సాక్షి, హైదరాబాద్: ప్రాణాధారమైన నీరు రోగాలకు కారణమవుతోంది. అమృత జలంగా భావించే తాగునీరు అతి ముఖ్యమైన అవయవాలను దెబ్బ తీస్తోంది. విచ్చలవిడిగా పెరుగుతున్న బోరు బావుల నీటి వినియోగం రోగాలకు కారణమవుతోంది. లోతైన బోర్లలోని నీటి వినియోగంతో మూత్రపిండాల వ్యాధులు విజృంభిస్తున్నాయి. దేశంలో ఏటా 1.36 లక్షల మంది కిడ్నీ వ్యాధులతో చనిపోతున్నారు.
ప్రమాదకర వ్యాధిగా భావించే ఎయిడ్స్ వల్ల మృతి చెందుతున్న వారి కంటే కిడ్నీ రోగాలతో చనిపోతున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. మన రాష్ట్రంలో ఏటా 3,000 మందిలో కిడ్నీ వ్యాధులు గుర్తిస్తుండగా.. ఆ వ్యాధులతో మృతి చెందుతున్న వారి సంఖ్యా అంతే ఉంటోంది. ఆర్యోగ్యశ్రీ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 21,236 మంది మూత్రపిండాల రోగులున్నారు. వీరు కాకుండా ప్రైవేట్ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నవారు 10 వేలకు పైగా ఉంటారని అంచనా.
‘లోతు’ నీటితో ప్రమాదమెక్కువ..!
తాగేనీటిలో ఏ ఒక్క మూలకం మోతాదుకు మించి ఉన్నా ఆరోగ్య సమస్యలొస్తాయి. భూగర్భంలో 118 రకాల మూలకాలు ఉండగా.. వీటిలో 14 రకాలు సాధారణం కంటే ఎక్కువ మోతాదులో ఉంటే కిడ్నీ వ్యాధులొస్తాయి. వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాల అధిక వినియోగం వల్ల మొదట్లో 60 అడుగుల లోతులో ఉండే నీరు ఇప్పుడు వంద అడుగుల లోతులోగానీ ఉండటం లేదు.
ఎక్కువ లోతు నుంచి వచ్చే నీటిలో సిలికా, కాడ్మియం, యురేనియం, క్రోమియం, లెడ్ మూలకాలు ఎక్కువ మోతాదులో ఉంటున్నాయి. ఈ మూలకాలున్న నీటిని తాగి ప్రజలు రోగాలబారిన పడుతున్నారు. మూలకాల మోతాదుకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రమాణాలను నిర్దేశించింది. అయితే డబ్ల్యూహెచ్‌వో నిర్ధారించిన ప్రకారం మూలకాలుంటే వ్యాధులు రావనేది అన్ని సందర్భాల్లో జరగదు. ఆయా ప్రాంతాల్లోని వాతావరణ పరిస్థితులు, వ్యక్తుల ఆరోగ్య స్థాయిని బట్టి వ్యాధులు వస్తుంటాయి.
పూర్తిగా పాడయ్యేవరకూ గుర్తించలేం..
మిగిలిన వ్యాధులతో పోలిస్తే మూత్రపిండాల సమస్య జటిలమైనది. ఏ పెద్ద వ్యాధులనైనా వైద్య పరీక్షలతో ముందే గుర్తించవచ్చు. కానీ మూత్రపిండాలు మాత్రం పూర్తిగా పని చేయకుండాపోయే వరకు నిర్ధారించే అవకాశం ఉండ దు. కిడ్నీలు 80% పని చేయకుండాపోయినప్పుడే వైద్య పరీక్షల్లో తెలుస్తుంది. చాలా అరుదైన కేసుల్లోనే కొంచెం ముందుగా గుర్తించవచ్చు. మూత్రపిండాల వ్యాధుల తో ఇబ్బంది పడేవారికి ఆర్థికంగానూ కష్టాలుంటాయి.
ప్రతి నెల పరీక్షలు, రక్త శుద్ధి కోసం భారీ ఖర్చులు చేయాల్సి ఉంటుంది. సగటున కనీసం రూ.5 వేలకు తగ్గకుండా ఖర్చులు ఉంటాయి. సమస్య తీవ్రతను బట్టి ఖర్చు పెరుగుతుంది. మూత్రపిండాలు చెడిపోతే.. డయాలసిస్ (కృత్రిమ రక్త శుద్ధి) పైనే ఆధారపడాల్సి ఉంటుంది. చాలా అరుదైన సందర్భాల్లోనే ఇతరుల మూత్రపిండాలు అమర్చుకోవడం జరుగుతుంటుంది.
ఎలా వస్తాయి..
చాలా కాలంగా లోతైన బోరు బావుల నీరు తాగుతున్నవారు కిడ్నీ వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. అధిక బరువు, షుగర్, బీపీ వ్యాధులు.. మూత్ర పిండాలలో రాళ్లుంటే కిడ్నీలు చెడిపోయే అవకాశాలు ఎక్కువ. వంశపారంపర్యంగానూ ఈ వ్యాధులొస్తాయి. కీళ్ల వాపులు, ఒళ్లు నొప్పులకు సంబంధించి నివారణ మందులు వాడేవారు కిడ్నీ సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంది.
దక్షిణ భారతంలో ఎక్కువ..
లోతైన బోర్లలో నుంచి వచ్చే నీటిని తాగే ప్రాంతాల్లో కిడ్నీ రోగులు పెరుగుతున్నారు. ఉపరితలంలోని నీరు తాగే ప్రాంతాల్లో వ్యాధుల నమోదు తక్కువగా ఉంటోంది. బోర్ల నీటి వినియోగం ఎక్కువగా ఉన్న దక్షిణ భారతంలో కిడ్నీ రోగుల సంఖ్య పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. – డా.టి. గంగాధర్, మూత్రపిండాల వ్యాధి నిపుణులు, నిమ్స్
ఉపరితంలోని నీరే వాడుకోవాలి
భూగర్భ జలంలో ఎన్నో రకాల మూలకాలు మోతాదుకు మించి ఉంటాయి. వాటన్నింటినీ సరైన స్థాయిలోకి తీసుకురావడం కష్టం. అందుకే ఉపరితలంలోని నీరే వినియోగించాలి. వ్యాధుల నియంత్రణకు ఇదే శాశ్వత పరిష్కారం. – డాక్టర్ రాజారెడ్డి, నిమ్స్ మాజీ డైరెక్టర్
రాష్ట్రంలో బోర్లు, బావుల పరిస్థితి
ఏడాది బోర్లు బావులు
1986–87 23,939 5,15,039
2000–01 4,28,137 7,35,273
2006–07 6,53,131 6,30,585
2010–11 7,01,450 5,90,408
2016–17 9,08,262 3,82,623
ఆరోగ్యశ్రీ మొదలైనప్పటి నుంచి కిడ్నీ రోగుల సంఖ్య
2008–09 511
2009–10 714
2010–11 1,035
2011–12 1,633
2012–13 2,800
2013–14 2,641
2014–15 3,673
2015–16 3,164
2016–17 3,393
2017 1,672
(అక్టోబర్ 1 వరకు)
Comments
Please login to add a commentAdd a comment