తెలంగాణ వ్యాప్తంగా జోరుగా వర్షాలు
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా వరణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. శనివారం రాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జోరువానతో హోరెత్తిస్తున్నాడు. వరణుడి దెబ్బకు పలు రహదారుల్లో నీళ్లు చేరి రాకపోకలకు అంతరాయం కలిగింది. అక్కడక్కడా వాహనాలు వర్షపు నీటిలో ఇరుక్కుపోయాయి. గిరిజన ప్రాంతాల్లో కొన్ని గ్రామాలు నీట మునిగాయి. ఎన్నో వాగులు పొంగి పొర్లుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాన్ని జిల్లాల వారీగా చూస్తే..
ఆదిలాబాద్: జిల్లాలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. వాగులు పొంగి పొర్లుతున్నాయి. గొల్లపల్లి, కృష్ణపల్లి వాగులు పొంగటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అర్జునగుట్ట వద్ద ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా ఓపెన్ కాస్టుల్లో వర్షపు నీరు భారీగా చేరింది. దీంతో డోర్ని -1, 2, శ్రీరాంపూర్, కైరీగూడ, రామకృష్ణాపూర్ బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. కొమురంభీం ప్రాజెక్టుకు వరదనీరు చేరింది. అక్కడ ఇన్ ఫ్లో 22 వేలు, ఔట్ ఫ్లో 12 వేల క్యూసెక్కులుగా నమోదవటంతో 5 గేట్లు ఎత్తివేశారు.
కరీంనగర్: ఆదివారం జిల్లా వ్యాప్తంగా సగటున 6.8 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మహదేవ్పూర్లో 13.6 సెంటీ మీటర్లు, కమలాపూర్, మహాముత్తారంలో 12.6, వీణవంకం, కాటారంలలో 11 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కమలాపూర్ మండలం అంబాల, శంబునిపల్లిలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. అంబాల కల్వర్టు తెగిపోవడంతో హన్మ కొండ, కమలాపూర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రామగుండం ఓపెన్ కాస్ట్లోకి వరద నీరు చేరి బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది.
ఖమ్మం: జిల్లాలోని దుమ్ముపేటలో 15 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.భద్రాచలం, ఏజెన్సీల్లో దాదాపు 40 గ్రామాలు నీట మునిగాయి. పినపాక మండలం బోటిగూడెం, పాల చెరువులకు గండి పడింది. దాంతో వాటి సమీపంలో ఉన్న మారేడుగూడెం, బోటిగూడెం గ్రామాల్లోకి వరద నీరు చేరింది. మధిర మండలం జాలిముడి ప్రాజెక్టు వద్ద వైరా నదిలో ఇద్దరు ఇంజనీర్లు చిక్కుకున్నారు. నామాలపాడు వద్ద జిన్నేయ వాగు పొంగడంతో ఇల్లెందు - మహబూబ్ నగర్ మధ్య రాకాపోకలు నిలిచిపోయాయి.
వరంగల్: నర్సంపేట డివిజన్లో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు పొంగి పొర్లడంతో భద్రాచలం - నర్సంపేట మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. ఉత్తర తెలంగాణలో ఆదివారం కురిసిన భారీ వర్షంతో ధవళేశ్వరం బ్యారేజికి భారీగా వరద నీరు చేరుతోంది.