చర్చోపచర్చలు.. | Early Elections In Telangana Assembly Khammam Politics | Sakshi
Sakshi News home page

చర్చోపచర్చలు..

Published Tue, Sep 4 2018 10:59 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Early Elections In Telangana Assembly Khammam Politics - Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: ముందస్తు ఎన్నికలున్నట్లు ప్రచారమవుతున్న నేపథ్యంలో జిల్లాలోని పార్టీలన్నీ భవిష్యత్‌ కార్యాచరణపై దృష్టి సారించాయి. ప్రధానంగా టీఆర్‌ఎస్‌ ఒంటరి పోరుకు సిద్ధం కాగా.. కాంగ్రెస్‌ మాత్రం కలిసొచ్చే పార్టీలతో మిత్రుత్వానికి సిద్ధం కావడంపై ఆ పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌.. సీపీఐతో ఎన్నికల పొత్తు పెట్టుకుని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం లోక్‌సభతోపాటు మూడు అసెంబ్లీ నియోజకవర్గాలను ఆ పార్టీకి కేటాయించింది. ఈసారి ఎన్నికల్లో సీపీఐతో మాత్రమే కాకుండా టీడీపీతో ఎన్నికల పొత్తు అంశం తెరపైకి రావడంతో ఈసారి మిత్రపక్షాలుగా టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ పోటీ చేసే పరిస్థితి ఏర్పడింది. దీంతో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐలలో ఎవరికి ఏ సీటు లభిస్తుంది? పొత్తులో లాభపడేది ఎవరు? సీటు కోల్పోయేది ఎవరు? అనే అంశంపై ఆయా పార్టీల్లో జోరుగా ఊహాగానాలు, చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి.

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌.. సీపీఐతో పొత్తులో భాగంగా ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి సీపీఐకి చెందిన జాతీయ నేత నారాయణ పోటీ చేయగా.. మహబూబాబాద్‌ ఎంపీ స్థానానికి సీపీఐ మద్దతుతో మాజీ మంత్రి బలరాంనాయక్‌ ఎన్నికల బరిలోకి దిగారు. ఇక వైరా, కొత్తగూడెం, పినపాక నియోజకవర్గాల్లో సీపీఐ అభ్యర్థులు బరిలోకి దిగగా.. కాంగ్రెస్‌ మద్దతిచ్చింది. మిగిలిన ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు సీపీఐ మద్దతు ప్రకటించగా.. ఉమ్మడి జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్‌ గెలుపొందింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి కొత్తగూడెం టికెట్‌ ఆశించి.. ఎన్నికల పొత్తు వల్ల చివరి నిమిషంలో టికెట్‌ చేజారడంతో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు వైఎస్సార్‌ సీపీలో చేరి కొత్తగూడెం శాసనసభ బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జలగం వెంకట్రావు విజయం సాధించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌తో పొత్తుకు ఉబలాటపడుతున్న టీడీపీ ఖమ్మం లోక్‌సభ స్థానంపై కన్నేసి.. ఆ స్థానం కోసం పట్టుపడుతున్నట్లు ఇరు పార్టీల్లోనూ జోరుగా ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన నామా నాగేశ్వరరావు కాంగ్రెస్‌ మద్దతుతో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సమాయత్తమవుతున్నారని, ఈ మేరకు పార్టీ శ్రేణులకు సైతం రాజకీయ పరిస్థితులను వివరిస్తూ.. కాంగ్రెస్‌తో మైత్రి అంశాన్ని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
 
రెండూ కోరుతున్నట్లు ప్రచారం 
అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా నుంచి టీడీపీ తరఫున ఎన్నికైన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సిట్టింగ్‌ అభ్యర్థి కావడంతో ఖమ్మం ఎంపీ స్థానంతోపాటు సత్తుపల్లి స్థానాన్ని టీడీపీ గట్టిగా కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున టీడీపీ అభ్యర్థి సండ్రతో సత్తుపల్లిలో తలపడిన మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌ను కాంగ్రెస్‌ పార్టీ ఎక్కడ సర్దుబాటు చేస్తుందన్నది ఉత్కంఠ రేపుతోంది. పాలేరు నియోజకవర్గంలో పలుమార్లు విజయం సాధించిన సంభాని ఈసారి జనరల్‌ స్థానమైన పాలేరు నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో దళితులు, గిరిజనులకు టికెట్లు ఇచ్చి గెలిపించుకున్న చరిత్ర కాంగ్రెస్‌ పార్టీకి ఉందని, అదే తరహాలో తనకు పాలేరు టికెట్‌ ఇవ్వాలని సంభాని పట్టుపడుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే టీడీపీతో ఎన్నికల పొత్తు దాదాపు ఖాయమని భావిస్తున్న కాంగ్రెస్‌ వర్గాలు సంభానిని ఎలా సర్దుబాటు చేస్తారనే అంశంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక 1999, 2004 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించడంతోపాటు కేంద్ర మంత్రిగా పనిచేసిన రేణుకా చౌదరి 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై ఓడిపోయారు. అప్పటి నుంచి జిల్లా రాజకీయాలను అంటిపెట్టుకుని ఉంటున్న రేణుక.. 2014లో కాంగ్రెస్, సీపీఐ ఎన్నికల పొత్తు వల్ల ఖమ్మం లోక్‌సభ స్థానాన్ని సీపీఐకి కేటాయించడంతో ఆ ఎన్నికల్లోనూ పోటీ చేసే అవకాశం కోల్పోయారు. ఈసారి సైతం ఎన్నికల పొత్తులో ఈ స్థానం సీపీఐకి కాకుండా టీడీపీకి ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు వస్తున్న వార్తలతో రేణుకాచౌదరి ఈసారి కూడా పోటీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా? ఆమెకు మరో సుస్థిర స్థానాన్ని ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సిద్ధంగా ఉందా? అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

టీడీపీ, కాంగ్రెస్‌లకు పొత్తు ఉంటే.. రాష్ట్ర, కేంద్ర మాజీ మంత్రులు సంభాని చంద్రశేఖర్, రేణుకాచౌదరి భవితవ్యం ఎలా ఉంటుంది? పార్టీ వారిని ఏ విధంగా సంతృప్తి పరుస్తుంది? ఎక్కడి నుంచి పోటీ చేయిస్తుందన్న అంశం చర్చనీయాంశంగా మారింది. అలాగే ఖమ్మం ఎంపీ స్థానం నుంచి ఈసారి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని శాసన మండలి ఉపనేత, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి పార్టీ అధిష్టానాన్ని కోరడంతోపాటు తనకున్న పరిచయాల ద్వారా పార్టీని ఒప్పించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మరికొన్ని సీట్లంటున్న టీడీపీ.. 
ఇక కాంగ్రెస్‌తో పొత్తుకు సై అంటున్న టీడీపీ.. ఖమ్మం ఎంపీ టికెట్‌తోపాటు సత్తుపల్లి సిట్టింగ్‌ స్థానం కావడంతో ఈ రెండు స్థానాలే కాకుండా గత ఎన్నికల్లో పోటీ చేసిన పాలేరు, అశ్వారావుపేట, కొత్తగూడెం, భద్రాచలం స్థానాలను కాంగ్రెస్‌ను అడుగుతున్నట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే రాష్ట్రం మొత్తంమీద కాంగ్రెస్‌ పార్టీ టీడీపీకి 15 లేదా.. అదనంగా ఒకటి, రెండు కేటాయించే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా నుంచి టీడీపీ నేతలకు ఎంతమందికి అవకాశం కల్పించడం సాధ్యమవుతుందన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో ఉత్పన్నమవుతోంది. ఇక గత ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీచేసి ఇప్పటికీ టీడీపీలోనే కొనసాగుతున్న పార్టీ సీనియర్‌ నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, కొత్తగూడెం నుంచి పోటీ చేసిన కోనేరు సత్యనారాయణ(చిన్ని), అశ్వారావుపేట నుంచి పోటీ చేసి ఓటమి చెందిన మెచ్చా నాగేశ్వరరావు, ఖమ్మం నుంచి పోటీ చేసేందుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య ఆసక్తి కనబరుస్తుండడంతో వీరిలో ఎవరి కల నెరవేరుతుంది? ఎన్నికల పొత్తు ఎంతమందికి కలిసొస్తుందన్న అంశంపై టీడీపీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అలాగే జనరల్‌ స్థానాలైన ఖమ్మం, కొత్తగూడెం, పాలేరు నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్, టీడీపీల నుంచి అనేక మంది పోటీ పడుతుండగా.. వీరిలో ఎవరికి టికెట్‌ లభిస్తుందన్న అంశం ఉత్కంఠ రేపుతోంది.
 
సీపీఐ కూడా.. 
ఇక కాంగ్రెస్‌తో పొత్తు కొనసాగితే సీపీఐ వచ్చే ఎన్నికల్లోనూ ఖమ్మం ఎంపీ స్థానంతోపాటు గతంలో పోటీ చేసిన వైరా, కొత్తగూడెం, పినపాకతోపాటు మరో రెం డు స్థానాలను అదనంగా అడగాలని యోచిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మూడు రాజకీ య పక్షాలు ఖమ్మం జిల్లాలో ఆయా ప్రాంతాల్లో బలం గా ఉండటం.. ఎన్నికల మైత్రి ఆ పార్టీలకు లాభించే అవకాశం ఉన్నా.. సీట్ల సర్దుబాటు ఎలా కొనసాగుతుంది.. అనే అంశంపై రాజకీయ వర్గాల్లో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రస్థాయిలో కాంగ్రెస్, టీడీపీల మధ్య ఎన్నికల అవగాహన చర్చలు కొలిక్కి వచ్చాయన్న ప్రచారం ఊపందుకోవడంతో ఖమ్మం ఎంపీగా కాంగ్రెస్‌ మద్దతుతో నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ మద్దతుతో టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్యకు దాదాపు టికెట్‌ ఖాయమన్న ప్రచారం టీడీపీ వర్గాల్లో కొనసాగుతోంది.

అయితే జిల్లాలోని ఆయా నియోజకవర్గాలపై ఆశలు పెట్టుకుని అనేక ఏళ్లుగా కాంగ్రెస్‌లో పని చేస్తున్న నేతలను ఆ పార్టీ ఎలా సర్దుబాటు చేస్తుందనేది ప్రధానంగా చర్చనీయాంశమైంది. కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి ఒక దశలో కాంగ్రెస్‌ తరఫున ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నా.. అదే సమయంలో ఆమె హైదరాబాద్‌కు సమీపంలోని మరో లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసే అవకాశాలున్నట్లు ప్రచారమవుతోంది. ఇక గత ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన వనమా.. ఈసారి పొత్తులో కొత్తగూడెం స్థానాన్ని కాంగ్రెస్‌కు కేటాయించాలని, టికెట్‌ తనకే ఇవ్వాలని కాంగ్రెస్‌ అధిష్టానానికి విన్నవించడమే కాకుండా.. తనకున్న పరిచయాలతో పార్టీ పెద్దలను ఒప్పించే ప్రయత్నంలో నిమగ్నమైనట్లు ప్రచారం జరుగుతోంది.

ఇక అదే నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి.. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఆశీస్సులతో కాంగ్రెస్‌లో చేరిన ఎడవల్లి కృష్ణ సైతం కొత్తగూడెం ఎమ్మెల్యే స్థానానికి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారమవుతోంది. ఇందుకు రేణుకాచౌదరి ఆశీస్సులున్నాయని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుండడంతో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ మిత్రపక్షాల్లో ఈ సీటు ఎవరికి లభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement