భర్త వెంకటేశ్వర్లుతో భార్య సత్యవతి
సుజాతనగర్: కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించాడు... ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు కూడా చేశాడు.. కాని విధి వక్రీకరించి ప్రస్తుతం అనారోగ్యంతో మంచానపడ్డాడు. కుటుంబ బాధ్యత నెత్తికెత్తుకున్న మరో కూతురు విద్యుదాఘాతంతో మృతి చెందింది. కూతురిని కాపాడబోయి తల్లి కూడా విద్యుదాఘాతానికి గురైంది. దీంతో ఒక చేయి పనిచేయడం లేదు. కుటుంబ పోషణే భారమైన తరుణంలో ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారీ నిరుపేద దంపతులు
సుజాతనగర్ మండలం సింగభూపాలేనికి చెందిన ఉగ్గం వెంకటేశ్వర్లు, భార్య సత్యవతికి ముగ్గురు కూతుళ్లు. కూలీనాలి చేసుకోవడంతోపాటు ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. ఏడాది క్రితం అనారోగ్యం పాలయ్యాడు. నిరుపేద కుటుంబానికి చెందిన వెంకటేశ్వర్లు అప్పోసప్పో చేసి వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. ఒక కిడ్నీ పాడైందని వైద్యులు చెప్పడంతో ఆర్థికస్థోమత అంతంతమాత్రంగా ఉన్న వెంకటేశ్వర్లు మెరుగైన వైద్యం చేయించుకోలేకపోయాడు. దీంతో రెండో కిడ్నీసైతం చెడిపోయింది. ప్రస్తుతం వెంకటేశ్వర్లు మంచానికే పరిమితమై తన పనులు కూడా తాను చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఒకరి ఊతం లేనిదే మంచం పైనుంచి లెగిసే పరిస్థితి లేదు. తల్లిదండ్రుల బాధ చూడలేని పెద్దకూతురు అరుణ ఇంటి బాధ్యతను స్వీకరించి తాను కూడా కూలీకి వెళ్తూ, కాయగూరలు అమ్ముతూ బతుకుబండిని నెట్టుకొస్తుండేది. విధి వక్రించి ఇంటి పనులు చేసుకుంటున్న తరుణంలో అరుణ ఇంట్లోనే విద్యుదాఘాతానికి గురైంది.
కూతురిని రక్షించే క్రమంలో తల్లి సత్యవతి కూడా విద్యుత్ షాక్‌కు గురైంది. ఈ ప్రమాదంలో అరుణ అక్కడికక్కడే మరణించగా, సత్యవతికి కుడిచేయి సరిగ్గా పనిచేయని స్థితికి చేరుకోవడంతోపాటు కాలి వేళ్లు కూడా తెగిపోయాయి. సంవత్సర కాలం నుంచి జీవనం సాగించడానికి ఆ దంపతులిద్దరూ పడే వేదన వర్ణణాతీతం. పూట గడవడమే కష్టంగా ఉన్న దంపతులకు అనారోగ్యం మరింత కుంగదీస్తోంది. కూలీపనులు సైతం చేసుకునే పరిస్థితిలో లేని సత్యవతి చుట్టుపక్కలవారి సాయంతో రోజులు నెట్టుకొస్తోంది. మెరుగైన వైద్యానికి డబ్బులు లేకపోవడంతో భర్త ఆరోగ్య పరిస్థితి రోజురోజుకీ క్షీణిస్తుండటంతో కన్నీటిపర్యంతమవుతోంది. ఉండటానికి కనీసం సరైన ఇళ్లు కూడా లేక పూరిగుడిసెలోనే జీవనం సాగిస్తున్నారు. తన భర్తకు మెరుగైన వైద్యం అందితే కుటుంబ పోషణ బాగుంటుందని భార్య సత్యవతి ఆవేదన వ్యక్తం చేస్తుంది. దాతలు ఉంటే సాయం చేయాలంటూ ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment