అనంతపురం జిల్లా కురువల్లిలో గ్రామ సచివాలయాన్ని ధ్వంసం చేస్తున్న టీడీపీ కార్యకర్తలు
రెచ్చిపోయి దాడులు చేస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు
ఏ తప్పూ చేయకపోయినా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలే టార్గెట్
ఇళ్లపై, ప్రభుత్వ కార్యాలయాలపై కొనసాగుతున్న దాడులు
ఇదేమని ప్రశ్నిస్తే హత్యాయత్నాలు.. కిడ్నాప్‌లు
చితకబాది బలవంతంగా క్షమాపణలు చెప్పిస్తున్న వైనం
వర్సిటీ వీసీలపై దౌర్జన్యం.. బలవంతంగా విగ్రహాల తొలగింపు
చంద్రబాబు, లోకేశ్‌ల లక్ష్యం.. ఆటవిక రాజ్యం
వీరిద్దరి కనుసైగ మేరకే కవ్వింపులు.. ఆపై గొడవలు
ఘర్షణలన్నింటినీ ‘సినిమా’గా చూస్తున్న పోలీసులు
టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయి గొడవలు కొనసాగిస్తున్నారు. దాడులు చేయడం తమ జన్మ హక్కు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అధికారం దక్కింది దౌర్జన్యం చేయడానికే అని చాటి చెబుతున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తల తీరు విస్తుగొలుపుతోంది. పట్టపగలు కర్రలు, రాళ్లు, రాడ్లతో వీరంగం వేస్తున్నారు. ఊరూరా విగ్రహాలను, శిలా ఫలకాలను ధ్వంసం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీలో ఎవరూ ఉండకూడదన్నట్లు బెదిరింపులకు దిగుతున్నారు.
ఈ పార్టీకి ఓట్లేసిన వారిని దుర్భాషలాడుతున్నారు. ఓట్లు వేయించిన వారు ఊరు వదిలి వెళ్లాలని హుకుం జారీ చేస్తున్నారు. ఇది అన్యాయం కదా.. అని ప్రశి్నస్తే దుస్తులు విప్పి కొడుతున్నారు. ఏ తప్పూ చేయకపోయినా, వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇచ్చినందుకు బహిరంగ క్షమాపణలు చెప్పిస్తున్నారు. యూనివర్సిటీ వీసీలపై దౌర్జన్యం చేస్తున్నారు. పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఇదివరకు ఇలా ఎప్పుడైనా జరిగిందా? ఇప్పుడే ఎందుకు ఇలా జరుగుతోంది? టీడీపీ నేతలు, కార్యకర్తలు నేరుగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని విధ్వంసం సృష్టిస్తుంటే.. ప్రభుత్వ ఆస్తులను పాడు చేస్తుంటే.. స్పందించాల్సిన పోలీసులు ఎందుకు చేష్టలుడిగి చూస్తున్నారు? నిజంగా ఈ పరిణామం ఖాకీ డ్రస్సుకే అవమానం.
దేశ చరిత్రలో ఇదివరకెన్నడూ లేని రీతిలో గత ఐదేళ్లలో గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాల భవనాలు వెలిశాయి. ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్‌లు, సచివాలయాలు, కొత్త రూపు రంగరించుకున్న స్కూళ్లు.. ఇలా ఎన్నెన్నో ప్రభుత్వ బిల్డింగ్‌లు నిర్మాణమయ్యాయి. ఒక్కో గ్రామానికి కోట్లాది రూపాయల విలువైన ఆస్తి సమకూరింది. ఇదంతా ప్రజలందరి ఉమ్మడి ఆస్తి. భద్రంగా కాపాడుకోవాలి. అలాంటిది పని గట్టుకుని ఊరూరా టీడీపీ సేన గునపాలు చేత పట్టుకుని ధ్వంసం చేస్తుండటాన్ని ఏమనాలి? రౌడీయిజం, దౌర్జన్యం, ఉన్మాదం.. ఇలా ఈ పదాలన్నీ తక్కువే. ఎవర్ని చూసుకుని ఇలా పేట్రేగిపోతున్నారు? చంద్రబాబు, లోకేశ్‌లను చూసుకునే కదా!
బాపట్ల జిల్లాలో పిండ ప్రదానం చేస్తుంటే అడ్డుకోవడం.. మంగళగిరిలో వైఎస్సార్‌సీపీ అభిమాని ఇంటిని జేసీబీతో కూల్చేయడం.. ఏకంగా నెల్లూరు మేయర్ దంపతులనే బెదిరించడం.. ఇదే జిల్లా దత్తులూరు మండలంలో జగనన్న లే అవుట్‌లోని ఇళ్లను ధ్వంసం చేయడం.. కొండాపురం మండలం గానుగపెంటలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఇంటి ప్రహరీ, మెట్లు కూల్చేయడం.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న వారిని భయభ్రాంతులకు గురి చేయడం.. ఇకపై పోస్టులు ఆపేస్తామని వారితో ప్రకటనలు ఇప్పించడం.. తప్పుడు కేసులు పెట్టడం.. ఇలా ఒక్కో ఊళ్లో ఒక్కో అరాచకం కళ్లెదుటే కనిపిస్తోంది ఒక్క పోలీసులకు తప్ప అందరికీ.
రేషన్ పంపిణీ వాహనంపై దాడి
వైఎస్ జగన్ ఫొటో చింపేసి.. టైర్లు కోసేసిన వైనం.. శ్రీకాకుళం జిల్లాలో ఘటన
కాశీబుగ్గ: ఎన్నికల్లో టీడీపీ గెలిచినప్పటి నుంచి అనేకరకాలుగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడులకు తెగబడుతున్నారు. ప్రభుత్వ ఆస్తులపైనా దాడులు చేస్తూ ప్రజలకు అందుతున్న సేవలను నిలిపివేయాలని కుట్రలకు పాల్పడుతున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గురుదాసుపురం సచివాలయం పరిధిలో ఉన్న సున్నాదేవి గ్రామంలో రేషన్ వాహనాన్ని ధ్వంసం చేశారు. గ్రామంలో ఆదివారం రాత్రి రేషన్ పంపిణీ చేసి చీకటి పడ్డాక వాహనాన్ని నిలిపి ఉంచారు.
అయితే గుర్తు తెలియని వ్యక్తులు వాహనం వద్దకు వచ్చి దానిపైన ఉన్న వైఎస్ జగన్ చిత్రపటాన్ని చించేశారు. వాహనం ఎడమ టైరును కోసేశారు. అక్కడితో ఆగకుండా వాహనానికి చుట్టూరా గీతలు గీసి రాళ్లతో కొట్టారు. వాహనం ఆపరేటర్ కిరణ్‌కుమార్ యాదవ్ వాహనం వద్దకు వెళ్లి చూసేసరికి టైర్లు కోసి బండి పాడైపోయి కనిపించింది. దీంతో అక్కడ రేషన్ పంపిణీ ఆగిపోయింది. ఉద్దానం ప్రాంతంలో ఉన్న మరో మూడు గ్రామాలకు సోమవారం బియ్యం పంపిణీ చేయాల్సి ఉండగా నిలిపివేసి పోలీసులకు సమాచారం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment