
మాట్లాడుతున్న మాజీ ఎంపీ నామా, ఎమ్మెల్యే సండ్ర
తల్లాడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను విస్మరిస్తున్నాయని మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. తల్లాడలో శుక్రవారం మాజీ ఎంపీపీ వజ్రాల వెంకటసుబ్బమ్మ గృహంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈ ఏడాది అకాల వర్షంతో పండించిన పంటలకు గిట్టుబాటు ధరలేక రైతులు సతమతమౌతున్నారని, ఎన్నికల సమయంలో రైతులకు అనేక వాగ్ధానాలు చేసి వాటిని ఆచరణలో పెట్టడంలో విఫలమౌతున్నట్లు ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పంటలకు గిట్టుబాటు ధర ఉండేలా మద్ధతు ధర ప్రకంటించాలన్నారు.
తెలంగాణను వ్యవసాయంలో ఒక మోడల్ స్టేట్‌గా రూపొందిస్తామని టీఆర్‌ఎస్ నాయకులు చెపుతున్నారని, స్వామినాధన్ కమిషన్ అమలుకు కృషి చేయాలన్నారు. బయ్యారం గనుల లీజుకిస్తే దానిపై లోక్‌సభలో ఆందోళన చేశామన్నారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెడతామని విభజన చట్టంలో పేర్కొన్నారని, ఇంతవరకు స్టీల్ ప్లాంట్ నెలకొల్పలేదన్నారు. పరిశ్రమలను అభివృద్ధి చేస్తేనే నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయల శేషగిరావు, మండల అధ్యక్ష, కార్యదర్శులు దూపాటి భద్రరాజు, కేతినేని చలపతిరావు, దగ్గుల శ్రీనివాసరెడ్డి, కె.సత్యనారాయణ, నున్నా తిరుమలరావు, మొక్కా కృష్ణార్జున్, సురేష్, రేగళ్ల సత్యం పాల్గొన్నారు.