Alliance with the TDP
-
కాంగి‘రేసు’లో మిగిలేది ఎవరు..?
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఆ పార్టీ అధిష్టానం బిజీబిజీగా ఉంది. ఇంతకాలం కూటమి, పొత్తులపై హడావుడిగా ఉన్న నే తలు.. ఎన్నికల షెడ్యూల్ విడుదలతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై వేగం పెంచారు. జిల్లా కాంగ్రెస్ కమిటీలు, టీపీసీసీలకు దరఖాస్తు చేసుకున్న ఆశావహుల దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. దరఖాస్తుల పరిశీలనలో భాగంగా ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ (పీఈసీ) మంగళవారం హైదరాబాద్‌లోని గండిపేటలో భేటీ అయ్యింది. ఈ సమావేశానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం, ఎన్నికల కమిటీ, ఇతర కమిటీల సభ్యులుగా ఉన్నవారు కూడా హాజరయ్యారు. కరీంనగర్, హుజూరా బాద్, చొప్పదండి, మానకొండూరు నియోజకవర్గాల నుంచి ఇప్పటివరకు డీసీసీకి 32 మంది దరఖాస్తు చేసుకోగా, ప్రధానంగా అభ్యర్థుల జాబితాలో వినిపిస్తున్న పలువురు పేర్లు లేవు. అలాంటి వారు టీపీసీసీ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలిసింది. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ బుధవారం కూడా సమావేశం కానున్నందునా.. ఆ భేటీ అనంతరం ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి ఒక్కో నియోజకవర్గం నుంచి మూడు, నాలుగు పేర్లను పంపనున్నట్లు తెలిసింది. ఆ తర్వాత ఫ్లాష్ సర్వేలు, పార్టీ మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా అభ్యర్థులను ఏఐసీ సీ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఆశావహులకు సంకటంగా ‘మూడు సూత్రాలు’.. ముందస్తు పోరులో పాల్గొనే అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆచీతూచీ నిర్ణయం తీసుకోనుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అభ్యర్థుల ఎంపి క కోసం ప్రధానంగా మూడు నిబంధనలు విధించినట్లు వార్తలు వస్తున్నాయి. మొదటిది వరుసగా మూడుసార్లు ఓడిపోయిన వారికి టికెట్ ఇవ్వరాదన్న నిబంధన. రెండోది గత ఎన్నికల్లో 30 వేల కంటే ఎక్కు వ ఓట్ల మెజారిటీతో ఓడిపోయిన వారిని పక్కన బెట్టా లని, అదేవిధంగా 2014 ఎన్నికల్లో 25 వేల కంటే తక్కు వ ఓట్లు వచ్చిన వారికి అవకాశం ఇవ్వరాదని నిర్ణయం తీసుకున్నారు. ఇవన్నీ దరఖాస్తు చేసుకున్న పలువురికి సంకటం కానుండగా.. కొత్తగా, మొదటిసారి దరఖాస్తు చేసుకునే వారికి కలిసొచ్చే అవకాశంగా భావిస్తున్నారు. ఇదే సమయంలో డీసీసీ, టీపీసీసీలకు వివిధ నియోజకవర్గాల నుంచి దరఖాస్తు చేసుకున్న పలువురు టిక్కెట్ కోసం ఎవరికి వారుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా వుంటే కాంగ్రెస్ అధిష్టానం మూడు సూత్రాలను ప్రామాణికంగా తీసుకుంటే మాజీ మంత్రి సుద్దాల దేవ య్య, మాజీ విప్ ఆరెపల్లి మోహన్‌కు సంకటం కానుండగా, ప్రజలతో సత్సంబంధాలు, పార్టీ నిర్వహించే ఫ్లాష్ సర్వేలతో ఉపశమనం కలిగించనున్నాయి. బుధవారం జరిగే సమావేశంలో మరిన్ని కీలక నిర్ణయాలు వెల్లడించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కరీంనగర్ నియోజకవర్గానికి 1952 నుంచి 2014 వరకు 14 ఎన్నికలు జరిగితే 11 సార్లు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ ఐదు సార్లు గెలిచింది. 2004లో చివరగా ఎం.సత్యనారాయణరావు (ఎమ్మెస్సార్) గెలిచా రు. 2009, 2014లలో వరుసగా కాంగ్రెస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావు ఓడిపోయారు. రెండోసారి 25,670 ఓట్లతో వెనుకబడి పోయారు. ఈ సారి కరీంనగర్ నుంచి 12 మంది పేర్లు వినిపిస్తుండగా, 10 మంది డీసీసీలో దరఖాస్తు చేసుకున్నారు. చల్మెడ లక్ష్మీనర్సింహారావు ఈ ఎన్నికలకు దూరంగా ఉంటానని చెప్తుండగా, పొన్నం ప్రభాకర్, కటుకం మృత్యుంజయంల పేర్లు తెరమీదకు వచ్చాయి. చొప్పదండి (ఎస్సీ రిజర్వుడు) స్థానంలో 1957 నుంచి 2014 వరకు 11 సార్లు ఎన్నికలు జరిగితే.. రెండు సార్లు గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు, తొమ్మిది సార్లు ఓటమి చెందారు. 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సుద్దాల దేవయ్య 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో సమీప ప్రత్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థి బొడిగె శోభ, సుద్దాల దేవయ్యపై 54,891 ఓట్లతో గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి అత్యధికంగా డీసీసీకి 14 మంది దరఖాస్తు చేసుకోగా, ‘మూడుసూత్రాల’ను అమలు చేస్తే సు ద్దాల దేవయ్యకు పార్టీ టికెట్ వచ్చే అవకాశం లేదు. ఈ స్థానం నుంచి కొత్తవారికే చాన్స్ దక్కనుంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో 1952 నుంచి 2014 వరకు 16 పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 1952, 1957లలో ద్విశాసనసభ స్థానంగా ఉన్న హుజూరాబాద్ నుంచి 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికే తిరి సుదర్శన్‌రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై 57,037 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆయన రెండేళ్ల క్రితం చనిపోగా, ఇక్కడి నుంచి ఐదుగురు టికెట్ కోసం జిల్లా కాంగ్రెస్ కమిటీలో దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడి నుంచి ఆశిస్తున్న అందరూ కొత్త వారే కావడంతో ‘మూడు సూత్రాల’ పరిధిలోకి వచ్చే అవకాశం లేదు. దీంతో ఇక్కడ కూడా కొత్తవారికే అవకాశం. ఎస్సీ రిజర్వుడు స్థానం మానకొండూరు నియోజకవర్గంలో 1962 నుంచి 2014 వరకు 12 సార్లు ఎన్నికలు జరిగాయి. 1992 నుంచి 2004 వరకు నేరెళ్ల నియోజకవర్గంగా, 2009 నుంచి మానకొండూరుగా మారిన ఈ నియోజకవర్గం నుంచి 12 సార్లు పోటీ చేస్తే.. నాలుగు సార్లు కాంగ్రెస్ పార్టీ, ఒకసారి కాంగ్రెస్(ఐ) గెలుపొందింది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్‌పై కాంగ్రెస్ అభ్యర్థి ఆరెపల్లి మోహన్ 46,922 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మూడు సూత్రాలలో భాగంగా 30 వేల పైబడిన మెజార్టీతో ఓడిపోయిన వారి అభ్యర్థిత్వంపై కూడా పరిశీలన చేస్తారన్న ప్రచారం నేపథ్యంలో మానకొండూరు టికెట్‌పైనా చర్చ జరిగే అకాశం ఉంది. కాగా, ఈ నియోజకవర్గం నుంచి డీసీసీకి ముగ్గురు దరఖాస్తు చేసుకున్నారు. -
ఆచి.. తూచి.. అడుగులు
సాక్షి, భూపాలపల్లి (వరంగల్): జిల్లాలో ఎన్నికల వేడి మొదలైనప్పటి నుంచి ప్రచారం జోరుగా కొనసాగుతోంది. కార్యకర్తలతో పాటు నాయకులు తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే ప్రతీసారి ఎన్నికల ముందు వలసల ఉధృతి ఉంటుంది. వివిధ పార్టీల్లో చేరేవారు.. వెళ్లే వారితో సందడి వాతావరణం నెలకొంటుంది. ఈసారి జిల్లాలో ప్రస్తుతం అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. అడపాదడపా చేరికలు జరుగుతున్నా పెద్దగా ప్రభావం చూపించే స్థాయిలో లేవు. అధికార పార్టీలోని అసంతృప్త నేతలు సైతం కొంత ప్రా భల్యం కలిగి ఉండడంతో వారు వేరే పార్టీలోకి వెళ్లడానికి ఆసక్తి చూపడంలేదు. కార్యకర్తలు సైతం వారినే అంటిపెట్టుకుని ఉండడంతో వలసలకు అవకాశం లేకుండా పోయింది. రాష్ట్ర అసెంబ్లీ రద్దయి 25 రోజులు గడిచింది. అయినప్పటికీ జిల్లాలో చెప్పుకోదగిన రీతిలో వలసలు కనిపించడంలేదు. గ్రామపంచాయతీ ఎన్నికల ముందు నమోదైన వలసలతో పొల్చితే అసెంబ్లీ ఎన్నికల ముందు వలసలు అధికంగా ఉంటాయని రాజకీయ పరిశీలకులు ఊహించినా ఆ స్థాయిలో లేవు. కార్యకర్తలు, నాయకులు అందరూ గోడమీద పిల్లుల మాదిరిగా వేచిచూసే ధోరణిలో ఉన్నారు. ఇప్పటివరకు టీఆర్ఎప్ పార్టీ మినహా ఇతర ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులపై స్పష్టత ఇవ్వలేదు. ఇంకా ఎన్నికల షెడ్యూల్ వెలువడకపోవడంతో పార్టీలు మారాలనుకున్న చాలా మంది ఆలోచనలో పడ్డారు. అభ్యర్థుల ప్రకట న తర్వాతే బలాబలాలను బేరీజు వేసుకుని పార్టీ మారడమా? లేక ఉన్నదాంట్లోనే కొనసాగడమా? అనేది నిర్ణయించుకోవడానికి వేచిచూస్తున్నారు. అసమ్మతి ఉన్నా.. పటిష్టమే.. జిల్లాలోని ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల్లో అధికార పార్టీ టికెట్లు ప్రకటించిన తర్వాత అసమ్మతి బెడద పెరిగింది. చందూలాల్‌కు ములుగు నుంచి టీఆర్ఎస్ టికెట్ ప్రకటించగా.. ఏజెన్సీ ప్రాంతం కావడం.. ఆదివాసీల ప్రాభల్యం అధికంగా ఉండడంతో వారికే అవకాశం కల్పించాలని ఆ పార్టీకి చెందిన అసమ్మతి నేతలు పట్టుపడుతున్నారు. అంతేకాకుండా మంత్రిగా ఉన్న చందూలాల్ తమను పట్టించుకోలేదని, ఆయన కుమారుడి అరాచకాలతో వేగలేకపోతున్నామని.. అభ్యర్థిని మార్చాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. తమలో ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటామని.. పార్టీ మారే ఆలోచనే లేదని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ములుగు కాంగ్రెస్‌లో ప్రస్తుతం రెండు వర్గాలు ఉన్నాయి. పొదెం వీరయ్య, సీతక్క నాయకత్వాల వారీగా విడిపోయి కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేస్తున్నారు. ప్రస్తుతానికి స్తబ్ధుగా ఉన్నా పార్టీ నుంచి టికెట్‌పై స్పష్టత వచ్చిన తర్వాత అసంతృప్తులు వేరే పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక భూపాలపల్లి విషయానికి వస్తే టీఆర్ఎస్ టికెట్ స్పీకర్ మధుసూదనాచారికి కేటాయించగా.. అదే పార్టీలోని నాయకుడు గండ్ర సత్యనారాయణరావు టికెట్ ఆశించి దక్కకపోవడంతో రెబల్‌గా బరిలో ఉంటానని స్పష్టంచేసి ప్రచారం సైతం ప్రారంభించారు. దీంతో నియోజకవర్గంలో పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి తమ నాయకుల వెంటే ఉంటున్నారు. మిగతా పార్టీలు తమ అభ్యర్థులను ఇంకా ప్రకటించకపోయినా కాంగ్రెస్, బీజేపీ తరఫున గండ్ర వెంకటరమణారెడ్డి, కీర్తిరెడ్డి విస్తృతంగా ప్రచారం చేపడుతున్నా ఆయా పార్టీల్లో పెద్దగా చేరికలు కనిపించడంలేదు. పుకార్లతో పరేషాన్.. ప్రస్తుతం అధికార టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పాటుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. జిల్లా పరిధిలోని మంథని, భూపాలపల్లి, ములుగు, భద్రాచలం నియోజకవర్గాల్లో ఏ పార్టీకి సీటు కేటాయిస్తారనే విషయంపై స్పష్టత రాకపోవడం పార్టీ మారాలనుకునే వారిని డైలామాలో పడేసింది. ఉదా హరణకు మంథని నియోజకవర్గంలో బలమైన కాంగ్రెస్ నాయకు డు శ్రీధర్‌బాబు వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే పుకార్లు షికారు చేస్తున్నాయి. దీంతో తాను మంథని నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని చెప్పుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరి ణామాలతో నాయకులు సైతం ఎందుకైనా మంచిదని టికెట్లపై క్లారి టీ కోసం ఎదురుచూస్తున్నారు. మంథని నియోజకవర్గంలోని కాటా రం, మహాముత్తారం, మహదేవపూర్ మండలాల్లో టీఆర్ఎస్, కాం గ్రెస్ పార్టీల్లోని కార్యకర్తలు అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు మారుతున్నారు. అయితే ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల్లో మాత్రం ఇలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ప్రధానంగా అభ్యర్థుల ప్రకటన తర్వాతే వలసల జోరు కనిపించే అవకాశం ఉంది. -
‘పట్నం’ టికెట్‌పై నజర్!
ఇబ్రహీంపట్నం: కాంగ్రెస్, టీడీపీల పొత్తు ఖరారవుతున్న నేపథ్యంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఆ పార్టీల శ్రేణులు క్షేత్రస్థాయిలో సానుకూలంగా స్పందిస్తున్నాయి. నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో టీడీపీకి క్షేత్రస్థాయిలో మంచి పట్టుంది. 1985, 1999, 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ అభ్యర్థి విజయం సాధించారు. 1989, 1994, 2004 ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి గెలిచారు. కాంగ్రెస్ పార్టీ 1985 నుంచి ఈ స్థానంలో గెలుపు సాధించ లేదు. నియోజకవర్గంలో హస్తం పార్టీకి మంచి పట్టున్నా గ్రూపు తగదాలే కొంప ముంచుతున్నాయి. తెలంగాణ ఏర్పాటు అనంతరం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పార్టీ ఫిరాయించి అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈనేపథ్యంలో ఆ పార్టీకి కొంత బలం తగ్గినా, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు పార్టీని వీడలేదు. పార్టీ అధిష్టానం పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతగా నిర్వహిస్తున్నారు. పట్నం సీటుపై ఇరుపార్టీల దృష్టి టీడీపీ, కాంగ్రెస్ పార్టీ మధ్య పొత్తు కుదిరితే ఇబ్రహీంపట్నం అసెంబ్లీ స్థానం కోసం ఇరుపార్టీల నేతలు పట్టుబట్టే ఆవకాశం కనిపిస్తోంది. ఈ స్థానాన్ని వదలుకునేందుకు ఆయా పార్టీల నేతలు సిద్ధంగా లేరు. ఈనేపథ్యంలో ఈ సీటు ఎవరికి దక్కుతుందనే అంశంలో ఉత్కంఠ నెలకొంది. ఆయా పార్టీల నుంచి టికెట్ ఆశిస్తున్న నేతలు కొంత ఆందోళనకు గురవుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి రొక్కం భీంరెడ్డి ఈ స్థానంపై గంపెడాశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్‌తోపాటు, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి టికెట్ రేసులో ముందున్నారు. ఈ స్థానాన్ని వదులుకోవద్దని ఇరుపార్టీల నేతలు తమ అధిష్టానాలపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్ పార్టీ గ్రూపు రాజకీయాలకు స్వస్తి పలికి టీడీపీతో జతకడితే టీఆర్ఎస్ అభ్యర్థికి ఇక్కడ గడ్డు పరిస్థితి తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, టీడీపీ, కాంగ్రెస్ రాజకీయ వ్యూహలు ఏటు వైపు వెళ్తాయో.. టికెట్ ఎవరిని వరిస్తుందో ఇంకొన్ని రోజులు వేచి చూస్తే తెలుస్తుంది. ప్రత్యర్థిని ఓడించడమే లక్ష్యం.. టీఆర్ఎస్ను మట్టి కరిపించాలనే ఉద్దేశంతో మిగతా పార్టీలు జతకడుతున్నాయి. పొత్తుతో ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు ఆయా పార్టీల పెద్దలు. కాంగ్రెస్, టీడీపీలు ఏకమైతే ఇబ్రహీంపట్నంలో గులాబీ పార్టీ అ భ్యర్థిని సులువుగా దెబ్బతీయవచ్చునని అం చనా వేస్తున్నారు. ప్రస్తుత రాజకీయాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అత్యధిక శాతం టీడీపీ కార్యకర్తలు, నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇబ్రహీంపట్నం, తుర్కయంజాల్ నిర్వహించిన ఆ పార్టీ సమావేశంలో కాంగ్రెస్‌తో దోస్తీని నేతలేవ్వరూ వ్యతిరేకించకపోవడం ఇందుకు నిదర్శనం. పార్టీ అధినేత చంద్రబాబు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తామని చెబుతున్నారు. -
పొత్తులు.. చిక్కులు..
సాక్షి, కొత్తగూడెం: రానున్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి నడిచేందుకు సిద్ధమైన టీడీపీ భద్రాద్రి జిల్లాలో కనీసం రెండు సీట్లు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. ఈ రెండు పార్టీల మధ్య ఇప్పటికే పొత్తు వ్యవహారం తుదిదశకు చేరుకోవడంతో జిల్లాలో సీట్ల సర్దుబాటు విషయమై రాజకీయ వర్గాల్లో మరింత ఆసక్తి రేపుతోంది. పొత్తుల్లో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో ఖమ్మం ఎంపీ సీటుతో పాటు మూడు నుంచి నాలుగు శాసనసభ స్థానాల్లో పోటీ చేసేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. టీడీపీ అధినాయకత్వం సైతం రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లోనే ఎక్కువ సీట్లు అడుగుతోంది. ప్రస్తుతం సిట్టింగ్ సీటు అయిన సత్తుపల్లి టీడీపీకి ఇవ్వడం లాంఛనమే. ఇక ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు లేనందున ఖమ్మం ఎమ్మెల్యే సీటును టీడీపీ ఆశిస్తోంది. ఇక్కడి నుంచి మాజీ ఎంపీ, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావును పోటీ చేయించేందుకు ఆ పార్టీ యోచిస్తోంది. ఇక మిగిలిన రెండు సీట్లు భద్రాద్రి జిల్లా నుంచి ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో అశ్వారావుపేట నియోజకవర్గంలో రెండో స్థానంలో నిలిచిన టీడీపీ తిరిగి ఆ స్థానాన్ని కోరుతోంది. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో ఓడిపోయిన మెచ్చా నాగేశ్వరరావునే దింపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ సీటును టీడీపీకి ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సైతం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక మరో సీటును ఇల్లెందు, పినపాక, భద్రాచలంలో ఎక్కడ ఇచ్చినా తీసుకునేందుకు టీడీపీ సిద్ధపడుతోంది. ఇల్లెందు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ కోసం పోటీ తీవ్రం గా ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారిందనే చెప్పవచ్చు. దీంతో ఈ సీటును టీడీపీ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌తో పొత్తుల్లో భాగంగా టీడీపీ తనకు టికెట్ ఇస్తే తిరిగి పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికార పార్టీలోకి వెళ్లిన ఓ నాయకుడు ప్రతిపాదన చేస్తున్నట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్‌లోకి వెళ్లిన మరొకరు కూడా టీడీపీ టికెట్ ఇస్తే తిరిగి చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక టీడీపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తుళ్లూరు బ్రహ్మయ్య సొంత నియోజకవర్గం పినపాక ఇచ్చినా.. తీసుకునేందుకు టీడీపీ వారు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసేందుకు వట్టం నారాయణ, బచ్చల భారతి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును బరి లోకి దించితే ఈ సీటును వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు టీడీపీ శ్రేణులు చెబుతున్నా యి. ఒకవేళ భద్రాచలం సీటు ఇచ్చినప్పటికీ పోటీ చేసేందుకు ఆ పార్టీ రెడీగా ఉంది. భద్రాచలం టికెట్ వస్తే వట్టం నారాయణను ఇక్కడ నుంచి పోటీ చేయించే ఆలోచనలో టీడీపీ ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ తో పొత్తుకు తాము దూరంగా ఉంటామని, బీఎల్ఎఫ్ ద్వారానే అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని సీపీఎం చెబుతోంది. కాగా, సమీకరణలు ఏమైనా మారి సీపీఎం కూడా కాంగ్రెస్ కూటమిలోకి వస్తే భద్రాచలం సీటును ఆ పార్టీకి ఇవ్వా ల్సి ఉంటుంది. ఇక కాంగ్రెస్ కూటమిలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న సీపీఐ కొత్తగూడెం సీటు విషయంలో పట్టుపడుతోంది. అయితే ఈ సీటు సాధించేందుకు కాం గ్రెస్ నుంచి మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, టీపీసీసీ సభ్యుడు ఎడవల్లి కృష్ణ పోటీపోటీగా కృషి చేస్తున్నారు. ఇక భద్రాచలం నియోజకవర్గంలో ఓటుబ్యాంకు గణనీయంగానే ఉన్న కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్థి లేరు. ఇల్లెందులో మాత్రం పోటీ తీవ్రంగా ఉంది. దీంతో కాంగ్రెస్ పరిస్థితి జిల్లాలో విచిత్రంగా తయారైంది. అంతర్గతంగా సమస్య పరిష్క రించి అసంతృప్తులను బుజ్జగిస్తారా లేక పొత్తుల్లో భాగం గా మిత్రపక్షాలకు కేటాయిస్తారా అనేది ప్రతిఒక్కరి లోనూ ఆసక్తిని కలిగిస్తోంది. కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలతో పొత్తు కన్నా టీడీపీతో పొత్తుపైనే జిల్లాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. -
టీడీపీతో పొత్తు పెట్టుకోం : కోట్ల
కర్నూలు (ఓల్డ్‌సిటీ): టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం కాంగ్రెస్‌కు లేదని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. కర్నూలులోని తన నివాసంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నుంచే రాజకీయ అరంగేట్రం చేసిన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి.. కాంగ్రెస్‌ను దరిద్రంగా పేర్కొనడం సబబు కాదన్నారు. కాంగ్రెస్‌ను వీడినందుకు అలా అంటున్నారని, రేపు టీడీపీని వీడినా అలా చెప్పరనే నమ్మకం ఏమిటని ప్రశ్నించారు. విజ్ఞులై ఉండి అలాంటి పదాలు వాడటం మంచిది కాదన్నారు. -
‘వైఎస్సార్ సీపీ గెలుస్తుందనుకున్నా’
సాక్షి, అనంతపురం: గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సైకిల్-హస్తం పొత్తుపై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి స్పందించారు. సోమవారం స్థానిక నేతలతో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు ఉండాలన్న దానిపై రాహుల్ గాంధీదే తుది నిర్ణయమని, అధిష్టానం ఆదేశిస్తే ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి సిద్దమేనని రఘువీరా పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వ్యతిరేక శక్తులతో కలిసి పనిచేస్తామని, ఏపీలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తున్నామని పునరుద్ఘాటించారు. వైఎస్సార్ సీపీ గెలుస్తుందనుకున్నా రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని 2014లో జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని భావించామన్నారు. అయితే చివరి నిమిషంలో ఫలితాలు తారుమారయ్యాయని రఘువీరా అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కీలకపాత్ర పోషిస్తుందని జోస్యం చెప్పారు. టీడీపీ, బీజేపీ వైఫల్యాలపై కరపత్రాలతో ఇంటింటా ప్రచారం చేస్తామని రఘువీరా తెలిపారు. -
టీడీపీతో పొత్తు
సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: భారతీయ జనతా పార్టీ జిల్లాపై పట్టుకోసం వ్యూహరచన చేస్తోంది. టీడీపీతో పొత్తు దాదాపు ఖరారు కావడంతో దక్షిణ తెలంగాణలోనే అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఎక్కువ సీట్లు తీసుకోవాలని భావిస్తోంది. తెలంగాణ రాష్ట్ర సాధన తమవల్లే సాధ్యమైందనే ఊపుతో ఉన్న కమలనాథులు.. ఈ సారి ఆశాజనక ఫలితాలు నమోదు చేస్తామని అంచనా వేసుకుంటున్నారు. సంప్రదాయబద్ధంగా జిల్లాలో చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు ఉండడంతో బీజేపీ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో టీడీపీతో పొత్తు చర్చలు తుది దశకు చేరుతున్న తరుణంలో ఐదారు అసెంబ్లీ సెగ్మెంట్లు, రెండు పార్లమెంటరీ స్థానాలపై కన్నేసింది. పొత్తుల ఖరారుపై ఇరుపార్టీల అగ్రనాయకులు జరుపుతున్న సంప్రదింపుల్లో సీట్ల కేటాయింపు ఆసక్తిగా మారింది. నగర శివార్లలో బీజేపీకి పట్టు ఉండడం, వీటిలో కొన్నింటికి ఆ పార్టీ ప్రాతినిధ్యం వహిం చిన నేపథ్యంలో.. ఈ స్థానాలపైనే కమల దళం గురిపెట్టింది. ముఖ్యంగా ఎల్బీనగర్, ఉప్పల్, మల్కాజిగిరి, తాండూరు, మహేశ్వరం, కూకట్పల్లి శాసనసభా నియోజకవర్గాలు బీజేపీ జాబితాలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాలు మల్కాజిగిరి, చేవెళ్ల కూడా తమకే వదిలిపెట్టాలని ఆ పార్టీ గట్టిగా పట్టుపడుతోంది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో సైకిల్‌కు పంక్చర్ కావడం, బీజేపీకి కాసింత ఆదరణ పెరిగిన నేపథ్యంలో ఇరుపార్టీలకు పొత్తు అనివార్యంగా మారింది. బీజేపీకి ఉన్న ఓటు బ్యాంకుతో తమకు కలిసివస్తుందని ‘దేశం’ ఆశిస్తుండగా, గ్రామస్థాయిలో టీడీపీ బలంగా ఉండడం తమకు లాభిస్తుందని కాషాయదళం అంచనా వేస్తోంది. అయితే, పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటులో కమలనాథులు పంతానికి పోవడం, అందులో ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో రెండు పార్లమెంటు సీట్లు కావాలని కోరడం ‘దేశం’ నాయకత్వానికి చిరాకు తెప్పిస్తోంది. అంతేగాకుండా టీడీపీ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్న స్థానాలను ఆ పార్టీ కోరడం కూడా తమ్ముళ్లకు మింగుడు పడడంలేదు. కమలానికి కేటాయిస్తే ప్రత్యర్థులకు అనుకూలంగా మారుతుందని భావిస్తోంది. మూడింటికి ఓకే! మల్కాజిగిరి, ఎల్బీనగర్, కూకట్పల్లి నియోజకవర్గాలు బీజే పీకి కేటాయించేందుకు టీడీపీ మొగ్గు చూపుతోంది. స్థానిక నేతల్లో కుమ్ములాటలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మల్కాజిగిరి స్థానాన్ని వదిలేయాలని టీడీపీ నాయకత్వం నిర్ణయానికొచ్చింది. ఇక ఎల్బీనగర్లో సీమాంధ్ర ఓటర్లు ఎక్కువగా ఉండడం, గతంలో ఇక్కడ బీజేపీ ప్రాతినిధ్యం వహించినందున ఈ సీటును విడిచిపెట్టేందుకు సుముఖత చూపుతోంది. అలాగే కూకట్‌పల్లిలో బీజేపీకి గట్టి పట్టు ఉన్నందున పొత్తులో భాగంగా దీన్ని కూడా త్యాగం చేయాలని యోచిస్తోంది. తాండూరు విషయంలో మాత్రం ఇంకా తుది నిర్ణయానికి రాలేకపోతోంది. ఇక్కడి ఎమ్మెల్యే పి.మహేందర్‌రెడ్డి టీఆర్ఎస్ గూటికి చేరిన తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేత ఎం.నరేశ్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈయనకు దాదాపుగా టికెట్ ఖరారు చేస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఈ నేపథ్యంలో దీన్ని ఇప్పుడు పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయిస్తే నరేష్‌కు అన్యాయం జరుగుతుందని ఆ పార్టీ అధినాయకత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. సంప్రదింపుల్లో ఈ స్థానం కోసం బీజేపీ మొండిగా వ్యవహరిస్తే నరేశ్ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని ముందడుగు వేయాలని ‘దేశం’ భావిస్తోంది. ఇక ఉప్పల్‌లో రాజ్యసభ సభ్యుడు దేవేందర్‌గౌడ్ కుమారుడు వీరేందర్ బరిలో ఉంటున్నందున ఈ సీటును వదులుకునే అవకాశం కనిపించడంలేదు. పార్టీ బలంగా ఉందనుకుంటున్న మహేశ్వరం స్థానాన్నీ వదులుకునే పరిస్థితి లేదు. లోక్‌సభ స్థానాల విషయానికి వస్తే ఈ రెండు స్థానాలపై టీడీపీ గట్టి ఆశలు పెట్టుకుంది. తెలంగాణలో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న ఈ రెండింటిని మిత్రపక్షానికి కేటాయించేందుకు సుముఖంగా లేదు. హైదరాబాద్, సికింద్రాబాద్, భువనగిరి తదితర సీట్లు వదులుకుంటున్నందున.. ఈ రెండు స్థానాలు తమకే కేటాయించాలని బీజేపీ కోరే అవకాశమున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా బీజేపీ- టీడీపీ మధ్య పొత్తులకు లైన్‌క్లియర్ అయిన తర్వాతే సీట్ల సర్దుబాటుపై స్పష్టత వస్తుందని అంటున్నాయి.