Kidney diseases
-
వెనుకబాటు వీడి ప్రగతిబాటలో సిక్కోలు
సిక్కోలు అంటే వెనుకబాటు.. సిక్కోలు అంటే వలసలు.. సిక్కోలు అంటే కిడ్నీ సమస్య.. సిక్కోలు అంటే ఉపాధి గోస.. ఇదంతా నిజమే గానీ.. ఇప్పుడది గతం. ఆ చేదు అనుభవాల పునాదులపై ప్రగతి పూలు పూస్తున్నాయి. నాలుగున్నరేళ్ళ క్రితం రాష్ర్టంలో జరిగిన అధికార మార్పిడి వెనుకబడిన, చిన్న చూపునకు గురైన శ్రీకాకుళం జిల్లా నెత్తిన పాలు పోసింది. వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అటు సంక్షేమం.. ఇటు అభివృద్ధిని సమపాళ్ళలో రంగరించి జిల్లా ప్రగతి చిత్రాన్ని తీర్చిదద్దుతోంది. సంక్షేమ పథకాల రూపంలోనే అక్షరాలా రూ.15 వేల కోట్లు జిల్లాలోని పేద లబ్ధిదారులకు నేరుగా అందించిన ప్రభుత్వం.. జిల్లా ప్రజల అర్థ శతాబ్ది కోరిక అయిన పోర్టు నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగిస్తూ ఉందిలే మంచి కాలం ముందూ ముందునా.. అంటూ.. జిల్లా భవిష్యత్తు ముఖచిత్రాన్ని మార్చేస్తోంది. దీనికి తోడు రెండు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు రానున్నాయి. ఇక దశాబ్దాలుగా జిల్లాలోని ఉద్దానం ప్రాంతాన్ని పీల్చి పిప్పి చేస్తున్న కిడ్నీ సమస్యకు శాశ్వతంగా పారదోలేందుకు ప్రత్యేకంగా రీసెర్చ్ సెంటర్, ఆస్పత్రి, 800 గ్రామాలకు ప్రత్యేక తాగునీటి పథకం ఏర్పాటు చేయడం ద్వారా ఉద్దానం గుండెలపై కుంపటిని దింపేసినట్లు అయ్యింది. మరోవైపు ఆఫ్ షోర్, వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల ద్వారా వ్యవసాయానికి కొత్త ఊపిరులూదుతున్నారు. జిల్లాలో నాలుగేళ్లలో ఆర్అండ్బీ శాఖ పరిధిలో రూ.526. 69కోట్లతో 633.4 కిలోమీటర్లకు సంబంధించి 432 రోడ్లు మంజూరు చేసింది. ► పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఏఐఐబీ కింద రూ.352.78 కోట్లతో 484.43కిలోమీటర్ల మేర 312 రోడ్లు వేసేందుకు మంజూరు చేసింది. ఇందులో 266 రోడ్లు పనులు జరుగుతున్నాయి. అదే స్కీమ్‌లో కొత్తగా రూ.46.72 కోట్లతో 205.68 కిలోమీటర్లతో 83 రహదారులు మంజూరు చేసింది. ► ఆర్సీపీఎల్డబ్ల్యూ కింద రూ.70.96 కోట్లతో 94.30 కిలోమీటర్లకు సంబంధించి 23 రోడ్లు మంజూరు చేయగా వాటిలో రూ.55.55 కోట్ల తో 21 రహదారుల నిర్మాణం పూర్తి చేసింది. ►పీఎంజీఎస్‌వై బ్యాచ్–1 కింద రూ.51.27కోట్లతో 11పనులు మంజూరు చేయగా ఇప్పటికే 10 పనులు పూర్తి చేసింది. బ్యాచ్–2లో రూ. 38.23కోట్లతో 8పనులు మంజూరు చేయగా ఆరుపూర్తయ్యాయి. రెండు ప్రగతిలో ఉన్నాయి. ► ప్రత్యేక మరమ్మతుల కింద 275 కిలోమీటర్ల పొడవునా రూ.73.25 కోట్లతో 54 రోడ్ల పనులు చేపట్టారు. ఏపీ రూరల్ రోడ్డు ప్రాజెక్టు వర్క్స్ కింద రూ.350 కోట్లతో 480 కిలోమీటర్ల పొడవునా 312 పనులు చేపడుతున్నారు. ► ఏపీ గ్రామీణ రహదారుల రెన్యువల్ వర్క్స్ కింద రూ.50 కోట్లతో 200 కిలోమీటర్ల పొడవునా 83 పనులు చేపడుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో రూ.56.35 కోట్లతో 102 గ్రామాలకు ఉపయోగపడేలా 42 సీసీ, బీటీ రోడ్లు వేశారు. ►నగరపాలక, పురపాలక సంఘాల్లో రూ.48 కోట్లతో రహదారులను అభివృద్ధి చేశారు. రూ.300 కోట్లతో జిల్లాలో 12 భారీ వంతెనలు నిర్మించారు. బలసలరేవు బ్రిడ్జి నిర్మాణానికి రూ.87కోట్లు మంజూరు చేశారు. కిడ్నీ పరిశోధన కేంద్రం, ఆస్పత్రి ఉద్దానానికి ఊపిరి కిడ్నీ వ్యాధులు అధికంగా ప్రబలుతున్న ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అండగా నిలిచారు. పలాసలో రూ.50 కోట్లకు పైగా వ్యయంతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, కిడ్నీ వ్యాధుల రీసెర్చ్ సెంటర్, అతిపెద్ద డయాలసిస్ సెంటర్ నిర్మించారు. కిడ్నీ వ్యాధులకు ప్రధాన కారణం తాగునీరుగా భావిస్తున్న నేపథ్యంలో జిల్లాలో పలాస, ఇచ్ఛాపురం పరిధిలో 7 (ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, పలాస, వజ్రపుకొత్తూరు) మండలాల్లోని 807గ్రామాలకు ఉపరితల రక్షిత మంచినీరు అందించేందుకు రూ.700 కోట్లతో ప్రాజెక్టు నిర్మించారు. త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. సుమారు 5లక్షల 57వేల 633మందికి తాగునీరు అందించడమే ప్రాజెక్టు లక్ష్యం. వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టు వలసలకు స్వస్తి మత్స్యకార సమస్యలతో పాటు వలసలపై సీఎం ప్రత్యేక దృష్టిసారించారు. ల్యాండ్ లార్డ్ మోడల్ విధానంలో రూ.2,949.70 కోట్లతో మూలపేట పోర్టు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 25 వేల మందికి ఉపాధి లభిస్తుంది. మత్స్యకారుల కోసం రూ. 365.81కోట్లతో ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తున్నారు. వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో రూ.11.95 కోట్లతో జెట్టీ నిర్మిస్తున్నారు. నిర్మాణంలో మూలపేట పోర్టు జలయజ్ఞం..ఫలప్రదం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సీఎం వైఎస్ జగన్ నడుంబిగించారు. వంశధార ఫేజ్ 2లోని స్టేజ్ 2 పనులు పూర్తి చేయడమే కాకుండా నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఉన్న అడ్డంకులు కారణంగా ఈలోపు మొత్తం ఆయకట్టును సస్యశ్యామలం చేసేందుకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మంజూరు చేశారు. రూ.176.35 కోట్లు మంజూరు చేయడమే కాకుండా పనులు కూడా ప్రారంభించారు. నాగావళి, వంశధార నదుల అనుసంధానం పనులు పూర్తి చేస్తున్నారు. ఉద్దానంలోని మహేంద్ర తనయపై నిర్మిస్తున్న ఆఫ్‌షోర్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రూ.852 కోట్లు మంజూరు చేశారు. ఇప్పుడా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మడ్డువలస రెండో దశ పనులకు రూ.26.65 కోట్లు మంజూరు చేశారు. పుష్కలంగా తాగునీరు.. ఇంటింటికి తాగునీరు సరఫరా చేసేందుకు జిల్లాలో మంచినీటి ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు పైపులెన్లు వేసింది. రూ.1552.36 కోట్లతో 4822 నిర్మాణాలు ప్రారంభించగా, ఇప్పటికే కొన్ని పనులు పూర్తయ్యాయి. జగనన్న హౌసింగ్ కాలనీల్లో తాగునీరు అందించేందుకు 791 పనులను రూ.38.4కోట్లతో పనులు చేపడుతున్నారు. అందుబాటులో వైద్యం.. ► సచివాలయాల్లో భాగంగా ఉన్న విలేజ్ హెల్త్ క్లినిక్‌ల ద్వారా ఇంటి చెంతకే వైద్యసేవలు అందుతున్నాయి. ►జిల్లాలో కొత్తగా రూరల్ ప్రాంతాల్లో 5 పీహెచ్‌సీలు, శ్రీకాకుళం, ఆమదాలవలస తదితర అర్బన్ ప్రాంతాల్లో 11 పీహెచ్‌సీలను కొత్తగా ఈ ప్రభుత్వ హయాంలోనే నిర్మించారు. పాతపట్నంలో 50 పడకల సామాజిక ఆసుపత్రిని రూ.4.2 కోట్లు, జొన్నవలస ఆసుపత్రిని 2.45 కోట్లు, లావేరులో రూ.1.20 కోట్లు, సోంపేట సామాజిక ఆసుపత్రిని రూ.4.60 కోట్లు, బారువ సామాజిక ఆసుపత్రిని రూ. 5.60 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. ►నాడు నేడు కింద 83 ఆసుపత్రులను రూ.47 కోట్లతో అభివృద్ధి చేశారు. నరసన్నపేట ఆసుపత్రిని 100 పడకలకు అప్‌గ్రేడ్ చేశారు. విద్యాభివృద్ధికి పెద్దపీట.. ► వైఎస్సార్ కలల విద్యా సంస్థ ట్రిపుల్ ఐటీలో రూ.131కోట్లతో జీప్లస్–5 బ్లాక్‌లను మూడు నిర్మించింది. ప్రస్తుతం రూ.67కోట్లతో న్యూ అకాడమీ బ్లాక్‌ను ప్రస్తుతం నిర్మిస్తోంది. మరో రూ.133 కోట్లతో 6వేల మందికి సరిపడా వసతి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంది. ►జిల్లాకే తలమానికంగా ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో రూ.45 కోట్లతో అదనపు భవనాలు నిర్మిస్తున్నారు. ►పొందూరు, ఆమదాలవలస మండలం తొగరాంలో డిగ్రీ కళాశాలలు, పొందూరులో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ రెసిడెన్సియల్ బాలురు పాఠశాల, సరుబుజ్జిలి మండలం రొట్టవలసలో బాలికల జూనియర్ కళాశాల, వెన్నెలవలసలో వెటర్నరీ పాలిటెక్నికల్ కళాశాల, ఆమదాలవలస మండలం తొగరాంలో అగ్రికల్చరల్ పాలిటెక్నికల్ కళాశాల, బూర్జ మండలం పెద్దపేటలో హారి్టకల్చర్ రీసెర్చ్ స్టేషన్ మంజూరు చేశారు. ఆమదాలవలస జగ్గు శా్రస్తులపేట వద్ద క్రికెట్ స్టేడియం మంజూరు చేశారు. కీలక అభివృద్ధి పనులు ►రూ.28 కోట్లతో పొందూరు రైల్వే బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నారు. ►రూ. 48 కోట్లతో అలికాం– ఆమదాలవలస మధ్యలో రైల్వే బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. ►ప్రసాదం స్కీమ్ కింద శ్రీముఖలింగం టెంపుల్ సర్క్యూట్ అభివృద్ధి చేస్తున్నారు. కోట్ల రూపాయలతో అరసవిల్లి సూర్యదేవాలయం అభివృద్ధి చేస్తున్నారు. ►జిల్లాలో లక్షా 10వేల 825మందికి ఉచితంగా ఇళ్ల స్థలాలు అందజేశారు. వాటిలో మొదటి విడతగా 83,456 ఇళ్లు నిర్మాణాలు చేపడుతున్నారు. ►నిరుద్యోగులకు ఉపాధి కలి్పంచే భాగంలో జిల్లాలో 27 ఫిష్ ఆంధ్ర డెలీయస్ యూనిట్లు ఏర్పాటు చేశారు. ►శ్రీకాకుళం– ఆమదాలవలస రోడ్డు నాలుగు లైన్లకు రూ.43కోట్లు మంజూరు చేశారు. పనులు ప్రారంభమయ్యాయి. పల్లెకు కొత్తరూపు.. ►పల్లెలు సరికొత్త రూపు రేఖలు సంతరించుకున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల భవన నిర్మాణాలు పెద్ద ఎత్తున జరిగాయి. కళ్లెదుటే ఆస్తులు కని్పస్తున్నాయి. ►రైతులకు సేవలందించేందుకు రూ.141.70 కోట్లతో 650 రైతు భరోసా కేంద్రాలను నిర్మిస్తున్నారు. ►గ్రామ సచివాలయాల కోసం రూ.262 కోట్లతో 654 భవనాలను నిర్మిస్తున్నారు. వీటిలో సగానికిపైగా పూర్తయ్యాయి. ►రూ.31.20 కోట్లతో వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీల కోసం 195 భవనాలను నిర్మిస్తున్నారు. ►వైఎస్సార్ విలేజీ హెల్త్ క్లినిక్స్ కోసం రూ.93.62 కోట్లతో 535 భవనాలను నిర్మిస్తున్నారు. ఇందులో సగానికి పైగా పూర్తయ్యాయి. ∙వ్యవ‘సాయం’ ►జిల్లాలో రైతుల కోసం 642 రైతుభరోసా కేంద్రాలు నిర్మించారు. 7 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌ల నిర్మాణాలు చేపట్టారు. వైఎస్సార్ రైతుభరోసా కింద 3.21 లక్షల మంది రైతులకు రూ 1919.46 కోట్లు అందించారు. వైఎస్సార్ ఉచిత పంటల బీమా కింద 87,158 రైతులకు గాను రూ 85.14 కోట్లు అందజేశారు. ►రూ.424.74కోట్లతో 2,89,197 క్వింటాళ్ల విత్తనాలను (వరి,మినుములుతో పాటు ఇతరాలు) సబ్సిడీ ధరపై అందించారు. 82,745 మెట్రిక్ టన్నులు ఎరువులు (యూరియా, డీఏపీ, ఎంఓపీ, ఎన్పీకే) పురుగు మందులు 5592 లీటర్లు నేనొ, యూరియా వంటివి ఆర్బీకేల ద్వారా అందించారు. ►సాగుకు ఉపయోగపడేలా వైఎస్సార్ యంత్రసేవా పరికరాలు అందజేశారు. చిన్న, సన్నకార రైతులకు 505 ట్రాక్టర్లు, మలి్టపుల్క్రాప్ ట్రెసర్స్, పాడిరేపర్స్, రోటావెటర్స్, 57 క్లస్టర్లలో వరి కంబైన్డ్ హార్వెస్టర్స్ వంటివి అందించారు. 10 వేల భూసార పరీక్షలు చేశారు. 27,049 మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేశారు. ఇవన్నీ చేయడంతో సాగుతో పాటు పంట దిగుబడి గణనీయంగా పెరిగింది. మనబడి నాడు–నేడు ►ఫేజ్–1: జిల్లాలో నాడు–నేడు మొదటి ఫేజ్ కింద 1247 పాఠశాలను సుందరంగా తీర్చిదిద్ది మౌలిక సదుపాయాలు కలి్పంచారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.286.22 కోట్లు వెచ్చించింది. ► ఫేజ్–2: జిల్లాలో నాడు–నేడు రెండో ఫేజ్ కింద పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, వసతి గృహాలు.. ఇలా 1096 విద్యాసంస్థలను తీర్చిదిద్దారు. అదనపు తరగతి గదులను నిర్మించి, మౌలిక సదుపాయాలను కలి్పస్తున్నారు. ఇందుకోసం రూ.427.73 కోట్లు కేటాయించారు. పనులు శరవేగంగా సాగుతున్నాయి. -
గ్రేటర్ జిల్లాల్లో మొత్తం 12 సెంటర్లే
హైదరాబాద్: హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కిడ్నీ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, డయాలసిస్ కేంద్రాలు తగినంత సంఖ్యలో అందుబాటులో లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. దాంతో పేద మధ్యతరగతి రోగులు కార్పొరేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తూ అప్పుల పాలవుతున్నారు. మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతున్న రోగులు, ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం వేచి చూస్తున్నారు. అందరికీ వారి వారి అవసరాన్ని బట్టి వారంలో ఒకటి లేదా రెండుసార్లు లేదా మూడుసార్లు డయాలసిస్ చేయించుకుంటారు. కానీ వారి అవసరాలకు తగ్గట్టుగా డయాలసిస్ సెంటర్లు మాత్రం పెరగకపోవడం రోగులకి తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. రెండు జిల్లాల్లో పదకొండే.. ► కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇతర రాష్ట్రాల కంటే మెరుగైనవని అధికారులు చెబుతున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 2,400 మంది రోగులు ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారంలో రెండు మూడుసార్లు డయాలసిస్ కోసం ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న రోగుల సంఖ్య అంతకంటే ఎక్కువగానే ఉందని అంచనా. ► హైదరాబాద్ జిల్లా పరిధిలో కేవలం ఏడు డయాలసిస్ కేంద్రాలు ఉండగా, 34 లక్షల జనాభా ఉన్న రంగారెడ్డిలో కేవలం నాలుగు మాత్రమే ఉన్నాయి. హైదరాబాద్ జిల్లా పరిధిలో కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రి, నాంపల్లి ఏరియా ఆసుపత్రి, గోల్కొండ ఏరియా ఆసుపత్రి, మలక్‌పేట ఏరియా ఆసుపత్రి, నిమ్స్, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులలో డయాలసిస్ కేంద్రాలు ఉన్నాయి. ప్రధానంగా పాతబస్తీ ప్రాంతానికి చెందిన అనేకమంది పేద రోగులు సాధారణంగా మలక్‌పేట్ ఏరియా హాస్పిటల్‌తో పాటు అక్కడి మహావీర్ ఎక్స్టెన్షన్ సెంటర్, నాంపల్లి ఏరియా హాస్పిటల్ , గోల్కొండ ఏరియా హాస్పిటల్ అస్రా హాస్పిటళ్లను ఎక్కువగా ఆశ్రయిస్తారు. పెరిగిన రోగుల సంఖ్య.. ‘ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్ర ఆరోగ్యశ్రీలో విలీనం చేసిన తర్వాత హైదరాబాద్ జిల్లాలో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య పెరిగింది. జిల్లాలో 2400 మంది రోగులు ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వం నిర్వహిస్తున్న డయాలసిస్ కేంద్రాల్లో ఉచిత చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వం రోగులకు రూ.2,000 పింఛను, ఉచిత బస్ పాస్‌లు కూడా అందజేస్తోంది. ప్రతి రోజు డయాలసిస్‌కు వెళ్లే రోగుల సేవల కోసం ప్రభుత్వం జిల్లాలోని 82 కేంద్రాలకు సింగిల్ యూజ్ డయాలిజర్లను అందజేస్తోంది’ అని జిల్లా వైద్యాధికారులు చెబుతున్నారు. ఆరోగ్యశ్రీ కింద డయాలసిస్ చేసేందుకు అంగీకరించిన ప్రైవేటు ఆసుపత్రులతో కలిపితే 26 కేంద్రాల వరకూ జిల్లాలో అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఆరోగ్యశ్రీ కార్డును అనుమతించాల్సి ఉన్నప్పటికీ కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు సాకులు చెప్పి తప్పించుకుంటున్నాయని రోగులు ఆరోపిస్తున్నారు. ► ‘రంగారెడ్డి జిల్లా పరిధిలో వనస్థలిపురం, షాద్‌నగర్, చేవెళ్ల, మహేశ్వరంలలో మాత్రమే సెంటర్లు ఉన్నాయి. ‘టీవల ఇబ్రహీంపట్నం మండలంలో ఓ సెంటర్ చేశారు. కానీ కొన్ని విద్యుత్ సమస్యల కారణంగా ఇది పనిచేయడం లేదు. సమస్యను పరిష్కరించిన తర్వాత మరో రెండు వారాల్లో ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుంది’ అని రంగారెడ్డి జిల్లా కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ (డీసీహెచ్ఎస్) జి. రాజు యాదవ్ చెప్పారు. మేడ్చల్ జిల్లాలో ఒక్కటే.. ఇటీవలి కాలంలో అటు జనాభా పరంగా ఇటు రియల్ ఎస్టేట పరంగా శరవేగంగా వృద్ధి చెందుతున్న మేడ్చల్ జిల్లా పరిధిలో డయాలసిస్ సెంటర్ల వ్యాప్తి మాత్రం పుంజుకోలేదు. ఘట్కేసర్ ఏరియా ఆసుపత్రిలో ఉన్న 35 బెడ్స్ డయాలసిస్ కేంద్రం తప్ప స్థానికులకు మరేదీ అందుబాటులో లేదు. మేడ్చల్‌లో మరో సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు వైద్యాధికారులు అంటున్నారు. ప్రైవేటులో బిల్లు తడిసిమోపెడు... ప్రైవేటు ఆసుపత్రుల్లో డయాలసిస్ ఒక్క సిట్టింగ్‌కి కనీసం రూ.3వేల నుంచి రూ.4వేల వరకు వసూలు చేస్తున్నారు. దీంతో నిరుపేద, మధ్య తరగతి రోగులు తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. ‘వారానికి రెండుసార్లు తన మేనల్లుడికి డయాలసిస్ చికిత్స పొందేందుకు. ఆసుపత్రిలో స్లాట్‌ను పొందిన రహ్మెన్ మాట్లాడుతూ.. బహదూర్‌పురాలోని తమ ఇంటి దగ్గర అలాంటి సదుపాయం లేకపోవడంతో తమ 17 ఏళ్ల మేనల్లుడికి చికిత్స కోసం బంజారాహిల్స్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిని ఎంచుకున్నామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని రాజేంద్రనగర్‌లోని మా ప్రాంతానికి సమీపంలో ఎక్కడా అందుబాటులో లేకపోవడంతో కార్పొరేట్ ఆసుపత్రిలో సెషన్‌కు 3,500 రూపాయలకు పైగా ఖర్చు చేస్తూన్నా’మని చెప్పారామె. ఈ నేపథ్యంలో కిడ్నీ రోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మరిన్ని డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తీవ్ర ఇబ్బందుల్లో కిడ్నీ రోగులు ఇబ్బందుల పాలవుతున్న బాధితులు ప్రైవేట్‌లో వేలాది రూపాయలు పెట్టలేని దీనావస్థ డయాలసిస్ కేంద్రాలను పెంచాలని సర్కారుకు వినతి -
ఇక ఉద్దానం ‘సురక్షితం’
సాక్షి, అమరావతి: నలభై ఏళ్లుగా కిడ్నీ వ్యాధుల భయాలు వెంటాడుతున్న ఉద్దానం ప్రాంత ప్రజలకు భరోసా కల్పిస్తూ అక్కడకు వంద కి.మీ.పైగా దూరంలోని హిర మండలం రిజర్వాయర్ నుంచి సురక్షిత జలాలు కదిలాయి. భూగర్భ పైపులైన్ల ద్వారా ఉద్దానానికి నీటి తరలింపుపై గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు వారం రోజులుగా నిర్వహిస్తున్న తొలిదశ ట్రయల్ రన్ విజయవంతమైంది. దాదాపు 132 కి.మీ. మేర భూగర్భ పైపు లైన్‌ను నిర్మించగా మార్గమధ్యంలో మెలియాపుట్టి వద్ద నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటైంది. మొదటి దశలో 32 కి.మీ. పొడవున భూగర్భ పైపులైన్ ద్వారా నీటిని తరలించారు. రానున్న 15 రోజులలో నీటి శుద్ధి కేంద్రం నుంచి ఉద్దానం చివరి ప్రాంతం ఇచ్ఛాపురం వరకు వంద కిలోమీటర్ల పొడవున ప్రధాన భూగర్భ పైపు లైన్ ద్వారా నీటి తరలింపు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఏడాది పొడవునా ప్రతి ఇంటికీ.. దాదాపు 807 నివాసిత ప్రాంతాలకు కొళాయిల ద్వారా తాగునీటి సరఫరాకు ఉద్దానం ప్రాంతాన్ని పది క్లస్టర్లుగా వర్గీకరించారు. అక్కడ నివసిస్తున్న దాదాపు 8 లక్షల మంది ప్రజలకు ఏడాది పొడవునా ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీటి సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ట్రయల్ రన్‌కు ఐదు కోట్ల లీటర్లు.. ఉద్దానం తాగునీటి అవసరాల కోసం రోజూ 8.40 కోట్ల లీటర్ల చొప్పున హిర మండలం నుంచి తరలిస్తారు. ఇందుకోసం 1,300 హెచ్‌పీ సామర్థ్యంతో మూడు భారీ నీటి పంపింగ్ మోటార్లను హీర మండలం రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేశారు. మొదటి దశ ట్రయల్ రన్ కోసం ఐదు కోట్ల లీటర్లను మెలియాపుట్టి నీటి శుద్ధి కేంద్రం వద్దకు తరలించినట్లు అధికారులు తెలిపారు. మూడు మోటార్ల పనితీరును కూడా పరీక్షించారు. మాట ప్రకారం.. ఖర్చుకు వెనుకాడకుండా శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, పలాస అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని దాదాపు ఏడు మండలాల పరిధిలో ఉద్దానం ప్రాంతం విస్తరించి ఉంటుంది. స్థానికులను దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న కిడ్నీ వ్యాధుల సమస్యను పరిష్కరించేందుకు సీఎం జగన్ రూ.700 కోట్లతో ఉద్దానానికి సమగ్ర రక్షిత మంచినీటి పథకాన్ని మంజూరు చేయడం తెలిసిందే. ఏడాది పొడవునా నీరు అందుబాటులో ఉండటంతో ఖర్చుకు వెనుకాడకుండా హిర మండలం రిజర్వాయర్ నుంచి నీటి తరలింపు చేపట్టాలని నిర్ణయించారు. ఏడాది పొడవునా ఉద్దానం నీటి అవసరాలను తీర్చేందుకు ఒక టీఎంసీ కన్నా తక్కువ అవసరం కాగా హిర మండలం రిజర్వాయర్‌లో కనీస మట్టం స్ధాయిలోనూ 2.67 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుంది. ఈ పథకంలో భాగంగా రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వివిధ గ్రామాల్లో మొత్తం 571 ఓవర్ హెడ్ ట్యాంకులను ప్రభుత్వం నూతనంగా నిర్మించింది. -
AP: దిగులు లేదిక.. ఉద్దానం చెంతకు ఆధునిక వైద్యం
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా మందస మండలం లింబుగం గ్రామస్తుడైన తెవ్వయ్య ఐదేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. డయాలసిస్ చేయించుకుంటున్నాడు. టీడీపీ ప్రభుత్వ హయాంలో శ్రీకాకుళం జిల్లాలోని ఏ ప్రభుత్వ ఆస్పత్రిలోనూ కిడ్నీ వ్యాధులకు సరైన చికిత్స అందుబాటులో ఉండేది కాదు. దీంతో చికిత్స కోసం విశాఖకు వెళ్లేవాడు. సహాయకునితో కలిసి ఒక్కసారి విశాఖకు వెళ్లి రావాలంటే రవాణా, ఇతర ఖర్చుల రూపంలో రూ.వేలల్లో ఖర్చు అయ్యేది. చాలీచాలని పింఛన్, భార్య కూలిపనులకు వెళితే వచ్చే డబ్బుతో మందుల కొనుగోలు.. వెరసి వైద్యం చేయించుకోవడం తలకు మించిన భారంగా మారింది. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక లింబుగంకు మూడు కి.మీ దూరంలోని హరిపురం సీహెచ్‌సీలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశారు. డయాలసిస్‌కు వెళ్లాల్సిన రోజు 108కు ఫోన్ చేస్తే అంబులెన్స్ ఇంటి వద్దకే వచ్చి తెవ్వయ్యను ఆస్పత్రికి తీసుకెళ్లేది. నెఫ్రాలజిస్ట్ సమీపంలోని హరిపురం ఆస్పత్రికి షెడ్యూల్ ప్రకారం వస్తున్నారు. ఈ క్రమంలో ఏదైనా సమస్య ఉంటే వెంటనే వైద్యం అందుతోంది. మరోవైపు సీఎం జగన్ ఇతని పింఛన్‌ను రూ.10 వేలకు పెంచారు. వీటన్నింటికీ తోడు ఇప్పుడు త్వరలో పలాసలో కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలో తెవ్వయ్య మాట్లాడుతూ ‘నా లాగా మహమ్మారి జబ్బుతో బాధపడుతున్న వారికి సీఎం జగన్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. పింఛన్ రూ.10 వేలకు పెంపుతో ఆర్థికంగా అండగా నిలివడమే కాకుండా, మా ఊళ్లకు శుద్ధి చేసిన నీటిని అందించడానికి చర్యలు తీసుకున్నారు. మెరుగైన వైద్యాన్ని మాకు చేరువ చేశారు. ఇంతకంటే మాకేం కావాలి?’ అని ఆనందపడ్డాడు. ప్రభుత్వ చర్యల కారణంగా ఉద్దానం ప్రాంతంలో ఇలా ఎంతో మంది కిడ్నీ బాధితులకు ఊరట లభిస్తోంది. అత్యాధునిక ఆస్పత్రితో భరోసా కిడ్నీ వ్యాధులకు మూల కారణంగా భావిస్తున్న నీటి సమస్యకు చెక్ పెట్టడంతో పాటు వైద్య పరంగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. పలాసలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేపట్టారు. దీన్ని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. రూ.60 కోట్లతో నిర్మిస్తున్న రీసెర్చ్ సెంటర్, ఆస్పత్రి నిర్మాణ పనులు 85 శాతం మేర పూర్తయ్యాయి. తుది దశ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ర్యాంప్ బ్లాక్‌తో కలిపి మూడు బ్లాక్‌లుగా నాలుగు అంతస్తుల్లో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటవుతోంది. మొదటి అంతస్తులో క్యాజువాలిటీ, రేడియో డయాగ్నోసిస్, హాస్పిటల్ సోర్ట్స్, సెంట్రల్ ల్యాబ్స్ ఉంటాయి. రెండో అంతస్తులో నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, సర్జరీ, మూడో అంతస్తులో డయాలసిస్, నెఫ్రాలజీ వార్డులు, నాలుగో అంతస్తులో ఓటీ కాంప్లెక్స్, పోస్ట్ ఆపరేటివ్/ఐసీయూ, యూరాలజీ వార్డ్స్, రీసెర్చ్ ల్యాబ్స్ ఉంటాయి. వీటన్నింటి కారణంగా కిడ్నీ రోగులకు భరోసా లభించనుంది. అధునాత పరికరాల సమకూర్పు కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌కు అత్యంత అధునాతన పరికరాలను ప్రభుత్వం సమకూరుస్తోంది. కిడ్నీ వ్యాధులకు సంబంధించిన అన్ని రకాల చికిత్సలతో పాటు, పరిశోధనలు చేయడానికి వీలుగా పరికరాల సమకూర్పు ఉంటోంది. ఎంఆర్ఐ, సిటీ స్కాన్, 2డీ ఎకో, హైఎండ్ కలర్ డాప్లర్, మొబైల్ ఎక్సరే ► డిజిటల్, ఏబీజీ అనలైజర్ పరికరాలతో పాటు, ఫుల్లీ రిమోట్ కంట్రోల్ ఐసీయూ కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో ఉండనున్నాయి. మొత్తంగా 117 రకాల వైద్య పరికరాలను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ఇప్పటికే పలు పరికరాల సరఫరా కూడా మొదలైంది. రీసెర్చ్ సెంటర్లో శాశ్వత ప్రాతిపదికన 41 మంది స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్యుల నియామకానికి ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపింది. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ, ఇతర వైద్యులను ఇక్కడ నియమించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇలా.. ► గత ప్రభుత్వంలో తీవ్రమైన కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ.2,500 ఇచ్చే పెన్షన్‌ను సీఎం జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.10 వేలకు పెంచింది. ప్రతి నెల 1వ తేదీనే లబ్ధిదారుల గుమ్మం వద్దకు రూ.10 వేల చొప్పున వలంటీర్లు పెన్షన్ అందజేస్తున్నారు. ► టెక్కలి, పలాస, సోంపేట, కవిటి, హరిపురం ఆస్పత్రుల్లో 69 మెషిన్లతో డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. 2020లో హరిపురంలో డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభించారు. మరో 25 మిషన్లతో కొత్తగా గోవిందపురం, అక్కుపల్లి, కంచిలి, బెలగాంలో డయాలసిస్ సెంటర్లు మంజూరయ్యాయి. ఇలా వరుసగా 2019–20లో 37,454 సెషన్లు, 2020–21లో 46,162 సెషన్లు, 2021–22లో 54,520 సెషన్లు, 2022–23లో 55,708 సెషన్లు కిడ్నీ బాధితులకు డయాలసిస్ చేశారు. ► ఇచ్చాపురం, కంచిలి సీహెచ్‌సీ, పీహెచ్‌సీల్లో 25 మిషన్లతో డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ► కిడ్నీ వ్యాధులపై వైద్య పరీక్షల కోసం ఉద్దానం ప్రాంతంలోని 18 పీహెచ్‌సీలు, ఐదు యూపీహెచ్‌సీలు, ఆరు సీహెచ్‌సీల్లో సెమీ ఆటో ఎనలైజర్లు, ఎలక్ట్రోలైట్ ఎనలైజర్లు, యూరిన్ ఎనలైజర్లు అందుబాటులో ఉంచారు. ► టీడీపీ హయాంలో డయాలసిస్ రోగులకు 20 రకాల మందులే అందిస్తుండగా, అవి కూడా అరకొరగానే అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం ప్రతి ఆస్పత్రిలో 37 రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. ► కొత్త కేసుల గుర్తింపునకు వైద్య శాఖ నిరంతరాయంగా స్క్రీనింగ్ కొనసాగిస్తోంది. వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లలో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్‌వో)లకు ప్రత్యేకంగా ఒక యాప్‌ను రూపొందించారు. వీరు ఈ ప్రాంతంలోని ప్రజలను స్క్రీనింగ్ చేసి, అనుమానిత లక్షణాలున్న వారి నుంచి రక్త నమూనాలు సేకరించి దగ్గరలోని పీహెచ్‌సీలకు సీరమ్ క్రియాటిన్ పరీక్షలకు తరలిస్తున్నారు. ఇబ్బందులు తొలగిపోతాయి సంవత్సరం నుంచి నేను డయాలసిస్ చేయించుకుంటున్నాను. మా గ్రామానికి దగ్గరలోని హరిపురం ప్రభుత్వాస్పత్రిలో డయాలసిస్ సెంటర్ ఉండటంతో రవాణా, వ్యయ ప్రయాసలు లేవు. డయాలసిస్ చేయించుకోవడానికి వెళ్లాల్సిన రోజు 108కు ఫోన్ చేస్తే అంబులెన్స్ ఇంటి వద్దకు వచ్చి ఆస్పత్రికి తీసుకుని వెళుతోంది. ప్రభుత్వం రూ.10 వేల పెన్షన్ కూడా ఇస్తోంది. షెడ్యూల్ ప్రకారం నెఫ్రాలజిస్ట్ హరిపురంకు వస్తున్నారు. మిగిలిన రోజుల్లో ఏదైనా అనారోగ్య సమస్య వస్తే శ్రీకాకుళం వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు పలాసలో కిడ్నీ సెంటర్ ప్రారంభిస్తే ఆ ఇబ్బంది కూడా తొలగిపోతుంది. - శ్రీరాములు, కిడ్నీ వ్యాధిగ్రస్తుడు, బేతాలపురం, శ్రీకాకుళం జిల్లా నీళ్ల దిగులుండదిక.. కిడ్నీ వ్యాధి ప్రభావిత గ్రామాల్లో మా ఊరు కూడా ఒకటి. ప్రభుత్వం మా కోసం రక్షిత నీటి పథకం అందుబాటులోకి తెస్తోంది. పనులు దాదాపు పూర్తికావచ్చాయని చెబుతున్నారు. త్వరలో మా గ్రామానికి నీళ్లు వస్తాయి. బోర్ నీళ్లు తాగడం వల్లే కిడ్నీ జబ్బులు వస్తున్నాయని చాలా మంది చెప్పారు. దీంతో మేం పక్క ఊరి నుంచి సరఫరా చేస్తున్న ఫిల్టర్ నీళ్లు కొనుక్కుని తాగుతున్నాం. ప్రభుత్వమే ఉచితంగా కొళాయి ద్వారా మంచినీటిని సరఫరా చేయబోతుండటం మాకెంతో ఊరట కలిగిస్తోంది. ఇప్పటికే వృద్ధాప్య పింఛన్లు, అమ్మ ఒడి, పక్కా ఇళ్లు, ఇతరత్రా పథకాలతో మా ప్రాంత ప్రజలకు సీఎం జగన్ అండగా నిలిచారు. ఆ మహమ్మారి జబ్బుకు శాశ్వత పరిష్కారం చూపితే ఆయన మేలు ఎప్పటికీ మరువం. - ఎం.సరోజిని, రంగోయి, శ్రీకాకుళం జిల్లా వ్యాధిగ్రస్తులకు పెద్ద ఊరట కిడ్నీ రీసెర్చ్ సెంటర్ భవన నిర్మాణం తుది దశలో ఉంది. మరోవైపు వైద్య పరికరాలు సమకూరుస్తున్నాం. త్వరలోనే రీసెర్చ్ సెంటర్ అందుబాటులోకి వస్తుంది. భవన నిర్మాణం, పరికరాల సమకూర్పునకు కలిపి రూ.60 కోట్ల మేర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పెద్ద ఊరట లభిస్తుంది. - మురళీధర్ రెడ్డి, ఎండీ, ఏపీఎంస్ఐడీసీ -
80 కోట్ల మంది కిడ్నీ రోగులు, రిస్కు తగ్గిస్తున్న సముద్ర చేపలు.. కీలక విషయాలు
చమురు చేపలుగా పిలిచే సముద్ర చేపల్ని ఆహారంగా తీసుకుంటే దీర్ఘకాలిక రోగాలు దరిచేరవని ఇప్పటికే శాస్త్రీయంగా రుజువైంది. క్రమం తప్పకుండా చేపలు తినేవారిలో క్యాన్సర్, గుండెపోటు, మధుమేహం వంటి రోగాల బారినపడే ప్రమాదం తక్కువని తేలింది. కాగా, తీవ్రమైన కిడ్నీ రోగాల బారిన పడినవారు సముద్ర చేపల్ని తింటే 8 నుంచి 10 శాతం రిస్క్ తగ్గుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్‌కు చెందిన జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ యూనివర్సిటీ ఈ విషయాన్ని వెల్లడించింది. సాక్షి, అమరావతి: ప్రపంచ జనాభాలో 10 శాతం (80 కోట్ల) మంది తీవ్రమైన మూత్రపిండాల వ్యాధుల (క్రానిక్ కిడ్నీ డిసీజెస్)తో బాధపడుతున్నారు. మూత్రపిండాల వైఫల్యం మనుషుల మరణానికి కూడా దారి తీస్తోంది. ఇలాంటి వారికి సముద్ర చేపలు రిస్క్ తగ్గిస్తున్నాయని తేలింది. సముద్ర చేపల్లో అధికంగా ఉండే ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ మూత్రపిండాల సమస్యల నుంచి ఉపశమనం ఇస్తున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. మొక్కల నుంచి వచ్చే ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ కంటే సముద్ర చేపల్లో ఉండే యాసిడ్స్ ఎక్కువగా ప్రభావితం చూపిస్తున్నాయని ఆస్ట్రేలియాకు చెందిన జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ యూనివర్సిటీ పరిశోధనల్లో తేలింది. సముద్రంలో దొరికే కవ్వలు, కానాగంతలు (కన్నంగదాత), పొలస, మాగ వంటి వందకు పైగా చమురు చేపలు, సముద్రపు మంచి పీతలు తిన్న వారిపై జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ యూనివర్సిటీ పరిశోధనలు జరిపింది. ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే సముద్ర చేపల్ని తినడం వల్ల మూత్రనాళాలు శుభ్రపడతాయని, వాటిలో పేరుకుపోయే రాళ్లు, కొవ్వు పదార్థాలు బయటకు పోతాయని గుర్తించారు. 12 దేశాలకు చెందిన 25 వేల మందికి పైగా కిడ్నీ రోగాల బాధితులపై జరిపిన 19 రకాల అధ్యయనాల ఫలితాలను వర్సిటీ వెల్లడించింది. కచ్చితంగా ఏ చేపలు ఎక్కువగా మూత్రపిండాల వ్యాధుల రిస్క్‌ను తగ్గిస్తున్నాయో చెప్పలేకపోయినప్పటికీ.. వాటిలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ రక్తం స్థాయిలను పెంచడంలో ప్రభావం చూపిస్తున్నాయని గుర్తించారు. వారానికి రెండుసార్లు తింటే.. తీవ్రమైన కిడ్నీ వ్యాధుల బారినపడిన 49 నుంచి 77 ఏళ్ల వయసు వారిపై ఈ పరిశోధనలు జరిపారు. శరీరం బరువు, ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్నవారితో పాటు శారీరక దైనందిన కార్యకలాపాలు, గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. అధిక మోతాదులో సముద్ర చేపలు తిన్న వారిపై వివిధ రూపాల్లో పరిశోధనలు జరిపారు. ఈ చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ప్రభావం మూత్రపిండాల వ్యాధుల తీవ్రతను 8నుంచి 10 శాతం వరకు తగ్గించిందని గుర్తించారు. వారానికి కనీసం రెండుసార్లు సముద్ర చేపలు తింటే రోజుకు 250 మిల్లీగ్రాముల కన్నా ఎక్కువగా ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ సమకూరుతున్నట్టు తేల్చారు. అవి కిడ్నీ వ్యాధులు రాకుండా అడ్డుకట్ట వేస్తాయని.. ఒకవేళ కిడ్నీ వ్యాధులతో బాధపడుతుంటే రిస్క్ శాతం తగ్గుతోందని పరిశోధనల్లో వెల్లడైనట్టు శాస్త్రవేత్త డాక్టర్ మట్టిమార్క్ లుండ్ వెల్లడించారు. చమురు చేపలు/సముద్ర చేపలు ఆరోగ్యకరమైన ఆహారంగా సిఫార్సు చేస్తున్నట్టు ఇటీవల వర్సిటీ విడుదల చేసిన జర్నల్‌లో ఆయన పేర్కొన్నారు. -
కిడ్నీ రోగులకు మెరుగైన వైద్యం
ఎ.కొండూరు: కిడ్నీ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన వైద్యం అందిస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలంలోని కిడ్నీ ప్రభావిత గ్రామాల్లో ఆమె శనివారం పర్యటించారు. కృష్ణారావుపాలెం శివారు మాన్సింగ్, దీప్లా నగర్, గిరిజన తండాల్లోని కిడ్నీ వ్యాధిగ్రస్తులను పరామర్శించారు. వ్యాధి సోకటానికి కారణాలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. నూతనంగా నిర్మిస్తున్న డయాలసిస్ సెంటర్, పీహెచ్‌సీని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యాధిగ్రస్తులకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా స్థానిక పీహెచ్సీలో స్క్రీనింగ్ టెస్టులు చేయిస్తామని చెప్పారు. అవసరమైన వారికి విజయవాడలో 12 ప్రైవేటు ఆసుపత్రుల్లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించి, మందులు కూడా ఇస్తామని తెలిపారు. రోగుల కోసం శనివారం నుంచి ఇక్కడ ఒక వాహనం అందుబాటులో ఉంటుందన్నారు. స్థానిక పీహెచ్‌సీలోనే డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 104 వాహనం ద్వారా ప్రతి నెలా కిడ్నీ రోగులకు మందులు అందిస్తామని చెప్పారు. ప్రస్తుతం ఐదు తండాల్లో తాత్కాలికంగా ట్యాంకర్లతో తాగునీరు అందిస్తున్నామని, త్వరలో మరో 15 తండాల్లో రూ. 6 కోట్లతో పైపులైన్ల ద్వారా తాగునీరిస్తామని చెప్పారు. ఈ మండలానికి స్వచ్ఛమైన తాగు నీరు అందించడం కోసం రూ.38 కోట్లతో కృష్ణా జలాలను ఇంటింటికి అందిస్తామని, దీనికి టెండర్లు కూడా పూర్తయ్యాయని తెలిపారు. అనంతరం కిడ్నీ రోగుల కోసం ఏర్పాటు చేసిన వాహనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కె.రక్షణనిధి,తదితరులు పాల్గొన్నారు. కిడ్నీ వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు గుంటూరు మెడికల్: రాష్ట్ర ప్రభుత్వం కిడ్నీ వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు చెప్పారు. గుంటూరులో శనివారం జరిగిన నెఫ్రాలజిస్టుల రాష్ట్ర సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉద్దానంలో కిడ్నీ వ్యాధి ప్రబలడానికి కారణాలపై ఐసీఎంఆర్‌తో కలిసి పరిశోధనలు చేసినట్లు చెప్పారు. నొప్పి నివారణ మాత్రలు ఎక్కువగా వాడటం, తాగే నీటిలో సిలికాన్, హెవీ మెటల్స్ ఎక్కువగా ఉండటం, ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం కారణాలని తేలిందన్నారు. ఉద్దానంతోపాటు, ఎ.కొండూరులో కూడా కిడ్నీ కేసులు వెలుగులోకి వచ్చాయని, వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని అన్నారు. -
Telangana: ఆ ఊరికి ఏమైంది..?
ఆ ఊరును కిడ్నీవ్యాధి పీడిస్తోంది. అంతుచిక్కకుండా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఆ వ్యాధి సోకి పలువురు మృత్యుకోరల్లో చిక్కుకున్నారు. చాలామంది డయాలసిస్ కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. వైద్యానికి డబ్బుల్లేక మరికొందరు దీనంగా రోజులు వెళ్లదీస్తున్నారు. ఇదీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం భేతాళపాడు గ్రామపంచాయతీ పరిస్థితి. ఆ గ్రామపంచాయతీ పరిధిలోని పంతులుతండా, టాక్యాతండా, పీక్లాతండా, చీపురుగూడెం, రాచబండ్ల కోయగూడెం, రేగళ్లతండా గ్రామాల ప్రజలు కూడా ఈ వ్యాధితో పోరాడుతున్నారు. 2015 నుంచి ఇప్పటివరకు కిడ్నీ సంబంధితవ్యాధితో 28 మంది మృతి చెందారు. గత పదిరోజుల వ్యవధిలోనే పంతులుతండాలో గుగులోత్ దేవిజ్యా(58), ధరావత్ వీరు(38) మృత్యువాతపడ్డారు. ఈ పంచాయతీ పరిధిలో 18 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా పడకలు, వసతుల్లేక ప్రైవేట్ ఆస్పత్రుల్లో డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తోందని బాధితులు అంటున్నారు. – జూలూరుపాడు భద్రాద్రి జిల్లా భేతాళపాడులో అంతుచిక్కని కిడ్నీవ్యాధి ఏడేళ్లుగా ఇదే తంతు... : ఈ పంచాయతీ పరిధిలోని ప్రజలు ఏడేళ్లుగా కిడ్నీవ్యాధితో బాధపడుతున్నా, పలువురు పిట్టల్లా రాలిపోతున్నా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు ఈ వ్యాధి ఎందుకు వస్తుందో అంతుపట్టడం లేదని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. 2017లో ఒకే రోజు ఇద్దరు మృతి చెందడంతో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు నామమాత్రంగా స్పందించి, అక్కడి ప్రజల తాగునీటి శాంపిళ్లను పరీక్షించి ఫ్లోరైడ్ సమస్య లేదని తేల్చారు. ఆ తర్వాత కూడా కిడ్నీవ్యాధి నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ప్రజలు ఎందుకు కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారనే విషయాలను తేల్చడంలో ప్రభుత్వం, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. భేతాళపాడు, పంతులుతండా, టాక్యాతండా, పీక్లాతండా గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్య వల్లే కీళ్లు, ఒంటినొప్పులు, కాళ్లవాపులు రావడంతోపాటు కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డాక్టర్లు దయచూపాలె గత నాలుగేళ్లుగా భార్యాభర్తలిద్దరం కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాం. డయాలసిస్ చేస్తే చనిపోతావని, బలహీనంగా ఉన్నావని, మందులు వాడమని నాకు డాక్టర్లు చెప్పారు. నా భార్య లక్ష్మి కీళ్లనొప్పులు, ఒళ్లు, నడుము నొప్పుల బాధ భరించలేకపోతోంది. ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లే మాపై దయ చూపాలి. –బానోత్ పరశ్యా, పంతులుతండా వారానికి రెండుసార్లు డయాలసిస్ చేయించుకుంటున్నా రెండేళ్లుగా మూత్రపిండాలవ్యాధితో బాధపడుతున్నా. వారానికి రెండుసార్లు ఖమ్మం ఆస్పత్రికి వెళ్లి డయాలసిస్ చేయించుకుంటున్నా. నెలకు రూ.20 వేలు ఖర్చవుతున్నాయి. డయాలసిస్ కోసం కొత్తగూడెం, భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రులకు వెళితే పడకలు ఖాళీగా లేవని డాక్టర్లు అంటున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్దామంటే డబ్బుల్లేవు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే మెరుగైన వైద్యసేవలు అందేలా చూడాలి. – బానోత్ మంగ్యా, టాక్యాతండా రక్త నమూనాలు సేకరిస్తాం భేతాళపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజలు కిడ్నీవ్యాధితో బాధపడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. బాధితుల రక్త నమూనాలు సేకరించాలని పీహెచ్సీ డాక్టర్‌ను ఆదేశించాం. బ్లడ్ శాంపిల్స్‌ను టీ హబ్‌కు పంపిస్తాం. భేతాళపాడుతోపాటు తండాల్లో నీటి నమూనాలు కూడా సేకరించాలని చెప్పాం. అన్ని శాఖల సమన్వయంతో ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. – శిరీష, డీఎంహెచ్‌వో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా -
ఆ గ్రామంలో పెరుగుతున్న క్యాన్సర్, కిడ్నీ మరణాలు
సాక్షి, ఇంద్రవెల్లి(ఖానాపూర్): మండలంలోని శంకర్‌గూడ గ్రామస్తులను క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు పట్టి పీడీస్తున్నాయి. 15 ఏళ్లుగా గ్రామంలో సాధారణ మరణాల కంటే క్యాన్సర్, కిడ్నీ మరణాలే అధికంగా ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. క్యాన్సర్, కిడ్నీ వ్యా ధులతో తక్కువ వయస్సు ఉన్న వారు మృతి చెందుతుండడంతో శంకర్‌గూడ గ్రామస్తులు భ యాందోళనకు గురవుతున్నారు. అంతేకా కుం డా వ్యాధులు రావడానికి కారణాలు తె లియక సతమతమవుతున్నారు. మరణాలపై దృష్టి సారించాల్సిన వైద్య శాఖ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గత 15 ఏళ్లలో క్యాన్సర్‌తో 16 మంది.. మండలంలోని శంకర్‌గూడ గ్రామ జనాభా సుమారు 450. గిరిజన గిరిజనేతర 95 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈ గ్రామంలో గడిచిన 15 సంవత్సరాల కాలంలో వావల్కార్ లలితబాయి (45), గుట్టె ప్రకాష్(52), గుట్టె రామరావ్(62), దేవ్కతే అంజనాబాయి (45), అబ్దుల్ హక్(40), జాధవ్ దర్గాజీ (60), గుబ్నార్ నిలాబాయి(45), కోరెంగా మెగ్నాథ్(41), వవాల్కర్ లలిత(40), మదినే ముక్తబాయి (60), పెం దోర్ శ్యామ్‌బాయి(45), ఆడ కర్ణుబాయి(50)లు క్యాన్సర్ వ్యాధితో మృతి చెందడంతో పాటు ఒకే కుటుంబానికి చెందిన తల్లి, కొడుకు, కోడలు జవాదే బార్జబాయి(60), జవాదే బా లాజీ(42), జవాదే శకుంతలబాయి(40)లు సహితం క్యాన్సర్ బారిన పడి మృతి చెందారు. కాగా ఈ నెల 12న గుబ్నార్ సతీష్(34)లు క్యా న్సర్‌తో మృతి చెందాడు. వీరే కాకుండా పలు వురు క్యాన్సర్‌తో పోరాటం చేస్తున్నారు. దుర్గం పోశమ్మబాయి(60) క్యాన్సర్ వ్యాధితో మంచం ప ట్టగా, వవాల్కార్ గాయబాయి(50) క్యాన్సర్ బారిన పడి హైదరాబాద్ యశోధ ఆస్పత్రిలో చి కిత్స పొందుతున్నారు. కిడ్నీ వ్యాధితో ముగ్గురు మృతి.. అదేవిధంగా కిడ్నీ వ్యాధితో కుడా ఇప్పటి వరకు చరక్ వెంకటి(45), జయబాయ్ కొండబాయి(50), వవాల్కర్ సందిపాన్(45)లు మరణిం చారు. చరక్ విష్ణుకాంత్(40), మదినే ప్రేమ్బా యి(50), అర్జునే మలాన్బాయి(52), పాండ్గే రుఖ్మబాయి(48)లు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. కొందరు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా మరికొందరి ఆరో గ్యం విషమించి గ్రామంలో మంచాలకు పరి మితమయ్యారు. తక్కువ వయస్సులోనే అనేక మంది మృతి చెందడంతో అనేక కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయాయని వాపోతున్నారు. వ్యాధులు రావడానికి కారణాలు..? క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు రావడానికి అసలు కారణాలు తెలియకపోవడంతో శంకర్‌గూడ గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. అయితే గ్రామంలో వ్యాధులు రావడానికి ముఖ్యంగా చేతిపంపుల కలుషిత నీరే కారణమని, గ్రామంలో ఉన్న చేతి పంపుల్లో సున్నపు (తెల్లని) రంగుతో కూడిన బురద నీరు వస్తుందని, ఆ నీరు తాగిన వారు అనారోగ్యానికి గురి కావడంతో పాటు క్యాన్సర్, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారని, పరిస్థితి విషమిస్తే మరణిస్తున్నారని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులు ఇప్పటివరకు మరణాలకు గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఇప్పటికైన జిల్లా అధికారులు దృష్టి సారించి గ్రామంలో వ్యాధులు రావడానికి గల కారణాలను తెలుసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. వైద్య నిపుణులు నీటిని పరీక్షించాలి మా గ్రామంలో ప్రతి ఏడాది క్యాన్సర్, కిడ్నీ వ్యాధుల మరణాలు పెరుగుతున్నాయి. ఇప్పటికైన జిల్లా అధికారులు దృష్టి సారించి వైద్య నిపుణులతో గ్రామంలో తాగు నీటిని పరిక్షించాలి. వ్యాధులు రావడానికి గల అసలు కారణాలను గుర్తించాలి. – ఆత్రం అశోక్, గ్రామస్తుడు వైద్య ఖర్చులు భరించలేకపోతున్నాం మా తల్లి వవాల్కర్ గాయబాయి గత రెండేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది. అనేక ఆస్పత్రుల్లో వైద్యం చేయించాను. ప్రస్తుతం హైదరాబాద్‌లోని యశోధ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. వైద్యం ఖర్చులు భరించలేక పోతున్నాం. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి. – వవాల్కర్ రమాకాంత్, గ్రామస్తుడు -
తాగినా.. టాబ్లెట్ తీసుకున్నా కిడ్నీ గోవిందా..!
మూత్రపిండాల ఆరోగ్యాన్ని దెబ్బతీసే వాటిల్లో ప్రధానమైనవి కొందరు తాము రోజూ అలవాటుగా తీసుకునే మద్యం. దాంతో పాటు మనం డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకునే ఆన్ కౌంటర్ మందులు కూడా. ఈ రెండిటిలోనూ చీప్‌లిక్కర్ అన్నది కిడ్నీలను దెబ్బతీస్తుందని మనం చాలాసార్లు వింటూనే ఉంటాం. చాలా మంది కిడ్నీ బాధితుల్లో ఇదో ప్రధానమైన కారణం. సాధారణంగా మన రక్తంలోని మలినాలను శుభ్రపరచడం అన్నది కిడ్నీల పని కదా. చీప్లిక్కర్లో మత్తును సమకూర్చడానికి వేసే వివిధ రకాల రసాయనాలు, యూరియా వంటి వాటిని రక్తం నుంచి ఒంట్లోంచి తొలగించడానికి కిడ్నీలు తమ సామర్థ్యానికి మించి కష్టపడతాయి. అవెంతగా కష్టపడతాయంటే... అలా మలినాలనూ, కాలుష్యాలనూ తొలగిస్తూ, తొలగిస్తూ, తమ సామర్థ్యాన్ని క్రమంగా కోల్పోతుంటాయి. దాంతో ఒక దశలో అవి కాలుష్యాలనే తొలగించలేని స్థితికి చేరుకుంటాయి. దీన్నే కిడ్నీ ఫెయిల్యూర్‌గా చెబుతుంటారు. ఇదే పరిణామం మద్యం వల్ల కూడా వస్తుంది. వాస్తవానికి మద్యం అంటేనే కూడా బాటిలెత్తు కాలుష్యం. దాంతో ఆ కలుషిత పదార్థాలను తొలగించే ప్రక్రియను నిరంతరాయం చేస్తూ చేస్తూ కిడ్నీలు అలసిపోతాయి. ఇక ఆన్ కౌంటర్ డ్రగ్స్‌గా మనం పేర్కొనే మందులతోనూ ఇదే అనర్థం కలుగుతుంది. ఆ మందులలోని మలినాలను తొలగించడానికి కిడ్నీలు కష్టపడతాయి. మందులలోని ఆ మాలిన్యాలను తొలగించేలోపే మళ్లీ వేసుకున్న మందులలోని కాలుష్యాలు మూత్రపిండాలను దెబ్బతీస్తాయి. గంటకు 12 లీటర్లను మాత్రమే శుభ్రపరచగలిగే ఈ కిడ్నీలు మరి అంతటి కాలుష్యాల పోగులను శుభ్రం చేయాలంటే ఎంత కష్టం? అందుకే అంతటి కష్టాన్ని భరించలేనంతటి భారం వాటిమీద పడుతున్నప్పుడు మూత్రపిండాలకు ‘క్రానిక్ కిడ్నీ డిసీజ్’ (సీకేడీ) లాంటి జబ్బులు వస్తాయి. అవి కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి కండిషన్లకు దారితీస్తాయి. అలాంటప్పుడు కృత్రిమంగా కేవలం కొద్దిమేరకు అంటే మనిషి జీవించి ఉండగలిగే మేరకు మాత్రమే ఒంట్లోని కాలుష్యాలను యంత్రాల సహాయంతో తొలగించే ప్రక్రియ అయిన ‘డయాలసిస్’తో నిత్యం నరకబాధలను చూస్తూ రోజులు రోజుల ప్రాతిపదికన రోగులు తమ ప్రాణాలను దక్కించుకుంటూ ఉంటారు. ఇలాంటి బాధలేమీ పడకుండా నిండా ఆరోగ్యంతో నిండు నూరేళ్లు జీవితం గడపాలంటే మద్యం అలవాటు మానేయాలి. అలా రెండంటే రెండు కిడ్నీలను పదిలంగా చూసుకోవాలి. ఇక నొప్పి భరించలేనంతగా ఉండటమో లేదా మర్నాడు డాక్టర్ దగ్గరికి వెళ్లేలోపు కాస్త ఉపశమనంగానో తప్ప... అలవాటుగా ఆన్ కౌంటర్ డ్రగ్స్ వాడనేకూడదని గుర్తుంచుకోండి. -
మసూద్‌కు సైనిక ఆస్పత్రిలో చికిత్స
న్యూఢిల్లీ: ఉగ్ర సంస్థలకు, పాక్ సైన్యానికి ఉన్న సంబం ధం మరోసారి తేటతెల్లమైంది. ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ అధినేత మసూద్ అజార్‌కు ఏకంగా రావల్పిండిలోని సైనిక ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని ఆ దేశ అధికారులే స్వయంగా ఒప్పుకున్నారు. కరుడు గట్టిన ఉగ్రవాది, జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజార్(50) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మూత్ర పిండాల వ్యాధితో అతడికి రావల్పిండిలోని సైనిక ఆస్పత్రిలో ప్రతిరోజూ డయాలసిస్ జరుగుతోందని పాక్ అధికారులు వెల్లడించారు. మసూద్ తమ దేశంలోనే ఉన్నట్లు ఒప్పుకోవడంతోపాటు తమకు టచ్‌లోనే ఉన్నాడనే విషయాన్ని కూడా పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మూద్ శుక్రవారం స్వయంగా అంగీకరించిన విషయం తెలిసిందే. ‘మూత్ర పిండాలు పనిచేయకపోవడంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రధాన సైనిక కార్యాలయం రావల్పిండిలోని సైనిక ఆస్పత్రిలో రోజూ ఆయనకు డయాలసిస్ జరుగుతోంది’అని అధికారులు తెలిపారు. పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మూద్ శనివారం ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలు వెల్లడించారు. పుల్వామా ఘటనకు బాధ్యుడైన మసూద్‌పై చర్యలు ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్నకు మంత్రి.. ఆ ఆరోపణను జైషే మొహమ్మద్ సంస్థ కొట్టిపారేసిందంటూ బదులిచ్చారు. అయితే, పుల్వా మా ఘటన వెనుక తామే ఉన్నామంటూ ఆ సంస్థ ప్రకటించింది కదా అని పేర్కొనగా ఆ సంస్థ పాత్ర ఉందనే విషయం గట్టిగా చెప్పలేమనీ, దానిపై కొన్ని అనుమానాలున్నాయన్నారు. అవిఏమిటనే ప్రశ్నకు మంత్రి ఖురేషి.. తమ ప్రభుత్వం జైషే నాయకులతో మాట్లాడగా వారు ఖండించారని వివరించారు. నిషేధిత సంస్థ నాయకులతో ఎవరు మాట్లాడారన్న ప్రశ్నకు ఆయన.. ‘ఇక్కడి ప్రజలు, వారిని గురించి తెలిసిన వారు’ అంటూ చెçప్పుకొచ్చారు. ఇలా ఉండగా, కరుడు గట్టిన ఉగ్రవాది జైషే మొహమ్మద్ అధినేత ఇంట్లో నుంచి కూడా బయటకు రాలేని అనారోగ్య స్థితికి చేరుకున్నారని పాక్ అధికారులు వెల్లడించారు. ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు శుక్రవారం మంత్రి ఖురేషి తెలిపిన విషయం తెలిసిందే. జీహాద్ ప్రచారంలో దిట్ట మజూద్ అజార్ నేతృత్వంలోని జైషే మహ్మద్ సంస్థ కశ్మీర్ యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తోంది. 2001లో భారత పార్లమెంట్‌పై దాడికి యత్నించింది. 2016లో పఠాన్‌కోట్‌లోని వైమానిక స్థావరంతోపాటు, ఉడిలోని సైనిక క్యాంపుపై దాడికి పాల్పడింది. కశ్మీర్లో బలగాలపై దాడులకు పాల్పడేందుకు ఉగ్రవాదులకు బాలాకోట్, ఖైబర్ ఫక్తున్వాల్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపే ఆధారాలను భారత ప్రభుత్వం ఇటీవల పాక్‌కు అందజేసింది కూడా. ఈ సంస్థను అగ్ర దేశాలు నిషేధించాయి. అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌కు సన్నిహితుడైన మసూద్‌ను భారత్ కస్టడీ నుంచి విడిపించుకునేందుకు ఉగ్రవాదులు ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని 1999లో కాందహార్‌కు దారి మళ్లించిన విషయం తెలిసిందే. జైలు నుంచి బయటకు వచ్చాక అతడు జైషే మొహమ్మద్‌ను స్థాపించాడు. 1979–1989 సంవత్సరాల మధ్య అఫ్గానిస్తాన్‌లో తిష్టవేసిన సోవియెట్ రష్యా సేనలకు వ్యతిరేకంగా జరిగిన పోరులో మసూద్ గాయపడ్డాడు. అనంతరం కరడుగట్టిన చాందసవాదిగా మారిన అతడు ఉగ్ర సంస్థ హర్కతుల్ అన్సార్ కీలక నేతగా మారాడు. మంచి వక్త కూడా అయిన మసూద్ జీహాద్(పవిత్ర యుద్ధం)ను ప్రపంచవ్యాప్తం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతికి కారణమైన ఆత్మాహుతి దాడి కూడా తన సభ్యులేనంటూ ఈ సంస్థ ప్రకటించుకుంది. దీంతో అజార్ బావమరిది మౌలానా యూసఫ్ అజార్ నేతృత్వంలో నడుస్తున్న బాలాకోట్‌లోని జైషే మొహమ్మద్ సంస్థ స్థావరంపై భారత వైమానిక దళం మెరుపుదాడులు చేపట్టి, తీవ్ర నష్టం కలిగించిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. భారత్‌తో యుద్ధం ఆగదు..: జైషే భారత్–పాక్ దేశాల మధ్య సంబంధాలకతీతంగా భారత్‌కు వ్యతిరేకంగా పవిత్ర యుద్ధం (జీహాద్) కొనసాగుతుందని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ తీర్మానించిందని భారత నిఘా వర్గాల నివేదికలు వెల్లడించాయి. 2017 నవం బర్ 17న పాక్‌లోని ఒకారాలో జరిగిన సమావేశంలో జైషే ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పుల్వామా ఆత్మాహుతి దాడి కుట్రదారుడు, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ సారథ్యం లో నిర్వహిస్తోన్న ఉగ్రవాద కార్యకలాపాల పట్ల సమావేశంలో పాల్గొన్న సభ్యులు పొగడ్తల వర్షం కురిపించారని భారత నిఘా వర్గాలు తెలిపాయి. సరిహద్దుల్లో సేకరించిన సమాచారాన్ని బట్టి జైషే మహ్మద్ సంస్థ తన ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తూ, ఘజ్వా–ఎ–హింద్ (భారత్‌పై ఆఖరి పోరాటం) సాగించాలని ఆ సమావేశాల్లో తీర్మానించింది. జైషే మహ్మద్ సంస్థ నాయకులు అబ్దుల్ రవూఫ్ అస్ఘర్, మహ్మద్ మసూద్, అబ్దుల్ మాలిక్ తాహీర్‌లు ఈ ఉగ్రవాద సమావేశాలను ఉద్దేశించి మాట్లాడినట్టు కూడా నిఘా సంస్థలు వెల్లడించాయి. 2018లో ఆరు రోజుల పాటు జైషే మహ్మద్ ‘షోబే తారఫ్’(డిపార్టమెంట్ ఆఫ్ ఇంట్రడక్ష న్) 65 మంది ఉలేమా (మతగురువు)లతో సహా 700ల మంది ప్రతినిధులతో 13 సమావేశాలు నిర్వహించినట్టు నిఘావర్గాల నివేదికలు బయటపెట్టాయి. మత గురువుల హర్షం...: జైషే సంస్థ 2018, మార్చిలో షోబ–ఎ–తారిఫ్ ఉగ్రవాద సంస్థ ప్రతినిధులు సియాల్ కోట్ జిల్లాలో 4 రోజుల పాటు 1,500ల మందితో 17 సమావేశాలు నిర్వహించినట్లు తెలిసింది. వీటికి హాజరైన 50 మంది మతగురువులు సమావేశాల పట్ల హర్షంవ్యక్తం చేసినట్టు సమాచారం. -
కిడ్నీ బాధిత భారతం
ఆయా సంస్థలు దేశంలో 52,273 మంది వ్యాధిగ్రస్తులను సర్వే చేశాయి. ప్రాంతం, సామాజిక ఆర్థిక స్థాయిల వారీగా అధ్యయనం చేశాయి. అందులో తూర్పు భారతం నుంచి 5,768 మంది వ్యాధికి గురికాగా, ఉత్తర భారతం నుంచి 14,588 మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఇక ఈశాన్య భారతం నుంచి 13,362 మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు. అయితే అత్యధికంగా దేశంలో దక్షిణ భారతం నుంచే 18,555 మంది మూత్రపిండాల వ్యాధికి గురయ్యారు. దక్షిణాది నుంచి వ్యాధికి గురైన వారిలో నెలకు రూ.5 వేలలోపు ఆదాయం ఉన్నవారు ఏకంగా 44.3% ఉండటం గమనార్హం. అలాగే రూ.20 వేలలోపు ఆదాయం గల 42.9% మందికి కిడ్నీ వ్యాధి సోకింది. మిగిలిన 12.7% మంది నెలకు రూ.20 వేలకు పైగా ఆదాయం గల వారున్నారని నివేదిక తెలిపింది. ఇక దక్షిణాదిలోనే షుగర్ కారణంగా కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నవారు 32.9 శాతమున్నారు. బీపీ ద్వారా కిడ్నీ వ్యాధి బారిన పడినవారు 11.8% మంది ఉన్నారు. 2040 నాటికి నాలుగో స్థానం 2016 లెక్కల ప్రకారం దేశంలో అత్యధికంగా గుండె సంబంధిత వ్యాధులకు గురవుతున్నవారే ఎక్కువగా ఉన్నారు. అదే దేశంలో మొదటిస్థానంలో ఉన్న వ్యాధిగా నివేదిక తెలిపింది. ఆ తర్వాత పక్షవాతం రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో ఊపిరితిత్తుల వ్యాధి ఉంది. అలా 16వ స్థానంలో కిడ్నీ వ్యాధి ఉంది. కానీ 2040 నాటికి కిడ్నీ వ్యాధి నాలుగో స్థానానికి వచ్చే ప్రమాదముందని హెచ్చరించింది. గుండె, పక్షవాతం, ఊపిరితిత్తుల వ్యాధి తర్వాత కిడ్నీ వ్యాధి అత్యంత ప్రమాదకరంగా తయారయ్యే ప్రమాదముందని తెలిపింది. తెలంగాణలో తక్కువే హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, సిక్కిం, నాగాలాండ్, గోవా, కేరళ రాష్ట్రాల్లో బీపీ బారినపడిన వారు అధికంగా ఉన్నారు. ఆయా రాష్ట్రాల్లో 26% మందికిపైగా బీపీతో బాధపడుతున్నారు. ఉత్తరాఖండ్, అసోంలో 24 నుంచి 26% ఉన్నారు. తెలంగాణ, రాజస్తాన్, యూపీ, మిజోరం రాష్ట్రాల్లో బీపీ రోగులు తక్కువగా ఉన్నారు. ఈ రాష్ట్రాల్లో 18%లోపు మాత్రమే బీపీతో బాధపడుతున్నారు. అయితే అధిక కొవ్వుతో బాధపడేవారు తెలంగాణలో ఏకంగా 22 నుంచి 25.4 %మంది ఉన్నారు. కిడ్నీ రోగులకు వైద్యుల కొరత.. కిడ్నీ వ్యాధి విస్తరిస్తున్నా ఆ మేరకు రోగులకు చికిత్స చేసే నెఫ్రాలజిస్టులు (కిడ్నీ వైద్య నిపుణులు) మాత్రం ఆ స్థాయిలో లేరు. ప్రస్తుతం దేశంలో కోటి మందికి కిడ్నీ వ్యాధి ఉండగా, వారికి చికిత్స చేయాలంటే కనీసం 30 నుంచి 40 వేల మంది నెఫ్రాలజిస్టులు కావాలి. కానీ ఇప్పుడు 5 వేల మంది రోగులకు ఒక నెఫ్రాలజిస్టు మాత్రమే ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లోనైతే అసలు నెఫ్రాలజీ వైద్యులే లేరంటే మరీ దారుణం. తెలంగాణలో 200 మంది నెఫ్రాలజిస్టులు ఉన్నారని వైద్య వర్గాల అంచనా. ఫిజీషియన్ల పాత్ర కీలకం దేశంలో నెఫ్రాలజిస్టుల కొరత ఉన్నమాట నిజమే. కాబట్టి ఆ మేరకు కిడ్నీ వ్యాధిని గుర్తించడంలో, అవసరమైన మేరకు చికిత్స చేయడంలో ఫిజీషియన్లు కూడా కీలకంగా ఉండాలి. రోగుల్లో వస్తున్న మార్పులను గుర్తించాలి. కిడ్నీ వ్యాధి ఉన్నట్లు అనుమానం ఉంటే పరీక్షలు చేయించాలి. – డాక్టర్ తాడూరి గంగాధర్, నెఫ్రాలజిస్ట్, నిమ్స్ కుటుంబంలో ఎవరికైనా ఉంటే అనుమానించాలి షుగర్, బీపీ వంటివి ఉంటే కిడ్నీ పరీక్ష చేయించుకోవాలి. అలాగే కుటుంబంలో ఎవరికైనా ఉంటే తప్పనిసరిగా టెస్ట్ చేయించుకోవాలి. రక్త, మూత్ర పరీక్షలు చేయించుకోవాలి. అల్ట్రాసౌండ్ పరీక్ష కూడా అవసరం. ముందుగా కిడ్నీ వ్యాధిని గుర్తిస్తే త్వరగా నయం చేయడానికి వీలు కలుగుతుంది.–డాక్టర్ కార్తీక్, నెఫ్రాలజిస్ట్, నిమ్స్ -
వాయుకాలుష్యంతో కిడ్నీ వ్యాధుల ముప్పు
లండన్ : విషవాయువులతో శ్వాసకోశ సమస్యలు ఎదురవుతాయని పలు అథ్యయనాలు వెల్లడవగా, వాయు కాలుష్యం తీవ్ర కిడ్నీ వ్యాధులకు దారితీస్తుందని తాజా అథ్యయనం పేర్కొంది. కిడ్నీ పనితీరుపై గాలిలోని హానికారక పదార్ధాలు ప్రతికూల ప్రభావం చూపుతాయని యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ చేపట్టిన అథ్యయనం వెల్లడించింది. పొగతాగడం తరహాలోనే హానికారక పదార్ధాలు కలిగిన వాయు కాలుష్యం ద్వారా నేరుగా మూత్రపిండాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని అధ్యయన రచయిత జెన్నిఫర్ బ్రాగీషమ్ స్పష్టం చేశారు. కిడ్నీల నుంచి పెద్ద మొత్తంలో రక్తం ప్రవహిస్తుందని, ఈ ప్రక్రియలో ప్రవాహ వ్యవస్థకు చిన్నపాటి విఘాతం కలిగినా తొలుత కిడ్నీలపై ప్రభావం పడుతుందని చెప్పారు. కాలుష్య ప్రాంతాల్లో నివసించే మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం వంటి హైరిస్క్ రోగులు కాలుష్యం బారిన పడకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. స్వచ్ఛమైన గాలి వీచే ప్రాంతాలతో పోలిస్తే కాలుష్య ప్రాంతాల్లో మూత్రపిండాల వ్యాధులు సహజంగానే అధికమని అథ్యయనం పేర్కొంది. -
పది నెలలైనా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వలేదు
తన తండ్రి కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మృతి చెందారని, ఆయనకు రూ.8 లక్షల వరకు ఖర్చు అవ్వడంతో సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్నా ఇవ్వలేదని జగన్ వద్ద తుని మండలం రామకృష్ణా కాలనీకి చెందిన ఎం.వీరపాండు ఆవేదన వ్యక్తం చేశాడు. పది నెలల కిత్రం సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసినా పట్టించుకోవడం లేదన్నాడు. పేద కుటుంబమైన మేము అప్పులు చేసి నాన్నగారికి వైద్యం చేయించామన్నాడు. సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరాడు. -
మమ్మల్ని ఆదుకోరూ..
సుజాతనగర్: కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించాడు... ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు కూడా చేశాడు.. కాని విధి వక్రీకరించి ప్రస్తుతం అనారోగ్యంతో మంచానపడ్డాడు. కుటుంబ బాధ్యత నెత్తికెత్తుకున్న మరో కూతురు విద్యుదాఘాతంతో మృతి చెందింది. కూతురిని కాపాడబోయి తల్లి కూడా విద్యుదాఘాతానికి గురైంది. దీంతో ఒక చేయి పనిచేయడం లేదు. కుటుంబ పోషణే భారమైన తరుణంలో ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారీ నిరుపేద దంపతులు సుజాతనగర్ మండలం సింగభూపాలేనికి చెందిన ఉగ్గం వెంకటేశ్వర్లు, భార్య సత్యవతికి ముగ్గురు కూతుళ్లు. కూలీనాలి చేసుకోవడంతోపాటు ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. ఏడాది క్రితం అనారోగ్యం పాలయ్యాడు. నిరుపేద కుటుంబానికి చెందిన వెంకటేశ్వర్లు అప్పోసప్పో చేసి వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. ఒక కిడ్నీ పాడైందని వైద్యులు చెప్పడంతో ఆర్థికస్థోమత అంతంతమాత్రంగా ఉన్న వెంకటేశ్వర్లు మెరుగైన వైద్యం చేయించుకోలేకపోయాడు. దీంతో రెండో కిడ్నీసైతం చెడిపోయింది. ప్రస్తుతం వెంకటేశ్వర్లు మంచానికే పరిమితమై తన పనులు కూడా తాను చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఒకరి ఊతం లేనిదే మంచం పైనుంచి లెగిసే పరిస్థితి లేదు. తల్లిదండ్రుల బాధ చూడలేని పెద్దకూతురు అరుణ ఇంటి బాధ్యతను స్వీకరించి తాను కూడా కూలీకి వెళ్తూ, కాయగూరలు అమ్ముతూ బతుకుబండిని నెట్టుకొస్తుండేది. విధి వక్రించి ఇంటి పనులు చేసుకుంటున్న తరుణంలో అరుణ ఇంట్లోనే విద్యుదాఘాతానికి గురైంది. కూతురిని రక్షించే క్రమంలో తల్లి సత్యవతి కూడా విద్యుత్ షాక్‌కు గురైంది. ఈ ప్రమాదంలో అరుణ అక్కడికక్కడే మరణించగా, సత్యవతికి కుడిచేయి సరిగ్గా పనిచేయని స్థితికి చేరుకోవడంతోపాటు కాలి వేళ్లు కూడా తెగిపోయాయి. సంవత్సర కాలం నుంచి జీవనం సాగించడానికి ఆ దంపతులిద్దరూ పడే వేదన వర్ణణాతీతం. పూట గడవడమే కష్టంగా ఉన్న దంపతులకు అనారోగ్యం మరింత కుంగదీస్తోంది. కూలీపనులు సైతం చేసుకునే పరిస్థితిలో లేని సత్యవతి చుట్టుపక్కలవారి సాయంతో రోజులు నెట్టుకొస్తోంది. మెరుగైన వైద్యానికి డబ్బులు లేకపోవడంతో భర్త ఆరోగ్య పరిస్థితి రోజురోజుకీ క్షీణిస్తుండటంతో కన్నీటిపర్యంతమవుతోంది. ఉండటానికి కనీసం సరైన ఇళ్లు కూడా లేక పూరిగుడిసెలోనే జీవనం సాగిస్తున్నారు. తన భర్తకు మెరుగైన వైద్యం అందితే కుటుంబ పోషణ బాగుంటుందని భార్య సత్యవతి ఆవేదన వ్యక్తం చేస్తుంది. దాతలు ఉంటే సాయం చేయాలంటూ ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది. -
పవన్ వ్యాఖ్యలపై స్పందించిన నారా లోకేశ్
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ సమస్యపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేశ్ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘పవన్ కల్యాణ్ గారికి తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారు. కిడ్నీ సమస్య ఉన్న పలాస, వజ్రపు కొత్తూరు, కవిటి, సోంపేట, కంచిలి, ఇచ్చాపురం, మందసాలో సుమారు 16 కోట్ల నిధులతో ఏడు ఎన్టీఆర్ సుజల మదర్ ప్లాంట్స్ ఏర్పాటు చేశాం. వీటి ద్వారా 80 గ్రామాల్లో 238 నివాస ప్రాంతాల్లో సురక్షిత తాగునీటి సరఫరా జరుగుతోంది. 136 రిమోట్ డిస్పెన్సింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వం ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్లలలో డయాలసిస్ పొందుతున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ.2500 పెన్షన్ అందిస్తున్నాం. నాలుగు నెలల్లో 15 మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేసి, ఇప్పటివరకూ లక్షమందికి పైగా స్ర్కీనింగ్ జరిగింది. సోంపేటలో నూతన ల్యాబ్ ఏర్పాటు చేసాం. ప్రజలకు అందుబాటులో ఉండేలా పలాస, సోంపేట, పాలకొండలో మూడు రినల్ డయాలసిస్ సర్వీస్ సెంటర్లు ఏర్పాటు చేశాం. జార్జ్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో కిడ్నీ వ్యాధి రావడానికి గల కారణాలపై పరిశోధన, వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం ప్రారంభమైంది. ఒక నిర్ణయానికి వచ్చేముందు క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు బేరీజు వేసుకోవాలి.’ అని సూచించారు. Our Government is making an honest effort to get to the root of CKD problem and is doing everything to safeguard the health of those affected. I request all to kindly verify the facts before jumping into conclusions. — Lokesh Nara (@naralokesh) 23 May 2018 కాగా ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం సరైన విధివిధానాలు 48 గంటల్లో ప్రకటించాలని.. లేని పక్షంలో నిరసన దీక్షకు కూర్చుంటానని ఏపీ ప్రభుత్వానికి పవన్ అల్టిమేటం జారీ చేసిన విషయం విదితమే. -
సాయం చేయండి..ఊపిరి పోసుకుంటా
అసలే పేదరికం.....వృద్ధాప్యంలో బాగోగులు చూసుకుంటాడనుకున్న కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో కిడ్నీ సమస్య తీవ్రమైంది.ఆర్థిక సమస్యలతో డయాలసిస్ చేయించుకోలేకఇబ్బంది పడుతున్నాడు. దాతలు సాయం చేస్తే ఊపిరి పోసుకుంటానని వేడుకుంటున్నాడు. సున్నపురాళ్లపల్లి (రాజంపేట టౌన్) : రాజంపేట మండలం సున్నపురాళ్ళపల్లె గ్రామానికి చెందిన జి.వెంకటేష్ అలియాస్ ఉమర్‌బాషా రెండేళ్ల క్రితం కిడ్నీ వ్యాధి బారిన పడ్డాడు. వయసులో ఉన్నప్పుడు ఏదో ఒక వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ముగ్గురు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేశాడు. వయస్సు పైబడటం, దానికి తోడు ఆరోగ్యం సహకరించక పోవడంతో ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఏడాదిన్నర క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉమర్‌బాషా కుమారుడు మృతి చెందడంతో ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. ఈ నేపథ్యంలో ఉమర్‌బాషాకు కిడ్నీ సమస్య అధికమైంది. రెండు నెలలుగా మూడు రోజులకోసారి డయాలసిస్ చేసుకోవాల్సిన పరిస్థితి. బంధువులు, తెలిసిన వారు, స్నేహితుల సహకారంతో కడపలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. ఒకసారి డయాలసిస్ చేయించుకుంటే రెండు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందని బాధితుడు చెబుతున్నాడు. సకాలంలో డబ్బులు లభించకుంటే వారం రోజుల వరకు డయాలసిస్ చేయించుకోకుండా ఉండిపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దాతలు సహాయం చేస్తే తన ప్రాణం నిలబడుతుందని వేడుకుంటున్నాడు. మానవతావాదులు 8790085866 నంబరును సంప్రదించాలని కోరుతున్నాడు. -
పోశయ్యకు వైద్యం చేయిస్తాం
చెన్నూర్‌రూరల్: కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న నిరుపేదకు ఆరోగ్యశ్రీ అండ లభించింది. మండలంలోని దుగ్నెపల్లి పంచాయతీ పరిధి వెంకంపేట గ్రామానికి చెందిన జాడి పోశయ్య గత కొద్ది రోజులుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్యానికి ఇప్పటికే రూ.8లక్షల వరకు ఖర్చయ్యాయి. మెరుగైన వైద్యం చేయించుకునేందుకు చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బందులు పడుతున్నాడు. ఈ విషయం తెలిసిన ‘సాక్షి’ పోశయ్య దీనస్థితిని వెలుగులోకి తీసుకొచ్చింది. ‘గుడిసె నీడన బతుకు.. గుండె నిండా బాధ’ శీర్షికన శుక్రవారం జిల్లా పేజీలో మానవీయ కథనాన్ని ప్రచురించింది. దీనికి ఆరోగ్యశ్రీ జిల్లా అధికారులు స్పందించారు. ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ డాక్టర్ పవన్‌కుమార్ ఆదేశాల మేరకు జిల్లా టీం లీడర్ మాచర్ల గణేశ్, అంగ్రాజ్‌పల్లి పీహెచ్సీ ఆరోగ్యమిత్ర సరిత శుక్రవారం వెంకంపేట గ్రామానికి వెళ్లి పోశయ్యను పరామర్శించారు. అతడి ఆరోగ్య పరిస్థితి, కుటుంబ పరిస్థితులను గురించి అడిగి తెలుసుకున్నారు. పోశయ్యకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యం చేయిస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్ లేదా హైదరాబాద్ ఆసుపత్రికి రావాలని పోశయ్యకు సూచించారు. వైద్యం ఉచితంగా అందించినా ఇతర ఖర్చుల కోసం పోశయ్య దాతల సాయం కోరుతున్నాడు. -
బాబోయ్.. బోరు నీళ్లా..!
సాక్షి, హైదరాబాద్: ప్రాణాధారమైన నీరు రోగాలకు కారణమవుతోంది. అమృత జలంగా భావించే తాగునీరు అతి ముఖ్యమైన అవయవాలను దెబ్బ తీస్తోంది. విచ్చలవిడిగా పెరుగుతున్న బోరు బావుల నీటి వినియోగం రోగాలకు కారణమవుతోంది. లోతైన బోర్లలోని నీటి వినియోగంతో మూత్రపిండాల వ్యాధులు విజృంభిస్తున్నాయి. దేశంలో ఏటా 1.36 లక్షల మంది కిడ్నీ వ్యాధులతో చనిపోతున్నారు. ప్రమాదకర వ్యాధిగా భావించే ఎయిడ్స్ వల్ల మృతి చెందుతున్న వారి కంటే కిడ్నీ రోగాలతో చనిపోతున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. మన రాష్ట్రంలో ఏటా 3,000 మందిలో కిడ్నీ వ్యాధులు గుర్తిస్తుండగా.. ఆ వ్యాధులతో మృతి చెందుతున్న వారి సంఖ్యా అంతే ఉంటోంది. ఆర్యోగ్యశ్రీ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 21,236 మంది మూత్రపిండాల రోగులున్నారు. వీరు కాకుండా ప్రైవేట్ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నవారు 10 వేలకు పైగా ఉంటారని అంచనా. ‘లోతు’ నీటితో ప్రమాదమెక్కువ..! తాగేనీటిలో ఏ ఒక్క మూలకం మోతాదుకు మించి ఉన్నా ఆరోగ్య సమస్యలొస్తాయి. భూగర్భంలో 118 రకాల మూలకాలు ఉండగా.. వీటిలో 14 రకాలు సాధారణం కంటే ఎక్కువ మోతాదులో ఉంటే కిడ్నీ వ్యాధులొస్తాయి. వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాల అధిక వినియోగం వల్ల మొదట్లో 60 అడుగుల లోతులో ఉండే నీరు ఇప్పుడు వంద అడుగుల లోతులోగానీ ఉండటం లేదు. ఎక్కువ లోతు నుంచి వచ్చే నీటిలో సిలికా, కాడ్మియం, యురేనియం, క్రోమియం, లెడ్ మూలకాలు ఎక్కువ మోతాదులో ఉంటున్నాయి. ఈ మూలకాలున్న నీటిని తాగి ప్రజలు రోగాలబారిన పడుతున్నారు. మూలకాల మోతాదుకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రమాణాలను నిర్దేశించింది. అయితే డబ్ల్యూహెచ్‌వో నిర్ధారించిన ప్రకారం మూలకాలుంటే వ్యాధులు రావనేది అన్ని సందర్భాల్లో జరగదు. ఆయా ప్రాంతాల్లోని వాతావరణ పరిస్థితులు, వ్యక్తుల ఆరోగ్య స్థాయిని బట్టి వ్యాధులు వస్తుంటాయి. పూర్తిగా పాడయ్యేవరకూ గుర్తించలేం.. మిగిలిన వ్యాధులతో పోలిస్తే మూత్రపిండాల సమస్య జటిలమైనది. ఏ పెద్ద వ్యాధులనైనా వైద్య పరీక్షలతో ముందే గుర్తించవచ్చు. కానీ మూత్రపిండాలు మాత్రం పూర్తిగా పని చేయకుండాపోయే వరకు నిర్ధారించే అవకాశం ఉండ దు. కిడ్నీలు 80% పని చేయకుండాపోయినప్పుడే వైద్య పరీక్షల్లో తెలుస్తుంది. చాలా అరుదైన కేసుల్లోనే కొంచెం ముందుగా గుర్తించవచ్చు. మూత్రపిండాల వ్యాధుల తో ఇబ్బంది పడేవారికి ఆర్థికంగానూ కష్టాలుంటాయి. ప్రతి నెల పరీక్షలు, రక్త శుద్ధి కోసం భారీ ఖర్చులు చేయాల్సి ఉంటుంది. సగటున కనీసం రూ.5 వేలకు తగ్గకుండా ఖర్చులు ఉంటాయి. సమస్య తీవ్రతను బట్టి ఖర్చు పెరుగుతుంది. మూత్రపిండాలు చెడిపోతే.. డయాలసిస్ (కృత్రిమ రక్త శుద్ధి) పైనే ఆధారపడాల్సి ఉంటుంది. చాలా అరుదైన సందర్భాల్లోనే ఇతరుల మూత్రపిండాలు అమర్చుకోవడం జరుగుతుంటుంది. ఎలా వస్తాయి.. చాలా కాలంగా లోతైన బోరు బావుల నీరు తాగుతున్నవారు కిడ్నీ వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. అధిక బరువు, షుగర్, బీపీ వ్యాధులు.. మూత్ర పిండాలలో రాళ్లుంటే కిడ్నీలు చెడిపోయే అవకాశాలు ఎక్కువ. వంశపారంపర్యంగానూ ఈ వ్యాధులొస్తాయి. కీళ్ల వాపులు, ఒళ్లు నొప్పులకు సంబంధించి నివారణ మందులు వాడేవారు కిడ్నీ సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంది. దక్షిణ భారతంలో ఎక్కువ.. లోతైన బోర్లలో నుంచి వచ్చే నీటిని తాగే ప్రాంతాల్లో కిడ్నీ రోగులు పెరుగుతున్నారు. ఉపరితలంలోని నీరు తాగే ప్రాంతాల్లో వ్యాధుల నమోదు తక్కువగా ఉంటోంది. బోర్ల నీటి వినియోగం ఎక్కువగా ఉన్న దక్షిణ భారతంలో కిడ్నీ రోగుల సంఖ్య పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. – డా.టి. గంగాధర్, మూత్రపిండాల వ్యాధి నిపుణులు, నిమ్స్ ఉపరితంలోని నీరే వాడుకోవాలి భూగర్భ జలంలో ఎన్నో రకాల మూలకాలు మోతాదుకు మించి ఉంటాయి. వాటన్నింటినీ సరైన స్థాయిలోకి తీసుకురావడం కష్టం. అందుకే ఉపరితలంలోని నీరే వినియోగించాలి. వ్యాధుల నియంత్రణకు ఇదే శాశ్వత పరిష్కారం. – డాక్టర్ రాజారెడ్డి, నిమ్స్ మాజీ డైరెక్టర్ రాష్ట్రంలో బోర్లు, బావుల పరిస్థితి ఏడాది బోర్లు బావులు 1986–87 23,939 5,15,039 2000–01 4,28,137 7,35,273 2006–07 6,53,131 6,30,585 2010–11 7,01,450 5,90,408 2016–17 9,08,262 3,82,623 ఆరోగ్యశ్రీ మొదలైనప్పటి నుంచి కిడ్నీ రోగుల సంఖ్య 2008–09 511 2009–10 714 2010–11 1,035 2011–12 1,633 2012–13 2,800 2013–14 2,641 2014–15 3,673 2015–16 3,164 2016–17 3,393 2017 1,672 (అక్టోబర్ 1 వరకు) -
ప్రాణభిక్ష పెట్టండి
ఎదుగుతున్న ఒక్కగానొక్క కొడుకును చూసి సంతోషించారు ఆ తల్లిదండ్రులు. కాలేజీకి వెళ్తున్న కొడుకు ప్రయోజకుడై కష్టాలు తీర్చుతాడని కలలు కన్నారు. కానీ వారి ఆశల శిఖరం కూలింది. కోటి ఆశలుపెట్టుకున్న కొడుకు ఆస్పత్రి పాలయ్యాడు. రెండు కిడ్నీలు పాడైపోయిన కొడుకును బతికించుకునేందుకు ఆ తల్లిదండ్రులు నేడు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. కొడుకు ప్రాణభిక్ష పెట్టండని వేడుకుంటున్నారు. ఆ తల్లిదండ్రులే రఘునాథ్‌పల్లి మండలం మాదారానికి చెందిన అరూరి పుష్ప, కిష్టయ్య దంపతులు. రఘునాథపల్లి(జనగామ) : రఘునాథపల్లి మండలం మాదారానికి చెందిన అరూరి కిష్టయ్య, పుష్ప దంపతులకు ఏకైక కుమారుడు పరశురాములు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. రెండు నెలల క్రితం పరశురాములు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా వరంగల్ ఎంజీఎంలో చేర్చారు. కిడ్నీలు పనిచేయడం లేదని వైద్యులు సూచించారు. దీంతో సికింద్రాబాద్‌లోని సన్‌షైన్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రతి రోజు డయాలసిస్ ద్వారా వైద్యం అందిస్తున్నారు. ఇప్పటికే రూ.2 లక్షలకు పైగా కొడుకు కోసం అప్పు చేశారు. లివర్ సహితం దెబ్బతింది. కొడుకును కాపాడుకునేందుకు వారికున్న ఎకరం భూమిని అమ్మేందుకు కిష్టయ్య దంపతులు సిద్ధపడ్డారు. కానీ కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. స్నేహితుల విరాళాలు. కిష్టయ్య దంపతుల ఆర్థిక పరిస్థితిని చూసిన పరశురాములు స్నేహితులు పలు చోట్ల విరాళాలు సేకరించి రూ.8 వేలు అందజేశారు. సర్కారు దయ తలచి తమ కొడుకుకు మెరుగైన వైద్యం అందించి పుత్రభిక్ష పెట్టాలని ఆ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ఆపన్నహస్తం అందించేవారు 9908921650, 9908258044 నంబర్లకు ఫోన్ చేయాలని వేడుకుంటున్నారు. -
‘ఉద్దానం’ నీటిలో ప్రమాదకర మూలకాలు
జీఎస్ఐ పరీక్షలో నిర్ధారణ: నిమ్స్ మాజీ డైరెక్టర్ రాజారెడ్డి - కిడ్నీ వ్యాధులతో వేల సంఖ్యలో మరణాలకు ఇదే కారణం - భూ ఉపరితల జలాల వినియోగమే దీనికి పరిష్కారమని వెల్లడి - 26న ఉద్దానంలో బహిరంగసభ: సాక్షి ఈడీ రామచంద్రమూర్తి సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో వేల మంది మరణాలకు అక్కడి తాగునీరే కారణమని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) పరీక్షలో తేలింది. ఉద్దానం ప్రాంతంలోని నీటిలో కిడ్నీవ్యాధులకు కారణ మయ్యే మూలకాలు అధిక స్థాయిలో ఉన్నట్లు నిర్ధారణ అయింది. శుక్రవారం నిమ్స్ మాజీ డైరెక్టర్ రాజారెడ్డి, సాక్షి మీడియా గ్రూప్ ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్యలతో కలసి ఉద్దానం కిడ్నీ బాధితుల సంఘీభావ కమిటీ ప్రతినిధులు హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఈ వివరాలను వెల్లడించారు. కిడ్నీ వ్యాధుల బారినపడి వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్న ఉద్దానం ప్రాంతంలోని తాగునీటి నమూనాలను ఇటీవ ల సేకరించి జీఎస్ఐలో పరీక్షించినట్లు నిమ్స్ మాజీ డైరెక్టర్ రాజారెడ్డి తెలిపారు. ‘‘తాగే నీటిలో ఏ మూలకం కూడా పరిమితికి మించి ఉంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. భూగర్భం లో 118 రకాల మూలకాలు ఉంటాయి. వాటిలో 14 రకాలు సాధారణం కంటే ఎక్కువ మోతాదులో ఉంటే కిడ్నీ వ్యాధులు తలెత్తుతా యి. ఉద్దానం ప్రాంతం నుంచి సేకరించిన 12 తాగునీటి నమూనాలను జీఎస్ఐ పరీక్షించింది. ఆ ప్రాంతంలోని ఒక గ్రామంలో 23 మంది కిడ్నీ వ్యాధులతో చనిపోయారు. ఆ గ్రామం లోని తాగునీటిలో కాడ్మియం, యురేనియం, క్రోమియం, లెడ్ మూలకాలు అధిక స్థాయిలో ఉన్నాయి. అవి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిర్దేశించిన పరిమితి కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు. సిలికా స్థాయి కూడా ఎక్కువే ఉంది. కానీ సిలికా ఏ స్థాయిలో ఉంటే ప్రమాదకరమనే అంశాన్ని డబ్ల్యూహెచ్‌వో ఇంకా నిర్ధారించలేదు..’’ అని ఆయన చెప్పారు. ఉపరితల జలాల వినియోగమే శ్రేయస్కరం తాగునీరు డబ్ల్యూహెచ్‌వో నిర్ధారించిన ప్రమాణాల ప్రకారం ఉంటే వ్యాధులు రావనేది కూడా అన్ని సందర్భాల్లో జరగదని రాజారెడ్డి చెప్పారు. ఆయా ప్రాంతాల్లోని వాతావరణ పరిస్థితులు, వ్యక్తుల ఆరోగ్యస్థాయిని బట్టి ఉంటుందన్నారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ అధికంగా ఉందని పరిశోధనలలో తేలిందని, దాంతో కోట్ల రూపాయలతో డీఫ్లోరైడ్ వ్యవస్థను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. కానీ తర్వాత పరిస్థితి ఇంకో రకంగా మారిందని, బోర్ల నుంచి వచ్చే నీటిని సరఫరా చేసే పరిస్థితి వచ్చిందని చెప్పారు. భూగర్భ జలంలో ఎన్నో రకాల మూలకాలు మోతాదుకు మించి ఉంటాయని, వాటన్నింటినీ సరిపోయే స్థాయిలోకి తీసుకురావడం కష్టమని వివరించారు. తాగేందుకు, వంట కోసం భూ ఉపరితలంలోని నీటినే వినియోగించాలని, కిడ్నీల వ్యాధుల నియంత్రణకు అదే శాశ్వతమైన పరిష్కారమని స్పష్టం చేశారు. ఇక ఈ నెల 26న ఉద్దానంలో కిడ్నీ బాధితులతో బహిరంగ సభ నిర్వహిస్తున్నా మని సాక్షి ఈడీ రామచంద్రమూర్తి చెప్పారు. ఆ సభ ఏర్పాట్లను జర్నలిస్టు రమణమూర్తితో పాటు స్థానికులు కృష్ణమూర్తి, శ్రీనివాస్‌లు పర్యవేక్షిస్తారని వెల్లడించారు. ఉద్దానం ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నట్లుగా వంశధార నది నీటిని తాగునీటి కోసం సరఫరా చేయాలని మల్లేపల్లి లక్ష్మయ్య డిమాండ్ చేశారు. ఆ ప్రాంతంలోని ప్రజల సమస్యపై ప్రభుత్వం, రాజకీయ పార్టీలే కాదు అందరూ ఆలోచించాలన్నారు. ఇక తమకు అందరూ మద్దతుగా నిలవాలని ఉద్దానం కిడ్నీ బాధితుల సంఘీభావ కమిటీ ప్రధాన కార్యదర్శి వంకల మాధవరావు కోరారు. కిడ్నీ వ్యాధులతో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, ఉద్దానంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. -
మరో ప్రాణం పోయింది!
ఈ గ్రామ దయనీయ పరిస్థితిని వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ ⇒ కిడ్నీ వ్యాధులతో సంభవిస్తున్న మరణాలపై కథనాలు ⇒ అయినా పట్టించుకోని అధికార యంత్రాంగం ⇒ ఇప్పుడు బాలుడి మృతితో కదలిక ⇒ బుధవారం గువ్వలగుట్టను సందర్శించనున్న అధికారులు ⇒ కిడ్నీ బాధితులపై ఆరా.. నీటి శాంపిళ్లను పరీక్షించాలని నిర్ణయం చందంపేట (దేవరకొండ): కన్న తల్లి దండ్రుల వేదన అరణ్య రోదనగానే మిగిలిపోయింది.. వారి కళ్ల ముందే కొడుకు ప్రాణం గాలిలో కలసిపోయింది.. ఎంత మొరపెట్టుకున్నా.. పత్రికల్లో కథనాలు వచ్చినా.. స్పందించని ప్రభుత్వ యంత్రాంగానికి ఆ చిన్నారి ప్రాణం బలైపోయింది.. నల్లగొండ జిల్లా చందంపేట మండలం గువ్వలగుట్టకు చెందిన మేరావత్ లక్ష్మణ్ (12) మంగళవారం కన్నుమూశాడు. గువ్వలగుట్టలో జనం కిడ్నీ వ్యాధుల కారణంగా వరుసగా మృతి చెందుతున్న వైనంపై, చావు బతుకుల్లో ఉన్న లక్ష్మణ్ పరిస్థితిపై ‘జనం పరిస్థితి అధ్వానం.. ఇది మన ఉద్ధానం’పేరిట పక్షం రోజుల కింద ‘సాక్షి’మాన వీయ కథనాన్ని ప్రచురించింది. అక్కడి జనం పడుతున్న బాధలను వివ రించింది. కానీ అధికార యంత్రాంగంలో స్పందన కనిపించలేదు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న లక్ష్మణ్ మంగళవారం మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న వైద్యారోగ్య శాఖ బృందం బుధవారం గువ్వలగుట్టను సందర్శించాలని నిర్ణయించింది. ఎన్నిసార్లు గోడు వెళ్లబోసుకున్నా..గువ్వలగుట్ట రోగాల పుట్టగా మారి పోతోంది. కిడ్నీ వ్యాధులు మెల్లమెల్లగా ఆ గ్రామాన్నే కబళించేస్తున్నాయి. ఇక్కడి నీటిలోని రసాయనాల కారణంగా ఈ దుస్థితి తలెత్తిందని ప్రాథమికంగా గుర్తించారు. దీనిపై ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు. కానీ ఫలితం కనిపించలేదు. ఈ గ్రామం దుస్థితిపై ‘సాక్షి’ఎన్నో కథనాలను ప్రచు రించింది. ఆరు నెలల క్రితం ‘గువ్వలగుట్ట.. రోగాల పుట్ట’అన్న శీర్షికన గువ్వలగుట్టలో కిడ్నీ వ్యాధి మరణాలు, బాధితుల దీన స్థితిపై కథనాన్ని ప్రచురించింది. కిడ్నీ వ్యాధుల బారినపడి జనం పిట్టల్లా రాలిపోతున్న వైనాన్ని వివరించింది. వ్యాధులతో బాధపడుతూ, లక్షలకు లక్షలు ఖర్చు చేసి చికిత్స చేయించుకున్నా ఫలితం లేనివారి ఆందోళనను తెలిపింది. వారితోపాటు లక్ష్మణ్ పరిస్థితిని, తల్లి దండ్రుల ఆవేదనను కూడా వివరించింది. అయినా అధికార యంత్రాంగంలో స్పందన కానరాలేదు. సురక్షిత నీరు అందేదెన్నడు? గువ్వలగుట్టకు అతి సమీపంలోనే ఉన్న కృష్ణా బ్యాక్‌వాటర్ నుంచి మంచినీటిని ఈ గ్రామానికి అందించేందుకు చేపట్టిన పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి. ట్యాంకులు నిర్మించి, పైప్‌లైన్‌ను ఏర్పాటు చేసే పను లను మొదలుపెట్టి.. అర్ధంతరంగా వదిలే శారు. దాదాపు ఏడాదిగా కదలిక లేదు. నేడు గువ్వలగుట్టకు వైద్యారోగ్య శాఖ బృందం నల్లగొండ టౌన్: నల్లగొండ జిల్లా చందంపేట మండలంలోని గువ్వలగుట్టను బుధవారం వైద్య ఆరోగ్య శాఖ ప్రతినిధి బృందం సందర్శించనుంది. కిడ్నీ వ్యాధులతో ఇక్కడి జనం అవస్థలపై కథనాలు, మంగళవారం లక్ష్మణ్ అనే బాలుడి మృతి నేపథ్యంలో.. అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. వైద్యారోగ్య శాఖ బృందం బుధవారం గువ్వలగుట్టకు చేరుకుని కిడ్నీ వ్యాధుల బాధితులతో మాట్లాడతారు. వారి సమస్యలు తెలుసుకుని.. ఇక్కడి బోరుబావులు, నీటి పంపులను పరిశీలిస్తారు. నీటి శాంపిళ్లను సేకరించి ప్రయోగశాలకు పంపుతారు. చీఫ్ వాటర్ అనలిస్ట్ డాక్టర్ ఆంజనేయులు, సీనియర్ అనాలసిస్ట్ డాక్టర్ కిరణ్మయి ఈ బృందంలో ఉంటారు. -
చల్లపేటలో చావుడప్పు
కిడ్నీ వ్యాధి... ఈ పేరు చెప్పగానే టక్కున గుర్తుకు వచ్చేది జిల్లాలో ఉద్దాన ప్రాంతం. అటువంటి ఈ మాయదారి రోగం మైదాన ప్రాంతాల్లో కూడా విజృంభిస్తుంది. గార మండలంలోని అంపోలు పంచాయతీ చల్లపేట గ్రామంలో ఈ మహమ్మారి జడలు విప్పింది. గత కొద్ది రోజులుగా ఈ వ్యాధిన బారిన పడి గ్రామంలో పలు కుటుంబాలు సతమతమవుతున్నాయి. గత ఏడాది వరకు 9 మందికి వ్యాధి సోకగా... ఈ ఏడాది ఆ సంఖ్య 20కి చేరింది. దీంతో మా గ్రామానికి ఏమైంది. అసలు కారణం ఏమై ఉంటుందని గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. ∙విజృంభిస్తున్న కిడ్నీ వ్యాధి ∙మూడేళ్లలో వివిధ కారణాలతో 34 మంది మృత్యువాత ∙భయాందోళనలో గ్రామస్తులు ∙పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు గార: మండలంలో అంపోలు పంచాయతీ చల్లపేట గ్రామంలో కిడ్నీ వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తుంది. ఈ మాయదారి రోగం బారిన పడి పలువురు మృత్యువాత చెందారు. గ్రామంలో 282 కుటుంబాలు ఉండగా 1180 మంది జనాభా నివసిస్తున్నారు. ఇప్పటివరకు 20 మందిని ఈ మహమ్మారి పొట్టన పెట్టుకుంది. కిడ్నీ వ్యాధి సోకిన రోగులే కాకుండా సాధారణ వ్యక్తులు కూడా గత మూడేళ్లగా 34 మంది మృత్యువాత చెందారు. వీరందరూ మధ్యవయస్కులే. వీరందరూ కిడ్నీ వ్యాధితో మృతి చెందారా లేదా అన్నది తెలియడం లేదు. అయితే గుండెపోటు, జ్వరం వంటి లక్షణాలతో అధికమంది ప్రాణాలు కోల్పోయారు. నిత్యం కష్టపడి పనిచేసేవారికి గుండెపోటు అంటే కొంత అయోమయానికి గురిచేస్తుంది. వైద్య శాస్త్రం ప్రకారం కిడ్నీ వ్యాధి వస్తే త్వరగా మరణించే పరిస్థితిలేదు. కిడ్నీ వ్యాధికి అనుబంధంగా మరిన్ని రోగాలు(వీటిలో గుండెపోటు, జ్వరాలు) వచ్చే అవకాశం ఉంది. కిడ్నీ వ్యాధితో నేరుగా చనిపోకపోయినా వీరందరి చావుకి కిడ్నీ వ్యాధితో సంబంధం ఉందని చెప్పవచ్చు. తాగునీటి వనరులిలా... గ్రామంలోని ప్రజలు రక్షిత పథకం, నేలబావి, బోరు నీటిని తాగునీరుగా వినియోగిస్తున్నారు. ఈ నీటిని పలుమార్లు ప్రయోగశాలకు పంపించి పరీక్షలు చేసినా ఉద్దానం మాదిరి భూమిలో సిలికాన్ లేదని వైద్య సిబ్బంది చెబుతున్నారు. నొప్పి మాత్రలే కారణమా... గ్రామస్తులు ప్రతి చిన్నరోగానికి సంచివైద్యులను ఆశ్రయించడం పరిపాటి. దీనికి తోడు కీళ్లనొప్పులు అధికంగానే ఉన్నాయి. నొప్పి అంటేనే పెయిన్‌కిల్లర్ ట్యాబ్లెట్స్ రాసేయడం లేదా సూదిమందు వేసేయడం సంచి వైద్యుల అలవాటు. ఈ గ్రామస్తులు అతిగా పెయిన్‌కిల్లర్స్ వాడుతున్నారని వైద్య సిబ్బంది గతంలో చేసిన సర్వేలో తేల్చింది. దీనిపై అప్పటి కలెక్టర్ లక్ష్మీనరసింహం పెయిన్ కిల్లర్స్ తగ్గించేలా ప్రజల్లో చైతన్యం చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. -
ఉద్దానానికి మొండిచేయి!
► బడ్జెట్లో కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం రూపాయి కూడా కేటాయించని సర్కార్ ► ఆందోళనలో బాధితులు కవిటి: అత్యంత ప్రమాదకరస్థాయిలో విజృంభిస్తున్న ఉద్దానం కిడ్నీవ్యాధులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. వ్యాధిగ్రస్తులపై తమకు ఎంతో చిత్తశుద్ధి ఉందని పాలకులు చెబుతూ వచ్చారు. అయితే తాజాగా బుధవారం శాసనసభలో ఆర్థికశాఖమంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కిడ్నీవ్యాధిగ్రస్తులకు మొండిచేయి చూపా రు. వ్యాధి మూలాలు కనుక్కోవడానికి గాని, వ్యాధిగ్రస్తుల వైద్య సేవల కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఈ విషయం తెలిసి బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్దానం వాసులు చాలామంది మూత్రపిండల వ్యాధిబారిన పడుతున్న విషయం తెలిసిందే. వ్యాధి మూలాలు కనుక్కోవడానికి కేంద్ర ప్రభుత్వం భారతీయ వైద్యపరిశోధనామండలి(ఐసీఎంఆర్) బృందంతో అధ్యయనం పేరిట ఉద్దానం ప్రాంతానికి ఫిబ్రవరి మొదటివారంలో నిపుణుల బృందాన్ని పంపింది. దురదృష్టవశాత్తూ వారు క్షేత్రస్థాయిలో కాలుమోపకుండానే వెనుదిరగడంతో ఇక్కడ ప్రజలు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. పైగా ఈ బృందంలో సభ్యుడు ఎన్టీఆర్ హెల్త్వర్సిటీ వైస్‌చాన్సలర్ డాక్టర్ రవిరాజ్ కిడ్నీ వ్యాధులకు కారణం నీటిలో ఉన్న సిలికాన్ అంటూ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి కామినేనికి నివేదిక ఇచ్చారు. ఎటువంటి పరిశోధనలూ లేకుండానే ఈ నివేదిక అందించడం ఈ ప్రాంతంలో తీవ్రచర్చనీయాంశం అయింది. తమపై అనవసరంగా బురదజల్లారని జిల్లా గ్రామీణా నీటిసరఫరా విభాగం అధికారులు, ఉద్దానం ప్రాజెక్ట్ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు మాటమాత్రం చెప్పకుండానే ప్రభుత్వానికి ఇచ్చిన ఆ నివేదికలో నీటిలో సిలికాన్ ఉందని డాక్టర్ రవిరాజ్ సిలికా పలుకులు పలకడం పట్ల నిర్ఘాంతపోయారు. ఇలాంటి పరిస్థితిలో రాష్ట్ర బడ్జెట్లో వ్యాధి మూలాలు కనుక్కోవడానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తారని ఈ ప్రాంతీయులు గంపెడాశతో ఎదురు చూశారు. అయితే వారందరికీ భంగపాటు మిగిలింది. వ్యాధిగ్రస్తుల వైద్యఖర్చులకు నిధులు కేటాయింపు లేదు. డయాలసిస్‌కు వెళ్లేవారికి రవాణాచార్జిల పేరిట నిధుల మంజూరుగానీ, వ్యాధిగ్రస్తులకు ఉచిత మందుల పంపిణీ వంటి విషయంపై బడ్జెట్లో ప్రస్తావించకపోవడంతో ఉద్దానం వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరుని తప్పుబడుతున్నారు. బడ్జెట్ అంకెల గార డీ: ప్రభుత్వం ప్రవేశప ెట్టిన వార్షిక బడ్జెట్ అంకెల గారడీగా ఉంది. ప్రాధాన్యతా రంగాలకు కేటాయింపుల్లేవు. ఉద్దానం కిడ్నీ వ్యాధుల అధ్యయనాన్ని ప్రభుత్వం తూతూమంత్రంగా మార్చేసిందనటానికి బడ్జెట్లో కనీస ప్రస్తావన లేకపోవడం, నిధుల కేటాయింపులో మొండిచెయ్యి చూపడం ఉదాహరణగా చెప్పవచ్చు. ఇది చాలా బాధాకరం. ప్రభుత్వం తమను ఆదుకుంటుందని చూసిన కిడ్నీవ్యాధిగ్రస్తులకు ఈ బడ్జెట్ చేదుగుళికనే ఇచ్చింది. –పిరియా సాయిరాజ్, మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త కుటుంబానికి భారమయ్యాను: 50 ఏళ్ల వయసు వరకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. నాలుగేళ్ల క్రితం ఒంట్లో బాగోకపోవడంతో సోంపేట వెళ్లి వైద్యుడిని సంప్రదిస్తే కిడ్నీవ్యాధి బారిన పడ్డానని తెలిపారు. అప్పటి నుంచి మందులు వాడుతూ వస్తున్నాను. రెండు సంవత్సరాల నుంచి వారానికి రెండుసార్లు డయాలసిస్ కోసం వైజాగ్ వెళ్తున్నాను. శ్రీకాకుళం దగ్గర ఉందని వెళితే వివిధ కారణాలు చూపి.. వైజాగ్ వెళ్లాలంటున్నారు. భార్య సాయంతో వైజాగ్ వెళ్లి వస్తున్నాను. పిల్లలు కూలి చేసి తెచ్చే డబ్బులను వైద్యానికి ఖర్చు చేస్తున్నాను. వారానికి రూ.1600 మందులు అవసరమవుతున్నాయి. దీంతో కుటుంబానికి భారంగా మారాను. – పొడియా మదను, శ్రీహరిపురం, కవిటి మండలం -
అవగాహనతో ఆరోగ్యం
గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే సాక్షి గుడ్హెల్త్ మెగా షో ప్రారంభం పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజానీకం గుంటూరు మెడికల్ : ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై అవగాహన కల్పించుకోవాలని గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే సూచించారు. ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ‘సాక్షి’ మీడియా గ్రూప్ గుడ్హెల్త్ మెగా షో నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. గుంటూరు నగరంపాలెంలోని కేకేఆర్ ఫంక్షన్ ప్లాజాలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గుడ్హెల్త్ మెగా షోను కాంతిలాల్ శనివారం ముఖ్య అతిథి హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ వైద్య రంగంలో అత్యాధునిక వైద్య పద్ధతులు రోజూ వస్తూ ఉన్నాయని, వాటిని ప్రజలకు పరిచయం చేసేందుకు హెల్త్‌షో ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. మీడియా మిత్రులకు కూడా వైద్య పరీక్షలు చేయించేందుకు ‘సాక్షి’ చొరవ చూపించి హెల్త్ షో ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ‘సాక్షి’ ఏర్పాటు చేసిన హెల్త్ షోను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు. ‘సాక్షి’ మీడియా గ్రూప్ డైరెక్టర్ రాణిరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించాలనే లక్ష్యంతో ‘సాక్షి’ హెల్త్ షో ఏర్పాటు చేశామన్నారు. ఆరోగ్య అంశాలన్నీ ఒకేచోట... సాయిభాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత, ప్రముఖ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యపరమైన అంశాలన్నీ ఒకేచోట చేరువ చేసి ప్రజలకు ఆరోగ్యం అందించేందుకు ‘సాక్షి’ హెల్త్ షో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రోజులు జరిగే ఈ హెల్త్ షోలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. వేదాంత హాస్పిటల్ అధినేత డాక్టర్ చింతా రామకృష్ణ మాట్లాడుతూ కిడ్నీ వ్యాధులు ఎలా వస్తాయి, రోగులకు ఎలాంటి వైద్య సేవలు గుంటూరులో లభిస్తున్నాయనే విషయాలను వివరించేందుకు ఈ హెల్త్ షో ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. హెల్ప్ హాస్పిటల్ అధినేత డాక్టర్ కె.కల్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ ఈ హెల్త్‌షో ఆధునిక వైద్య పద్ధతులను ప్రజలకు చేరువ చేస్తుందన్నారు. కారుమూరి సూపర్ స్పెషాలిటీ అధినేత, ప్రముఖ గుండె వైద్య నిపుణుడు డాక్టర్ కారుమూరి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యంపై అవగాహన లేకపోవడం వల్లే చాలా మంది అర్ధాంతంగా జీవితాలు ముగి స్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. గుం టూరు సిటీ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ చక్కా శివరామకృష్ణ, శ్రీరామచంద్ర పిల్లల, దంత వైద్యశాల నిర్వాహకుడు డాక్టర్ టి.చంద్రశేఖరరెడ్డి, డాక్టర్ పువ్వాడ తిరుమల రవిచందర్, మల్లికా స్పయిన్ సెంటర్ అధినేత డాక్టర్ జె.నరేష్‌బాబు, శ్రీరేణుకా నేత్రాలయం సూపర్‌స్పెషాలిటీ కంటి హాస్పిటల్ నిర్వాహకురాలు డాక్టర్ యడ్ల గాయత్రి, దంత వైద్య నిపుణులు డాక్టర్ చింతా వాసవి, శ్రీబాలాజీ ఫిజియోథెరపీ హాస్పిటల్ అధినేత డాక్టర్ నాగసతీష్ తదితరులు ఆయా వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మాట్లాడారు. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ జోనల్ మేనేజర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలు వచ్చాక ఇన్సూరెన్స్ గురించి ఆలోచించేకంటే, ముందస్తుగానే బీమా చేయించుకుంటే నిశ్చింతగా ఉండవచ్చని సూచించారు. సాక్షి డెప్యూటీ జనరల్ మేనేజర్ రంగనా«థ్, ఈవెంట్ మేనేజర్ భరత్ కిషోర్, రీజనల్ మేనేజర్ జి.వెంకటరెడ్డి, జిల్లా మేనేజర్ కె.చిత్తరంజన్, కల్యాణి యాడ్ ఏజెన్సీ నిర్వాహకులు కె.సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. సాక్షి గుడ్హెల్త్ మెగా షో రెండోరోజైన ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు కొనసాగనుంది. -
మంత్రి కంటే సీఎంకే ఎక్కువ అర్థమైంది: పవన్
హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ రోగుల విషయంలోనే కాకుండా ఇలాంటి సమస్యలు ఎక్కడున్నా అందుకు జనసేన పోరాడుతూనే ఉంటుందని సినీనటుడు, పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు. దీనిపై ఆయన శనివారం వరుస ట్వీట్లు చేశారు. కిడ్నీ బాధితుల సమస్య తీవ్రత జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు కంటే మెరుగ్గా సీఎం చంద్రబాబునాయుడుకు అర్థమైందని ట్వీట్లో పేర్కొన్నారు. ఉద్దానం బాధితుల సమస్య పూర్తిగా పరిష్కారమమ్యేవరకూ అన్ని పార్టీల మేనిఫెస్టోలో ఈ అంశం ఉండాలని పిలుపునిచ్చారు. ఉద్దానం సమస్యల విషయంలో ఎంతో తోడ్పాడు అందించిన మీడియాకు బాధితుల తరఫు నుంచి కృతజ్ఞతలు చెప్పారు. ఏ చేయూత లేని వారికి ఇదే విధంగా పోరాడటంలో ఇదే స్ఫూర్తిని రగిలించాలని అన్నారు. ఉద్దానం బాధితులపై ఏపీ ప్రభుత్వం సానుకూల స్పందన రావడంపై హర్షం వ్యక్తంచేశారు. ఉద్దానం కిడ్నీ రోగుల సమస్య పరిష్కారం పట్ల ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పవన్ పర్యటన అనంతరం మంత్రి కామినేని శ్రీనివాస్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుందని సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు పడతాయని పవన్ ధీమా వ్యక్తంచేశారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటన సందర్భంగా ఉద్దానం సహా 11 మండల్లాల్లో కిడ్నీ వ్యాధి సమస్యను ఘోర విపత్తుగా ఇటీవల పవన్ పేర్కొన్నారు. (ఇక్కడ చదవండి: 15 రోజుల్లోగా స్పందించకుంటే ఉద్యమమే) pic.twitter.com/CbmJgDW3v2 — Pawan Kalyan (@PawanKalyan) 7 January 2017