
ఖమ్మం విప్లవాల గుమ్మం
‘ఖమ్మం విప్లవాల గుమ్మం.. పోరాటాల ఖిల్లా.. నా హయాంలోనే జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది’ అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్‌లో టీడీపీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ప్రజాగర్జన సభకు పార్టీ జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు అధ్యక్షత వహించగా చంద్రబాబు హాజరై ప్రసగించారు.
జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల్లో రాజీవ్‌సాగర్ పూర్తి కాలేదని, ఇందిరాసాగర్ కాంట్రాక్టర్ల వరంగా మారిందన్నారు. ఈ ప్రాజెక్టులతో పాటు మొండికుంట, పాలెంవాగు, కిన్నెరసాని ప్రాజెక్టులను ప్రభుత్వం విస్మరించిందని.. ఈ ప్రాజెక్టులన్నింటిని టీడీపీ అధికారంలోకి రాగానే పూర్తి చేస్తుందన్నారు. జిల్లాలో నాగార్జునసాగర్ ఆయకట్టు కింద లక్షా యాభై వేల ఎకరాల్లో పంటలు వేశారని, నీటి విడుదల లేక ఈ పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందన్నారు. వేసిన పంటలకు నీళ్లివ్వాలని జిల్లా రైతుల పక్షాన గవర్నర్‌కు లేఖ రాయనున్నట్లు తెలిపారు.
పోలవరం నిర్వాసితులకు ఆధునిక చట్టంతో పునరావాసం కల్పించేలా, వారికి పూర్తిగా న్యాయం జరిగే వరకు టీడీపీ పోరాడుతుందన్నారు. ఎస్సారెస్పీ ద్వారా జిల్లాలో పంటలకు నీళ్లందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. జిల్లా ప్రజలకు ఏదో చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇక్కడ అభివృద్ధినే విస్మరించిందన్నారు. భద్రాచలంలో గిరిజన యూనివర్శిటీ, కొత్తగూడెంలో మైనింగ్ యూనివర్శిటీ, కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుకు టీడీపీ కృషి చేస్తుందన్నారు. ఖమ్మంను హైదరాబాద్‌కు దీటైన నగరంగా అభివృద్ధి చేస్తామన్నారు. జిల్లా నుంచి ఇండియాలో ఎక్కడికైనా వెళ్లేందుకు విమానాశ్రయం ఏర్పాటు చేయిస్తానన్నారు. నష్టాల్లో ఉన్న సింగరేణికి తన ప్రభుత్వ హయాంలో రూ.663 కోట్లు రుణం ఇప్పించి ఆదుకున్నానన్నారు.
జిల్లా అభివృద్ధికి పాటు పడకుండా నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్ నేతలకు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. రానున్న ఎన్నికల్లో జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు, రెండు ఎంపీ స్థానాలు గెలిపించేలా ప్రజలు ఆశీర్వదించాలన్నారు.ఈ సభలో ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు హయాంలోనే జిల్లా అభివృద్ధి జరిగిందని, గత ప్రభుత్వం అభివృద్ధిలో జిల్లాను విస్మరించిందన్నారు. కొత్త రాష్ట్రంలో అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమవుతుందన్నారు. ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ నవ తెలంగాణలో ఖమ్మం జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. పోలవరంతో 2 లక్షల మంది గిరిజనులు నిర్వాసితులవుతున్నారన్నారు. కొత్త భూ చట్టం ప్రకారం నిర్వాసితులకు న్యాయం చేసే బాధ్యత టీడీపీపై ఉందని పేర్కొన్నారు.
చంద్రబాబునాయుడు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి గిరిజనులకు న్యాయం చేయాలన్నారు. ప్రజాగర్జన సభలో తెలంగాణ పార్టీ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, మోత్కుపల్లి నర్సింహులు, ఎల్.రమణ, విజయరమణారావు, ఉమా మాధవరెడ్డి, రమేష్ రాథోడ్, గుండు సుధారాణి, రేవూరిప్రకాశ్‌రెడ్డి, సీతక్క, ఈ. పెద్దిరెడ్డి, రావులపాటి సీతారామారావు, ప్రకాశ్‌గౌడ్, అరవింద్‌కుమార్‌గౌడ్, జిల్లా నేతలు సండ్ర వెంకటవీరయ్య, ఊకె అబ్బయ్య, బాలసాని లక్ష్మీనారాయణ, పోట్ల నాగేశ్వరరావు, బాణోతు మోహన్‌లాల్, మద్దినేని బేబిస్వర్ణకుమారి, నాగప్రసాద్, కోనేరు సత్యనారాయణ, ఫణీశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.