పసిబిడ్డతో రజిత, కళ్యాణ్ దంపతులు
ఇల్లెందు: బందీగా మారిన ఆ తల్లికి విముక్తి లభించింది. అమ్మ స్పర్శ కరువై, ఆమె ఒడిలోని వెచ్చదనం దూరమై, తల్లి పాల అమృతం అందక రెండు రోజులుగా అల్లాడుతున్న ఆ పసికందును అక్కున చేర్చుకుంది. ఆకలి తీర్చింది. ‘‘బిడ్డా.. ఇంకెప్పటికీ నీ వెంటే ఉంట.. నిన్నొదిలి ఉండ..’’ అంటూ, ఆ పసివాడిపై ముద్దులు కురిపించింది. ఇల్లెందు మండలం రొంపేడు పంచాయతీ మిట్టపల్లి తండాకు చెందిన బి.రజిత, గార్ల మండలం ముల్కనూరుకు చెందిన బళ్లెం కళ్యాణ్ ప్రేమించుకున్నారు. ఏడాది క్రితం గార్ల శివాలయంలో పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమ పెళ్లికి ఆమె తల్లిదండ్రులు అంగీకరించలేదు. హైదరాబాద్‌లో కాపురం పెట్టిన ఈ దంపతులకు మూడు నెలల క్రితం బాబు జన్మించాడు.
ఈ దంపతులు, తమ చిన్నారితో కలిసి ఇటీవల ఇల్లెందు వచ్చారు. రజితను ఆమె తల్లిదండ్రులు నమ్మించి, మిట్టపల్లిలోని తమ ఇంటికి శుక్రవారం రప్పించారు. సాయంత్రం వరకు వస్తానని చెప్పి, మూడు నెలల 11 రోజుల వయసున్న తన బిడ్డను ఇల్లెందులో తన భర్త కళ్యాణ్ వద్ద వదిలి వెళ్లింది. అక్కడ ఆమెను తల్లిదండ్రులు గృహ నిర్బంధంలో ఉంచారు. పసిబిడ్డ కోసం అక్కడ ఆ తల్లి వేదన. తల్లి కోసం ఇక్కడ ఈ పసిబిడ్డ రోదన. ఈ పరిస్థితిలో, పోలీసులను కళ్యాణ్ ఆశ్రయించాడు. వారు అంతగా స్పందించకపోవడంతో ‘సాక్షి’కి సమాచారమిచ్చాడు. దీనిపై, ఆదివారం రోజున ‘సాక్షి’లో ‘బందీగా తల్లి.. ఆకలితో పసికూన..’ శీర్షికన కథనం ప్రచురితమైంది.
ఈ కథనంతో పోలీసులు కదిలారు. మిట్టపల్లిలోని రజిత పుట్టింటికి ఆదివారం ఉదయం ఎస్‌ఐ రాజు వెళ్లారు. రజితను, ఆమె పుట్టింటి వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అప్పటికే పోలీస్ స్టేషన్‌లో పసికూనతో కళ్యాణ్ ఎదురుచూస్తున్నాడు. బిడ్డను చూడగానే రజిత పరుగెత్తుకుంటూ వచ్చింది. వాడిని చేతుల్లోకి తీసుకుని తనవితీరా ముద్దాడింది. కన్నీటిపర్యంతమైంది. పాలు పట్టింది. ఆకలి తీర్చింది.
ఆ తరువాత రజితను, కళ్యాణ్‌ను, రజిత కుటుంబీకులను ఎస్‌ఐ రాజు విచారించారు.
తన కోసం భర్త కళ్యాణ్, పసిబిడ్డ ఎదురుచూస్తున్నారని, వెళతానని బయల్దేరిన తనను పుట్టింటోళ్లు ఇంటిలో బంధించారని ఎస్‌ఐతో రజిత చెప్పింది. తనకు భర్త కళ్యాణ్, బిడ్డ కావాలని స్పష్టంగా చెప్పింది. ఎస్‌ఐ అడగడంతో ఇదే విషయాన్ని రాసిచ్చింది. ఆమె కుటుంబీకులు, భర్త కళ్యాణ్ నుంచి కూడా రాయించుకున్నారు. రజితను ఆమె భర్త కళ్యాణ్‌తో పంపించారు. కళ్యాణ్, రజిత, బాబు, కళ్యాణ్ తల్లి సువార్త కలిసి ఇల్లెందు పోలీస్ స్టేషన్ నుంచి గార్ల ముల్కనూరులోని తమ ఇంటికి వెళ్లారు. చివరికి, కథ సుఖాంతమైంది.
Comments
Please login to add a commentAdd a comment