పదోన్నతుల జాతర.. | Panchayati Raj Employees To Promotions Adilabad | Sakshi
Sakshi News home page

పదోన్నతుల జాతర..

Published Wed, Sep 5 2018 10:44 AM | Last Updated on Wed, Sep 5 2018 10:44 AM

Panchayati Raj Employees To Promotions Adilabad - Sakshi

ఆదిలాబాద్‌అర్బన్‌: పంచాయతీ రాజ్‌ శాఖ ఉద్యోగుల ఇరవై నాలుగేళ్ల నిరీక్షణకు ప్రస్తుత సర్కారు తెర వేసింది. మండల అభివృద్ధి అధికారులకు పదోన్నతులు కల్పించాలని పంచాయతీ రాజ్‌ ఉద్యోగులు ఏళ్లుగా చేస్తున్న పోరాటాలు ఫలించాయి. పెండింగ్‌లో ఉన్న ఎంపీడీవోల పదోన్నతుల ఫైలుపై సీఎం కేసీఆర్‌ సోమవారం సంతకం చేయడంతో పంచాయతీ రాజ్‌ శాఖలో పదోన్నతులకు లైన్‌ క్లియరైంది. అప్పటి ప్రభుత్వం 1994లో పీఆర్‌ శాఖలో పదోన్నతులు చేపట్టింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ జరగలేదు. ప్రస్తుత ప్రభుత్వం తాజాగా జూన్, జూలైలో సాధారణ బదిలీలు చేపట్టినా.. పంచాయతీ రాజ్‌ శాఖలో ఎలాంటి బదిలీలు చేపట్టని విషయం తెలిసిందే. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 130 మంది ఎంపీడీవోలు సీనియార్టీ ప్రకారం పదోన్నతులకు అర్హులుగా ఉండగా, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి ఏడుగురికి పదోన్నతుల్లో అవకాశం లభించనుంది. ఈ ప్రక్రియ ద్వారా ఎంపీడీవోలు డిప్యూటీ సీఈవో, డీఆర్డీవోలుగా పదోన్నతులు పొందనున్నారు. ఈ హోదా స్టేట్‌ క్యాడర్‌ కావడంతో ప్రభుత్వం నుంచి పదోన్నతులకు సంబంధించిన ఉత్తర్వులు రావాల్సి ఉంటుందని సంబందిత అధికారులు పేర్కొంటున్నారు. పదోన్నతులతో ఖాళీ అయినా ఎంపీడీవో స్థానాలను భర్తీ చేయడానికి మరికొంతమంది ఉద్యోగులకు పదోన్నతులు లభించనున్నాయి.
   
ఆ ఏడుగురు అధికారులు వీరే.. 
సీనియార్టీ జాబితా ప్రకారం పదోన్నతులు పొందునున్న ఆయా ఎంపీడీవోలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మండలాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆదిలాబాద్‌ రెగ్యులర్‌ ఎంపీడీవో జితేందర్‌రెడ్డి(ప్రస్తుతం ఇన్‌చార్జి జెడ్పీ సీఈవోగా కొనసాగుతున్నారు), మంచిర్యాల రెగ్యులర్‌ ఎంపీడీవో కే.నరేందర్‌(ప్రస్తుతం జెడ్పీ డిప్యూటీ సీఈవోగా ఉన్నారు), ఇచ్చోడ రెగ్యులర్‌ ఎంపీడీవో వెంకట సూర్యరావు(డిప్యూటేషన్‌పై ప్రస్తుతం పీఆర్‌ కమిషనరేట్‌లో పని చేస్తున్నారు), జన్నారం ఎంపీడీవో  శేషాద్రి(ప్రస్తుతం టీసీ ఫాడ్‌లో పని చేస్తున్నారు), సిర్పూర్‌(యు) ఎంపీడీవో రవీందర్‌(ప్రస్తుతం ఆదిలాబాద్‌ ఎంపీడీవోగా డిప్యూటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు), జైనూర్‌ ఎంపీడీవో దత్తరావు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి(డీఆర్డీవో)గా ఆదిలాబాద్‌లో పని చేస్తున్న రాజేశ్వర్‌ రాథోడ్‌లు పదోన్నతులు పొందనున్న వారి జాబితాలో మోస్ట్‌ సీనియర్‌గా ఉన్నారు. ఇదిలా ఉండగా, జిల్లా పునర్విభజనతో నాలుగు జిల్లాలుగా ఏర్పాటైంది. ప్రస్తుతం నాలుగింటికి ఒకే జిల్లా పరిషత్‌ ఉంది.

నాలుగు జిల్లాల్లో ఇప్పటికే గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పని చేస్తున్నారు. జిల్లా పరిషత్‌కు సీఈవో, డిప్యూటీ సీఈవో రెండు పోస్టులే అవసరం. వీరిద్దరే ఇక్కడ ఉండే అవకాశం ఉంది. వీరితోపాటు డీఆర్డీవో కూడా ఇక్కడే ఉండనున్నారు. అంటే పదోన్నతులు పొందిన ఏడుగురిలో ముగ్గురు ఇక్కడ ఉండగా, మిగతా నలుగురు ఇతర జిల్లాలకు బదిలీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, పంచాయతీ రాజ్‌ శాఖ విభజన అయ్యి నాలుగు జిల్లాల్లో జిల్లా పరిషత్‌లు ఉంటే పదోన్నతులు పొందిన ఎంపీడీవోలందరూ ఉమ్మడి జిల్లా పరిధిలోనే ఉండేవారు. ప్రస్తుతం జిల్లా పరిషత్‌ విభజన కాకపోవడంతో ఇతర జిల్లాలకు వెళ్లాల్సి వస్తోందనే కొంత బాధ ఎంపీడీవోల్లో లేకపోలేదు.

మరో 35 మంది అధికారులకు కూడా.. 
ఉమ్మడి జిల్లాలో త్వరలో జరుగనున్న ఎంపీడీవోల పదోన్నతుల వల్ల ఖాళీ కానున్న వారి స్థానా లను భర్తీ చేసేందుకు సైతం రంగం సిద్ధమైంది. ఇందుకు ఉద్యోగుల సీనియార్టీ జాబి తాను పంచా యతీ రాజ్‌ శాఖ అధికారులు సిద్ధం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పని చేస్తున్న మొత్తం 312 మంది అధికారులతో కూడిన సీనియార్టీ జాబితాను తయారు చేసి ప్రస్తుతం సిద్ధంగా ఉంచారు. ఆ జాబితాలోంచి ఎంపీడీవోలతోపాటు పంచాయతీ రాజ్‌ శాఖలో పని చేస్తున్న సుమారు మరో 35 మంది ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశాలు కన్పిస్తున్నాయి. గత పన్నేం డేళ్ల క్రితం 2006లో సీఈవో, డిప్యూటీ సీఈవోగా ఎంపీడీవోలకు పదోన్నతులు కల్పించినా ఇంతా పెద్ద మొత్తంలో పదోన్నతులు లభించలేదు. కేవలం ఎంపీడీవోలకే పదోన్నతులు కల్పించి మిగతా వారికి చేపట్టకపోవడంతో కింది స్థాయి అధికారుల పోస్టులు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయని సమాచారం. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పంచాయతీ రాజ్‌ ఉద్యోగులందరికీ పదోన్నతులు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. 

నూతన నియామకాలకు అవకాశం.. 
ఖాళీ అయినా ఎంపీడీవో స్థానాలను భర్తీ చేసేందుకు సూపరింటెండెంట్ల(పర్యవేక్షకులు)కు, ఈవోఆర్డీలకు అవకాశం ఉండగా, సూపరింటెండెంట్లుగా పదోన్నతులు పొందేందుకు సీనియర్‌ అసిస్టెంట్లకు, సీనియర్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందెందుకు జూనియర్‌ అసిస్టెంట్లకు, టైపిస్టులకు అవకాశం ఉంది. జూనియర్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందెందుకు టైపిస్ట్‌లకు, రికార్డు అసిస్టెంట్లకు, రికార్డు అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందెందుకు అటెండర్లకు అవకాశం కలుగనుంది. ఇలా పంచాయతీ రాజ్‌ శాఖలో సుమారు 35 నుంచి 40 మంది ఉద్యోగులకు పదోన్నతులు వరించనున్నాయని చెప్పవచ్చు.

ఇదిలా ఉండగా, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌–1 అధికారిగా కొనసాగుతున్న వారికి ఈవోపీఆర్డీగా, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌–2 అధికారికి గ్రేడ్‌–1గా, గ్రేడ్‌–3 అధికారికి గ్రేడ్‌–2గా కూడా పదోన్నతులు లభించనున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. తద్వారా ఖాళీ అయిన పోస్టుల్లో కొత్త నియామకాలు చేపట్టే అవకాశాలున్నాయని సమాచారం. కాగా, పదోన్నతులు కల్పించడంపై పీఆర్‌ మినిస్టీరియల్‌ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గజానన్‌రావు, సుధాకర్‌రెడ్డి తెలిపారు.  సీఎం కేసీఆర్, మంత్రి కృష్ణారావులకు ధన్యవాదాలు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement