ఉద్దానానికి మొండిచేయి!
► బడ్జెట్‌లో కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం రూపాయి కూడా కేటాయించని సర్కార్
► ఆందోళనలో బాధితులు
కవిటి: అత్యంత ప్రమాదకరస్థాయిలో విజృంభిస్తున్న ఉద్దానం కిడ్నీవ్యాధులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. వ్యాధిగ్రస్తులపై తమకు ఎంతో చిత్తశుద్ధి ఉందని పాలకులు చెబుతూ వచ్చారు. అయితే తాజాగా బుధవారం శాసనసభలో ఆర్థికశాఖమంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కిడ్నీవ్యాధిగ్రస్తులకు మొండిచేయి చూపా రు. వ్యాధి మూలాలు కనుక్కోవడానికి గాని, వ్యాధిగ్రస్తుల వైద్య సేవల కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఈ విషయం తెలిసి బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్దానం వాసులు చాలామంది మూత్రపిండల వ్యాధిబారిన పడుతున్న విషయం తెలిసిందే.
వ్యాధి మూలాలు కనుక్కోవడానికి కేంద్ర ప్రభుత్వం భారతీయ వైద్యపరిశోధనామండలి(ఐసీఎంఆర్) బృందంతో అధ్యయనం పేరిట ఉద్దానం ప్రాంతానికి ఫిబ్రవరి మొదటివారంలో నిపుణుల బృందాన్ని పంపింది. దురదృష్టవశాత్తూ వారు క్షేత్రస్థాయిలో కాలుమోపకుండానే వెనుదిరగడంతో ఇక్కడ ప్రజలు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. పైగా ఈ బృందంలో సభ్యుడు ఎన్టీఆర్ హెల్త్‌వర్సిటీ వైస్‌చాన్సలర్ డాక్టర్ రవిరాజ్ కిడ్నీ వ్యాధులకు కారణం నీటిలో ఉన్న సిలికాన్ అంటూ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి కామినేనికి నివేదిక ఇచ్చారు. ఎటువంటి పరిశోధనలూ లేకుండానే ఈ నివేదిక అందించడం ఈ ప్రాంతంలో తీవ్రచర్చనీయాంశం అయింది. తమపై అనవసరంగా బురదజల్లారని జిల్లా గ్రామీణా నీటిసరఫరా విభాగం అధికారులు, ఉద్దానం ప్రాజెక్ట్ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు మాటమాత్రం చెప్పకుండానే ప్రభుత్వానికి ఇచ్చిన ఆ నివేదికలో నీటిలో సిలికాన్ ఉందని డాక్టర్ రవిరాజ్ సిలికా పలుకులు పలకడం పట్ల నిర్ఘాంతపోయారు. ఇలాంటి పరిస్థితిలో రాష్ట్ర బడ్జెట్‌లో వ్యాధి మూలాలు కనుక్కోవడానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తారని ఈ ప్రాంతీయులు గంపెడాశతో ఎదురు చూశారు. అయితే వారందరికీ భంగపాటు మిగిలింది. వ్యాధిగ్రస్తుల వైద్యఖర్చులకు నిధులు కేటాయింపు లేదు. డయాలసిస్‌కు వెళ్లేవారికి రవాణాచార్జిల పేరిట నిధుల మంజూరుగానీ, వ్యాధిగ్రస్తులకు ఉచిత మందుల పంపిణీ వంటి విషయంపై బడ్జెట్‌లో ప్రస్తావించకపోవడంతో ఉద్దానం వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరుని తప్పుబడుతున్నారు.
బడ్జెట్ అంకెల గార ప్రభుత్వం ప్రవేశప డీ: ెట్టిన వార్షిక బడ్జెట్ అంకెల గారడీగా ఉంది. ప్రాధాన్యతా రంగాలకు కేటాయింపుల్లేవు. ఉద్దానం కిడ్నీ వ్యాధుల అధ్యయనాన్ని ప్రభుత్వం తూతూమంత్రంగా మార్చేసిందనటానికి బడ్జెట్‌లో కనీస ప్రస్తావన లేకపోవడం, నిధుల కేటాయింపులో మొండిచెయ్యి చూపడం ఉదాహరణగా చెప్పవచ్చు. ఇది చాలా బాధాకరం. ప్రభుత్వం తమను ఆదుకుంటుందని చూసిన కిడ్నీవ్యాధిగ్రస్తులకు ఈ బడ్జెట్ చేదుగుళికనే ఇచ్చింది. –పిరియా సాయిరాజ్, మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌సీపీ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త
కుటుంబానికి భారమయ్యాను: 50 ఏళ్ల వయసు వరకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. నాలుగేళ్ల క్రితం ఒంట్లో బాగోకపోవడంతో సోంపేట వెళ్లి వైద్యుడిని సంప్రదిస్తే కిడ్నీవ్యాధి బారిన పడ్డానని తెలిపారు. అప్పటి నుంచి మందులు వాడుతూ వస్తున్నాను. రెండు సంవత్సరాల నుంచి వారానికి రెండుసార్లు డయాలసిస్ కోసం వైజాగ్ వెళ్తున్నాను. శ్రీకాకుళం దగ్గర ఉందని వెళితే వివిధ కారణాలు చూపి.. వైజాగ్ వెళ్లాలంటున్నారు. భార్య సాయంతో వైజాగ్ వెళ్లి వస్తున్నాను. పిల్లలు కూలి చేసి తెచ్చే డబ్బులను వైద్యానికి ఖర్చు చేస్తున్నాను. వారానికి రూ.1600 మందులు అవసరమవుతున్నాయి. దీంతో కుటుంబానికి భారంగా మారాను. – పొడియా మదను, శ్రీహరిపురం, కవిటి మండలం