కిడ్నీ రోగులకు ప్రత్యేక వాహనాన్ని ప్రారంభిస్తున్న మంత్రి విడదల రజిని, ఎమ్మెల్యే రక్షణనిధి
ఎ.కొండూరు: కిడ్నీ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన వైద్యం అందిస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలంలోని కిడ్నీ ప్రభావిత గ్రామాల్లో ఆమె శనివారం పర్యటించారు. కృష్ణారావుపాలెం శివారు మాన్‌సింగ్, దీప్లా నగర్, గిరిజన తండాల్లోని కిడ్నీ వ్యాధిగ్రస్తులను పరామర్శించారు. వ్యాధి సోకటానికి కారణాలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. నూతనంగా నిర్మిస్తున్న డయాలసిస్ సెంటర్, పీహెచ్‌సీని పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యాధిగ్రస్తులకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా స్థానిక పీహెచ్‌సీలో స్క్రీనింగ్ టెస్టులు చేయిస్తామని చెప్పారు. అవసరమైన వారికి విజయవాడలో 12 ప్రైవేటు ఆసుపత్రుల్లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించి, మందులు కూడా ఇస్తామని తెలిపారు. రోగుల కోసం శనివారం నుంచి ఇక్కడ ఒక వాహనం అందుబాటులో ఉంటుందన్నారు.
స్థానిక పీహెచ్‌సీలోనే డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 104 వాహనం ద్వారా ప్రతి నెలా కిడ్నీ రోగులకు మందులు అందిస్తామని చెప్పారు. ప్రస్తుతం ఐదు తండాల్లో తాత్కాలికంగా ట్యాంకర్లతో తాగునీరు అందిస్తున్నామని, త్వరలో మరో 15 తండాల్లో రూ. 6 కోట్లతో పైపులైన్ల ద్వారా తాగునీరిస్తామని చెప్పారు.
ఈ మండలానికి స్వచ్ఛమైన తాగు నీరు అందించడం కోసం రూ.38 కోట్లతో కృష్ణా జలాలను ఇంటింటికి అందిస్తామని, దీనికి టెండర్లు కూడా పూర్తయ్యాయని తెలిపారు. అనంతరం కిడ్నీ రోగుల కోసం ఏర్పాటు చేసిన వాహనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కె.రక్షణనిధి,తదితరులు పాల్గొన్నారు.
కిడ్నీ వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు
గుంటూరు మెడికల్: రాష్ట్ర ప్రభుత్వం కిడ్నీ వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు చెప్పారు. గుంటూరులో శనివారం జరిగిన నెఫ్రాలజిస్టుల రాష్ట్ర సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉద్దానంలో కిడ్నీ వ్యాధి ప్రబలడానికి కారణాలపై ఐసీఎంఆర్‌తో కలిసి పరిశోధనలు చేసినట్లు చెప్పారు.
నొప్పి నివారణ మాత్రలు ఎక్కువగా వాడటం, తాగే నీటిలో సిలికాన్, హెవీ మెటల్స్ ఎక్కువగా ఉండటం, ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం కారణాలని తేలిందన్నారు. ఉద్దానంతోపాటు, ఎ.కొండూరులో కూడా కిడ్నీ కేసులు వెలుగులోకి వచ్చాయని, వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment