promotions postings
-
విద్యాశాఖలో పదోన్నతుల రచ్చ
సాక్షి, మచిలీపట్నం(కృష్నా) : జిల్లా విద్యాశాఖలో పదోన్నతుల రగడ మొదలైంది. డీఈఓ కార్యాలయంలోని సిబ్బంది నిర్వాకం వల్ల అర్హులైనప్పటికీ, పదోన్నతులు దక్కటం లేదని కొంతమంది ఉపాధ్యాయులు నిరసన గళం విప్పారు. భాషా పండితుల పదోన్నతుల్లో అక్రమాలకు జరిగాయని ఆరోపిస్తూ, ఓ ఉపాధ్యాయుడు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ముందు సోమవారం గుండు గీయించుకొని నిరసన తెలిపాడు. ఈనెల 3, 4 తేదీల్లో ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతులకు డీఈఓ కార్యాలయ అధికారులు అంతా సిద్ధం చేస్తున్న తరుణంలో ఇటువంటి పరిణామాలు చోటుచేసుకోవటం విద్యాశాఖ వర్గాల్లో సర్వత్రా చర్చనీయాంశమైంది. రెండేళ్ల తర్వాత జరుగుతున్న పదోన్నతుల ప్రక్రియతో వీటిని ఆశించే ఉపాధ్యాయుల్లో ఆనందం వ్యక్తమౌతున్నప్పటికీ, ఎక్కడ వివాదాలు చుట్టుకొని కౌన్సెలింగ్ నిలిచిపోతుందేమోననే భయం వారిని వెంటాడుతుంది. రాష్ట్రంలో ఏర్పడిన నూతన ప్రభుత్వం ఉపాధ్యాయుల విన్నపాలను పరిగణలోకి తీసుకొని సర్వీసు రూల్స్‌కు లోబడి అర్హులైన వారిందరికీ అందుబాటులో ఉన్న ఖాళీల మేరకు అడహక్ పదోన్నతులు ఇవ్వాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. వివాదాల నేపథ్యంలో రెండేళ్లుగా పదోన్నతులు లేకపోగా, ప్రభుత్వం తాజా ఉత్తర్వులతో దీనిపై జిల్లా విద్యాశాఖాధికారులు కసరత్తు మొదలుపెట్టారు. స్కూల్ అసిస్టెంట్ నుంచి ప్రధానోపాధ్యాయులు, ఎస్జీటీ కేడర్ నుంచి స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతులు కల్పించేందుకు సీనియార్టీ జాబితాలను సైతం విడుదల చేశారు. కొంతమంది ఎస్జీటీలు బీఈడీ మెథడాలజీ అర్హతతో పదోన్నతులు కల్పించాలని కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకోవటంతో, కలెక్టర్ ఆమోదంతో వారికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పిస్తున్నామని చెప్పి, డీఈవో కార్యాలయ అధికారులు ఈనెల 27న కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎస్సే ఉర్దూ–1, తెలుగు–19, హిందీ –11 మందికి పదోన్నతులు ఇచ్చారు. వీటిపై భాషా పండితులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 05–02–2017 సంవత్సరానికి ముందు ఉన్న ఖాళీలను పరిగణలోకి తీసుకొని పదోన్నతులు ఇవ్వాలని, కానీ రద్దు అయిన జీవోలను అనుసరించి, నిబంధనలకు విరుద్ధంగా కొంతమందికి పదోన్నతులు కల్పించారని భాషోపాధ్యాయ సంస్థ జిల్లా అధ్యక్షులు కె సుబ్రహ్మణ్యేశ్వరరావు ఆధ్వర్యంలో పదిమంది భాషా పండితులు డీఈఓ కార్యాలయానికి వచ్చి, అధికారులతో వాగ్వాదానికి దిగారు. గుండు గీయించుకొని నిరసన జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు బత్తుల సత్యనారాయణ, విజయలక్ష్మిలను కలసిన భాషా పండితులు, జరిగిన అన్యాయంపై వివరించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు, కమిషనర్ ఆదేశాలతో, కలెక్టర్ ఆమోదంతోనే అంతా జరిగిందని వారు ఉపాధ్యాయులకు తెలిపారు. దీనిపై ఎటువంటి సమాచారం లేకుండానే పదోన్నతులు ఇవ్వడటంలో ఆంతర్యమేమిటని వారు ప్రశ్నించారు. కొన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకుల అండ చూసుకొని, కార్యాలయంలోని కొంతమంది సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారని, దీనిపై తాము పెద్దఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కార్యాలయం ముందు నినాదాలు చేశారు. అధికారుల తీరుకు నిరసనగా, భాషోపాధ్యాయ సంస్థ జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యేశ్వరరావు గుండు గీయించుకున్నాడు. ఆ తర్వాత స్పందనలో జిల్లా అధికారులకు దీనిపై వినతిపత్రాన్ని అందజేశారు. హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతులు సవ్యంగా సాగేనా! ఈ నెల 3న ప్రధానోపాధ్యాయులు, 4న స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 3,4,5 తేదీల్లో వీటిని నిర్వహిస్తామని డీఈఓ కార్యాలయ అధికారులు ముందుగా ప్రకటించారు. తాజాగా వీటి షెడ్యూల్ మార్పు చేశారు. హెచ్ఎం పోస్టులు 51, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 350 వరకు ఖాళీలు ఉన్నట్లుగా డీఈఓ కార్యాలయ అధికారులు చెబుతున్నారు. కానీ సంబంధిత సెక్షన్లు చూసే సిబ్బంది వీటిపై స్పష్టత ఇవ్వకపోవటం, ఒక్కోసారి ఒక్కో రీతిన ఖాళీల వివరాలను చెబుతుండటం, వాటిలోనూ మార్పులు ఉంటాయని అంటుండం ఉపాధ్యాయవర్గాల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కొంతమంది సిబ్బంది వ్యవహారశైలి డీఈఓకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఇటువంటి వాటిని చక్కదిద్దాల్సిన అవసరం ఉందని ఉపాధ్యాయులు అంటున్నారు. -
డీఎస్పీ యూనిఫాం.. ఇన్స్పెక్టర్ పోస్టు!
సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖలో కొత్తగా పదోన్నతి పొందిన డీఎస్పీలు.. పోస్టింగ్స్ కోసం వేచి చూస్తున్నారు. 15 రోజుల క్రితం పదోన్నతులు వచ్చినా పోస్టింగ్ ఇవ్వకపోవడంతో ఎక్కడ కూర్చోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఇన్స్పెక్టర్ పోస్టింగుల్లోనే కొనసాగుతూ డీఎస్పీగా యూనిఫాం వేసుకొని ఉద్యోగం చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంతో ఐపీఎస్, నాన్ కేడర్ ఎస్పీ, అదనపు ఎస్పీలను బదిలీ చేసేందుకు ఉన్నతాధికారులు కసరత్తు చేశారు. మూడేళ్లు ఒకే జిల్లాలో పనిచేసిన వారికి కూడా స్థానచలనం కల్పించారు. కానీ పదోన్నతి ఇచ్చిన డీఎస్పీలకు పోస్టింగ్ కేటాయించకపోవడం బాధిత అధికారులను ఒత్తిడికి గురి చేస్తోంది. దాదాపు 35 మంది డీఎస్పీలు పోస్టింగ్ కోసం వెయిటింగ్లో ఉన్నారు. శాంతి భద్రతల విభాగం పోస్టింగ్స్ అవసరం లేదని, ఏ లూప్‌లైన్ వింగ్‌లోనైనా త్వరగా పోస్టింగ్స్ ఇవ్వాలని ఉన్నతాధికారులను అధికారులు కోరుతున్నారు. ఇటీవల 16 మంది డీఎస్పీలను బదిలీ చేసిన పోలీస్ శాఖ, ఆ అధికారుల బదిలీ స్థానాలు మారుస్తూ మళ్లీ ఆదేశాలిచ్చింది. బదిలీ చేసిన స్థానాల్లో మళ్లీ మార్పులెందుకు జరిగాయని సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్ల వల్లే మార్పులు జరిగి ఉంటాయాని చర్చ జరుగుతోంది. హైదరాబాద్ నగర కమిషనరేట్‌లో ఏళ్ల పాటు పనిచేసి డీఎస్పీ పదోన్నతి తర్వాత జిల్లాలకు వెళ్లిన వారంతా మళ్లీ పాత ప్రాంతాల్లోనే పోస్టింగ్ దక్కించుకున్నారు. -
పదోన్నతుల జాతర..
ఆదిలాబాద్‌అర్బన్: పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగుల ఇరవై నాలుగేళ్ల నిరీక్షణకు ప్రస్తుత సర్కారు తెర వేసింది. మండల అభివృద్ధి అధికారులకు పదోన్నతులు కల్పించాలని పంచాయతీ రాజ్ ఉద్యోగులు ఏళ్లుగా చేస్తున్న పోరాటాలు ఫలించాయి. పెండింగ్‌లో ఉన్న ఎంపీడీవోల పదోన్నతుల ఫైలుపై సీఎం కేసీఆర్ సోమవారం సంతకం చేయడంతో పంచాయతీ రాజ్ శాఖలో పదోన్నతులకు లైన్ క్లియరైంది. అప్పటి ప్రభుత్వం 1994లో పీఆర్ శాఖలో పదోన్నతులు చేపట్టింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ జరగలేదు. ప్రస్తుత ప్రభుత్వం తాజాగా జూన్, జూలైలో సాధారణ బదిలీలు చేపట్టినా.. పంచాయతీ రాజ్ శాఖలో ఎలాంటి బదిలీలు చేపట్టని విషయం తెలిసిందే. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 130 మంది ఎంపీడీవోలు సీనియార్టీ ప్రకారం పదోన్నతులకు అర్హులుగా ఉండగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఏడుగురికి పదోన్నతుల్లో అవకాశం లభించనుంది. ఈ ప్రక్రియ ద్వారా ఎంపీడీవోలు డిప్యూటీ సీఈవో, డీఆర్డీవోలుగా పదోన్నతులు పొందనున్నారు. ఈ హోదా స్టేట్ క్యాడర్ కావడంతో ప్రభుత్వం నుంచి పదోన్నతులకు సంబంధించిన ఉత్తర్వులు రావాల్సి ఉంటుందని సంబందిత అధికారులు పేర్కొంటున్నారు. పదోన్నతులతో ఖాళీ అయినా ఎంపీడీవో స్థానాలను భర్తీ చేయడానికి మరికొంతమంది ఉద్యోగులకు పదోన్నతులు లభించనున్నాయి. ఆ ఏడుగురు అధికారులు వీరే.. సీనియార్టీ జాబితా ప్రకారం పదోన్నతులు పొందునున్న ఆయా ఎంపీడీవోలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మండలాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆదిలాబాద్ రెగ్యులర్ ఎంపీడీవో జితేందర్‌రెడ్డి(ప్రస్తుతం ఇన్చార్జి జెడ్పీ సీఈవోగా కొనసాగుతున్నారు), మంచిర్యాల రెగ్యులర్ ఎంపీడీవో కే.నరేందర్(ప్రస్తుతం జెడ్పీ డిప్యూటీ సీఈవోగా ఉన్నారు), ఇచ్చోడ రెగ్యులర్ ఎంపీడీవో వెంకట సూర్యరావు(డిప్యూటేషన్‌పై ప్రస్తుతం పీఆర్ కమిషనరేట్‌లో పని చేస్తున్నారు), జన్నారం ఎంపీడీవో శేషాద్రి(ప్రస్తుతం టీసీ ఫాడ్లో పని చేస్తున్నారు), సిర్పూర్(యు) ఎంపీడీవో రవీందర్(ప్రస్తుతం ఆదిలాబాద్ ఎంపీడీవోగా డిప్యూటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు), జైనూర్ ఎంపీడీవో దత్తరావు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి(డీఆర్డీవో)గా ఆదిలాబాద్‌లో పని చేస్తున్న రాజేశ్వర్ రాథోడ్‌లు పదోన్నతులు పొందనున్న వారి జాబితాలో మోస్ట్ సీనియర్‌గా ఉన్నారు. ఇదిలా ఉండగా, జిల్లా పునర్విభజనతో నాలుగు జిల్లాలుగా ఏర్పాటైంది. ప్రస్తుతం నాలుగింటికి ఒకే జిల్లా పరిషత్ ఉంది. నాలుగు జిల్లాల్లో ఇప్పటికే గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పని చేస్తున్నారు. జిల్లా పరిషత్‌కు సీఈవో, డిప్యూటీ సీఈవో రెండు పోస్టులే అవసరం. వీరిద్దరే ఇక్కడ ఉండే అవకాశం ఉంది. వీరితోపాటు డీఆర్డీవో కూడా ఇక్కడే ఉండనున్నారు. అంటే పదోన్నతులు పొందిన ఏడుగురిలో ముగ్గురు ఇక్కడ ఉండగా, మిగతా నలుగురు ఇతర జిల్లాలకు బదిలీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, పంచాయతీ రాజ్ శాఖ విభజన అయ్యి నాలుగు జిల్లాల్లో జిల్లా పరిషత్‌లు ఉంటే పదోన్నతులు పొందిన ఎంపీడీవోలందరూ ఉమ్మడి జిల్లా పరిధిలోనే ఉండేవారు. ప్రస్తుతం జిల్లా పరిషత్ విభజన కాకపోవడంతో ఇతర జిల్లాలకు వెళ్లాల్సి వస్తోందనే కొంత బాధ ఎంపీడీవోల్లో లేకపోలేదు. మరో 35 మంది అధికారులకు కూడా.. ఉమ్మడి జిల్లాలో త్వరలో జరుగనున్న ఎంపీడీవోల పదోన్నతుల వల్ల ఖాళీ కానున్న వారి స్థానా లను భర్తీ చేసేందుకు సైతం రంగం సిద్ధమైంది. ఇందుకు ఉద్యోగుల సీనియార్టీ జాబి తాను పంచా యతీ రాజ్ శాఖ అధికారులు సిద్ధం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పని చేస్తున్న మొత్తం 312 మంది అధికారులతో కూడిన సీనియార్టీ జాబితాను తయారు చేసి ప్రస్తుతం సిద్ధంగా ఉంచారు. ఆ జాబితాలోంచి ఎంపీడీవోలతోపాటు పంచాయతీ రాజ్ శాఖలో పని చేస్తున్న సుమారు మరో 35 మంది ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశాలు కన్పిస్తున్నాయి. గత పన్నేం డేళ్ల క్రితం 2006లో సీఈవో, డిప్యూటీ సీఈవోగా ఎంపీడీవోలకు పదోన్నతులు కల్పించినా ఇంతా పెద్ద మొత్తంలో పదోన్నతులు లభించలేదు. కేవలం ఎంపీడీవోలకే పదోన్నతులు కల్పించి మిగతా వారికి చేపట్టకపోవడంతో కింది స్థాయి అధికారుల పోస్టులు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయని సమాచారం. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పంచాయతీ రాజ్ ఉద్యోగులందరికీ పదోన్నతులు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. నూతన నియామకాలకు అవకాశం.. ఖాళీ అయినా ఎంపీడీవో స్థానాలను భర్తీ చేసేందుకు సూపరింటెండెంట్ల(పర్యవేక్షకులు)కు, ఈవోఆర్డీలకు అవకాశం ఉండగా, సూపరింటెండెంట్లుగా పదోన్నతులు పొందేందుకు సీనియర్ అసిస్టెంట్లకు, సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందెందుకు జూనియర్ అసిస్టెంట్లకు, టైపిస్టులకు అవకాశం ఉంది. జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందెందుకు టైపిస్ట్‌లకు, రికార్డు అసిస్టెంట్లకు, రికార్డు అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందెందుకు అటెండర్లకు అవకాశం కలుగనుంది. ఇలా పంచాయతీ రాజ్ శాఖలో సుమారు 35 నుంచి 40 మంది ఉద్యోగులకు పదోన్నతులు వరించనున్నాయని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్–1 అధికారిగా కొనసాగుతున్న వారికి ఈవోపీఆర్డీగా, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్–2 అధికారికి గ్రేడ్–1గా, గ్రేడ్–3 అధికారికి గ్రేడ్–2గా కూడా పదోన్నతులు లభించనున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. తద్వారా ఖాళీ అయిన పోస్టుల్లో కొత్త నియామకాలు చేపట్టే అవకాశాలున్నాయని సమాచారం. కాగా, పదోన్నతులు కల్పించడంపై పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గజానన్‌రావు, సుధాకర్‌రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కృష్ణారావులకు ధన్యవాదాలు తెలిపారు. -
తెలంగాణలో16మంది ఐపీఎస్‌లకు ప్రమోషన్లు
హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఐపీఎస్ లకు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 16 మంది ఐపీఎస్‌లకు గురువారం ప్రమోషన్లపై పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఐపీఎస్‌ల కొత్త పోస్టింగ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి. - హైదరాబాద్ క్రైం జాయింట్ కమిషనర్‌గా పి. ప్రభాకరరావు - హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ అడిషనల్ కమిషనర్‌గా వై.నాగిరెడ్డి - హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీగా ఎన్. ప్రకాష్‌రెడ్డి - వరంగల్ పోలీస్ కమిషనర్‌గా సుధీర్‌బాబు - సీఐడీ డీఐజీగా పి. రవివర్మ - కరీంనగర్ ఎస్పీగా జోయెల్ డేవిస్ - ఇంటెలిజెన్స్ డీఐజీగా పి. ప్రమోద్ కుమార్ - డ్రగ్స్ కంట్రోల్ డీఐజీగా ఆకుల్ సబర్వాల్ - ఏసీబీ డైరెక్టర్ గా చారూ సిన్హా - లా అండ్ ఆర్డర్ ఐజీగా ఎమ్కె సిన్హా - విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్‌గా ఎన్. సత్యనారాయణ