చెరో దారేనా..? | Telangana Early Elections To Change The Politics In Khammam | Sakshi
Sakshi News home page

చెరో దారేనా..?

Published Sun, Sep 9 2018 7:33 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Telangana Early Elections To Change The Politics In Khammam - Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: వామపక్ష పార్టీలు ఎవరి వైపు మొగ్గు చూపుతాయనే అంశం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కమ్యూనిస్టుల కంచుకోటగా పేరొందిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వచ్చే శాసన సభ ఎన్నికల్లో వారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. 2009 వరకు దాదాపు ప్రతి ఎన్నికల్లో వామపక్షాలు ఒకే కూటమిగా ఏర్పడి.. వివిధ రాజకీయ పక్షాల మద్దతుతో పోటీ చేసి శాసనసభ స్థానాలతోపాటు లోక్‌సభ స్థానాలను సైతం గెలుపొందిన పరిస్థితి జిల్లాలో ఉండగా.. 2014 శాసనసభ, లోక్‌సభ ఎన్నికల నుంచి సీపీఐ, సీపీఎంలు వేర్వేరు రాజకీయ పక్షాలతో ఎన్నికల పొత్తు కుదుర్చుకుని వేరు కూటములు గా పోటీ చేశాయి. గత ఎన్నికల్లో సీపీఐ, కాంగ్రెస్‌ పార్టీతో ఎన్నికల పొత్తు పెట్టుకోగా.. సీపీఎం.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతో ఎన్నికల అవగాహన కుదుర్చుకుంది.

కాంగ్రెస్‌తో కుదిరిన పొత్తు మేరకు సీపీఐ ఖమ్మం ఎంపీ స్థానంతోపాటు కొత్తగూడెం, పినపాక, వైరా నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓటమి చెందింది. ఇక సీపీఎం మద్దతిచ్చిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఖమ్మం ఎంపీ స్థానంతోపాటు పినపాక, అశ్వారావుపేట, వైరా నియోజకవర్గాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తు సీపీఐ కుదుర్చుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. గతంలో పోటీ చేసిన కొత్తగూడెం, వైరా, పినపాక నియోజకవర్గాలతోపాటు అదనంగా అశ్వారావుపేటను కోరాలని సీపీఐ అధినాయకత్వం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుండగా.. సీపీఐతోపాటు టీడీపీ సైతం కాంగ్రెస్‌తో పొత్తు కోసం ప్రయత్నిస్తుందన్న వార్తల నేపథ్యంలో ఎవరు ఆశించినా సీట్లు ఎవరికి లభిస్తాయి.. కాంగ్రెస్‌ జిల్లాలో ఎన్ని స్థానాల నుంచి పోటీ చేస్తుందన్న అంశం ఉత్కంఠ రేపుతోంది. టీడీపీ సైతం గతంలో తాము పోటీ చేసిన స్థానాల్లో సత్తుపల్లితోపాటు మరికొన్ని ఇవ్వాలని డిమాండ్‌ చేస్తోంది.

సీపీఎం మాత్రం ఈసారి బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌(బీఎల్‌ఎఫ్‌) పేరుతో కొత్త కూటమికి తెరలేపింది. తమతో కలిసి వచ్చే రాజకీయ పార్టీలతో కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ కూటమిలో ప్రధాన రాజకీయ పక్షంగా సీపీఎం ఉంది. రాజకీయ పక్షాలే కాకుండా సమాజాన్ని ప్రభావితం చేసే వివిధ రంగాల ప్రముఖులను సైతం కలుపుకునిపోయి.. వారిని ఆయా ప్రాంతాల్లో పోటీ చేయించే అంశాన్ని సైతం బీఎల్‌ఎఫ్‌ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. తటస్థ అభ్యర్థులు బీఎల్‌ఎఫ్‌ నుంచి పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు వారికి ఎన్నికల గుర్తు ఏది కేటాయించాల్సి ఉంటుంది.

తటస్థ అభ్యర్థులుగా అన్ని వర్గాల ఓట్లను పొందే అవకాశం కోసం బీఎల్‌ఎఫ్‌ను రాజకీయ పార్టీగా సైతం నమోదు చేశారు. దీంతో ఆ ఫ్రంట్‌ తరఫున పోటీ చేసే వారికి రాష్ట్రవ్యాప్తంగా ఒకే ఎన్నికల గుర్తు వచ్చే అవకాశం లభిస్తుందని బీఎల్‌ఎఫ్‌ భావిస్తోంది. సీపీఎంకు బలం ఉన్న ఖమ్మం, మధిర, భద్రాచలం, పాలేరు వంటి నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులను పోటీ చేయించాలని సీపీఎం భావిస్తున్నా.. బీఎల్‌ఎఫ్‌ తరఫున తటస్థ అభ్యర్థులు ముందుకు వస్తే వారిని బలపరిచేందుకు సైతం వ్యూహ ప్రతివ్యూహాలు రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

భంగపడిన వారికి అవకాశం? 
ఇక ఆయా పార్టీల నుంచి టికెట్‌ ఆశించి భంగపడ్డ పలువురు నేతలు సైతం బీఎల్‌ఎఫ్‌ నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్లు భావిస్తున్న ఫ్రంట్‌ వర్గాలు చివరి నిమిషం వరకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేయకుండా వేచి చూసే ధోరణి అవలంబించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక మధిర నియోజకవర్గం నుంచి సామాజిక ఉద్యమకారుడు, ప్రజా గాయకుడు గద్దర్‌ను ఎన్నికల బరిలో బీఎల్‌ఎఫ్‌ తరఫున రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే ఒక దశలో ఖమ్మం నియోజకవర్గం నుంచి ప్రముఖ పాత్రికేయుడు, రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్‌ను సైతం బీఎల్‌ఎఫ్‌ నుంచి పోటీ చేయాలని ఆహ్వానించినట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే త్వరలో జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన పోటీ చేసే అవకాశం ఉన్నందున ఖమ్మం నుంచి పోటీచేసే అవకాశం లేకపోవచ్చని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే గత ఎన్నికల్లో భద్రాచలంలో విజయం సాధించడం ద్వారా ఏకైక శాసనసభ స్థానాన్ని గెలుపొందిన సీపీఎం మళ్లీ అదే స్థానాన్ని నిలుపుకునేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తోంది. సీపీఎం నుంచి గెలుపొందిన సున్నం రాజయ్య ఈసారి ఆంధ్రప్రదేశ్‌లోని రంపచోడవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉండటంతో భద్రాచలం సీపీఎం అభ్యర్థిగా మాజీ ఎంపీ మిడియం బాబూరావును రంగంలోకి దింపాలని పార్టీ యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

దుమ్ముగూడెం ప్రాంతానికి చెందిన బాబూరావు 2004లో భద్రాచలం నుంచి సీపీఎం తరఫు న ఎంపీగా గెలుపొందారు. ఇక సీపీఐ మాత్రం కాంగ్రెస్‌ తో ఎన్నికల అవగాహన కుదిరే అవకాశం ఉండటంతో జిల్లాలో తాము గతంలో పోటీ చేసిన ఖమ్మం ఎంపీతోపాటు మూడు నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ప్రధానంగా కొత్తగూడెం నియోజకవర్గంలో ఈసారి పాగా వేసేందుకు ఆ పార్టీ శక్తియుక్తులు ఒడ్డుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీపీఎం, సీపీఐలు ఈ ఎన్నికల్లో తమదైన రీతిలో రాజకీయ పంథాను అవలంబించడం.. రాజకీయంగా చెరో దారిలో పయనించే అవకాశం స్పష్టంగా కనపడుతుండటంతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ బహుము ఖ పోటీ తప్పదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement