మంత్రి కంటే సీఎంకే ఎక్కువ అర్థమైంది: పవన్
హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ రోగుల విషయంలోనే కాకుండా ఇలాంటి సమస్యలు ఎక్కడున్నా అందుకు జనసేన పోరాడుతూనే ఉంటుందని సినీనటుడు, పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు. దీనిపై ఆయన శనివారం వరుస ట్వీట్లు చేశారు. కిడ్నీ బాధితుల సమస్య తీవ్రత జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు కంటే మెరుగ్గా సీఎం చంద్రబాబునాయుడుకు అర్థమైందని ట్వీట్లో పేర్కొన్నారు. ఉద్దానం బాధితుల సమస్య పూర్తిగా పరిష్కారమమ్యేవరకూ అన్ని పార్టీల మేనిఫెస్టోలో ఈ అంశం ఉండాలని పిలుపునిచ్చారు. ఉద్దానం సమస్యల విషయంలో ఎంతో తోడ్పాడు అందించిన మీడియాకు బాధితుల తరఫు నుంచి కృతజ్ఞతలు చెప్పారు. ఏ చేయూత లేని వారికి ఇదే విధంగా పోరాడటంలో ఇదే స్ఫూర్తిని రగిలించాలని అన్నారు.
ఉద్దానం బాధితులపై ఏపీ ప్రభుత్వం సానుకూల స్పందన రావడంపై హర్షం వ్యక్తంచేశారు. ఉద్దానం కిడ్నీ రోగుల సమస్య పరిష్కారం పట్ల ప్రభుత‍్వం చర్యలు తీసుకుంటుందని పవన్ పర్యటన అనంతరం మంత్రి కామినేని శ్రీనివాస్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుందని సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు పడతాయని పవన్ ధీమా వ్యక్తంచేశారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటన సందర్భంగా ఉద్దానం సహా 11 మండల్లాల్లో కిడ్నీ వ్యాధి సమస్యను ఘోర విపత్తుగా ఇటీవల పవన్ పేర్కొన్నారు.
(ఇక్కడ చదవండి: 15 రోజుల్లోగా స్పందించకుంటే ఉద్యమమే)
— Pawan Kalyan (@PawanKalyan) 7 January 2017