ఇంటర్న్‌షిప్‌కు సర్వం సిద్ధం | Internship for Engineering Students on January 22 2024: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఇంటర్న్‌షిప్‌కు సర్వం సిద్ధం

Published Sun, Jan 21 2024 6:13 AM | Last Updated on Sun, Jan 21 2024 6:13 AM

Internship for Engineering Students on January 22 2024: Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డిగ్రీ, బీటెక్‌ విద్యార్థుల దీర్ఘకాలిక ఇంటర్న్‌షిప్‌నకు సర్వం సిద్ధమైంది. ఈ విద్యార్థులకు విద్యతో పాటు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాన్ని అందించేందుకు ప్రభుత్వం ఇంటర్న్‌షిప్‌ ప్రవేశపెట్టింది. ఇంజనీరింగ్‌ విద్యార్థులకు సోమవారం నుంచి ఇంటర్న్‌షిప్‌ ప్రారంభమవుతుంది. డిగ్రీ విద్యార్థులకు వచ్చే నెలలో ప్రారంభమవుతుంది. గతేడాది 2.56 లక్షల మంది ఇంటర్న్‌షిప్‌ చేయగా, ఈ ఏడాది 3.46 లక్షల మంది ఇందుకు సన్నద్ధమవుతున్నారు.

ప్రభుత్వం 30కి పైగా ప్రపంచ స్థాయి సంస్థల్లో వర్చువల్‌గా, మరో 30 వేలకు పైగా ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమల ద్వారా ఇంటర్న్‌షిప్‌ కల్పిస్తోంది. ఇంటర్న్‌షిప్‌ కోసం ఉన్నత విద్యా మండలి పోర్టల్‌లో లెర్నింగ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఎల్‌ఎంఎస్‌) ఏర్పాటు చేశారు. జిల్లాలవారీగా గుర్తించిన సంస్థల వివరాలను వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ చేస్తున్నారు. ఆ సంస్థలతో సమన్వయం చేసేందుకు జిల్లా కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక కమిటీలను ప్రభుత్వం నియమించింది.

ప్రపంచ స్థాయి సంస్థలతో ఒప్పందం
విద్యార్థుల ఇంటర్న్‌షిప్‌ కోసం పరిశ్రమలు, ఐటీ సంస్థలు, ప్రముఖ వర్తక, వాణిజ్య సంస్థలతో సహా కోర్సులతో సంబంధమున్న మైక్రో, స్మాల్, మీడియం, లార్జ్, మెగా సంస్థలను ప్రభుత్వం ఎంపిక చేసింది. వీటిలో మాన్యుఫాక్చరింగ్‌తో పాటు సర్వీసు సంస్థలూ ఉన్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందం చేసుకుంటోంది. ఎల్‌ఎంఎస్‌–ఐఐసీ పోర్టల్‌లో వీటి వివరాలు ఉంచింది. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, స్మార్ట్‌ ఇంటన్జ్, ఎక్సల్‌ ఆర్, సెలర్‌ అకాడమీ, సిస్కో, నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్, వాద్వానీ ఫౌండేషన్, టీమ్‌ లీజ్‌ వంటి సంస్థల ద్వారా ఇంటర్న్‌షిప్‌ అందిస్తోంది.

ఈ ఏడాది సుమారు 40 వేల మంది సంప్రదాయ డిగ్రీ విద్యార్థులకు స్ట్రైఫండ్‌తో కూడిన ఇంటర్న్‌షిప్‌ కల్పిస్తోంది. వీరితో పాటు 2వేల మంది ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్యూచర్‌ స్కిల్స్‌ ఎక్స్‌పర్ట్స్‌ కింద సేవలు వినియోగించుకోనుంది. వీరికి నెలకు రూ.12 వేల చొప్పున చెల్లిస్తూ ఆరు నెలల పాటు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు డిజిటల్‌ టెక్నాలజీపై అవగాహన పెంపొందించనుంది.

చదువుకొనే సమయంలోనే జీతాన్నీ అందుకుంటారు
విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించేందుకు డిగ్రీతో పాటు ఇంజనీరింగ్‌ తదితర ప్రొఫెషనల్‌ కోర్సులకు ఏడాది పాటు ఇంటర్న్‌షిప్‌ అమలు చేస్తున్నాం. దీర్ఘకాలిక ఇంటర్న్‌షిప్‌ను చివరి సెమిస్టర్‌లో పెట్టడం ద్వారా విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న పాఠ్యాంశాలతో పాటు పరిశ్రమల్లో నేర్చుకున్న విజ్ఞానంతో వేగంగా ఉద్యోగాలు సాధిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు 10 లక్షల మందికి షార్ట్‌ టర్మ్, లాంగ్‌ టర్మ్‌ ఇంటర్న్‌షిప్‌ అందించింది. ఏపీలో విద్యార్థులు తొలిసారిగా చదువుకొనే సమయంలోనే జీతాన్నీ అందుకోనున్నారు.  – ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement