవోలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మండలాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆదిలాబాద్ రెగ్యులర్ ఎంపీడీవో జితేందర్‌రెడ్డి(ప్రస్తుతం ఇన్చార్జి జెడ్పీ సీఈవోగా కొనసాగుతున్నారు), మంచిర్యాల రెగ్యులర్ ఎంపీడీవో కే.నరేందర్(ప్రస్తుతం జెడ్పీ డిప్యూటీ సీఈవోగా ఉన్నారు), ఇచ్చోడ రెగ్యులర్ ఎంపీడీవో వెంకట సూర్యరావు(డిప్యూటేషన్‌పై ప్రస్తుతం పీఆర్ కమిషనరేట్‌లో పని చేస్తున్నారు), జన్నారం ఎంపీడీవో శేషాద్రి(ప్రస్తుతం టీసీ ఫాడ్లో పని చేస్తున్నారు), సిర్పూర్(యు) ఎంపీడీవో రవీందర్(ప్రస్తుతం ఆదిలాబాద్ ఎంపీడీవోగా డిప్యూటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు), జైనూర్ ఎంపీడీవో దత్తరావు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి(డీఆర్డీవో)గా ఆదిలాబాద్‌లో పని చేస్తున్న రాజేశ్వర్ రాథోడ్‌లు పదోన్నతులు పొందనున్న వారి జాబితాలో మోస్ట్ సీనియర్‌గా ఉన్నారు. ఇదిలా ఉండగా, జిల్లా పునర్విభజనతో నాలుగు జిల్లాలుగా ఏర్పాటైంది. ప్రస్తుతం నాలుగింటికి ఒకే జిల్లా పరిషత్ ఉంది. నాలుగు జిల్లాల్లో ఇప్పటికే గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పని చేస్తున్నారు. జిల్లా పరిషత్‌కు సీఈవో, డిప్యూటీ సీఈవో రెండు పోస్టులే అవసరం. వీరిద్దరే ఇక్కడ ఉండే అవకాశం ఉంది. వీరితోపాటు డీఆర్డీవో కూడా ఇక్కడే ఉండనున్నారు. అంటే పదోన్నతులు పొందిన ఏడుగురిలో ముగ్గురు ఇక్కడ ఉండగా, మిగతా నలుగురు ఇతర జిల్లాలకు బదిలీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, పంచాయతీ రాజ్ శాఖ విభజన అయ్యి నాలుగు జిల్లాల్లో జిల్లా పరిషత్‌లు ఉంటే పదోన్నతులు పొందిన ఎంపీడీవోలందరూ ఉమ్మడి జిల్లా పరిధిలోనే ఉండేవారు. ప్రస్తుతం జిల్లా పరిషత్ విభజన కాకపోవడంతో ఇతర జిల్లాలకు వెళ్లాల్సి వస్తోందనే కొంత బాధ ఎంపీడీవోల్లో లేకపోలేదు. మరో 35 మంది అధికారులకు కూడా.. ఉమ్మడి జిల్లాలో త్వరలో జరుగనున్న ఎంపీడీవోల పదోన్నతుల వల్ల ఖాళీ కానున్న వారి స్థానా లను భర్తీ చేసేందుకు సైతం రంగం సిద్ధమైంది. ఇందుకు ఉద్యోగుల సీనియార్టీ జాబి తాను పంచా యతీ రాజ్ శాఖ అధికారులు సిద్ధం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పని చేస్తున్న మొత్తం 312 మంది అధికారులతో కూడిన సీనియార్టీ జాబితాను తయారు చేసి ప్రస్తుతం సిద్ధంగా ఉంచారు. ఆ జాబితాలోంచి ఎంపీడీవోలతోపాటు పంచాయతీ రాజ్ శాఖలో పని చేస్తున్న సుమారు మరో 35 మంది ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశాలు కన్పిస్తున్నాయి. గత పన్నేం డేళ్ల క్రితం 2006లో సీఈవో, డిప్యూటీ సీఈవోగా ఎంపీడీవోలకు పదోన్నతులు కల్పించినా ఇంతా పెద్ద మొత్తంలో పదోన్నతులు లభించలేదు. కేవలం ఎంపీడీవోలకే పదోన్నతులు కల్పించి మిగతా వారికి చేపట్టకపోవడంతో కింది స్థాయి అధికారుల పోస్టులు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయని సమాచారం. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పంచాయతీ రాజ్ ఉద్యోగులందరికీ పదోన్నతులు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. నూతన నియామకాలకు అవకాశం.. ఖాళీ అయినా ఎంపీడీవో స్థానాలను భర్తీ చేసేందుకు సూపరింటెండెంట్ల(పర్యవేక్షకులు)కు, ఈవోఆర్డీలకు అవకాశం ఉండగా, సూపరింటెండెంట్లుగా పదోన్నతులు పొందేందుకు సీనియర్ అసిస్టెంట్లకు, సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందెందుకు జూనియర్ అసిస్టెంట్లకు, టైపిస్టులకు అవకాశం ఉంది. జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందెందుకు టైపిస్ట్‌లకు, రికార్డు అసిస్టెంట్లకు, రికార్డు అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందెందుకు అటెండర్లకు అవకాశం కలుగనుంది. ఇలా పంచాయతీ రాజ్ శాఖలో సుమారు 35 నుంచి 40 మంది ఉద్యోగులకు పదోన్నతులు వరించనున్నాయని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్–1 అధికారిగా కొనసాగుతున్న వారికి ఈవోపీఆర్డీగా, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్–2 అధికారికి గ్రేడ్–1గా, గ్రేడ్–3 అధికారికి గ్రేడ్–2గా కూడా పదోన్నతులు లభించనున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. తద్వారా ఖాళీ అయిన పోస్టుల్లో కొత్త నియామకాలు చేపట్టే అవకాశాలున్నాయని సమాచారం. కాగా, పదోన్నతులు కల్పించడంపై పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గజానన్‌రావు, సుధాకర్‌రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కృష్ణారావులకు ధన్యవాదాలు తెలిపారు. -
పంచాయతీకో కార్యదర్శి
ఖమ్మం సహకారనగర్: పంచాయతీల పరిధిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం.. వాటిని పరిష్కరించేందుకు మరింత పటిష్టమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. గ్రామస్థాయిలో అభివృద్ధి తదితర అంశాల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శులదే కీలకపాత్ర. జిల్లాలో ప్రస్తుతం కార్యదర్శులు తక్కువగా ఉండడం.. వారికి ఇతర పంచాయతీల బాధ్యతలు అప్పగించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదనపు బాధ్యతలు నిర్వర్తించే కార్యదర్శులు కూడా విధి నిర్వహణకు పూర్తి సమయం కేటాయించలేని పరిస్థితి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రతి పంచాయతీకి కార్యదర్శిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అందుకు సంబంధించిన ఉత్తర్వులను కూడా జారీ చేసింది. దీంతో పాత పంచాయతీలతోపాటు కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు కార్యదర్శులను నియమించనున్నారు. జిల్లాలో మొత్తం 584 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో పాత పంచాయతీలు 427 కాగా.. ఆగస్టు 2వ తేదీ నుంచి 167 గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పడ్డాయి. అదే సమయంలో 10 గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల పరిధిలో విలీనమయ్యాయి. మొత్తం పంచాయతీలకు కలిపి కేవలం 102 మంది కార్యదర్శులున్నారు. దీంతో ఖాళీగా ఉన్న గ్రామ పంచాయతీలకు కూడా కార్యదర్శులను నియమించి.. స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కార్యదర్శులు అందుబాటులో లేక.. 584 గ్రామ పంచాయతీలలో 102 మంది కార్యదర్శులు మాత్రమే ఉండటంతో పనిభారంతో ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్కరికీ 3 నుంచి 4 గ్రామాల బాధ్యతలను అప్పగించడంతో ఏ సమయంలో ఎక్కడ ఉంటారో అర్థంకాని పరిస్థితి. ఒకవైపు పని ఎక్కువగా ఉందని కార్యదర్శులు వాపోతుండగా.. మరోవైపు ప్రజలు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న సర్టిఫికెట్ కావాలన్నా.. అత్యవసరంగా గ్రామ కార్యదర్శి సంతకం కావాలన్నా రోజుల తరబడి కార్యదర్శుల కోసం వేచి ఉండాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. కార్యదర్శి ఏ గ్రామంలో ఉన్నాడో అర్థం కాకపోవడం, తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తే అక్కడ కూడా కార్యదర్శుల జాడ లేకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. ఇక విద్యార్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యదర్శుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. 485 పోస్టుల భర్తీ.. జిల్లాలో మొత్తం 584 గ్రామ పంచాయతీలుండగా.. 102 మంది మాత్రమే కార్యదర్శులున్నారు. మిగిలిన వాటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీగా ఉన్న 485 పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులు భర్తీ అయితే స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు త్వరితగతిన పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఇదే అవకాశం.. జిల్లాలో పంచాయతీ కార్యదర్శి పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావడంతో నిరుద్యోగ అభ్యర్థుల్లో ఆశలు మొదలయ్యాయి. ఈనెల 3 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా, ఈనెల 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇటీవల ప్రతిపాదించిన జోనల్ వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో వెంటనే పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న గ్రామ పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేయడంతోపాటు కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లో కూడా నూతన కార్యదర్శులను నియమించనున్నది. దీంతో ప్రస్తుతం ఉన్న పనిభారంతో సుదూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు ఇబ్బందులు తప్పనున్నాయి. పోస్టుల భర్తీ విషయంలో ప్రభుత్వం నిర్ణయం హర్షణీయం. – చెరుకూరి పవన్, పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా కార్యదర్శి -
అర్చకులకు తీపికబురు!
జోగుళాంబ శక్తిపీఠం: ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. వారి పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అర్చకులు తమకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలని ఎంతో కాలంగా పోరాటం చేస్తున్నప్పటికీ గతేడాది సెప్టెంబర్ 15న వేతనాల చెల్లింపు కోసం జీఓ నం.577ను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో వేతనాల చెల్లింపుపై స్పష్టత ఉన్నప్పటికీ ఉద్యోగ విరమణ అనంతరం వృద్ధులైన అర్చకులు పింఛన్ పొందే విషయమై ఎలాంటి ఆదేశాలు పొందుపర్చలేదు. గతంలో చాలీచాలని వేతనాలే కాకుండా ఉద్యోగ విరమణ పేరిట అలంపూర్‌కు చెందిన భీమసేనాచార్యులు అనే అర్చకుడికి రిటైర్డ్మెంట్ నోటీస్ ఇవ్వడంతో కుటంబాన్ని పోషించుకోలేని స్థితిలో చేసేదిలేక ఆత్మహత్యకు ఒడిగట్టాడు. ఇలాంటి పరిస్థితిలో కనీసం తమకు పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచమని అర్చకులు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్ ఆదివారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుని అర్చకుల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇదే సందర్భంలో అర్చక, ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా నేరుగా ప్రభుత్వమే ప్రతినెలా 1వ తేదీన వేతనాలు చెల్లించేందుకు కీలక నిర్ణయం వెలువరించింది. 171 మంది అర్చకులకు లబ్ధి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 6 ‘ఏ’ కేటాగిరీ కలిగిన ఆలయాల్లో 44 మంది అర్చకులు, 6 ‘బీ’ కేటాగిరీ 102 మందికి, 6 ‘సీ’ కేటాగిరీ ఆలయాల్లో 25 మంది చొప్పున మొత్తం కలిపి 171 మందికి పదవి విరమణ వయస్సు పెంపు ప్రయోజనం చేకూరనుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాల చెల్లింపు ప్రక్రియలో భాగంగా వారం రోజులుగా అధికారులు 324 మంది కాంట్రాక్టు, ఎన్ఎంఆర్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ వారికి 2015 పీఆర్సీ ప్రకారం వేతనాల చెల్లింపు ప్రక్రియను ప్రారంభించారు. అందులో భాగంగానే మూడురోజుల క్రితం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా కేవలం 31 మందికి మాత్రమే వారి వారి బ్యాంకు ఖాతాల్లో వేతనాలను జమచేశారు. నేడు మరో 189 మంది అర్చక, ఉద్యోగులకు వేతనాలు చెల్లించనున్నారు. మరో విడతలో మిగిలిన వారందరికీ 2015 పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రుణపడి ఉంటాం.. ప్రభుత్వ వేతనాల చెల్లింపులతో పాటుగా పదవీ విరమణ వయస్సు 58 నుంచి 65కు పెంచడంతో నా లాంటి వృద్ధాప్యంలో ఉన్న అర్చకులకు భరోసా కల్పించినట్లయింది. పింఛన్ లేని లోటును ఈ విధంగా తీర్చినందుకు అర్చకలోకం రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటుంది. –వీరయ్య, మద్దిమడుగు దేవస్థానం అర్చకుడు, నాగర్‌కర్నూల్ జిల్లా ప్రభుత్వానికి కృతజ్ఞతలు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలని రెండు దశాబ్దాలుగా చేస్తున్న పోరాటాలకు ఫలితం దక్కింది. ఈ సందర్భంగా వేతనాల చెల్లింపులపై చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌కు జిల్లా అర్చక, ఉద్యోగుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. – జనుంపల్లి జయపాల్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా అర్చక, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు -
మేమిస్తే.. మీరు లాక్కుంటారా.?
సాక్షి, కామారెడ్డి: తరతరాలుగా గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములపై కాంగ్రెస్ ప్రభుత్వం హక్కు పత్రాలను ఇస్తే ప్రస్తుత టీఆర్ఎస్ సర్కారు వారి భూములను లాక్కుంటోందని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. గిరిజనుల పోడు భూముల జోలికొస్తే అంతు చూస్తామని హెచ్చరించారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో గిరిజన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తాము అధికారంలోకి రాగానే చేయతలపెట్టిన కార్యక్రమాలను వివరిస్తూ ‘గిరిజన డిక్లరేషన్’ప్రకటించారు. శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉత్తమ్ మాట్లాడుతూ.. ‘2014 ఎన్నికల్లో గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తానని నమ్మించి సీఎం కేసీఆర్ మోసం చేశారు. 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి ఒక్కరికీ ఇవ్వలేదు. హామీలు అమలు చేయకపోగా వారు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కుంటూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు. ఖమ్మంలో గిరిజన రైతులకు సంకెళ్లు వేసి జైలుకు పంపడం, గొత్తికోయ మహిళలను బట్టలిప్పించి అవమానించిన చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వానిది’అని మండిపడ్డారు. ‘కేసీఆర్.. గిరిజనుల పోడు భూముల జోలికొస్తే ఖబడ్దార్.. నీ అంతు చూస్తాం’అని హెచ్చరించారు. టీఆర్ఎస్ పాలనకు చివరి రోజులు సరైన ధరలు లేక పత్తి, మిర్చి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ పరామర్శించిన పాపాన పోలేదని ఉత్తమ్ ఆరోపించారు. టీఆర్ఎస్ పాలనకు చివరి రోజులు మొదలయ్యాయని అన్నారు. టీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, నిశ్శబ్ద విప్లవం రానుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు చేసిన వాగ్దానాలను విస్మరించి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కేసీఆర్.. ఇప్పుడు వేరే రాష్ట్రాల వెంట తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఫెడరల్ ఫ్రంట్ అంటున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 80 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అందరూ మోసపోయారు: జానారెడ్డి తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని, అయితే కేసీఆర్ కల్లబొల్లి మాటలు నమ్మి టీఆర్ఎస్కు ఓటేసిన పాపానికి ప్రజలు మోసపోయారని సీఎల్పీ నేత జానారెడ్డి పేర్కొన్నారు. రైతులను మభ్యపెట్టడానికే ప్రభుత్వం ఎకరాకు రూ.4 వేల పంపిణీ మొదలుపెట్టిందన్నారు. అప్పులు చేయడంలో సీఎం రికార్డు సృష్టించారని ఎద్దేవా చేశారు. హామీలు నిలబెట్టుకోలేని టీఆర్ఎస్ను నిలదీయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, మాజీ మంత్రి రవీంద్రనాయక్, మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత తదితరులు పాల్గొన్నారు. గిరిజన డిక్లరేషన్ 1. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే విద్య, ఉద్యోగాల్లో జనాభా ప్రాతిపదికన గిరిజనులకు రిజర్వేషన్లు అమలు చేస్తాం. 2. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులన్నింటినీ భర్తీ చేయడం ద్వారా నిరుద్యోగ గిరిజన యువతకు ఉద్యోగాలు అందిస్తాం. 3. రాష్ట్ర ఏర్పాటు బిల్లులో గిరిజన విశ్వవిద్యాలయ స్థాపనకు సంబంధించి చట్టం ఉన్నా టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా రావడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గిరిజన విశ్వవిద్యాలయాన్ని స్థాపిస్తాం. 4. బయ్యారంలో స్టీల్‌ఫ్యాక్టరీని స్థాపించి ఆ ప్రాంత గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. 5. గిరిజనులు నివసించే అన్ని మైదాన ప్రాంతాల్లోనూ ఐటీడీఏలను ఏర్పాటు చేస్తాం. ఐటీడీఏ ద్వారా గిరిజనుల ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం. 6. 22 లక్షల మందికి ఇళ్లు లేవని తేల్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం 2 లక్షలు కూడా నిర్మించలేకపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇళ్లు లేనివారందరికీ నిర్మించి ఇస్తాం. 7. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన నిధులను వారి అభ్యున్నతికే ఖర్చు చేస్తాం. 8. గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు ఇప్పటికే పట్టాలిచ్చాం. టీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనుల నుంచి గుంజుకుంటోంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తిరిగి గిరిజనులకే అప్పగిస్తాం. గిరిజనులకు అండగా ఉంటాం. -
రైతులను విస్మరిస్తున్న ప్రభుత్వాలు
తల్లాడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను విస్మరిస్తున్నాయని మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. తల్లాడలో శుక్రవారం మాజీ ఎంపీపీ వజ్రాల వెంకటసుబ్బమ్మ గృహంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈ ఏడాది అకాల వర్షంతో పండించిన పంటలకు గిట్టుబాటు ధరలేక రైతులు సతమతమౌతున్నారని, ఎన్నికల సమయంలో రైతులకు అనేక వాగ్ధానాలు చేసి వాటిని ఆచరణలో పెట్టడంలో విఫలమౌతున్నట్లు ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పంటలకు గిట్టుబాటు ధర ఉండేలా మద్ధతు ధర ప్రకంటించాలన్నారు. తెలంగాణను వ్యవసాయంలో ఒక మోడల్ స్టేట్‌గా రూపొందిస్తామని టీఆర్ఎస్ నాయకులు చెపుతున్నారని, స్వామినాధన్ కమిషన్ అమలుకు కృషి చేయాలన్నారు. బయ్యారం గనుల లీజుకిస్తే దానిపై లోక్‌సభలో ఆందోళన చేశామన్నారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెడతామని విభజన చట్టంలో పేర్కొన్నారని, ఇంతవరకు స్టీల్ ప్లాంట్ నెలకొల్పలేదన్నారు. పరిశ్రమలను అభివృద్ధి చేస్తేనే నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయల శేషగిరావు, మండల అధ్యక్ష, కార్యదర్శులు దూపాటి భద్రరాజు, కేతినేని చలపతిరావు, దగ్గుల శ్రీనివాసరెడ్డి, కె.సత్యనారాయణ, నున్నా తిరుమలరావు, మొక్కా కృష్ణార్జున్, సురేష్, రేగళ్ల సత్యం పాల్గొన్నారు. -
‘డబుల్’ కోసం భూముల పరిశీలన
ఘట్కేసర్ టౌన్: సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కోసం మండల కేంద్రంలోని మైసమ్మ గుట్ట కాలనీ సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిని జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు శుక్రవారం పరిశీలించారు. ఘట్టుమైసమ్మ ఆలయం వెనకాల ఉన్న సర్వేనంబర్ 543/2 గల ప్రభుత్వ భూమి ఇళ్లు నిర్మించడానికి అనువుగా ఉందో లేదోనని తెలుసు కోవడానికి కలెక్టర్ క్షేత్రస్థాయిలో సందర్శించారు. మల్కాజ్గిరి ఆర్డీఓ ప్రభాకర్‌రెడ్డి, ఘట్కేసర్ తహసీల్దార్ విష్ణువర్ధన్‌రెడ్డి, మండల హౌజింగ్ ఏఈ రమేష్, వీఆర్ఓ మల్లేష్ ఉన్నారు. ఆసరా పింఛన్లు అందుతున్నాయా..? ఘట్కేసర్: మండల పరిధిలో పలు గ్రామాల్లోని సర్కార్ భూములను కలెక్టర్ పరిశీలించారు. ఏదులాబాద్ గ్రామంలో ఉన్న 185 సర్వేనంబర్‌లో 22 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో 10 ఎకరాలను అసైన్డ్ పట్టాదారులు ఉన్నారు. అదేవిధంగా ప్రతాప్సింగారంలో సర్వేనంబర్ 378లోని 4 ఎకరాల ప్రభుత్వ భూమిని కలెక్టర్ రఘునందన్‌రావు పరిశీలించారు. తహసీల్దార్ విష్ణువర్ధన్‌రెడ్డితో మాట్లాడి వివరాలు సేకరించారు. ఏదులాబాద్‌లో ఏమైనా సమస్యలు ఉన్నాయా..? అని కలెక్టర్ అక్కడే ఉన్న సర్పంచ్ మూసీ శంకరన్నను అడిగారు. గ్రామాభివృద్ధికి నిధులు కావాలని సర్పం చ్ కలెక్టర్‌ను కోరారు. మూసీనది కాలుష్యంతో స్థానికులు తీవ్ర ఇబ్బందిపాలవుతున్నారని సర్పంచ్ చెప్పారు. ఆసరా పింఛన్లు అందరికి అందుతున్నాయా..? అని కలెక్టర్ అడుగగా.. అందరికి అందుతున్నాయని.. ఇంకా కొందరికి అందాల్సి ఉందని స్థానిక ప్రజా ప్రతినిధులు తెలిపా రు. ఔటర్ రింగురోడ్డు, బైపాస్‌రోడ్డు భూనిర్వాసితుల సమస్యల గురించి తహసీల్దార్‌ను సంప్రదించాలని చెప్పారు. డిప్యూటీ కలెక్టర్ చంద్రశేఖర్, ఆర్ఐ ఆశ్విన్‌కుమార్, వీఆర్ఓ యాదగిరి, హౌసింగ్ ఏఈ రమేష్, ఎంపీటీసీ సభ్యుడు మంకం రవి తదిరులు ఉన్నారు. కీసర మండలంలో.. కీసర: మండల పరిధిలోని యాద్గార్‌పల్లిలో సర్వేనెంబర్ 225, చీర్యాల గ్రామంలో సర్వేనెంబర్ 59, 60 , కీసరలో సర్వే నెంబర్ 856లో ఉన్న ప్రభుత్వ స్థలాలను కలెక్టర్ రఘునందన్‌రావు స్థానిక తహసీల్దార్ రవీందర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. మండలంలో మొదటివిడతగా డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం యాద్గార్పల్లి, చీర్యాల, కీసర గ్రామాలను ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా కీసరలో 50 ఇళ్లను నిర్మించేందుకు ఎమ్మెల్యే సూచనప్రాయంగా అంగీకరించారని అధికారులు కలెక్టర్ కు వివరించారు. కీసరలో జీ+1 లేదా జీ+2 విధానంలో ఇళ్ల నిర్మాణం చేపట్టి లబ్ధిదారులకు అందజేయనున్నట్లు కలెక్టర్ ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం భోగారం గ్రామంలో వాటర్‌గ్రిడ్ పథకంలో భాగంగా నిర్మించనున్న సంప్ స్థలాన్ని కలెక్టర్ రఘునందన్‌రావు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్ జగదీష్, గ్రామ రెవెన్యూ కార్యదర్శి బాల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. శామీర్‌పేట్: శామీర్‌పేట్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 1284లో గల బస్‌స్టేషన్ పరిధిలో, మినీ స్టేడియం వద్ద గల ప్రభుత్వ స్థలాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ రఘునందనరావు పరిశీలించారు. అనంతరం ఉప్పరిపల్లిలోని సర్వేనంబర్ 837 అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలోని ప్రభుత్వ స్థలాలను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల కోసం నూతనంగా ఏర్పాటు చేస్తున్న డబుల్బెడ్రూం ఇండ్లకు ప్రభు త్వ స్థలాలను ఎంపిక చేయాల్సి ఉందని.. అనువైన ప్రాంతలను పరిశీలించేందుకు వచ్చినట్లు తెలిపారు. హౌసింగ్ డీఈ నరేందర్‌రెడ్డి, శామీర్‌పేట్ తహసీల్దార్ దేవుజా, శామీర్‌పేట్ సర్పంచ్ కిశోర్‌యాదవ్, వీఆర్వో ఫణీందర్, శ్రీనివాసచారి, నర్సింలు పాల్గొన్నారు. -
రెచ్చిపోయిన రేవంత్ రెడ్డి!
-
రెచ్చిపోయిన రేవంత్ రెడ్డి!
హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ టిడిపి ఎమ్మెల్యే ఏ.రేవంత్ రెడ్డి రెచ్చిపోయారు. టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఆ పార్టీ నేతల తీరుని ఆయన దుయ్యబట్టారు. తీవ్రస్థాయిలో విమర్శించారు.ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులను విమర్శిస్తే విద్యుత్ కష్టాలు తీరవని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు(కెసిఆర్) తన బంట్రోతులతో మీటింగ్ పెట్టించి చంద్రబాబును కావాలనే తిట్టిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో ముక్కుతూ, మూలుగుతూ మూడు గంటలు కరెంట్ ఇస్తున్నారని అన్నారు. ఇల్లు కట్టి ఇవ్వకుండా నల్లా ఇస్తే ఏమి లాభం? అని ప్రశ్నించారు. రైతులకు 5 గంటలపాటు కూడా కరెంట్ ఇవ్వడంలేదని విమర్శించారు. ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ లైన్లను ఎందుకు వాయిదా వేశారని అడిగారు. సిఎంగా ఉండి అడ్డగోలుగా తిడితే మిగిలిన ప్రభుత్వాలు ఎలా సహకరిస్తాయని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. **