యాసంగి పంటలకు పెట్టుబడి సాయం పంపిణీకి ముహూర్తం ఖరారయ్యింది. సోమవారం నుంచి పంపిణీ ప్రారంభం కానుంది. ఈసారి చెక్కుల రూపంలో కాకుండా నేరుగా రైతుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేయనున్నారు. ఈ పథకం ద్వారా జిల్లాలో లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది.
సాక్షి, కామారెడ్డి: రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా ఏటా రెండు పంటలకు ఎకరాకు రూ.4 వేల చొప్పున అందిస్తున్నారు. ఖరీఫ్‌లో రైతులకు చెక్కుల రూపంలో అందించారు. ప్రస్తుతం ఎన్ని కల కోడ్ అమలులో ఉన్నందున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు జమ చేయాలని నిర్ణయించారు. దీంతో వ్యవసాయ అధికారులు రైతుల బ్యాంకు ఖాతాల వివరాలు సేకరిస్తున్నారు.
జిల్లాలో 2,07,611 మంది రైతులకు యాసం గిలో రూ. 176 కోట్ల పెట్టుబడి సాయం అందించా ల్సి ఉంది. వ్యవసాయ శాఖ అ«ధికారులు ఇప్పటివరకు 60 వేల మంది రైతుల బ్యాంకు ఖాతా నంబర్లను సేకరించారు. అయితే ప్రభుత్వం ఈ నెల 22 నుంచి రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం సొమ్మును జమ చేయడానికి నిర్ణయించింది. జిల్లాలో తొలిరోజు 6,133 మంది రైతుల ఖాతాల్లో రూ. 6.25 కోట్లు జమ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. రోజు కొన్ని ఖాతాల చొప్పున రైతుల ఖాతాల్లో పెట్టుబడి సొమ్ము జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
60 వేలమంది వివరాలు మాత్రమే..
ఖరీఫ్ సీజన్‌లో రైతులకు పెట్టుబడి సాయాన్ని చెక్కులద్వారా పంపిణీ చేశారు. రైతులు చెక్కులను బ్యాంకులకు తీసువెళ్లి డ్రా చేసుకున్నారు. అయితే ఈసారి కూడా చెక్కుల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. కానీ ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో చెక్కుల పంపిణీకి ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వలేదు. దీంతో రైతుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేయాలని నిర్ణయించారు. చాలా మంది రైతులకు అప్పు కోసం తీసుకున్న ఖాతాలే ఉన్నాయి.
కొందరికి మాత్రమే సేవింగ్స్ ఖాతాలున్నాయి. దీంతో రైతుల నుంచి బ్యాంకు ఖాతా నంబర్ల సేకరణ వ్యవసాయ శాఖకు కొంత ఇబ్బందికరంగా తయారైంది. రైతులు బ్యాంకులకు వెళ్లి కొత్త ఖాతాలు తీయడానికి సమయం పడుతుండడంతో ఇప్పటి వరకు కేవలం 60 వేల ఖాతాలు మాత్రమే వ్యవసాయ శాఖ సేకరించగలిగింది. రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను ఈ నెల 25 లోగా సేకరించడం పూర్తయితే ఈ నెలాఖరులోపు అందరి ఖాతాల్లో పెట్టుబడి సాయం డబ్బులు జమ చేసే అవకాశాలుంటాయి.
సాగు చేసేవారికి అందిస్తేనే..
ఎకరాకు రూ.4 వేల చొప్పున ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. గత ఖరీఫ్ సీజన్‌లో రైతుబంధు పథకం మొదలైంది. యాసంగితో రెండో విడత పంపిణీ జరుగుతోంది. అయితే పెట్టుబడి సాయం పెద్ద రైతులకే ఎక్కువగా మేలు చేస్తోందన్న అభిప్రాయం చిన్న, సన్నకారు రైతుల్లో ఉంది. జిల్లాలో అత్యధికంగా చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. వారిలో ఎకరం, ఎకరంనర, రెండెకరాలు ఉన్న రైతులు 80 శాతంపైనే ఉన్నారు.
అయితే పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసి, పడావుగా వదిలేసిన వారికి రూ.లక్షల్లో పెట్టుబడి సాయం అందుతుండడంపై రైతులు పెదవి విరుస్తున్నారు. పంట సాగు చేసేవారికి సాయం అందించకుండా భూములు పెద్ద ఎత్తున కొనుగోలు చేసి వృథాగా వదిలేసిన వారికి ఇవ్వడం వల్ల ప్రజాధనం వృథా అవుతోందన్న అభిప్రాయం ఉంది. అలాగే కౌలు రైతులకు ఈ పథకం వర్తించకపోవడంతో వారు నష్టపోతున్నారు. తమకు కూడా పెట్టుబడి సాయం అందించాలని కౌలు రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment