Sagubadi: ఏ బోర్లు అనుకూలం? ఎండిపోతున్న బోర్‌ని నిర్థారించడం ఎలా? | Sagubadi: Methods To Improve The Efficiency Of Borehole | Sakshi
Sakshi News home page

Sagubadi: ఏ బోర్లు అనుకూలం? ఎండిపోతున్న బోర్‌ని నిర్థారించడం ఎలా?

Published Tue, Jul 4 2023 11:15 AM | Last Updated on Fri, Jul 14 2023 3:46 PM

Sagubadi: Methods To Improve The Efficiency Of Borehole - Sakshi

బోర్ల నుంచి ఎప్పుడంటే అప్పుడు నీటిని తోడుకోవాలంటే వానాకాలంలో వాటికి నీటిని తాపాలన్న అవసరాన్ని ఇప్పుడు చాలా మంది బోర్ల యజమానులు గుర్తిస్తున్నారు. సాధారణంగా వాన నీరు 10–15% మాత్రమే భూమిలోకి ఇంకుతుంది. బోరు చుట్టూ గుంత నిర్మిస్తే అక్కడ కురిసిన వర్షంలో 50%ని ఇంకింపజేసుకొని భూగర్భ జలాలను పెంచుకోవచ్చు. అయితే, ఎండిపోయిన, ఎండిపోబోతున్న బోర్లన్నిటికీ నీటిని ఇంకింపజేసుకునే సామర్థ్యాన్ని నిర్ధారించడం కోసం నీరు తాపే పరీక్ష చెయ్యాలని నిపుణులు చెబుతున్నారు.

వాటర్‌ ట్యాంకర్‌ ద్వారా 5 వేల లీటర్ల నీటిని తీసుకువచ్చి బోరులో పోసి, నీరు లోపలికి ఎంతమేరకు వెళ్తున్నదీ పరీక్షిస్తారు. 200 మీటర్ల పరిధిలో పరిసరాల్లో ఏ బోరు నుంచీ నీటిని తోడకుండా ఉన్నప్పుడు ఈ నీటి పరీక్ష చేయాలి. నీటి పరీక్షకు సాఫ్ట్‌వేర్‌ సాధనం బోరు లోపలికి నీరు పోస్తున్నప్పుడు నీరు ఎక్కువగా బయటికి వచ్చేస్తే.. ఆ బోరుకు నీటిని ఇంకించుకునే సామర్థ్యం లేదని.. అది రీఛార్జ్‌ గుంత నిర్మాణానికి తగినది కాదని నిర్ధారించవచ్చు. ఒకవేళ నీరు చాలా వరకు లోపలికి ఇంకిపోతే ఆ బోరు చుట్టూ రీఛార్జ్‌ గుంత నిర్మాణానికి అనువుగా ఉందనుకోవచ్చు.

ఈ నీటి పరీక్ష చేసేటప్పుడు ఉపయోగించే ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ సాధనాన్ని సికింద్రాబాద్‌కు చెందిన ‘వాటర్‌ లైవ్‌లీహుడ్‌ ఫౌండేషన్‌’ వ్యవస్థాపకులు రామ్‌మోహన్‌ రూపొందించారు. పేటెంట్‌కు దరఖాస్తు చేశారు. ఈ సాధనం ద్వారా బోరు వద్ద ఇంకుడుగుంత నిర్మించుకోవాలో వద్దో ఖచ్చితంగా నిర్థారించుకోవచ్చని రామ్‌మోహన్‌(94401 94866) తెలిపారు.అన్ని బోర్లూ పనికిరావు నాగర్‌ కర్నూల్‌ జిల్లా అచ్ఛంపేట ప్రాంతంలోని ఐనోల్, రామాజిపల్లి గ్రామాల్లో ప్రాంతంలో వాటర్‌ అండ్‌ లైవ్లిహుడ్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 10 బోరు బావుల చుట్టూ వాన నీటి రీచార్జి గుంతల నిర్మాణం కోసం ట్యాంకర్లతో నీటి పరీక్ష చేశారు. 5 బోర్లు అనుకూలమని తేలింది. 2 బోర్లు అనుకూలం కాదని తేలింది. మరో 3 బోర్లకు రీచార్జి సామర్ధ్యం తక్కువగా ఉంది. కాబట్టి, రీచార్జ్‌ గుంతకు బదులు ఫారం పాండ్‌ను ఏర్పాటు చేసుకోవటం మేలని నిపుణులు తేల్చారు.

ఏ బోర్లు అనుకూలం? బోరు బావి చుట్టూ భూమి లోపల విడి మట్టి పొరలు ఉంటే.. ఆ బోరు బావికి వాన నీటిని లోపలి పీల్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.బోరు బావి చుట్టూ గట్టి మట్టి పొరలు భూమికి నీటిని పీల్చుకునే సామర్ధ్యం తక్కువగా ఉంటుంది. భూమి లోపల మొరం లేదా బంక మట్టి పొరలు ఉంటే నీరు ఇంకదు. గుట్టలు, ఎత్తయిన ప్రదేశాల్లోని బోర్లు, భూమిలో దట్టమైన సున్నపు రాయి ఉన్న బోర్లు రీచార్జ్‌ గుంత నిర్మాణానికి అనువు కాదు. ప్రపంచ మామిడి దినోత్సవం సందర్భంగా ఈ నెల 7(శుక్రవారం)న నూజివీడులో మామిడి రైతుల సదస్సు జరుగుతుంది.

నూజివీడులోని ప్రభుత్వాసుపత్రి రోడ్డులో బ్రహ్మకుమారి మఠం పక్కన ఛత్రపతి సదనంలో ఉ. 9 గం. నుంచి భారతీయ కిసాన్‌ సంఘ్, నోఫాల ఆధ్వర్యంలో సదస్సు జరగనుంది. పలువురు శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు, మామిడి ఎగుమతిదారులు పాల్గొని అనేక అంశాలపై చర్చిస్తారని నోఫా కార్యదర్శి బి. రాజేశ్‌ తెలిపారు. అందరూ ఆహ్వానితులే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement