సాక్షి, హైదరాబాద్: నాగార్జున సాగర్ కింది ఆయ కట్టు రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి. గత 15 రోజులుగా కృష్ణమ్మ పరవళ్లతో గతంలో ఎన్నడూ లేనట్లుగా జూలైలోనే ఎగువ కర్ణాటక ప్రాజెక్టులు నిండటం, దిగువ శ్రీశైలంలో 150 టీఎంసీలు చేరడం.. దిగువ సాగర్‌లో ఖరీఫ్ ఆశలకు జీవం పోసింది.
దీనికితోడు లభ్యత జలాల్లో సాగర్ ఎడమ కాల్వ కింది అవసరాలకు 12 టీఎంసీల నీటిని కేటాయించడం, ఇప్పటికే లభ్యతగా ఉన్న జలాల్లో మరో 40 టీఎంసీల వరకు దక్కే అవకాశా లున్న నేపథ్యంలో సాగర్ కింద ఉన్న 6.6 లక్షల ఎకరాల పూర్తి ఆయకట్టుకు నీటిని అందిస్తామని ప్రాజెక్టు అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మూడేళ్లుగా కష్టాలే.. ఈసారే ఆశలు..
సాగర్ ఎడమ కాల్వ కింద మొత్తంగా 6.40 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో నల్లగొండ జిల్లాలోని జోన్–1 కింద 3.80 లక్షల ఎకరాలు, ఖమ్మం జిల్లాలోని జూన్–2 కింద 2.60 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉంది. మొత్తంగా సాగర్ ఎడమ కాల్వల కింద 132 టీఎంసీల మేర కేటాయింపులున్నాయి. అయితే కృష్ణాలో ప్రవాహాలు తగ్గడం, ఎగువ నుంచి సాగర్‌కు నీళ్లు వచ్చి, అది నిండేందుకు అక్టోబర్ వరకు పడుతుండటంతో ఖరీఫ్ కన్నా రబీ మీదే ఎక్కువ ఆశలు ఉండేవి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014–15 ఖరీఫ్‌లో సమృద్ధిగా వర్షాలు కురవడంతో 6.40 లక్షల ఎకరాలకు గాను 5.22 లక్షల ఎకరాల ఆయకట్టు సాగు జరిగింది. దీనికోసం మొత్తంగా సాగర్ నుంచి 83.16 టీఎంసీల నీటి విడుదల జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఆ తర్వాత మాత్రం ఖరీఫ్ ఆయకట్టుకు నీరందిన దాఖలాలే లేవు. 2015–16లో పూర్తిగా కరువు పరిస్థితుల నేపథ్యంలో ఎకరం ఆయకట్టుకూ నీరందలేదు.
2016–17 ఖరీఫ్‌లో 3.18 లక్షల ఎకరాల సాగు జరగ్గా కేవలం 19.45 టీఎంసీలు మాత్రమే విడుదల చేశారు. ఇక గత ఏడాది ఖరీఫ్‌లోనూ 3.60 లక్షల ఎకరాలు సాగు జరిగినట్లుగా లెక్కలున్నా సాగర్ నుంచి విడుదల అయింది మాత్రం కేవలం 4.42 టీఎంసీలు మాత్రమే. ప్రాజెక్టు నుంచి నీటి విడుదలపై ఆశలు సన్నగిల్లడంతో, రైతులంతా బోర్ల వైపు మళ్లడంతో భూగర్భజలాల ద్వారానే సాగు జరిగింది. ఈ ఏడాది సైతం అవే పరిస్థితులు ఉంటాయని భావించినా ఎగువ నుంచి వస్తున్న జలాలతో ఆశలు చిగురించాయి.
నీటి నిల్వతో శ్రీశైలం
శ్రీశైలంలో నీటి నిల్వ 215 టీఎంసీలకు గానూ 150 టీఎంసీలకు చేరడంతో తొలి విడతగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అవసరాలకు బోర్డు 55 టీఎంసీలు పంచింది. ఇందులో సాగర్ ఆయకట్టు అవసరాలకు 12 టీఎంసీలు కేటాయించింది. ఇవి కేవలం ఆగస్టు అవసరాలకే కేటాయించ గా, మున్ముందు లభ్యతను బట్టి మరో 40 టీఎంసీలు దక్కే అవకాశం ఉంది. ఈ నీటితో పూర్తి ఆయకట్టుకు నీరందించాలని తెలంగాణ భావిస్తోంది.
గత ఏడాది రబీలో నీటి యాజమాన్య పద్ధతులు, ఇంజనీర్ల నిరంతర పర్యవేక్షణ, వివిధ శాఖలతో సమన్వయం కారణంగా ప్రాజెక్టుల కింద చివరి ఆయకట్టు పంటలకు నీరందించగలిగారు. కేవలం 44.77 టీఎంసీలతో 5.25 లక్షల ఎకరాలకు నీరందించారు. టీఎంసీ నీటితో 11,796 ఎకరాలకు నీరందింది. ఈ మారు సైతం సుమారు 50 టీఎంసీల నీటితో సమర్థ నీటి వినియోగం, ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిన నీరు విడుదల చేస్తే 6.40 లక్షల ఎకరాలకు నీరందించే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు అంటున్నాయి.
దీనికి తోడు సాగర్ ఎడమ కాల్వల కింద ఏపీలోని గుంటూరు జిల్లా ఆయకట్టుకు కృష్ణాబోర్డు 3.5 టీఎంసీలు కేటాయించింది. మున్ముందు మరిన్ని కేటాయింపులకు ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలో గుంటూరు వరకు నీటి విడుదల చేయాలన్నా మధ్యలో ఉన్న ఖమ్మం జిల్లా ఆయకట్టును దాటించాల్సిందే. ఈ లెక్కన చూసినా చివరి ఆయకట్టు వరకు నీరందుతుందని నీటి పారుదల వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
సాగర్‌కు నీటి విడుదల..
ఈ నెల 28 నుంచి వచ్చే నెల 22 వరకు రోజుకు 2 టీఎంసీల చొప్పున శ్రీశైలం నుంచి సాగర్‌కు పవర్‌హౌస్‌ల ద్వారా నీరు విడుదల చేయాలని కృష్ణాబోర్డు ఆదేశించిన నేపథ్యంలో నీటి విడుదల మొదలైంది. శ్రీశైలం నుంచి 19,013 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మొత్తంగా శ్రీశైలం నుంచి సాగర్‌కు 52 టీఎంసీల నీటి విడుదల జరగనుంది. ఇందులో తెలంగాణ 20 టీఎంసీలు, ఏపీ కుడి, ఎడమ కాల్వల కింద 11 టీఎం సీలు వాడుకోనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment