ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పరశురాములు
ఎదుగుతున్న ఒక్కగానొక్క కొడుకును చూసి సంతోషించారు ఆ తల్లిదండ్రులు. కాలేజీకి వెళ్తున్న కొడుకు ప్రయోజకుడై కష్టాలు తీర్చుతాడని కలలు కన్నారు. కానీ వారి ఆశల శిఖరం కూలింది. కోటి ఆశలుపెట్టుకున్న కొడుకు ఆస్పత్రి పాలయ్యాడు. రెండు కిడ్నీలు పాడైపోయిన కొడుకును బతికించుకునేందుకు ఆ తల్లిదండ్రులు నేడు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. కొడుకు ప్రాణభిక్ష పెట్టండని వేడుకుంటున్నారు. ఆ తల్లిదండ్రులే రఘునాథ్‌పల్లి మండలం మాదారానికి చెందిన అరూరి పుష్ప, కిష్టయ్య దంపతులు.
రఘునాథపల్లి(జనగామ) : రఘునాథపల్లి మండలం మాదారానికి చెందిన అరూరి కిష్టయ్య, పుష్ప దంపతులకు ఏకైక కుమారుడు పరశురాములు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. రెండు నెలల క్రితం పరశురాములు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా వరంగల్ ఎంజీఎంలో చేర్చారు. కిడ్నీలు పనిచేయడం లేదని వైద్యులు సూచించారు. దీంతో సికింద్రాబాద్‌లోని సన్‌షైన్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రతి రోజు డయాలసిస్ ద్వారా వైద్యం అందిస్తున్నారు. ఇప్పటికే రూ.2 లక్షలకు పైగా కొడుకు కోసం అప్పు చేశారు. లివర్ సహితం దెబ్బతింది. కొడుకును కాపాడుకునేందుకు వారికున్న ఎకరం భూమిని అమ్మేందుకు కిష్టయ్య దంపతులు సిద్ధపడ్డారు. కానీ కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు.
స్నేహితుల విరాళాలు.
కిష్టయ్య దంపతుల ఆర్థిక పరిస్థితిని చూసిన పరశురాములు స్నేహితులు పలు చోట్ల విరాళాలు సేకరించి రూ.8 వేలు అందజేశారు. సర్కారు దయ తలచి తమ కొడుకుకు మెరుగైన వైద్యం అందించి పుత్రభిక్ష పెట్టాలని ఆ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ఆపన్నహస్తం అందించేవారు 9908921650, 9908258044 నంబర్లకు ఫోన్ చేయాలని వేడుకుంటున్నారు.