
కందిమళ్ల వెంకట నాగప్రసాద్
ఖమ్మం: జిల్లా తెలుగుదేశం పార్టీలో ఎంపి నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావుల మధ్య ఆధిపత్య పోరులో మరో కొత్త నేత పుట్టుకువచ్చారు. ల్యాంకో సంస్థలకు సిఇఓగా పనిచేసిన కందిమళ్ల వెంకట నాగప్రసాద్ అనే పారిశ్రామిక వేత్త టిడిపిలో హటాత్తుగా చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయనను ఏకంగా పార్టీ అధికార ప్రతినిధిగా ప్రకటించేశారు.
జిల్లాలోని దమ్మపేట మండలానికి చెందిన కందిమళ్ల కుటుంబం ఆది నుంచీ టిడిపిలో పనిచేస్తోంది. అయితే బిసి వర్గానికి చెందిన ఈ కుటుంబం నుంచి పారిశ్రామిక వేత్తగా, ల్యాంకో సంస్ధలో సిఇఓగా పనిచేస్తున్న నాగప్రసాద్ ఒక్కసారిగా టిడిపి తీర్థం పుచ్చుకుని తన వ్యాపార బాధ్యతలకు స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామం వెనుక ఖమ్మం ఎంపి నామా నాగేశ్వరరావు చక్రం తిప్పినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జిల్లాలో పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే జనరల్ స్థానాలుగా ఉన్నాయి. ఖమ్మం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా తుమ్మల నాగేశ్వరరావు ఉండగా, కొత్తగూడెం నుంచి మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు తనయుడు చిన్నికి లేదా కొత్తగూడెం ఎఎంసి మాజీ చైర్మన్ కిలారు నాగేశ్వరరావులలో ఒకరికి ఈ సారి టిక్కెట్టు వస్తుందని అందరూ భావిస్తున్నారు. ఇక పాలేరు నుంచి నామా వర్గంలో కొనసాగుతున్న బేబీ స్వర్ణకుమారికి టిక్కెట్టు దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. అయితే మూడు స్థానాలూ ఒకే సామాజిక వర్గంకు ఇస్తే జిల్లాలో బిసిలకు ప్రాతినిధ్యం లేకుండా పోయిందనే ప్రచారాన్ని మిగిలిన పార్టీలు ముందుకు తీసుకువస్తాయనే చర్చ పార్టీలో మొదలైంది.
ఈ నేపథ్యంలో పాలేరు స్థానంను బిసిలకు కేటాయించాలనే డిమాండ్‌ను బిసి నేతలు తెరమీదికి తీసుకువచ్చారు. దాంతో జిల్లాలో తుమ్మల వర్గంలో కొనసాగుతున్న ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పేరును కూడా వెంటనే ఆయన వర్గం ప్రచారంలోకి తెచ్చింది. ఎమ్మెల్సీగా పనిచేస్తుండటంతోపాటు ఏజెన్సీ ప్రాంతం నుంచి ఎదిగిన నేతగా బాలసానికి టిక్కెట్టు ఇస్తే అటు ఏజెన్సీలోనూ, ఇటు బిసి వర్గాల్లోనూ పార్టీకి ఓట్లు రాలతాయని తుమ్మల వర్గం అనుకూల వాదనను మొదలుపెట్టింది. ఈ పరిణామాలతో ఒక్కసారిగా అటు నామా వర్గం ఉలిక్కిపడింది. తమ వర్గంలోని స్వర్ణకుమారికి టిక్కెట్టు రాకుండా చేసేందుకు తుమ్మల వర్గం ముందు నుంచే ప్రణాళికలను అమలు చేస్తోందని ఆశించిన నామా వెంటనే పావులు కదపడం మొదలుపెట్టారు. బాలసానికి చెక్ పెట్టేందుకు అదే సామాజిక వర్గం నుంచి పార్టీకి అనుకూలంగా వున్న కందిమళ్ల కుటుంబం నుంచి వ్యాపార రంగంకు చెందిన నాగప్రసాద్‌ను తెరమీదికి తీసుకువచ్చారు. నాగప్రసాద్ అయితే ఎన్నికల్లో ఖర్చు పరంగా పార్టీపై భారం వుండదని, పైగా అవసరమైతే పార్టీకే నాగప్రసాద్ ఆర్ధిక పరిస్థితి అండగా నిలుస్తుందంటూ అధినేత చంద్రబాబు వద్ద నామా చేసిన ప్రతిపాదనలు ఆయనకు అమాంతం నచ్చేశాయి.
చంద్రబాబు వెంటనే నాగప్రసాద్‌ను పార్టీలోకి ఆహ్వానించడం, రాష్ట్రస్ధాయి పదవిని కట్టబెట్టడం చకచకా జరిగిపోయాయి. ఇక జిల్లాలో అడుగుపెట్టిన నాగప్రసాద్‌ను నామా వర్గం ఘనంగా ఆహ్వానించి రేపో, మాపో పాలేరు స్థానంపై కుర్చోబెట్టేందుకు సిద్దపడుతోంది. జిల్లా పార్టీ కార్యాలయంకు తొలిసారి వచ్చిన నాగప్రసాద్‌ను పాలేరు నియోజకవర్గానికి చెందిన నేతలు కలుసుకుని పరిచయం చేసుకునేందుకు పోటీ పడటమే ఇందుకు నిదర్శనం. దీంతో ఇప్పటి వరకూ నామాను నమ్మకున్న స్వర్ణకుమారి పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులైంది. ఏదో ఒక విధంగా ఆమెకు న్యాయం చేస్తానని నామా హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద నాగప్రసాద్ రాక అటు బాలసానికి నిరాశను, తుమ్మల వర్గానికి ఊహించని ఎదురుదెబ్బను మిగిల్చింది. పారిశ్రామిక వేత్తగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చి జిల్లా తెలుగుదేశంను శాసిస్తున్న నామా నాగేశ్వరరావుకు మరో వ్యాపారవేత్త నాగప్రసాద్ తోడవ్వడంతో ఇక జిల్లా తెలుగుదేశంలో నామా వర్గం మరింత బలోపేతం అవుతుందని, తుమ్మల వర్గం ప్రాభవం మసకబారక తప్పదనే భావం పార్టీ వర్గాలలో వ్యక్తమవుతోంది.