మిర్యాలగూడ, న్యూస్‌లైన్: నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలోని ఆయకట్టు చివరి భూముల్లో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. రెండేళ్లుగా సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతుల ఆశలపై అధ్వానంగా మారిన కాల్వలు నీళ్లు చల్లాయి.
దామరచర్ల మండలంలోని ముదిమాణిక్యం, వజీరాబాద్ మేజర్ కాలువల ద్వారా చివరి భూములకు ఇంకా నీరు చేరనేలేదు. సాగర్ జలాశయం నిండడంతో ఎడమ కాలువకు కూడా 12 రోజుల క్రితమే సాగునీటిని విడుదల చేశారు. దీంతో పాటు ఎడమ కాలువ పరిధిలో ఉన్న మేజర్ కాలువలకు కూడా నీటిని విడుదల చేశారు.
ఈ నేపథ్యంలో కాలువకు సమీపంలో ఉన్న రైతులు వరి సాగుకు సిద్ధమవుతున్నా ఆయకట్టు చివరి భూముల రైతులు మాత్రం నీటికోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. కాలువల్లో చుక్కనీరు కనిపించకపోవడంతో వారికి ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఎడమ కాలువ పరిధిలో జిల్లాలో 10 మేజర్ కాలువలు, 81 మైనర్ కాలువలు ఉన్నాయి. వాటి పరిధిలో జిల్లాలో 3.73 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాల్సి ఉంది. కానీ కాలువ చివరి భూములకు సరిపడా సాగునీరందక బీళ్లుగా మారుతున్నాయి.
కాలువలకు నీళ్లు వదిలి 12 రోజులవుతున్నా ఇప్పటి వరకు కనీసం కాలువ చివరి వరకు కూడా నీళ్లు రాలేదు. దీంతో రైతులు కనీసం నారుమళ్లు కూడా తడుపుకోలేని పరిస్థితి వచ్చింది. వజీరాబాద్ మేజర్ కాలువ నీళ్లు ఇప్పటి వరకు కనీసం దామరచర్ల మండలంలోని కేశవపురం వరకు కూడా రాలేదు. అదేవిధంగా ముదిమాణిక్యం మేజర్ కాలువ నీళ్లు దామరచర్ల మండలంలోని ముదిమాణిక్యం వరకు చేరే అవకాశమే లేకుండా పోయింది. దీంతో కాలువ చివరి భూములన్నీ బీళ్లుగా మారే అవకాశాలు ఉన్నాయి.
తాత్కాలిక మరమ్మతులకు నిధులు కరువు
సాధారణంగా ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యే సమయంలో మేజర్, మైనర్ కాలువల మరమ్మతులకు ఎన్‌ఎస్‌పీ అధికారులు నిధులు విడుదల చేస్తారు. కానీ ప్రస్తుతం మేజర్ కాలువలు సాగర్ ప్రాజెక్టు ఆధునికీకరణలో భాగంగా ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. మేజర్ కాలువల ఆధునికీకరణకు గాను 142.47 కోట్ల రూపాయలు కేటాయించారు. అందులో భాగంగానే కాలవ కట్టల వెడల్పు, సీసీ పనులు జరుగుతున్నాయి. కాగా ఆధునికీకరణ పేరుతో కాలువల మరమ్మతులకు కనీసం నిధులు కూడా విడుదల చేయలేదు. దాంతో కాలువలు అద్వానంగా మారి కాలువ చివరి భూములకు నీళ్లు చేరడం లేదు. ఆధునికీకరణ పనులు 2008లో ప్రారంభం కాగా 2016వ వరకు పూర్తి చేయాల్సి ఉంది. అయినా కాలువల తాత్కాలిక మరమ్మతులు కనీస నిధులు కూడా విడుదల చేయలేదు. దాంతో కాలువల్లో నీళ్లు పారేది కష్టతరంగా మారింది.
కాలువల దుస్థితిని పట్టించుకోని అధికారులు
నాగార్జునసాగర్ ప్రధాన కాలువకు నీటిని విడుదల చేసిన ఎన్‌ఎస్‌పీ అధికారులు కనీసం మేజర్ కాలువల్లో షట్టర్లు కూరుకుపోయినా పట్టించుకోలేదు. ఊట్లపల్లి మేజర్-2, తడకమళ్ల మేజర్-3 కాలువకు షట్టర్లు కూరుకుపోవడంతో రైతులే నానా ఇబ్బందులు పడి వాటిని తీసుకున్నారు. అదేవిధంగా కాలువల్లో కంపచెట్లు, పూడిక పేరుకుపోయి ఉంది. దీంతో కాలువ చివరి భూములకు వరకు నీరు చేరకుండా వృధాగా పోతున్నాయి. ముదిమాణిక్యం, వజీరాబాద్, ముల్కలకాలువ మేజర్ కాలువలకే చివరి ఆయకట్టుకు నీళ్లు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. వజీరాబాద్ మేజర్ కాలువ పరిధిలోని తెట్టెకుంట కాలువలో కంపచెట్లు పెరిగి ఉన్నాయి.
చి‘వరి’ కష్టాలు!
Published Wed, Aug 14 2013 5:44 AM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM
Advertisement