కోటి ఆశలతో ఖరీఫ్
► సాగుకు సిద్ధమైన కర్షకులు
► అనుకూలంగా వర్షాలు
► దుక్కులు దున్ని ఏర్పాట్లు
కోటి ఆశలతో కర్షకులు ఖరీఫ్ సాగుకు సిద్ధమయ్యారు. గత నెలలో అడపాదడపా నమోదైన వర్షపాతంతో పాటు ఈ నెల రెండో వారం నుంచి ఒక మోస్తరుగా కురుస్తున్న వానలు సేద్యానికి అనుకూలంగా ఉన్నాయి. దీంతో ఈ ఖరీఫ్‌పై అన్నదాతల ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
సాక్షి, అమరావతి : నాగార్జున సాగర్ కుడి కాలువ పరిధిలోని గుంటూరు, నరసరావుపేట డివిజన్ల మండలాల్లో ఇప్పటికే మెట్ట పంటలైన పత్తి, మిర్చి సాగు చేశారు. నరసరావుపేట, రొంపిచర్ల, పిడుగురాళ్ల, నకరికల్లు, క్రోసూరు, సత్తెనపల్లి, వినుకొండ ప్రాంతాల్లో దాదాపు 22 వేల హెక్టార్లలో పత్తి, మినుము, పెసర పంటలను సాగు చేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఈ పంటలకు ఊపిరి పోస్తున్నాయి. ఈ ఖరీఫ్ సీజన్‌లో పత్తి లక్షా 60 వేల హెక్టార్లు, మిర్చి 80 వేల హెక్టార్లు, పెసర 10 వేల హెక్టార్లు, కంది 25 వేల హెక్టార్లు, మినుము 15 వేల హెక్టార్లలో సాగు చేసే అవకాశాలున్నాయి. వర్షాలు ఈ విధంగానే కొనసాగితే త్వరగానే పంటల సాగు పూర్తయ్యే వీలుంటుందని వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు.
ఉద్యాన పంటల సాగుకు అనుకూలం....
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు కూరగాయల సాగుకు ఎంతో అనుకూలంగా ఉంటుందని ఉద్యాన శాఖ అధికారులు పేర్కొన్నారు. నారాకోడూరు, మంగళగిరి, బాపట్ల, నరసరావుపేట, వినుకొండ ప్రాంతాల్లో కూరగాయల సాగు ఎక్కువగా ఉంటుంది. బెండ, వంగ, బీర, సొర, గోరుచిక్కుడు వంటి కూరగాయల పంటలు దాదాపు 20 వేల హెక్టార్లలో సాగు చేసేందుకు అన్నదాతలు అన్ని ఏర్పాట్లు చేసుకొన్నారు. జిల్లాలో మిర్చి పంట 80 వేల హెక్టార్లలో సాగు కానుందని ఉద్యాన శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మిర్చి సాగు చేపట్టారు. ఈ వారంలో కొందరు రైతులు నార్లు పోసుకొనేందుకు సిద్ధమయ్యారు. 13,700 ఎకరాల్లో ఈ ఏడాది పసుపు పంట సాగవుతుందని ఉద్యాన శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రైతులకు అందుబాటులో 50 శాతం సబ్సిడీతో అన్ని రకాల కూరగాయల పంటల విత్తనాలను సిద్ధంగా ఉంచినట్లు ఉద్యాన శాఖ డీడీ జయచంద్రారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.
అందుబాటులో విత్తనాలు, ఎరువులు
జిల్లాలో అన్నదాతలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎరువులు, విత్తనాలను సిద్ధం చేశాం. సబ్సిడీపై అందించే పెసర, మినుము విత్తనాలు నాలుగువేల క్వింటాళ్లు, కంది 220 క్వింటాళ్లు, సోయా చిక్కుడు 200 క్వింటాళ్లు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. పచ్చిరొట్ట విత్తనాలు జీలుగ, పిల్లిపెసర, జనుము 8,700 క్వింటాళ్లు, 31వేల క్వింటాళ్ల వరి విత్తనాలు అందుబాటులో ఉంచాం. 16 వేల టన్నుల జింక్ సల్ఫేట్, 3600 టన్నుల జిప్సం, 16 వేల టన్నుల భాస్వరం, 40 వేల టన్నుల యూరియా అందుబాటులో ఉంది. - వీడీవీ కృపాదాసు, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు