పలాసలో సిద్ధమవుతున్న కిడ్నీ రీసెర్చ్ సెంటర్
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా మందస మండలం లింబుగం గ్రామస్తుడైన తెవ్వయ్య ఐదేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. డయాలసిస్ చేయించుకుంటున్నాడు. టీడీపీ ప్రభుత్వ హయాంలో శ్రీకాకుళం జిల్లాలోని ఏ ప్రభుత్వ ఆస్పత్రిలోనూ కిడ్నీ వ్యాధులకు సరైన చికిత్స అందుబాటులో ఉండేది కాదు. దీంతో చికిత్స కోసం విశాఖకు వెళ్లేవాడు. సహాయకునితో కలిసి ఒక్కసారి విశాఖకు వెళ్లి రావాలంటే రవాణా, ఇతర ఖర్చుల రూపంలో రూ.వేలల్లో ఖర్చు అయ్యేది.
చాలీచాలని పింఛన్, భార్య కూలిపనులకు వెళితే వచ్చే డబ్బుతో మందుల కొనుగోలు.. వెరసి వైద్యం చేయించుకోవడం తలకు మించిన భారంగా మారింది. 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక లింబుగంకు మూడు కి.మీ దూరంలోని హరిపురం సీహెచ్‌సీలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశారు. డయాలసిస్‌కు వెళ్లాల్సిన రోజు 108కు ఫోన్ చేస్తే అంబులెన్స్ ఇంటి వద్దకే వచ్చి తెవ్వయ్యను ఆస్పత్రికి తీసుకెళ్లేది. నెఫ్రాలజిస్ట్ సమీపంలోని హరిపురం ఆస్పత్రికి షెడ్యూల్ ప్రకారం వస్తున్నారు.
ఈ క్రమంలో ఏదైనా సమస్య ఉంటే వెంటనే వైద్యం అందుతోంది. మరోవైపు సీఎం జగన్ ఇతని పింఛన్‌ను రూ.10 వేలకు పెంచారు. వీటన్నింటికీ తోడు ఇప్పుడు త్వరలో పలాసలో కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలో తెవ్వయ్య మాట్లాడుతూ ‘నా లాగా మహమ్మారి జబ్బుతో బాధపడుతున్న వారికి సీఎం జగన్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది.
పింఛన్ రూ.10 వేలకు పెంపుతో ఆర్థికంగా అండగా నిలివడమే కాకుండా, మా ఊళ్లకు శుద్ధి చేసిన నీటిని అందించడానికి చర్యలు తీసుకున్నారు. మెరుగైన వైద్యాన్ని మాకు చేరువ చేశారు. ఇంతకంటే మాకేం కావాలి?’ అని ఆనందపడ్డాడు. ప్రభుత్వ చర్యల కారణంగా ఉద్దానం ప్రాంతంలో ఇలా ఎంతో మంది కిడ్నీ బాధితులకు ఊరట లభిస్తోంది.
అత్యాధునిక ఆస్పత్రితో భరోసా
కిడ్నీ వ్యాధులకు మూల కారణంగా భావిస్తున్న నీటి సమస్యకు చెక్ పెట్టడంతో పాటు వైద్య పరంగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. పలాసలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేపట్టారు. దీన్ని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. రూ.60 కోట్లతో నిర్మిస్తున్న రీసెర్చ్ సెంటర్, ఆస్పత్రి నిర్మాణ పనులు 85 శాతం మేర పూర్తయ్యాయి. తుది దశ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ర్యాంప్ బ్లాక్‌తో కలిపి మూడు బ్లాక్‌లుగా నాలుగు అంతస్తుల్లో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటవుతోంది.
మొదటి అంతస్తులో క్యాజువాలిటీ, రేడియో డయాగ్నోసిస్, హాస్పిటల్ సోర్ట్స్, సెంట్రల్ ల్యాబ్స్ ఉంటాయి. రెండో అంతస్తులో నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, సర్జరీ, మూడో అంతస్తులో డయాలసిస్, నెఫ్రాలజీ వార్డులు, నాలుగో అంతస్తులో ఓటీ కాంప్లెక్స్, పోస్ట్ ఆపరేటివ్/ఐసీయూ, యూరాలజీ వార్డ్స్, రీసెర్చ్ ల్యాబ్స్ ఉంటాయి. వీటన్నింటి కారణంగా కిడ్నీ రోగులకు భరోసా లభించనుంది.
అధునాత పరికరాల సమకూర్పు
కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌కు అత్యంత అధునాతన పరికరాలను ప్రభుత్వం సమకూరుస్తోంది. కిడ్నీ వ్యాధులకు సంబంధించిన అన్ని రకాల చికిత్సలతో పాటు, పరిశోధనలు చేయడానికి వీలుగా పరికరాల సమకూర్పు ఉంటోంది. ఎంఆర్‌ఐ, సిటీ స్కాన్, 2డీ ఎకో, హైఎండ్ కలర్ డాప్లర్, మొబైల్ ఎక్సరే ► డిజిటల్, ఏబీజీ అనలైజర్ పరికరాలతో పాటు, ఫుల్లీ రిమోట్ కంట్రోల్ ఐసీయూ కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌లో ఉండనున్నాయి.
మొత్తంగా 117 రకాల వైద్య పరికరాలను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ఇప్పటికే పలు పరికరాల సరఫరా కూడా మొదలైంది. రీసెర్చ్ సెంటర్‌లో శాశ్వత ప్రాతిపదికన 41 మంది స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్యుల నియామకానికి ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపింది. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ, ఇతర వైద్యులను ఇక్కడ నియమించనున్నారు.
ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇలా..
► గత ప్రభుత్వంలో తీవ్రమైన కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ.2,500 ఇచ్చే పెన్షన్‌ను సీఎం జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.10 వేలకు పెంచింది. ప్రతి నెల 1వ తేదీనే లబ్ధిదారుల గుమ్మం వద్దకు రూ.10 వేల చొప్పున వలంటీర్లు పెన్షన్ అందజేస్తున్నారు.
► టెక్కలి, పలాస, సోంపేట, కవిటి, హరిపురం ఆస్పత్రుల్లో 69 మెషిన్‌లతో డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. 2020లో హరిపురంలో డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభించారు. మరో 25 మిషన్‌లతో కొత్తగా గోవిందపురం, అక్కుపల్లి, కంచిలి, బెలగాంలో డయాలసిస్ సెంటర్లు మంజూరయ్యాయి. ఇలా వరుసగా 2019–20లో 37,454 సెషన్‌లు, 2020–21లో 46,162 సెషన్‌లు, 2021–22లో 54,520 సెషన్‌లు, 2022–23లో 55,708 సెషన్‌లు కిడ్నీ బాధితులకు డయాలసిస్ చేశారు.
► ఇచ్చాపురం, కంచిలి సీహెచ్‌సీ, పీహెచ్‌సీల్లో 25 మిషన్‌లతో డయాలసిస్ సెంటర్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.
► కిడ్నీ వ్యాధులపై వైద్య పరీక్షల కోసం ఉద్దానం ప్రాంతంలోని 18 పీహెచ్‌సీలు, ఐదు యూపీహెచ్‌సీలు, ఆరు సీహెచ్‌సీల్లో సెమీ ఆటో ఎనలైజర్లు, ఎలక్ట్రోలైట్ ఎనలైజర్లు, యూరిన్ ఎనలైజర్లు అందుబాటులో ఉంచారు.
► టీడీపీ హయాంలో డయాలసిస్ రోగులకు 20 రకాల మందులే అందిస్తుండగా, అవి కూడా అరకొరగానే అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం ప్రతి ఆస్పత్రిలో 37 రకాల మందులు అందుబాటులో ఉన్నాయి.
► కొత్త కేసుల గుర్తింపునకు వైద్య శాఖ నిరంతరాయంగా స్క్రీనింగ్ కొనసాగిస్తోంది. వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లలో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్‌వో)లకు ప్రత్యేకంగా ఒక యాప్‌ను రూపొందించారు. వీరు ఈ ప్రాంతంలోని ప్రజలను స్క్రీనింగ్ చేసి, అనుమానిత లక్షణాలున్న వారి నుంచి రక్త నమూనాలు సేకరించి దగ్గరలోని పీహెచ్‌సీలకు సీరమ్ క్రియాటిన్ పరీక్షలకు తరలిస్తున్నారు.
ఇబ్బందులు తొలగిపోతాయి
సంవత్సరం నుంచి నేను డయాలసిస్ చేయించుకుంటున్నాను. మా గ్రామానికి దగ్గరలోని హరిపురం ప్రభుత్వాస్పత్రిలో డయాలసిస్ సెంటర్ ఉండటంతో రవాణా, వ్యయ ప్రయాసలు లేవు. డయాలసిస్ చేయించుకోవడానికి వెళ్లాల్సిన రోజు 108కు ఫోన్ చేస్తే అంబులెన్స్ ఇంటి వద్దకు వచ్చి ఆస్పత్రికి తీసుకుని వెళుతోంది. ప్రభుత్వం రూ.10 వేల పెన్షన్ కూడా ఇస్తోంది. షెడ్యూల్ ప్రకారం నెఫ్రాలజిస్ట్ హరిపురంకు వస్తున్నారు. మిగిలిన రోజుల్లో ఏదైనా అనారోగ్య సమస్య వస్తే శ్రీకాకుళం వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు పలాసలో కిడ్నీ సెంటర్ ప్రారంభిస్తే ఆ ఇబ్బంది కూడా తొలగిపోతుంది.
- శ్రీరాములు, కిడ్నీ వ్యాధిగ్రస్తుడు, బేతాలపురం, శ్రీకాకుళం జిల్లా
నీళ్ల దిగులుండదిక..
కిడ్నీ వ్యాధి ప్రభావిత గ్రామాల్లో మా ఊరు కూడా ఒకటి. ప్రభుత్వం మా కోసం రక్షిత నీటి పథకం అందుబాటులోకి తెస్తోంది. పనులు దాదాపు పూర్తికావచ్చాయని చెబుతున్నారు. త్వరలో మా గ్రామానికి నీళ్లు వస్తాయి. బోర్ నీళ్లు తాగడం వల్లే కిడ్నీ జబ్బులు వస్తున్నాయని చాలా మంది చెప్పారు. దీంతో మేం పక్క ఊరి నుంచి సరఫరా చేస్తున్న ఫిల్టర్ నీళ్లు కొనుక్కుని తాగుతున్నాం. ప్రభుత్వమే ఉచితంగా కొళాయి ద్వారా మంచినీటిని సరఫరా చేయబోతుండటం మాకెంతో ఊరట కలిగిస్తోంది. ఇప్పటికే వృద్ధాప్య పింఛన్‌లు, అమ్మ ఒడి, పక్కా ఇళ్లు, ఇతరత్రా పథకాలతో మా ప్రాంత ప్రజలకు సీఎం జగన్ అండగా నిలిచారు. ఆ మహమ్మారి జబ్బుకు శాశ్వత పరిష్కారం చూపితే ఆయన మేలు ఎప్పటికీ మరువం.
- ఎం.సరోజిని, రంగోయి, శ్రీకాకుళం జిల్లా
వ్యాధిగ్రస్తులకు పెద్ద ఊరట
కిడ్నీ రీసెర్చ్ సెంటర్ భవన నిర్మాణం తుది దశలో ఉంది. మరోవైపు వైద్య పరికరాలు సమకూరుస్తున్నాం. త్వరలోనే రీసెర్చ్ సెంటర్ అందుబాటులోకి వస్తుంది. భవన నిర్మాణం, పరికరాల సమకూర్పునకు కలిపి రూ.60 కోట్ల మేర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పెద్ద ఊరట లభిస్తుంది.
- మురళీధర్ రెడ్డి, ఎండీ, ఏపీఎంస్‌ఐడీసీ
Comments
Please login to add a commentAdd a comment