‘ఫ్యామిలీ డాక్టర్‌’పై ప్రత్యేక దృష్టి | Sajjala Ramakrishna Reddy And Vidadala Rajini On Family Doctor | Sakshi
Sakshi News home page

‘ఫ్యామిలీ డాక్టర్‌’పై ప్రత్యేక దృష్టి

Published Thu, Nov 17 2022 5:07 AM | Last Updated on Thu, Nov 17 2022 5:07 AM

Sajjala Ramakrishna Reddy And Vidadala Rajini On Family Doctor - Sakshi

విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేస్తున్న మంత్రి రజిని, ప్రభుత్వ సలహాదారు సజ్జల

సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడ తూర్పు): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డాక్టర్‌ ట్రయిల్‌ రన్‌ను సమర్థంగా నిర్వహించి క్షేత్రస్థాయిలో తలెత్తే సమస్యలు, ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అధికారులను ఆదేశించారు. తద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు ఏం చేయాలనే దానిపై నిరంతరం కసరత్తు చేయాలన్నారు.

మంగళగిరి ఏపీ ఐఐసీ టవర్స్‌లోని తన కార్యాలయంలో బుధవారం వైద్య శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. గత నెల 21 నుంచి ఫ్యామిలీ డాక్టర్‌ ట్రయిల్‌ రన్‌ ప్రారంభమైందని తెలిపారు. దీనికి ప్రజల నుంచి లభిస్తున్న స్పందన, వైద్యుల నుంచి వస్తున్న సూచనలు తదితర వివరాలను వివరించారు. మూడు వారాల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 4,733 వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లకు రెండుసార్లు 104 మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌ (ఎంఎంయూ) వాహనాలు వెళ్లాయని, సిబ్బంది గ్రామాలకే వెళ్లి వైద్య పరీక్షల సేవలు అందించారని పేర్కొన్నారు. మరో 4,267 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లకు 104 ఎంఎంయూ వాహనాలు ఒకసారి వెళ్లాయని వివరించారు.  

గ్రామాలకే వైద్యులు వెళ్లడం గొప్ప విషయం 
మంత్రి రజిని మాట్లాడుతూ.. ఫ్యామిలీ డాక్టర్‌ విధానానికి సంబంధించి తాను స్వయంగా ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నానని, వారి నుంచి అద్భుతమైన స్పందన కనిపిస్తోందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 97,011 మంది బీపీ బాధితులు, 66,046 మంది సుగర్‌ వ్యాధిగ్రస్తులకు పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేసినట్టు చెప్పారు. 

వైద్య విద్యార్థులకు రీసెర్చ్‌ స్కాలర్‌షిప్‌ల పంపిణీ
వైద్య రంగానికి సీఎం జగన్‌ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి రజిని, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడలోని వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్సిటీలో బుధవారం అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులకు రీసెర్చ్‌ స్కాలర్‌షిప్‌లను పంపిణీ చేశారు. మంత్రి రజిని మాట్లాడుతూ వైద్యశాఖలో ఒక్క ఖాళీ కూడా లేకుండా పెద్దఎత్తున పోస్టులు భర్తీ చేశామన్నారు. సజ్జల మాట్లాడుతూ.. వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం అండర్‌ గ్రాడ్యుయేషన్‌ విద్యార్థులను సైతం పరిశోధనల్లో ప్రోత్సహించడం ప్రశంసనీయమన్నారు. ఈ రీసెర్చ్‌ ఫలితాలు గ్రామీణ ప్రజలకు సైతం అందాలన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement