సాక్షిప్రతినిధి, ఖమ్మం: కాంగ్రెస్ టికెట్ల వ్యవహారంపై నేతల్లో టెన్షన్ నెలకొంది. ఒకప్పుడు జిల్లా కాంగ్రెస్‌లో అన్నీ తామై.. చక్రం తిప్పి.. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇప్పుడు టికెట్ల కోసం చక్కర్లు కొడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించిన మాజీ మంత్రులు పలువురు ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? మహాకూటమి పొత్తుల వల్ల వారు గతం నుంచి పోటీ చేస్తున్న స్థానాలను త్యాగం చేయాల్సి వస్తే పార్టీ వారికి ఎటువంటి భరోసా ఇస్తుంది? ఎలా రాజకీయ సర్దుబాటు చేస్తుందన్న అంశం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో మధిర, పినపాక నియోజకవర్గాలు మినహా మిగిలిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఎవరికి లభిస్తుందన్న అంశం ఉత్కంఠ రేపుతోంది.
మధిర నుంచి టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క ఒక్కరే దరఖాస్తు చేయడంతో ఆయన పేరు ఖరారు కావడం లాంఛనంగా మిగిలింది. పినపాకలోనూ అక్కడి మాజీ ఎమ్మెల్యే
రేగా కాంతారావుకు టికెట్ ఖాయమన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఇక మిగిలిన నియోజకవర్గాల్లో రోజుకొకరి పేరు తెరపైకి రావడం, ఫలాన వారికి టికెట్ వస్తుందనే ప్రచారం జరగడం కొద్ది రోజులుగా జరుగుతున్నా.. అధిష్టానం ఆశీస్సులు లభించేదెవరికి అనే విషయం మాత్రం ఒక పట్టాన కార్యకర్తలకే అంతుచిక్కడం లేదు.
ఉమ్మడి జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌లో ఉన్న ఇద్దరు రాష్ట్ర మాజీ మంత్రులు సంభాని చంద్రశేఖర్, వనమా వెంకటేశ్వరరావు, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగేందుకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే పార్టీ వారి పేర్లను పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నా.. వారు పోటీ చేయాలనుకున్న సత్తుపల్లి, కొత్తగూడెం, ఖమ్మం స్థానాలను మహాకూటమిలో భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, సీపీఐ కోరుతుండడంతో ఆ సీట్ల కేటాయింపుపై పార్టీపరంగా పీటముడి పడినట్లయింది. దీంతో మహాకూటమి భాగస్వామ్య పక్షాల నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో ఎవరికి టికెట్ దక్కుతుందన్న అంశం ప్రశ్నార్థకంగా మారింది.
‘సండ్ర’ ప్రచారం..
ఇప్పటికే సత్తుపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య మహాకూటమి అభ్యర్థిగా నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఆ సీటును టీడీపీకే కేటాయించడానికి కాంగ్రెస్ సిద్ధపడడం, అక్కడి నుంచి గత ఎన్నికల వరకు రెండుసార్లు పోటీ చేసిన మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌ను ఈసారి కాంగ్రెస్ ఎక్కడి నుంచి బరిలోకి దించుతుందన్న అంశం ఇంకా కొలిక్కి రాలేదు. సంభాని గతంలో పోటీ చేసి.. పలు పర్యాయాలు గెలిచి తనకు పట్టున్న పాలేరు జనరల్ స్థానం నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతుండడంతోపాటు ఇందుకోసం ఏఐసీసీ స్థాయిలో తనవంతు ప్రయత్నాలను వేగవంతం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
పాలేరు నుంచి ఆయనను బరిలోకి దించే అంశం కాంగ్రెస్ పరిశీలనలో ఉన్నా.. సత్తుపల్లి నుంచి పోటీ చేసే అవకాశం మాత్రం లేకుండా పోయింది. అలాగే కొత్తగూడెం టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు సైతం టికెట్ కోసం పార్టీలో హోరాహోరీ పోరు జరపాల్సిన పరిస్థితి నెలకొంది. కూటమి పొత్తులో భాగంగా భాగస్వామ్య పక్షమైన సీపీఐ ఈ సీటును తమకే కేటాయించాలని పట్టుపట్టడం, 2009 ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలుపొందిన సీపీఐ మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మరోసారి మహాకూటమి తరఫున పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ ఈ సీటును కూటమిలోకి భాగస్వామ్య పక్షమైన సీపీఐకి కేటాయిస్తుందా? మాజీ మంత్రి వనమానే బరిలోకి దించుతుందా? అనే అంశంపై ఇప్పటికీ స్పష్టత కొరవడింది. కాంగ్రెస్‌కు కేటాయిస్తేనే విజయం సాధ్యమని ఆ పార్టీ వర్గాలు ప్రచారం చేస్తున్నా.. సీపీఐ సైతం కొత్తగూడెం తమకు పట్టున్న ప్రాంతమని, సింగరేణి కార్మికులు, ఆ ప్రాంత ప్రజా ఉద్యమాలతో పార్టీకి ఎనలేని అనుబంధం ఉన్నందున గెలిచి తీరుతామని వాదిస్తోంది.
దీంతో వనమాకు టికెట్ లభించే విషయం చివరి నిమిషం వరకు తేలని పరిస్థితి. అలాగే కాంగ్రెస్ నుంచి స్వయానా వనమా తోడల్లుడు, కాంగ్రెస్ నేత ఎడవల్లి కృష్ణ, నియోజకవర్గానికి చెందిన నాగా సీతారాములు టికెట్ ఆశిస్తున్నారు. కాంగ్రెస్ పోటీ చేయాలని భావించినా.. టికెట్ ఎవరికి లభిస్తుందన్న అంశం మాత్రం ఒక పట్టాన అంతుపట్టడం లేదు. ఇక ఇప్పటివరకు లోక్‌సభ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేసి రెండుసార్లు ఖమ్మం ఎంపీగా విజయం సాధించి.. కేంద్రంలో మంత్రిగా పని చేసిన రేణుకాచౌదరి ఈసారి ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. పోటీ చేయాలంటూ నియోజకవర్గ కార్యకర్తలు, సాధారణ ప్రజల నుంచి ఒత్తిడి ఉందని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించడం ద్వారా రేణుకాచౌదరి సైతం ఖమ్మం నుంచి పోటీ చేసే అవకాశాన్ని కోరుతున్నట్లు ప్రచారమవుతోంది.
అయితే ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు టీడీపీ సైతం సిద్ధపడడం, కాంగ్రెస్‌లో అనేక మంది పోటీపడుతుండడంతో ఇక్కడ కూటమిలోని ఏ భాగస్వామ్య పక్షం ఎన్నికల బరిలో నిలుస్తుందనే అంశం ఉత్కంఠ రేపుతోంది. సత్తుపల్లిలో మహాకూటమి భాగస్వామ్య పక్షం పోటీ చేస్తుండడంతో అక్కడ మాజీ మంత్రి సంభాని అవకాశం కోల్పోయినట్లయింది. ఇక టికెట్ల పోరులో ఉన్న మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని చేస్తున్న ప్రయత్నాలు, ఖమ్మం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరికి ఏ మేరకు పరిస్థితులు కలిసొస్తాయనే అంశం జిల్లా రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment