పొత్తులు.. చిక్కులు.. | Telangana Early Elections TDP Alliance With Congress | Sakshi
Sakshi News home page

పొత్తులు.. చిక్కులు..

Sep 9 2018 7:52 AM | Updated on Mar 18 2019 9:02 PM

Telangana Early Elections TDP Alliance With Congress - Sakshi

సాక్షి, కొత్తగూడెం:  రానున్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి నడిచేందుకు సిద్ధమైన టీడీపీ భద్రాద్రి జిల్లాలో కనీసం రెండు సీట్లు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. ఈ రెండు పార్టీల మధ్య ఇప్పటికే పొత్తు వ్యవహారం తుదిదశకు చేరుకోవడంతో జిల్లాలో సీట్ల సర్దుబాటు విషయమై రాజకీయ వర్గాల్లో మరింత ఆసక్తి రేపుతోంది. పొత్తుల్లో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో ఖమ్మం ఎంపీ సీటుతో పాటు మూడు నుంచి నాలుగు శాసనసభ స్థానాల్లో పోటీ చేసేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. టీడీపీ అధినాయకత్వం సైతం రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లోనే ఎక్కువ సీట్లు అడుగుతోంది. ప్రస్తుతం సిట్టింగ్‌ సీటు అయిన సత్తుపల్లి టీడీపీకి ఇవ్వడం లాంఛనమే. ఇక ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు లేనందున ఖమ్మం ఎమ్మెల్యే సీటును టీడీపీ ఆశిస్తోంది. ఇక్కడి నుంచి మాజీ ఎంపీ, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావును పోటీ చేయించేందుకు ఆ పార్టీ యోచిస్తోంది.

ఇక మిగిలిన రెండు సీట్లు భద్రాద్రి జిల్లా నుంచి ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో అశ్వారావుపేట నియోజకవర్గంలో రెండో స్థానంలో నిలిచిన టీడీపీ తిరిగి ఆ స్థానాన్ని కోరుతోంది. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో ఓడిపోయిన మెచ్చా నాగేశ్వరరావునే దింపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ సీటును టీడీపీకి ఇచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ సైతం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక మరో సీటును ఇల్లెందు, పినపాక, భద్రాచలంలో ఎక్కడ ఇచ్చినా తీసుకునేందుకు టీడీపీ సిద్ధపడుతోంది. ఇల్లెందు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున టికెట్‌ కోసం పోటీ తీవ్రం గా ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్‌ పార్టీకి ఇబ్బందికరంగా మారిందనే చెప్పవచ్చు. దీంతో ఈ సీటును టీడీపీ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌తో పొత్తుల్లో భాగంగా టీడీపీ తనకు టికెట్‌ ఇస్తే తిరిగి పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికార పార్టీలోకి వెళ్లిన ఓ నాయకుడు ప్రతిపాదన చేస్తున్నట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్‌లోకి వెళ్లిన మరొకరు కూడా టీడీపీ టికెట్‌ ఇస్తే తిరిగి చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక టీడీపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తుళ్లూరు బ్రహ్మయ్య సొంత నియోజకవర్గం పినపాక ఇచ్చినా..  తీసుకునేందుకు టీడీపీ వారు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసేందుకు వట్టం నారాయణ, బచ్చల భారతి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును బరి లోకి దించితే ఈ సీటును వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు టీడీపీ శ్రేణులు చెబుతున్నా యి.

ఒకవేళ భద్రాచలం సీటు ఇచ్చినప్పటికీ పోటీ చేసేందుకు ఆ పార్టీ రెడీగా ఉంది. భద్రాచలం టికెట్‌ వస్తే వట్టం నారాయణను ఇక్కడ నుంచి పోటీ చేయించే ఆలోచనలో టీడీపీ ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ పార్టీ తో పొత్తుకు తాము దూరంగా ఉంటామని, బీఎల్‌ఎఫ్‌ ద్వారానే అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని సీపీఎం చెబుతోంది. కాగా, సమీకరణలు ఏమైనా మారి సీపీఎం కూడా కాంగ్రెస్‌ కూటమిలోకి వస్తే భద్రాచలం సీటును ఆ పార్టీకి ఇవ్వా ల్సి ఉంటుంది. ఇక కాంగ్రెస్‌ కూటమిలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న సీపీఐ కొత్తగూడెం సీటు విషయంలో పట్టుపడుతోంది.

అయితే ఈ సీటు సాధించేందుకు కాం గ్రెస్‌ నుంచి మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, టీపీసీసీ సభ్యుడు ఎడవల్లి కృష్ణ పోటీపోటీగా కృషి చేస్తున్నారు. ఇక భద్రాచలం నియోజకవర్గంలో ఓటుబ్యాంకు గణనీయంగానే ఉన్న కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్థి లేరు. ఇల్లెందులో మాత్రం పోటీ తీవ్రంగా ఉంది. దీంతో కాంగ్రెస్‌ పరిస్థితి జిల్లాలో విచిత్రంగా తయారైంది. అంతర్గతంగా సమస్య పరిష్క రించి అసంతృప్తులను బుజ్జగిస్తారా లేక పొత్తుల్లో భాగం గా మిత్రపక్షాలకు కేటాయిస్తారా అనేది ప్రతిఒక్కరి లోనూ ఆసక్తిని కలిగిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ, వామపక్షాలతో పొత్తు కన్నా టీడీపీతో పొత్తుపైనే జిల్లాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement