lovers marriage
-
విచిత్రమైన ప్రేమ కథ: చనిపోయి తమ ప్రేమను గెలిపించుకున్న జంట!
ఎన్నో విచిత్రమైన ప్రేమ కథలు గురించి విన్నాం. కానీ ఇలాంటి ప్రేమ కథను ఇప్పటి వరకు విని ఉండం. అదీ కూడా బతికుండగా తమ ప్రేమను పండించుకుని పెళ్లి వరకు తీసుకురాలేకపోయారు. కానీ చనిపోయాక తమ కోరికను కుటుంబ సభ్యులతో నెరవేర్చుకోగలిగారు. ఈ ఘటన గుజరాత్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...గుజరాత్‌లోని తాపిలో నివశించే గణేష్, రంజనాలు ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. అయితే వారి ప్రేమను కుటుంబసభ్యులు అంగీకరించ లేదు. ఇక తమ కోరిక నెరవేరే అవకాశమే లేదని నిరాశతో ఆ ఇద్దరు ఆగస్టు 2022లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ అనుహ్య ఘటనతో కుటుంబ సభ్యులు పశ్చాత్తాపం చెందారు. ఎలాగో బతికుండగా వారిక కల నెరవేర్చలేకపోయాం అని చాలా బాధపడ్డారు. అందుకని వారి విగ్రహాలను తయారు చేయించి వాటికే పెళ్లి చేసి ఆ ప్రేమ జంట కోరికను నెరవేర్చారు. సరిగ్గా చనిపోయిన ఆరునెలలకు ఆ ప్రేమికుల విగ్రహాలకు ఘనంగా వివాహం జరిపించారు కుటుంబసభ్యులు. ఈ మేరకు ఆ అమ్మాయి తాత మాట్లాడుతూ ఆ అబ్బాయి తమ దూరపు బంధువు కుంటుంబానికి చెందిన వాడని వద్దునుకున్నామని చెప్పారు. ఐతే వారిద్దరూ ఒకరినొకరు ఎంతగానే ఇష్టపడ్డారని, అందుకే ఇరు కుటుంబాలు ఈ ఆలోచనకు వచ్చి ఇలా చేశామని చెప్పుకొచ్చారు. వారి ఆత్మకు శాంతి కలగాలనే ఉద్దేశంతోనే ఇలా వారి ప్రతిమలకు ఘనంగా పెళ్లి చేసినట్లు బంధువులు తెలిపారు. (చదవండి: స్టార్ సింగర్ రేంజ్లో పాడాడు..ఆ బుడ్డోడి కాన్ఫిడెన్స్‌కి మంత్రి ఫిదా!) -
అమ్మ వచ్చింది.. ఆకలి తీర్చింది!
ఇల్లెందు: బందీగా మారిన ఆ తల్లికి విముక్తి లభించింది. అమ్మ స్పర్శ కరువై, ఆమె ఒడిలోని వెచ్చదనం దూరమై, తల్లి పాల అమృతం అందక రెండు రోజులుగా అల్లాడుతున్న ఆ పసికందును అక్కున చేర్చుకుంది. ఆకలి తీర్చింది. ‘‘బిడ్డా.. ఇంకెప్పటికీ నీ వెంటే ఉంట.. నిన్నొదిలి ఉండ..’’ అంటూ, ఆ పసివాడిపై ముద్దులు కురిపించింది. ఇల్లెందు మండలం రొంపేడు పంచాయతీ మిట్టపల్లి తండాకు చెందిన బి.రజిత, గార్ల మండలం ముల్కనూరుకు చెందిన బళ్లెం కళ్యాణ్ ప్రేమించుకున్నారు. ఏడాది క్రితం గార్ల శివాలయంలో పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమ పెళ్లికి ఆమె తల్లిదండ్రులు అంగీకరించలేదు. హైదరాబాద్‌లో కాపురం పెట్టిన ఈ దంపతులకు మూడు నెలల క్రితం బాబు జన్మించాడు. ఈ దంపతులు, తమ చిన్నారితో కలిసి ఇటీవల ఇల్లెందు వచ్చారు. రజితను ఆమె తల్లిదండ్రులు నమ్మించి, మిట్టపల్లిలోని తమ ఇంటికి శుక్రవారం రప్పించారు. సాయంత్రం వరకు వస్తానని చెప్పి, మూడు నెలల 11 రోజుల వయసున్న తన బిడ్డను ఇల్లెందులో తన భర్త కళ్యాణ్ వద్ద వదిలి వెళ్లింది. అక్కడ ఆమెను తల్లిదండ్రులు గృహ నిర్బంధంలో ఉంచారు. పసిబిడ్డ కోసం అక్కడ ఆ తల్లి వేదన. తల్లి కోసం ఇక్కడ ఈ పసిబిడ్డ రోదన. ఈ పరిస్థితిలో, పోలీసులను కళ్యాణ్ ఆశ్రయించాడు. వారు అంతగా స్పందించకపోవడంతో ‘సాక్షి’కి సమాచారమిచ్చాడు. దీనిపై, ఆదివారం రోజున ‘సాక్షి’లో ‘బందీగా తల్లి.. ఆకలితో పసికూన..’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ కథనంతో పోలీసులు కదిలారు. మిట్టపల్లిలోని రజిత పుట్టింటికి ఆదివారం ఉదయం ఎస్ఐ రాజు వెళ్లారు. రజితను, ఆమె పుట్టింటి వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అప్పటికే పోలీస్ స్టేషన్లో పసికూనతో కళ్యాణ్ ఎదురుచూస్తున్నాడు. బిడ్డను చూడగానే రజిత పరుగెత్తుకుంటూ వచ్చింది. వాడిని చేతుల్లోకి తీసుకుని తనవితీరా ముద్దాడింది. కన్నీటిపర్యంతమైంది. పాలు పట్టింది. ఆకలి తీర్చింది. ఆ తరువాత రజితను, కళ్యాణ్‌ను, రజిత కుటుంబీకులను ఎస్ఐ రాజు విచారించారు. తన కోసం భర్త కళ్యాణ్, పసిబిడ్డ ఎదురుచూస్తున్నారని, వెళతానని బయల్దేరిన తనను పుట్టింటోళ్లు ఇంటిలో బంధించారని ఎస్ఐతో రజిత చెప్పింది. తనకు భర్త కళ్యాణ్, బిడ్డ కావాలని స్పష్టంగా చెప్పింది. ఎస్ఐ అడగడంతో ఇదే విషయాన్ని రాసిచ్చింది. ఆమె కుటుంబీకులు, భర్త కళ్యాణ్ నుంచి కూడా రాయించుకున్నారు. రజితను ఆమె భర్త కళ్యాణ్‌తో పంపించారు. కళ్యాణ్, రజిత, బాబు, కళ్యాణ్ తల్లి సువార్త కలిసి ఇల్లెందు పోలీస్ స్టేషన్ నుంచి గార్ల ముల్కనూరులోని తమ ఇంటికి వెళ్లారు. చివరికి, కథ సుఖాంతమైంది. -
పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట
ఎల్కతుర్తి : రక్షణ కల్పించాలని ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు ప్రేమజంట మంగళవారం ఎల్కతుర్తిలో విలేకరులతో మాట్లాడింది. కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన మౌటం నాగలక్ష్మి, కొండి ధనుంజయ ఆరు సం వత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఈనెల 20న హైదరాబాద్‌లోని ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్నారు. దీంతో నాగలక్ష్మి తల్లిదండ్రులు కమలాపూర్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టారు. 21వ తేదీన ధనుంజయ ఇంటిపై నాగలక్ష్మి బంధువులు దాడి చేశారు. తమపై దాడి చేసే అవకాశాలు ఉన్నాయని, తమకు రక్షణ కల్పించాలని ధనుంజయ, నాగలక్ష్మి ఈ సందర్భంగా సీఐ రవికుమార్‌ను కోరారు. -
అల్లుడి కళ్లలో కారం కొట్టి కూతురి కిడ్నాప్
సాక్షి, తిరుపతి : వాళ్లిద్దరికి మూడేళ్ల క్రితం ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే వారి ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో నెలన్నర క్రితం (ఆగస్ట్ 16) పెళ్లి చేసుకున్నారు. అన్యోన్యంగా సాగుతున్న వారి కాపురంలో కులాలు అడ్డుగోడలుగా నిలిచాయి. కూతురు కులాంతర వివాహం చేసుకోవడం అమ్మాయి తల్లిదండ్రులకు నచ్చలేదు. ప్రేమించి పెళ్ళిచేసుకున్న పాపానికి అల్లుడి కళ్ళల్లో కారం చల్లి కూతుర్ని ఆమె తల్లిదండ్రులు కిడ్నాప్ చేశారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... తిరుపతికి చెందిన నవీన్ కుమార్ చంద్రగిరి గ్రామీణ ప్రభుత్వ ఆసుపత్రిలో హౌస్ సర్జన్‌గా పని చేస్తున్నాడు. మెడిసన్ చదువుతున్న సిరిచందనతో అతడికి పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమ వివాహానికి దారి తీసింది. అయితే కుమార్తె వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని సిరిచందన తల్లిదండ్రులు ఇవాళ మధ్యాహ్నం రెండు ఇన్నోవా వాహనాలతో వచ్చి... భార్యాభర్తలు ఇంటికి వెళుతుండగా నవీన్‌పై దాడి చేశారు. అనంతరం సిరిచందనను బలవంతంగా తీసుకు వెళ్లారు. నవీన్‌కుమార్ తన సోదరి సాయంతో చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కులాలు వేరు కావడంతో సిరిచందన తల్లిదండ్రులు రాజభూపాల్ రెడ్డి, పార్వతి...తనపై దాడి చేసి తన భార్యను కిడ్నాప్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ... తమ పెళ్లి సిరిచందన తల్లిదండ్రులకు ఇష్టం లేదని, అందుకే తనపై దాడి చేసి భార్యను బలవంతంగా తీసుకెళ్లారని తెలిపాడు. గతంలో కూడా పలుమార్లు దాడులకు ప్రయత్నిస్తుంటే తిరుపతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసినట్లు అతడు తెలిపాడు. బాదితుడి ఆవేదన వీడియో -
అల్లుడి కళ్లలో కారం కొట్టి కూతురి కిడ్నాప్
-
మోసం చేశాడు... పెళ్లి చేసుకున్నాడు
టీనగర్: ఊత్తుకోటలో యువతిని మోసగించిన యువకుడు పోలీసులకు చిక్కగానే వివాహం జరిపించారు. ఊత్తుకోట సమీపానగల కల్కాలవోడై గ్రామానికి చెందిన యువతి మణిమేగలై (21). శ్రీపెరంబుదూరులోగల ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుంది. అదే గ్రామానికి చెందిన వెంకటేశన్ (28). టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. మణిమేగలై, వెంకటేశ్ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మణిమేగలై సంపాదనతో తరచూ బయటి ప్రదేశాలకు వెళ్లి ఆమెతో చనువుగా గడిపేవాడు. తనను వివాహం చేసుకోవాలని మణిమేగలై ఒత్తిడి తెస్తూ వచ్చింది. ఏడాది తర్వాత చేసుకుందామని ఆమెతో చెప్పాడు. ఈ క్రమంలో వెంకటేశ్ అదృశ్యమయ్యాడు. తాను మోసపోయినట్లు తెలుసుకున్న మణిమేగలై ఊత్తుకోట మహిళా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంకటేశన్‌ను అదుపులోకి తీసుకున్నారు. మణిమేగలైను వివాహం చేసుకోకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీంతో అతను వివాహానికి ఒప్పుకున్నాడు. ఊత్తుకోట రవాణా సంస్థ వర్కుషాప్ సమీపంలోగల అమ్మవారి ఆలయంలో మణిమేగలైను వెంకటేశన్ వివాహం చేసుకున్నాడు. దీంతో మణిమేగలై తన ఫిర్యాదును వాపసు తీసుకుంది.